పోషకాహారంలో కీలకమైన పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఇంత అలసత్వమా ?
దిగుమతుల పైన చూపిన శ్రద్ధ రైతులకు ప్రోత్సాహం ఇస్తే అధిక ధరలు తగ్గి అందరికీ పోషకాహారం అందదా?
అధ్యయనాలు పరిశీలించక, నిపుణుల సిఫారసులు ఆమోదించక గాలి మేడలు కట్టడం పాలకులకు రివాజా?
---- వడ్డేపల్లి మల్లేశం
రసాయన ఎరువులు పురుగుమందుల వాడకంతో ఉత్పత్తి అవుతున్న పప్పుధాన్యాలు ఒకవైపు అనారోగ్య కారకమని ఆవేదన చెందుతుంటే అంతో ఇంతో పోషక విలువలున్న పప్పు ధాన్యాలను పేద వర్గాలకు అందకుండా ధరలకు రెక్కలు రావడం అంటే సామాన్య ప్రజానీకాన్ని ఈ దేశంలో గుర్తించకపోవడమే. ప్రణాళికల రూపకల్పనలో బడ్జెట్ ప్రతిపాదనలో ఏనాడు కూడా పాలకులు సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకోవడంలేదని ఆర్థిక నిపుణులు విమర్శించిన సందర్భాలు ఈ దేశంలో అనేకం . ఒకవైపు సేంద్రీయ వ్యవసాయాన్ని గణనీయంగా పెంచడం ద్వారా పోషక విలువలున్న ఆహారాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలని అనేక కమిటీలు బుద్ధి జీవులు మేధావులు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంటే ఆ మేరకు రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని సిఫారసు చేస్తుంటే పోషకవిలువలున్న పప్పు ధాన్యాలు కూడా దిగుమతి చేసుకోవలసి రావడంతో పేదవాళ్లకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నవి.
పప్పుధాన్యాలపై కమిటీ సిఫారసులు:-
1)పప్పు ధాన్యాల ఉత్పత్తి, రైతు విధానాలపై నియమించిన అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ధరల నిర్ధారణలో రైతుల కష్టనష్టాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని పాలకులు గమనించాలి. 2)గిట్టుబాటు ధరలకు సంబంధించిన విధి విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా ఆ కమిటీ హెచ్చరించినట్లుగా తెలుస్తున్నది. 3) రైతులను ప్రోత్సహించి హేతుబద్ధమైన ధరలతో రైతుల నుండి ప్రభుత్వమే సేకరించాలని అందుకుగాను ఏటా 10,000 కోట్లను అదనంగా ప్రత్యేకించాలని అరవింద్ కమిటీ చేసిన సూచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చెవికి ఎక్కకపోవడం దారుణం. పేదలపై నిర్లక్ష్యం, పెట్టుబడిదారులకు వంత పాడిన స్థాయిలో పాలకవర్గాల శ్రద్ధ ప్రజల పైన ఉండని కారణంగా గాలిలో మేడలు కట్టడం, రైతు ప్రభుత్వం అని మాటతప్పడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోవడం మనం కళారా చూడవచ్చు .
పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దయనీయస్థితి:
గత సంవత్సర కాలంగా పప్పుల ధరలు తారాస్థాయికి చేరుకోవడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి దాపరించినది. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడానికి తగిన ప్రోత్సాహకాలను నివేదికల మేరకు అందించే బదులు ధరలను తగ్గించడానికి దిగుమతిపై సుంకాలను మినహాయింపులు 2025 వరకు పొడిగిస్తానని ప్రకటించినప్పటికీ ఆ నిర్ణయం దేశ అవసరాలను తీర్చలేదు . మరొకవైపు గతంతో పోలిస్తే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 13.36 లక్షల ఎకరాల మేర తగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో
దిగుమతులే అనివార్యమైన వేళ ధరలు ఆకాశాన్ని అంటడంతో అంతో ఇంతో పోషకాహారమని పప్పు ధాన్యాల పైన ఆధారపడిన వారికి దిన దిన గండం గా మారుతున్నది. పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గడానికి వాతావరణం అనుకూలించకపోవడమే కారణమని కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ పలు అధ్యయనాలు మాత్రం ప్రభుత్వ ఆలోచన సరైనది కాదని తేల్చినవి. పెట్టుబడి ఖర్చులు మించి పోవడం, రాబడిలో స్థిరత్వం లేకపోవడం, ధాన్యాల నిలువ వసతు ల కొరత, ఇతర కారణాల వలన కూడా రైతులు ప ప్పుధాన్యాల ఉత్పత్తిపై ఆసక్తి చూపకపోవడం ప్రధాన కారణమని ఈ అధ్యయనాలు తేల్చినట్లు తెలుస్తున్నది.
