అయ్యయ్యో... డబ్బులన్నీ పోయెనే...
ఓటమిపాలు ఆయనే... అప్పులు మాత్రం మిగిలినే...!
నిరాశ నిస్పృహ లతో కొట్టుమిట్టాడుతున్న ఓటమి అభ్యర్థులు
✍️ డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత.
ఎన్నికల పండుగ ముగిసింది. గెలిచిన వారు పండుగ చేసుకుంటున్నారు. ఓట్ల కోసం డబ్బులు తీసుకున్న వారు పండగ చేసుకుంటున్నారు. గెలిచిన పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తుంది. జోరుగా విజయం సాధించి ర్యాలీలు తీస్తున్నారు. కానీ ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచి భారంగా ఓటమిపాలై, దీనంగా హీనంగా దిక్కులు చూస్తున్న ఓటమి అభ్యర్థులు మాత్రం ఇంకా బాధల నుండి తేరుకోవడం లేదు.
స్థలం తాకట్టు పెట్టి సీటు కోసం నిలబడితే అది నిట్ట నిలువునా ఓటమిపాలు చేసింది. సొంతింటి బంగారం అమ్మి ఓట్ల కోసం ఇల్లులు తిరిగి బొట్టు పెడితే ఆ ఓట్లన్నీ బుట్ట దాఖలు అయ్యాయి. ఇల్లు కుదవబెట్టి ఇరుగుపొరుగు తలుపు తడితే ఓటు నీకే అంటూ వాగ్దానం చేసి మోసం చేశారు. ఓటు వేయండి అన్నా అని వేడుకున్నా అప్పటికప్పుడు తెచ్చి పెట్టుకున్న చిరునవ్వులు చిందిస్తూ నీకు తప్ప ఎవరికీ ఓటు వెయ్యము మా ఓటు మీకే అని బీరాలు పలికారు. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు అని అందిన కాడికి అప్పులు తెచ్చారు.
విజయం వస్తే చాలు అని ఊరంతా ప్రచారం చేస్తూ ర్యాలీలు తీస్తూ నినాదాలు చేస్తూ మైకు శబ్దాలతో జెండాలు ఎగురుతుండగా చెమట చుక్కలతో చౌరస్తాలలో కనుల విందుగా ప్రచారం చేశారు.ఫలితం రోజున మాత్రం నిశ్శబ్దం గా నిలబడి ఓటమి మాట చెవిని తాకగానే కొయ్యబారిపోయాడు.గెలిచినోడు జండా ఊపి, పూలలో మునిగిపోతే ఓడినోడు అప్పుల గుణంలో మునిగిపోయి అప్పులు ఎలా తీర్చాలో తల పట్టుకు కూర్చున్నాడు. వడ్డివాడు తలుపు దగ్గరకు వచ్చి డబ్బు ఎప్పుడు అని కఠినంగా అడగడంతో కంగుతిన్నారు. నమ్ముకున్న పార్టీ ఇచ్చిన నిధులు లేవు, పట్టించుకున్న పాపాన పోలేదు. తన తో ఎన్నికల ప్రచారంలో నడిచిన నేతల మాటలు అమలు గాని హామీలతోపాటు గాలిలో కలిసిపోయాయి.
సొంత వాళ్ళే శత్రువును చూసినట్టు చూస్తూ దూరం పెట్టారు. తను కన్న కలలన్నీ సాయంత్రం నీడలా తగ్గుతూ తగ్గుతూ తన పరిస్థితి మాత్రం హీరో అనుకుంటే జీరో కు వచ్చింది. ఎన్నికల జాతరలో ఎన్ని చిత్ర విచిత్రాలు దాగున్నాయో కదా. ఓట్ల కోసం వెళ్ళిన రోజు, ఎన్నికల బరిలో నిలుచున్న రోజు అండగా ఉంటానే హామీలు ఇచ్చిన అందరూ ఒక్కొక్కరుగా పార్టీతో సహా అడవి దాచిన వెన్నెలగా మారిపోతుంది. నవ్విన నాప చేను పండగ పోతుందా అని ఎదురుచూసినప్పటికీ ఓటమిపాలు చెందారు కదా ఎలాగైనా ఆదుకుందాం అనే వాళ్లే లేకపోవడంతో ఓటమి చెందిన అభ్యర్థులు చావు తప్ప శరణ్యం లేదంటు నిట్టూర్పు విడుస్తున్నారు.
ఇది ఎన్నికల భారతం. ఇక్కడ విజయం సాధించిన వారికే అధికార పీఠం. ఓటమి చెందిన వారి పక్కన ఒక్కడు కూడా నిలుచుండడు. కనీసం భుజం తట్టి మేమున్నాము అంటూ బంధువులు గానీ, స్నేహితులు గాని చివరికి పార్టీ గాని ఓటమి చెందిన అభ్యర్థులు ఎలా ఉన్నారు, ఏమి చేస్తున్నారు, వారి బాగోగులు ఏమిటి కూడా చూడకుండా తమకేమీ పట్టనట్టు దూరంగా దూరంగా వెళ్లి చేతులెత్తేస్తారు.
ఓటమి ఎంత పని చేసింది...
జీవితం అనే కంచెనే చేను మేసింది...
అప్పుల రాసులు పోసింది.. ఓటమి పూలు పూసింది....
ఓట్ల కొనుగోలు కోసం *అప్పులు చేసిన డబ్బులతో వాన కురిసింది...
తప్పకుండా గెలుస్తామనే ఆశ మెరిసింది...
