సెల్ ఫోన్లలో దర్శనమిస్తున్న అశ్లీల సన్నివేశాలు  ఏ విలువల కోసం?

Apr 6, 2024 - 21:23
 0  3

 బావ ప్రకటన స్వేచ్ఛను  అడ్డుకునే ప్రభుత్వాలు వీటినెoదుకు నియంత్రణ చేయడం లేదు?

మహిళా సంఘాలు, సామాజికవేత్తలు, బుద్ధి జీవుల మౌనం దేనికోసం?

మురుగు కాలువ పక్కన  పూల తోట ఉన్నట్లు  మేధావి ప్రసంగము పక్కనే  అర్థనగ్న దృశ్యాలు  ఎవరి అండతో కొనసాగుతున్నాయి?

స్పందించరెందుకు.

---  వడ్డేపల్లి మల్లేశం

అనేక సాంకేతిక  విలువల సమాహారంగా  అందరి చేతుల్లో  దర్శనమిస్తున్న సెల్ఫోన్లలో  అపారమైనటువంటి  జ్ఞాన సంపద , సాహిత్య సామాజిక సాంస్కృతిక  చారిత్రక  అంశాలు, ప్రాచీన    అవశేషాలు ,   కళాఖండాలు,  చారిత్రక నిర్మాణాల  ఆనవాళ్లను  చూడగలుగుతున్న కాలమితి . ఒకనాడు విషయపరిజ్ఞానం కోసం పుస్తక పఠనం అనివార్యమైన సందర్భం అందరికీ తెలిసిందే . దానికి భిన్నంగా  చిత్రాలు  కొన్ని నినాదాలు సూక్తులు  విషయ పరిజ్ఞానాన్ని మిళితం చేసి  అల ఓకగా అవగాహన కలిగించే రీతిలో  అనేక ప్రసారాలు యూట్యూబ్ ఛానల్  అందుబాటులోకి రావడం  మారుతున్న కాలానికి అనుగుణంగా  చైతన్యాన్ని  ప్రతిభను  అవగాహన పెంపొందించుకోవడానికి  ఎంతో దోహదపడుతున్నాయి.  వివిధ రంగాల నిపుణుల  ఆయా అంశాలకు సంబంధించిన  పూర్తి సమాచారం ప్రసంగాల రూపంలో  అందుబాటులోకి వస్తే, అనే  రోగాలు  ఇతర అనారోగ్య సమస్యలు  పరిష్కారాలను కూడా  వైద్యులు  నిపుణులు  సూటిగా అందించగలుగుతున్న కాలమిది.  వివిధ కళాకృతులు, దర్శనీయ ప్రదేశాలు  ప్రాచీన కళాఖండాలు  చారిత్రక అంశాలను సులువుగా అవగాహన చేయడానికి చర్చలు, ఇంటర్వ్యూలు,  వక్తల ప్రసంగాలు,  సభలు సమావేశాల  రికార్డులు  నేటి సమాజానికి  ఎంతో తోడ్పడుతున్నాయి .  ఈ అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కావాలని  సెర్చ్ చేసినప్పుడు మాత్రమే  వ్యక్తులకు  విషయానికి సంబంధించిన డేటా లభిస్తుంటే  అశ్లీల చిత్రాలు, నృత్యాలు,  కదలికలు, విన్యాసాలు,  అంగాంగ ప్రదర్శనలు , అర్ధనగ్న దృశ్యాలు మాత్రం  సెల్ ఫోను ఓపెన్ చేయగానే  వాట్సప్ యూట్యూబ్  టచ్ చేయగానే  నిరంతరం కనబడుతూనే ఉంటాయి .

ఈ చిత్రాలు ఏ విలువల కోసం?  పాలకులు ఎందుకు నియంత్రించడం లేదు ?

