తాగిన మత్తులో హత్యలు, ఆత్మహత్యలు మద్యపానం వల్ల విష ఫలితాలు ప్రభుత్వానికి తెలియదా?
ప్రజలకు ద్రోహం జరుగుతుంటేమరింత ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా ?
---- వడ్డేపల్లి మల్లేశము
ప్రభుత్వం తన పరిపాలన అనేక శాఖల ద్వారా నిర్వహిస్తున్న సందర్భంలో సహజంగానే ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని ఇచ్చే శాఖగా ఆబ్కారీ శాఖను గుర్తిస్తారు . మిగతా అన్ని శాఖల ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరిగితే అబ్కారీ శాఖ కేవలం ప్రజలను నమ్మించి మభ్యపెట్టి తాగుబోతులను చేసి బలహీనులను చేసి ఉన్న కొద్ది ఆదాయాన్ని మద్యానికి ఖర్చు చేసే విధంగా ప్రోత్సహించడమే ఈ శాఖ యొక్క పనిగా మనకర్థమవుతున్నది. శాఖ ఉద్యోగులతో కానీ మద్యం షాపుల పై ఆధారపడి జీవిస్తున్న వారి పైన గాని సమాజానికి ప్రజలకు ఏ రకమైనటువంటి దురభిప్రాయము ఉండవలసిన అవసరం లేదు. కానీ ఆదాయానికి ,వేలాది మందికి ఉపాధి అవకాశంగా ఈ శాఖను ప్రభుత్వము గుర్తించి దానివల్ల వనగూరే ప్రమాదాలు పరిణామాలు, అనారోగ్య పరిస్థితులు హత్యలు, ఆత్మహత్యలు మత్తు మహమ్మారిని ప్రభుత్వం గుర్తించకపోవడం అంతులేని విషాదగాథ గా మిగిలిపోయినది . అందుకే ఇవాళ మొహమాటం లేకుండా ప్రజలకు అనర్థాలను చేకూర్చిపెడుతున్నటువంటి ఈ శాఖపై, మద్యం మత్తుపై, మద్యం అమ్మకాలపై ,ప్రభుత్వ నిర్ణయాల పైన నిశితంగా విమర్శలు అనివార్యమవుతున్నవి. పేదరిక నిర్మూలన ఉపాధి అవకాశాలలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా సులభంగా ఆదాయాన్ని ఇచ్చి ఉపాధి నిచ్చే అబ్కారీ శాఖను చట్టబద్ధం చేయడం చాలా విచారకరం. రాజ్యాంగబద్ధంగా మద్యపానాన్ని నిషేధించవలసిన అవసరాన్ని ఆదేశిక సూత్రం స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఆ నిబంధనను తుంగలో తొక్కి వ్యతిరేకంగా వ్యవహరించడం అంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టడమే కదా.!
అనర్థాల మీద దృష్టి లేదు-- కానీ అమ్మకాల మీద టార్గెట్లు :-
. తెలంగాణ ఏర్పడే నాటికి లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం పదివేల కోట్లుండగా 2022లో 30 వేల కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఇదే అదనుగా భావించిన ప్రభుత్వం వచ్చే సంవత్సరం 40 వేల కోట్లు రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకొని ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. కానీ విపరీతమైన మద్యం ప్రజలకు అందుబాటులో ఉండడం వలన తాగుడుకు బానిసలై మరింత పేదవాళ్లుగా మారి అనారోగ్యం బారిన పడి క్షణికావేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కట్టడి చేయడానికి మాత్రం ప్రభుత్వం ఒక్క క్షణం ఆలోచించినట్లు కనిపించదు. పైగా రాబోయే సంవత్సరం 40 వేల కోట్ల టార్గెట్ ను అందుకోవాలని ప్రతినెలా 3750 కోట్ల విలువైన మద్యం అమ్మాలని ఎక్సైజ్ శాఖకు టార్గెట్ పెట్టినట్లు తెలుస్తుంది . ఈ నేపథ్యంలో సిబ్బంది అధికారులు మద్యం దుకాణాలతో పాటు బెల్టు షాపులను విచ్చలవిడిగా త్రాగడానికి ప్రోత్సహించి అవసరమైతే ఉద్ద ర అమ్మకాలను కూడా అనుమతిస్తూ టార్గెట్ చేరుకోవడానికి చేస్తున్న కృషి పరోక్షంగా సమాజానికి ప్రజలకు ఎనలేని ద్రోహాన్ని తలపెట్టడమే.
