పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వలె వృద్ధులపై వేధింపులు సాధింపులా?
కాటికి కాలుజాపిన తరుణంలో అవమానాలు, చిత్కారాలు, గెంటివేతలు, మానసికక్షోభలే తల్లిదండ్రులకు గౌరవాలు బహుమానాలా? తన దాకా వస్తే కానీ తెలియదు.. ఆ వాస్తవాన్నే తెలుసుకోవాలి సుమా!!
--- వడ్డేపల్లి మల్లేశం
తన దాకా వస్తే కానీ తెలియదు అనే నానుడిలోని అంతరార్థం అంతా ఇ o తా కాదు. ఇతరులకు ఒక నీతి తనకు మరొక నీతి, ఇతరులకు ఒక శిక్ష తనకు సాదాశిక్ష, ఇతరులు చేసింది తప్పైతే తాను చేసింది మాత్రం ఒప్పు అని అంగీకరించడం, ఇతరులు చేసినది పొరపాటు అయితే తాను చేసింది అనుకోకుండా జరిగింది అని సమర్ధించుకునే అవకాశం ఉన్న కాలమిది. ఎత్తుపల్లాలు, ఆరోహణ అవరోహణలు, తప్పు ఒప్పులు, నీతి అవినీతి, మంచి చెడు, కష్టసుఖాలు, చిన్న పెద్ద అనే తారతమ్యాలు సృష్టిలో సహజం. కానీ వీటిని తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో తమ నైజం, స్థాయి, ధైర్యం, పెత్తనం సహజమని ఇతరులది మాత్రం కృత్రిమమని తమది సహజమైన ప్రతిభా అని ఇతరులది అనుకోకుండా కలిసి వచ్చిందని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం ముమ్మరంగా సాగుతున్న కాలమిది.
తాము చేసింది సక్రమమని, ఇతరులది అక్రమమని, తమది నీతి మార్గమని, ఇతరులది అవినీతి పంతా అని నచ్చజెప్పే ప్రయత్నం, సమర్థించుకునే అవకాశాలు, పలుకుబడిని ఉపయోగించి తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసే కాలమిది." ప్రకృతిలోని తారతమ్యాలకు తోడుగా మనిషి లో ఉన్నటువంటి వివక్షత, అణచివేత,అసమానత, పీడన, అవమానము, సాచివేత వైఖరి, నిందల పాలు చేయడం, చివరికి తమకు అనుకూలంగా సమర్థించుకోవడానికి సర్వ ఎత్తులు వేయడం వంటి అక్రమ మార్గాలతో కూడుకున్నటువంటి వ్యవస్థను నిత్యం మనం కళారా చూస్తూ ఉన్నాం. న్యాయ వ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగము, పోలీసు వ్యవస్థ అడపాదడపా అక్కడో ఇక్కడో నైతిక విలువలకు కట్టుబడినటువంటి సమాజాన్ని ఒకవైపు చూస్తూ ఉన్నప్పటికీ కనిపించేదంతా అవినీతి అక్రమాలతో కూడుకున్న చీకటి సామ్రాజ్యమని, పలుకుబడి గల వారిదే రాజ్యమని, తప్పును ఒప్పు చేయడానికి కలవారికి పెద్ద కష్టమేమీ కాదని, పేదవారికి మాత్రం ప్రతిదీ కష్టమని, విలువలతో కూడుకున్న జీవితాలు గడిపే పేద వర్గాలకు స్థానం లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గులు అవినీతిపరులు ఆగంతకులకు కొదవలేని కాలమిది."
అయితే ఈ రకమైన వివక్షత తేడాలు కేవలం సమాజంలో మాత్రమే కాదు కుటుంబ వ్యవస్థలో కూడా బలంగా చూడవచ్చు. తోబుట్టువుల మధ్యన విషప్రచారాలు, అన్నదమ్ముల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణ దృశ్యాలు, అత్త కోడళ్ళ మధ్యన అపశృతులు, ఆధిపత్య ధోరణులు, సాచివేత వైఖరితో పాటు హింసించి పీడించి అవమానిస్తున్నటువంటి సన్నివేశాలను మనము ప్రతిరోజు కల్లా రా చూస్తూ ఉన్నాం. వృద్ధులైన తల్లిదండ్రులను అవమానించడం, రక్షణ లేకపోవడం, పీడించడం, భరోసా లేని కారణంగా దిక్కులేని వాళ్లుగా మారిపోవడం, బలవంతంగా ఇంటి నుండి గెంటి వేయడం, అప్పుడప్పుడు చావు దెబ్బలు తింటున్నటువంటి సందర్భాలను కూడా గమనించినట్లయితే తల్లిదండ్రులు ఎవరు? కన్న కొడుకులు ఎవరు? అన్నదమ్ములు ఎవరు? అక్క చెల్లెలు ఎవరు? చివరికి అత్తమామల పట్ల ఆడపడుచుల యొక్క కఠిన వైఖరిని కూడా గమనించినప్పుడు ఈ బలహీనమైనటువంటి మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు ఎంత నీచంగా దిగజారినాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ కల్లారా ప్రతిరోజు చూస్తున్నటువంటి సన్నివేశాలు సంఘటనలు యదార్ధ గాథలే కదా !