ఏ ఆధునిక సాధనమైన  ఉపయోగించుకునే తీరు మీద దాని  ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి  .సెల్ ఫోన్   కేవలం  మాట్లాడుకోవడానికి  ఉపయోగించుకుంటే  పైన తెలిపిన సమాచారం విషయ పరిజ్ఞానం మనిషికి అందదు.  ఆ ఆసక్తి  అన్వేషణ ఉన్నప్పుడు మాత్రమే  చదవడానికి వినడానికి వీలైనటువంటి రికార్డులు మనకు వాట్సాప్ యూట్యూబ్ లలో కనిపిస్తాయి.  వాటిని చదువుకోవడం కానీ వినడం గాని  మన అవగాహనను మేధస్సును  మరింత పదును పెట్టడానికి ఉపయోగపడతాయి . స్త్రీని ఇప్పటికే సమాజంలో  అంగడి సరుకుగా, ఆట బొమ్మగా, మార్కెట్ వస్తువుగా, ప్రచార  గుర్తుగా  అత్యంత హీనంగా చౌకగా వినియోగించుకుంటున్న ఈ రోజుల్లో  మహిళా సంఘాలు, సమాజం యొక్క వ్యతిరేకత లేని కారణంగా  టీవీలలో  సినిమాలలో  బయట ప్రతి చోట  ఫ్లెక్సీలు వాల్ పోస్టర్లు గోడ పైన రాతల ద్వారా  స్త్రీ ప్రచార వస్తువుగా అన్నిచోట్ల కనపడుతూనే ఉంది.  అక్కడ కూడా  అర్ధనగ్నంగా వికృత పద్ధతిలో అశ్లీల  సన్నివేశాలతోనే దర్శనమిస్తున్న విషయాన్ని మనందరం గమనించి ఉన్నాం.  ఆ రకంగా  ప్రచార వస్తువుగా స్త్రీని  మార్కెట్ మాయాజాలం  చిత్రీకరిస్తుంటే ప్రతిఘటించని కారణంగా తమ దాకా వస్తే కానీ తెలియదు అనే రీతిలో జరుగుతున్న కొన్ని నేరాలు ఘోరాలు  లైంగిక హింస అత్యాచారాలు  నిత్యం సర్వత్రా జరుగుతూనే ఉన్నాయి.

 ఇక 24 గంటలు చేతిలోనే ఉండే సెల్ ఫోన్  వ్యవస్థ  మధ్య మన జీవితాలు  యాంత్రికంగా కొనసాగుతూ ఉంటే  తన దాకా వస్తే కానీ తెలియదు అనే రీతిలో  అర్ధ నగ్న శృంగార బొమ్మలను  ఆస్వాదించడానికి సిద్ధపడినటువంటి  జనం  దాని పరిణామాలను గుర్తించక తాత్కాలికంగా  మురిసిపోవడం  అనేక వికృత పరిణామాలకు దారి తీస్తుంది. పెద్దవాళ్లను చూసి పిల్లలు  కూడా  అనివార్యంగా  వీటిని చూడక తప్పడం లేదు . ఇదే అదునుగా భావించి  కొందరు  ఆ సన్నివేశాలను వెతికి పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ  నిజజీవితంలో  మరిన్ని వికృత పోకడలకు  కారణమవుతున్న సందర్భాలను వ్యతిరేకించగలరా  ?సెల్ ఫోన్ లో    దర్శనమిచ్చే  అర్థనగ్న అమ్మాయిల దృశ్యాలు  ప్రచారం కోసమో వాణిజ్యం కోసమో కానేకాదు. అలాంటప్పుడు  ఎందుకు ఈ రకంగా సెల్ఫోన్లో   పుంఖానుపుంఖాలుగా రావడానికి కారణం ఏమిటి ? ఈ దృశ్యాలు ఆడవాళ్ళను మగవాళ్ళను కూడా ప్రేరేపిస్తూ  పరస్పర ప్రభావంతో పాటు  వికృత పరిణామాలకు దారితీస్తుంటే  ప్రభుత్వపరంగా చర్యలు ఎందుకు గైకొనడం లేదు?  ఏ విలువల కోసం ఇలాంటి బొమ్మలను సెల్ఫోన్లో చూపిస్తున్నారు?  పాలకులు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది . తాత్కాలిక సంతోషానికి మరిగి  ప్రశ్నించడానికి సిద్ధంగా లేని కారణంగా  ఈ వికృత  చేష్టలు సమస్యగా అనిపించకపోవచ్చు కానీ  వీటి పరిణామాలను    సమాజం మీద చూపుతున్న ప్రభావo
  ఎంతో ఆందోళనకరమైనది.  శ్రామిక దృక్పథాన్ని, నీతి నిజాయితీని,  మానవతా విలువలను,  సామాజిక స్పృహను  పెంపొందించుకొని  ప్రతి వ్యక్తి ఎదుగుతూ  సమాజానికి వెన్నుదన్నుగా ఉండవలసిన తరుణంలో  ఇలాంటి తాత్కాలిక ఆవేశాలను  ఆకర్షణను  పెంచే సన్నివేశాలు  మనిషిని నిర్వీర్యం చేస్తున్న మాట నిజం కాదా ? మేధావులు బుద్ధి జీవులు సామాజికవేత్తలు మహిళా సంఘాలు  ఇలాంటి వికృత అంశాల పట్ల ఎందుకు  స్పందించడం లేదు.?  మేధావి ప్రసంగం వినగానే  ఒక  అర్ధ నగ్న దృశ్యం  యూట్యూబ్లో మరొక్క ప్రసంగం వినగానే  మరో సన్నివేశం  వెంట వెంటనే   ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తుంటే  బలహీన మనస్తత్వం కలిగిన మనిషి  మరింత బలహీనులై  తమ కర్తవ్యాన్ని విధి నిర్వహణను బాధ్యతను పక్కనపెట్టి  ఈ బొమ్మలను చూడడానికి  ఇష్టపడే  దౌర్భాగ్య పరిస్థితులకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదా? సెల్ ఫోన్లలో అనుమతించి  దానివల్ల సమాజానికి వనగూరే ప్రమాదాలను  పట్టించుకోకుండ  బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అంటే  సమాజాన్ని పాలకవర్గాలే  నిర్వీర్యం చేస్తున్న మాట నిజం కాదా ? ఈ అందుబాటును ఎందుకు వ్యతిరేకించడం లేదు ?. జ్ఞాన సంపద ప్రక్కన అమానవీయ దృశ్యాలను  ఎందుకు నింపుతున్నట్లు ? ప్రపంచమే అరచేతిలో ఉన్నట్లుగా సెల్ ఫోనును భావిస్తున్న తరుణంలో  అందుకు తగిన స్థాయిలో సాంకేతిక నిర్మాణం కలిగి ఉన్నప్పటికీ  ఇంతటి అధమ ఆలోచనలు  ఎవరి ప్రయోజనం కోసం?  అంగాంగ వర్ణన,  అశ్లీల దృశ్యాలు,  అర్ధనగ్న ప్రదర్శనలు  వ్యక్తిగత జీవితానికి  పరిమితం కావలసినది పోయి  చట్టబద్ధంగా  బహిరంగ మార్కెట్లో  ఉచితంగా లభించే సరుకుగా మారడం  పాలకవర్గాలకు  సోయి లేదు అనడానికి నిదర్శనం కాదా ? భారత సర్వోన్నత న్యాయస్థానం నుండి  ఒక మామూలు ఆలోచన కలిగిన వ్యక్తి వరకు కూడా  ఎవరు వీటిని   ప్రతిఘటించిన దాఖలాలు లేవు.  పోలీసులు చర్యలు తీసుకున్న సందర్భాలు లేనేలేవు.  మహిళా సంఘాలు  పట్టుబట్టి  విరమింప చేసిన పట్టుదల అసలే కనిపించదు . అంటే సమాజాన్ని  నిలువునా  సంస్కారహీనంగా మార్చే ఈ దృశ్యాలు  అన్ని వర్గాల ఆమోదంతో  కొనసాగుతున్నట్లేనా?అనే అనుమానం రాకమానదు.