పోలీసు నివేదికలు పట్టించుకున్న దాఖలా లేదు:-
ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ప్రకారంగా మద్యం మత్తులో 80 శాతం నేరాలు జరుగుతున్నట్లు స్వయంగా పోలీసు శాఖ ప్రకటించిన విషయం ప్రభుత్వానికి తెలియదా? అనేకమంది శాసనసభ్యులు మంత్రులు కూడా సందర్భోచితంగా మద్యపానం పైన మాట్లాడవలసి వచ్చినప్పుడు మద్యం విష ఫలితాలను అంగీకరిస్తూనే నిషేధించడానికి ముఖ్యమంత్రిని ఒప్పించడానికి మాత్రం ధైర్యం చాలడం లేదంటే ఈ రాష్ట్రంలో పాలన తమ అనుచర గణం కోసమే కదా? ఇటీవల ప్రభుత్వం మద్యం షాపులు పెట్టుకోవడానికి కూడా రిజర్వేషన్ ప్రతిపాదన చేసినది అంటే అంతకంటే హీనమైన పరిస్థితి మరొకటి ఉండదు అంటే మరింత ఎక్కువగా ప్రోత్సహించడం కోసమే కదా ? గత సంవత్సరం దిశ రేపు అండ్ మర్డర్ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మరియు రిమ్స్ ఆధ్వర్యంలో చంచల్గూడా జైలులో ఉన్న 65 మంది నేరస్తుల మీద జరిపిన పరిశోధన మానసికమైన సమస్యలు లేకపోయినా లిక్కర్ ప్రభావముతో నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించడం ఇప్పటికైనా ప్రభుత్వానికి జ్ఞానోదయం కాకపోతే ఎలా? మద్యం మత్తులో నేరాలకు పాల్పడి హత్యలు ఆత్మహత్యలకు పూనుకుంటున్న వారిని గమనిస్తే 43 శాతం మంది 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారేనని ఇందులో కూడా 55 శాతం మంది అల్ప ఆదాయం, సామాజిక స్థాయి, పేదరికం గలవాలేనని తేలినది. అంటే పేదరికం, అనారోగ్యం , ఉపాధి లేకపోవడం, ఆర్థిక భరోసా లేకపోవడం , సామాజికంగా వెనుకబాటుతనం కూడా మద్యానికి బానిసలు కావడానికి ఆవేశంలో నేరాలకు పాల్పడడానికి కారణమవుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో మద్యాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా
జరగబోయే దుష్పరిణామాలను అరికట్టవచ్చునని ఆర్థిక పరిస్థితులను చక్కపరచవచ్చునని పేదరికాన్ని నిర్మూలించవచ్చునని అత్యాచారాలు అకృత్యాలను అడ్డుకట్ట వేయవచ్చునని అనేక పరిశోధనలు తెలిపిన వాటిని ప్రోత్సహించే క్లబ్బులు, పబ్బులు, బార్లు యదేచ్చగా కొనసాగుతుంటే ప్రభుత్వ ఆలోచన ఆదాయం కోసమేనని చెప్పక తప్పదు. బార్లను విచ్చలవిడిగా ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం మద్యం తాగి తమ ఇంటికి ప్రయాణమైనటువంటి వారిని మధ్యలోనే ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టులు చేసి జరిమానాలు విధించడం ప్రభుత్వ ద్వంద్దనీతికి నిదర్శనం కాదా? బార్లలో తాగిన వాళ్లు పర్మిట్ రూముల్లో సేవించిన వాళ్లు
ఇంటికి పోకూడద? ఎక్కడ ఉండాలి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక సందర్భంలో మద్యం తాగి వాహనం నడుపుతున్నటువంటి డ్రైవర్ను పోలీసులు అడ్డుకొని మద్యం తాగి వాహనం నడపకూడదని హెచ్చరిస్తే మేము తాగిన మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపే మీకు నన్నడిగే అధికారం ఎ క్కడిది అని ప్రశ్నించినట్లు సామాజిక మీడియాలో చూడడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ తప్పిదాలను ఏనాడైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటారని ప్రభుత్వం గుర్తించినప్పుడు అబుకారి శాఖను ఇతర శాఖలలో విలీనం చేసి అనర్థాలను కొనితెచ్చిపెట్టే
మద్యాన్ని నిర్మూలించడం ద్వారా ఇతరత్రా ఉపాధి అవకాశాలను కల్పించడంతో మరింత సంపద ఉత్పత్తి చేయవచ్చునని ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది . .మద్యం అందుబాటులో ఉన్నప్పుడు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా తాగుడుకు బానిసలై సమాజాన్ని విషతుల్యం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయవలసిన సామాజిక బాధ్యతను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించకపోతే ప్రభుత్వ ఆచరణ దేశద్రోహమే అవుతుంది.ప్రజలు కూడా ప్రభుత్వ అవకాశవాదానికి అవకాశం ఇవ్వకుండా తమారోగ్యం,కుటుంబాజీవన ప్రమాణం,అనర్థాలను కట్టడిచేయడం కూడా తమ బాధ్యతని గుర్తించినప్పుడు చైతన్యంగా ప్రశ్నించినప్పుడు ప్రభుత్వాలు స్వార్థపు ఆలోచనల నుండి వైదొలుగుతాయి.వైఫల్యాలను అంగీకరిస్తాయి.ఉమ్మడిప్రజాఉద్యమావేధిక మా త్రమే పరిష్కారం చూపగలదు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ )