ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయ ఉద్యమ నాయకులను ఎన్నుకోవాలి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయ ఉద్యమ నాయకులను ఎన్నుకోవాలి.* పెట్టుబడిదారులు, విద్యాసంస్థల అధినేతలకు ఓటు నిరాకరించి ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించాలి.*
*************************************
---వడ్డేపల్లి మల్లేశం 90142 06412
---20...02...2025********************
తెలంగాణ రాష్ట్రంలో 40 సీట్లు కలిగిన శాసనమండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు మూడింటిలో ప్రస్తుతము వరంగల్ ఖమ్మం నల్లగొండ, నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ స్థానాలకు సంబంధించి రెండు చోట్ల ఎన్నికలు 27 ఫిబ్రవరి 2025 రోజున జరగనున్నాయి .ముఖ్యంగా ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక, అభ్యర్థుల ఎంపిక, ప్రచారము అన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యక్తి సామాజిక నేపథ్యం ఉద్యమ నాయకత్వం ఆధారంగా జరగవలసిన అవసరం చాలా ఉన్నది. కానీ వ్యక్తులు ఎవరో తెలియకుండా అధినేతలను పెట్టుబడిదారీ వ్యక్తులను రాజకీయ నాయకులను కూడా చివరికి ఎన్నికలలో దించే ప్రయత్నాలు ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల నుండి కూడా రాజకీయ లబ్ధి పొందాలనే దురాలోచన తప్ప మరేదీ కాదు. వాస్తవంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించడం వెనుక రాజ్యాంగ నేపథ్యముతో పాటు శాసనసభలో చర్చించిన తర్వాత కూడా అవసరమైనటువంటి సందర్భంలో మరింత లోతుగా చర్చించడానికి పెద్దల సభగా పిలువబడే శాసనమండలిలో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే వాళ్ళు, స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే వాళ్ళు, గవర్నర్ నామినేట్ చేసే వాళ్ళతో పాటుగా పట్టబదృ లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించడం అనేది ఒక ఉత్కృష్టమైన లక్ష్యంతో కూడుకున్నది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు, సమస్యలు, విద్యారంగ పరిస్థితులు, ప్రైవేట్ రంగంలో విద్యను నివారించడంతోపాటు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం,కొటారి సూచించినటువంటి కామన్ స్కూల్ విధానాన్ని కొనసాగించడానికి ప్రభుత్వానికి సూచన చేయడం అవసరమైతే ఒత్తిడి తీసుకురావడం వంటి లక్ష్యాలతో ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. లక్ష్యానికి అనుగుణంగా పనిచేయగల సమర్థవైన నాయకత్వం లేకుంటే ఎన్నుకోబడినా కూడా ఆయా వర్గాల కోసం ఏమాత్రం కృషి చేయరు అనేది నగ్న సత్యం. గతంలో ఉన్న కొద్ది మందిని పరిశీలించినప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా ఎన్నికైన వ్యక్తి ఉపాధ్యాయుల పక్షాన పని చేస్తానని రాజకీయాలకతీతo గా అధికార పార్టీకి ఏ రకంగానూ లొంగిపోనని చెప్పి ఆ వెంటనే ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకున్న సందర్భాలను గమనిస్తే శాసనమండల్ లోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తున్నట్లు మనకు తెలుస్తున్నది. కానీ దానికి భిన్నంగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రత్యేకమైన చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇటీవలి కాలంలో ప్రధానంగా ఆధిపత్య కులాలకు చెందిన వాళ్లే చట్టసభల్లో ఎన్నికవుతూ నాయకత్వం వహిస్తూ డామినేట్ చేస్తున్న సందర్భంలో బహుజన దృక్పథం బలంగా వస్తున్న నేపథ్యంలో కూడా ఆ వర్గాలకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వడానికి కృషి చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఉపాధ్యాయులుగా సుదీర్ఘమైన సర్వీస్ చేయడంతో పాటు ఉద్యమ నేపథ్యంతో సహా ఆయా సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఉంటే అలాంటి చోట్ల ప్రాతినిధ్యం కల్పించడం ద్వారాఉపాధ్యాయ ఓటర్లు తమ యొక్క సమయ స్ఫూర్తిని చాటుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది .
ప్రశ్నించగల సమర్థులు కావాలి - మోకరిల్లే వాళ్ళు కాదు :-
*******************************
ఏ సంస్కృతి, వ్యవస్థ నుండి వచ్చిన వాళ్లు ఆ సంస్కృతి లేదా ఆ వర్గ ప్రయోజనం కోసమే పాకులాడుతారనేది నగ్న సత్యం. అందుకే రాజకీయాలలో ముఖ్యంగా చట్టసభల్లోకి సుదీర్ఘమైన అనుభవము, ఉద్యమ నేపథ్యము, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వము, సామాజిక చింతన, ప్రశ్నించే తత్వంతో పాటు ఆ వర్గాల యొక్క ప్రయోజనం బాగా తెలిసి ఉండాలి. అంటే ఉపాధ్యాయునిగా పనిచేసిన వాళ్లయితేనే మరింత ఎక్కువగా న్యాయం చేయగలుగుతారు. ప్రధానంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ స్థానానికి జరుగుతున్న పోటీలో వై అశోక్ కుమార్ గారు సుదీర్ఘమైన ఉపాధ్యాయ అనుభవం కలిగి ఇటీవలే ఉద్యోగ విరమణ చేసి ఉద్యమ నేపథ్యంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ఉపాధ్యాయ హక్కులు సమస్యలు సాధనలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన వేళ వారి యొక్క అభ్యర్థిత్వాన్ని మొదటి స్థానానికి ఎంపిక చేసుకోవడం ద్వారా ఉపాధ్యాయ ఓటర్లు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది . స్వతంత్ర వ్యక్తిత్వంతో, స్వతంత్ర అభ్యర్థిగా, ఉపాధ్యాయ నిరుద్యోగ పట్టభద్రుల తదితర సమస్యల పరిష్కారంలో గలంవిప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఒత్తిడి చేయడానికి తన శక్తి యుక్తులను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అశోక్ కుమార్ గారు ఒక మామూలు కుటుంబం నుండి వచ్చి ధన రాజకీయాలకు అతీతంగా ఉద్యమ నేపథ్యంతో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయాన్ని అందరూ గమనించాలి. ప్రస్తుతం ప్రతి ఎన్నిక కూడా లక్షలు కోట్లతో కూడుకున్న కారణంగా పేదవాళ్లు సమర్థులు చాలా చోట్ల బహుజనులకు అవకాశం లేకుండా పోతున్నది .ఆధిపత్య వర్గాలు మాత్రమే అన్నిచోట్ల పోటీ చేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ అతీతంగా ధన రాజకీయాలను తిప్పి కొట్టడం ద్వారా స్వతంత్రంగా వ్యవహరించి శాసనమండలిలో పోరాటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని గెలిపించుకోవడం ద్వారా మన ప్రత్యేకతను చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఉపాధ్యాయులు కాని వారు ఎవరైనా పోటీ చేయవచ్చు అనే ప్రాతిపదిక చూడడానికి ఇబ్బందిగా, ఇబ్బేట్టుగా ఉంది. అంతేకాదు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలతో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తి గెలుపొందితే లేదా ఉపాధ్యాయ సంస్థల అధినేతలు పెట్టుబడిదారులు విద్యా వ్యాపారులను అభ్యర్థులుగా నిలబెట్టినప్పుడు వాళ్లు గెలిపించుకోవడానికి డబ్బును ఎరగా చూపే సందర్భంలో అలాంటి సభ్యులు గెలిస్తే ఏ రకమైనటువంటి చెడు పర్యవసానాలు ఉంటాయో ఒక్కసారి గమనించవచ్చు. ప్రైవేటు విద్యారంగానికి చెందినవాడు ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించడానికి ప్రైవేటు విద్యను చట్టబద్ధం చేయడానికి మాత్రమే పనిచేస్తాడు కానీ ప్రభుత్వ రంగంలో విద్య కావాలని పోరాడగలడా? విద్యా శాఖకు ఢిల్లీ కేరళ లాగా 25% బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రశ్నించగలరా? కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వివక్షత లేనటువంటి ఒకే రకమైన యాజమాన్యంలో ఉండగల విద్యా వ్యవస్థ కావాలని ఈ విద్యా వ్యాపారులు ప్రభుత్వాన్ని నిలదీయగలరా? ఒక్కసారి ఓటర్లు ఆలోచించుకోవాలి మరి అలాంటప్పుడు విద్యా వ్యాపారులను ఎంపిక చేయడమే నేరం