ఓటమి మరిచిపోలేని గుర్తులు వేసింది...
*ఫలితాలు ఇవ్వకుండా ఎన్నికల చెట్టు కాసింది...
విమర్శల తాకిడిలో ఎన్నో అపనిందలు మోసింది...
ఓటమి చెందడంతో ఇల్లు, పెళ్ళాం, పిల్లలు ఎడబాసింది...
ప్రత్యర్థి విజయం దెబ్బతో ముఖం వాసింది....
ఎన్నడూ చూడని ఎత్తుపల్లాలని ఎన్నికల యుద్ధం చూసింది...
*ఒక్కసారిగా ఓటమి చెందడంతో మెదడు అంతా దిమ్మ తిరిగి మెంటల్ లేసింది...!
ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కసారిగా ఓటమి పాలు చెందడంతో అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాము తలచినది ఒకటి, జరిగినది మరొకటి కావడంతో ఏమి చేయాలో పాలు పోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
స్థలాలు తాకట్టు పెట్టి స్వప్నాల్ని నాటిన వేళ,
సొంతింటి బంగారం అమ్మి ఆశల్ని వెలిగించిన వేళ,
ఇల్లు కుదువ పెట్టి నమ్మకాన్ని నిలబెట్టిన రోజులు—
ఎన్నికల రంగంలో అడుగేసిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అయినా విజయం సాధించాలని ధీమాతో ఎన్నికల రణ రంగాన పోరాటం జరిపి వీర మరణం పొందిన మాదిరిగా ఓటమిని మూటగట్టుకుని కుదేలైన జీవితాలు ఎన్నో ఎన్నెన్నో.
“ఎంత వడ్డీ అయినా పరవాలేదు” అన్న ధైర్యం,
పార్టీ జెండా కింద నిలబడి నినదించిన గళం,
వార్డు వీధులన్నీ తిరిగిన చెమట చుక్కలు,
విజయ గీతాలకై వేచి చూసిన కళ్ల జిలుగు ఎక్కడ పోయాయి, ఏమి అయ్యాయి, కళ్ళముందే విజయం మెరిసినట్టే మెరిసి అపజయాన్ని మూటగట్టి వెళ్లిపోయింది కదా. విజయం తమదే అని ఎదురుచూస్తున్నప్పటికీ
ఫలితాల ఉదయం వేరే కథ చెప్పింది,
విజయం తలుపు తట్టలేదు,ఓటమి మాత్రమే నిలిచింది. దీంతో ఓటమి చెందిన అభ్యర్థులు
చెల్లాచెదురైన ఆశలతో, కుదేలైన కలలతో, నెల నెల వడ్డీలు ఎలా కట్టాలని
వడ్డీ గడియారంకు కళ్లెం ఎలా వేయాలని బిత్తర చూపులు చూస్తున్నారు.
నమ్ముకున్న పార్టీ చేతులు చాచి ఓటమి చెందిన అభ్యర్థులకు అండగా నిలబడలేదు.
సహాయం అనే మాట గాలిలో ఏనాడో కలిసిపోయింది. ఇంటికి వచ్చేవారు లేరు, పలకరించే వారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు.
అప్పుల పర్వతం ఎదిరించి నిలిచిన అభ్యర్థి
“ఇప్పుడు అప్పు తీర్చేది ఎలా?” అనే ప్రశ్నలో మదిలో మెదులుతుండగా ఎన్నికల రణ రంగాన ఓటమిపాలై చిక్కుకున్నాడు.
రాజకీయ రంగం రంగులదే, అవి గెలిచిన వారికి మాత్రమే బ్రహ్మరథం పడతాయి స్వాగత సత్కారాలు ఉంటాయి విజయంతో కూడిన ప్రదర్శనలు ఉంటాయి కానీ ఓడిన వారి
ఓటమి రంగు మాత్రం నీలి నిశ్శబ్దం, మూగ రోదన మౌన వేదన.
ప్రజాస్వామ్య పథంలో పయనించినవాడికి
ప్రతి ఓటు వెనుక ఒక జీవితం ఉంటుందనే ఆశ, ఓటమి చెందిన వారికి దురాశ. అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలంటే సొంత డబ్బు తప్పకుండా కలిగి ఉండాలి. లేదంటే భారత ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే వ్యవస్థ అయినా కనుమరుగై ఉండాలి. ఓట్లు కొనగలిగినవాడు ఉన్నంతకాలం ఓట్లు ఓటర్లు అమ్ముకుంటూనే ఉంటారు.
అయితే నాణేనికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టే మనిషి జీవితాన్ని కూడా గెలుపు ఓటమి ఉంటుందనే నగ్న సత్యాన్ని ప్రతివారు నమ్మాలి. ఓటమి చెందిన అంతమాత్రాన కుంగిపోకుండా భవిష్యత్తుపై ఆశతో ఈసారి వచ్చే ఎన్నికలలోనైనా గెలుస్తాము కదా అన్న ఒక సంతృప్తితో బతకాలి తప్పించి అప్పుల ఊబిలో కూలి పోయి, కూరుకపోయి, ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుని, కుటుంబాలకు దూరంగా ఉండి, వేదన,రోదన అనుభవించకుండా కొండంత ధైర్యాన్ని గుండె నిండా నింపుకొని భవిష్యత్తుగా ఎదురు చూస్తూ జీవితంలో విజయం మరోసారి అయినా సాధించాలి తప్ప ఓటమికి కృంగిపోకూడదు.