దిక్కుతోచని స్థితిలో రైతులు-కనీస చర్యలు:-
వ్యవసాయం పండుగ అని చూసేవాళ్లం అనుకుంటే స్వయంగా ఆ క్షేత్రంలో పనిచేస్తున్న వాళ్లు పెట్టుబడి వ్యయం పెరిగిన కారణంగా నష్టపోతున్న సందర్భంలో రైతులు "వ్యవసాయం దండుగ" ని వాపోతున్న వైరుధ్య పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి . సాధారణంగా ఉత్పత్తికి సంబంధించి ధర నిర్ణయించే క్రమంలో అన్ని పంటల విషయంలో రైతుల గుండె కోతను అవగాహన చేసుకున్న వ్యవసాయ నిపుణులు స్వామినాథన్ సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 50% లాభాన్ని జోడించి మద్దతు ధరను నిర్ణయించాలని సూచించినప్పటికీ అమలులో నిర్లక్ష్యం కారణంగా రైతులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. .భూమిని కూడా పెట్టు బడిగా పరిగణించి రైతుల శ్రమకు తగిన రీతిలో రాబడిని అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్న కారణంగా పంటల విషయంలో అసమతుల్యత చోటు చేసుకోవడం , ప్రభుత్వాల నిర్లక్ష్యం ,ఉత్పత్తికి రైతుల ప్రోత్సహించకపోవడంతో అనేక పంటలు దేశంలో అందుబాటులో లేక దిగుబడి చేసుకోవలసి రావడంతో వాటి ధరలకు రెక్కలొస్తున్నవి. పంటలు రోగాల బారిన పడడం, అతివృష్టి అనావృష్టి , అప్పుల కోపంలో కూరుకుపోవడం వలన కూడా రైతులు నిస్సహాయులై అప్పులను తీర్చలేక గత సంవత్సరం దేశవ్యాప్తంగా రోజుకు సగటున 31 మంది బలవన్ మరణాలకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక తెలియజేస్తుంటే ప్రభుత్వ హామీలు ఏమైనట్లు?
కొన్ని సూచనలు:-
నిపుణుల నివేదికలను అధ్యయనం చేసి రైతుల విషయంలో తూచా తప్పక పాటించాలి . విపత్తుల సమయంలో రైతులకు భారీగా సాయం అందించాలి . ప్రజల ఆహార అవసరాలను తీర్చడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అనుగుణంగా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా జాతీయ వ్యవసాయ విధానాన్ని రూపొందించడం కూడా అవసరం. ప్రధానంగా భారతదేశంలో వరి గోధుమ పైననే ఎక్కువగా దృష్టి సారించడం నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల పైన నిర్లక్ష్యం వహించడంతో వ్యవసాయ దేశమైన భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు. ఈ సంక్షోభ0 నుండి దేశాన్ని గట్టి ఎక్కించాలి. ఉత్పత్తినీ పెంచి, పప్పులు వంటి పోషకారాన్ని ప్రజలకు అందించడంలో స్వావలంబన సాధించగలిగితే, అది కూడా సేంద్రియ పద్ధతిలో ప్రోత్సహించడం ద్వారా రైతులకు మేలు జరిగే విధానాన్ని అవలంబిస్తే తక్కువ ధరకు నాణ్యమైన పోషకవిలువల అందుబాటు ద్వారా ఆరోగ్య భారతాన్ని నిర్మించుకునే అవకాశం మెండుగా ఉo టుంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)