అలాంటి వాళ్లను ఓట్లు వేసి గెలిపించడం అంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. వై అశోక్ కుమార్ గారు ఇక్కడ బహుజన దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి నాయకులు అంతేకాదు ఉపాధ్యాయ ఉద్యమంలో దశాబ్దాల అనుభవం ఉన్నవారు స్వతంత్ర వ్యక్తిత్వంతో ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎలాంటి వారు కావాలో తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా విద్యారంగ పరిరక్షణకు సహకరించవలసిన అవసరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఎన్నుకునే ఓటర్ల పైన ఉన్నది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘాలు కూడా బీసీ అభ్యర్థులకు మద్దతు తెలిపిన సందర్భంగా . ఒక ప్రైవేటు విద్యాసంస్థల అధినేత బిసి వర్గానికి చెందినప్పటికీ కూడా అతడు పెట్టుబడుదారి వర్గానికి వంత పాడుతాడు కనుక అలాంటి వ్యక్తిని సమర్ధించడం అనేది సబబు కాదని బీసీ సంక్షేమ సంఘానికి విజ్ఞప్తి చేయడం సముచితంగా ఉంటుంది. అంతిమంగా లక్ష్యాల సాధనలో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి మాత్రమే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది.అలాంటి పరిస్థితి లోపల ప్రైవేటు విద్యారంగంలో పని చేసేవాళ్లను పట్టభద్రులకు గాని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాని పోటీ చేయడం అంటేనే మౌలికంగా దోపిడీని ప్రోత్సహించడం అని అర్థం చేసుకోవాలి. ఇదే సందర్భంలో కొందరు వ్యక్తం చేస్తున్నటువంటి సందేహాలను గమనిస్తే ఎన్నికైన తర్వాత అధికార పార్టీలో చేరి పదవులను దర్జాగా అనుభవించడానికి అలవాటు పడి ఉపాధ్యాయులను విద్యారంగాన్ని తమ లక్ష్యాలను బాధ్యతలను మరిచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్న వారికి తగిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా అభ్యర్థుల పైన ఉన్నది. అశోక్ కుమార్ గారు స్వతంత్రంగా వ్యవహరిస్తారని ప్రజా సమస్యలతో పాటు విద్యారంగా నిరుద్యోగ పట్టభద్రుల ఉపాధ్యాయ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కూడా పనిచేస్తారని ప్రభుత్వ రంగ విద్యను బలోపేతం చేయడానికి కూడా పోరాడుతారని ఈ సందర్భంగా మనం ఆశించడం అత్యాశ కాదు. ఆ వైపుగా వారు తమ లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారని ఏర్పరచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేద్దాం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు నిండు మనసుతో కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ స్థానానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి అశోక్ కుమార్ గారు పోటీ చేస్తున్న సందర్భంగా వారికి మీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఓటు వేసి గెలిపించడం ఒకవైపు జరగాలి.మరొకవైపు ఆయా సామాజిక వర్గాలు కూడా మీ సంపూర్ణ మద్దతును ప్రకటించడం ద్వారా నూతన శకానికి శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేద్దాం. అందుకు తగిన కృషి అడుగడుగునా జరగాలని ఓటర్లకు విజ్ఞప్తి చేద్దాం ప్రోత్సహిద్దాం. బీసీ సంక్షేమ సంఘం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించి గతంలో చేసిన ప్రకటనను సవరించుకోవడం ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటును అశోక్ కుమార్ గారికి వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తే అర్థవంతంగా ఉంటుంది. బీసీ సంక్షేమ సంఘానికి గౌరవం కూడా దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)