సమాజ ఎదుగుదలకు, మానవ వికాసానికి,  సంస్కార జీవితానికి  విఘాతము కలిగించే ఇలాంటి దృశ్యాలను  పూర్తిగా నిర్మూలించే వరకు  వ్యక్తుల నుండి  సంస్థల నుండి  సమాజంలోని భిన్న వర్గాల నుండి ప్రభుత్వం పైన ఒత్తిడి చేయవలసిన అవసరం చాలా ఉన్నది.  గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి  అన్ని అర్హతలు ఉన్నటువంటి బుద్ధి జీవులు మేధావులు మహిళా సంఘాలు  విద్యావంతులు ఎందుకు కళ్ళు మూసుకొని  జీవిస్తున్నారో  తమకు తాము ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఏ అర్హతతో ఈ దృశ్యాలను తమ పిల్లలకు చూపిస్తారో ఒక్కసారి తల్లిదండ్రులుగా  ప్రశ్నించుకుంటే  మీ మౌనానికి బాధ్యతారాహిత్యానికి  సిగ్గుతో తలవంచుకోక తప్పదు.
  సభ్యతకు, సంస్కారానికి ,వినయ విధేయతలకు,  గౌరవ మర్యాదలకు భారతదేశం తలమానికమని గర్వంగా చెప్పుకునే  డూప్లికేట్ దేశభక్తులకైన  ఇది నేరం, అసభ్యత, కుసంస్కారం అని తెలియదా ?
మూలాలను వెతకాలి  కారణాన్ని అన్వేషించాలి.  దీని వెనుక గల నిజాల నిగ్గు తేల్చాలి  .అసభ్య సన్నివేశాలను ఆమడ దూరం తరమాలి.  ఆ వైపుగా  కృషి కొనసాగుతుందని,  ముందు మహిళా సంఘాలు  చైతన్యముతో ప్రతిఘ్గటిస్తాయని,  ఇకనైనా సమాజం మేలుకుంటుందని ఆశిద్దాం.

(  ఈ వ్యాస కర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత  హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333