వృద్ధుల పట్ల అమానవీయ వైఖరిని నిరసించాలి
*****************************************
తన దాకా వస్తే కానీ తెలియదు అనే విషయం ప్రతి వ్యక్తికి తెలిసినప్పటికీ అంతవరకు చూద్దాంలే ఆ ఆలోచన ఇప్పుడు ఎందుకు అనే కోణంలో ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్న కారణంగా పశ్చాత్తాపము అనే పదానికి స్థానము అర్థం లేకుండా పోయినది. " కాటికి కాలు చాపిన ముదిమి వయస్సులో కూడా తల్లిదండ్రులు హింసకు గురి కావడం ఆందోళన కలిగించే విషయం. కొందరి పైన ఏ రకమైన ఆస్తిపాస్తులు సంపాదించలేదని విమర్శ బలంగా ఉంటే, మరికొందరు తమ కూతుర్ల వైపు మొగ్గు చూపుతున్నారని తమ గురించి పట్టించుకోవడం లేదని విమర్శతో కన్న పిల్లలే తల్లిదండ్రుల పైన దాడి చేసిన సంఘటనలు కోకొల్లలు.సంపాదించిన ఆస్తిపాస్తులు అన్ని కూతుర్లకే కట్టబెట్టినారని, తమకు ఏమి మిగిల్చలేదని, తమ కొరకు ఏనాడు కూడా ఆలోచించలేదని, అసలు వాళ్లు తమకు తల్లిదండ్రులు కానే కాదని, వారి పట్ల తమకు బాధ్యత లేదని, అందుకే ఇంటి నుంచి గెంటి వేస్తున్నామని, కనీసం నిలువ నీడకు కూడా అవకాశం లేకుండా ఇంట్లో నుండి బహిష్కరించిన వాళ్లను కూడా మనం చూడవచ్చు. మరి కొన్ని చోట్ల వృద్ధాప్యంలో వారికి సేవలు చేయడం ఇబ్బందికరము కనుక అవకాశం ఉన్న నాడే తప్పించుకోవడం ముఖ్యమని కొందరు భావిస్తే, ఒక్క కొడుకు ఉన్నటువంటి కుటుంబాలలో ముఖ్యంగా బాధ్యత అంతా చివరి వరకు తాను ఒక్కడినే మో యవలసి ఉంటుందని అక్కస్సుతో నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేసిన సందర్భాలు మనం చూడవచ్చు". వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించే సందర్భంలో ఇటీవల కాలంలో అమలులో వచ్చినటువంటి చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆచరణలో అవి విఫలం కావడం, అనేక రకాలు అయినటువంటి వాదనలు అమల్లోకి రావడంతో పాటు చుట్టాలను అమలు చేసే యంత్రాంగం బలంగా లేకపోవడంతో కూడా వృద్ధుల పరిరక్షణలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులుగా కొన్ని అంశాలను మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. "తమకు ఏమీ సంపాదించలేదని కొందరు అంటే, తమ గురించి పట్టించుకున్నది నామమాత్రమని మరికొందరు, ఆడపడుచుల కోసమే బ్రతికినారని కొందరు అంటే, అన్నదమ్ముల మధ్యన వివక్షత చూపినారని మరికొన్ని విమర్శల కు తల్లిదండ్రులు బలి కావడాన్ని మనం గమనించవచ్చు". వయసు మీద ఉన్న నాటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని వాటిని మనసులో దాచుకొని కుట్రపూరితంగా వ్యవహరించడం కారణంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అనేక మానసిక ఇబ్బందులు పడవలసి వస్తున్నది. సమాజం యొక్క మద్దతు అంతో ఇంతో దొరికినప్పటికీ అమలు చేసే క్రమంలో వృద్ధులు నిరంతరం వివక్షతకు గురవుతూనే ఉన్నారు. కనీసం వారికి మాట్లాడే అవకాశం కానీ అభిప్రాయాన్ని వెలిబుచ్చే స్వేచ్ఛగాని లభించకపోవడం వల్ల మౌనంగా కొడుకులు కోడండ్లు పిల్లలు కుటుంబ సభ్యులు విధించే శిక్ష భరించవలసివస్తున్నది అనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి మౌలికమైన వాస్తవమైన అంశాలను ప్రస్తావించడానికి ముందుకు వచ్చే జనం, పెద్దమనుషులు, రచయితలు చాలా తక్కువ కనుక వృద్ధులకు తగిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. ".అనేక దురభిప్రాయాలను మనసులో ఉంచుకొని కక్షపూరితంగా అమానవీయంగా వ్యవహరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు కొడుకులు కోడండ్లు వాళ్ల పిల్లలు యొక్క అభిమానాన్ని ఆదరణను పొందలేకపోవడం విచారకరం. నిజంగా వాళ్ళు కుటుంబానికి సేవ చేయలేదా? వాళ్ళు పోషించిన పాత్ర లేదా? కుటుంబం మనుగడకు గడకు వాళ్ళు ఆధారం కాదా? తొలినాళ్లలో కుటుంబం ఆలనా పాలన ఏ రకంగా సాధ్యమైంది? అనే విషయాలను ప్రశ్నించుకుంటే కానీ సమాధానం దొరకదు. అయితే ఆ ప్రశ్నలు వేసుకునే వాళ్లే కరువైనటువంటి కాలం ఇది."
దాచుకుంటే దా గేది కాదు భవిష్యత్తు శిక్షిస్తుంది జాగ్రత్త!!
*********************************************
"కుటుంబ సభ్యులనే ఆదరించలేనటువంటి అమానవీయ సంస్కృతి సమాజం నిండా వ్యాపించినటువంటి దుర్మార్గ పరిస్థితులలో ఈ వ్యవస్థను నెట్టుకుపోవడం నిజంగా కష్టమే. కుటుంబ వ్యవస్థ అంతో ఇంతో ప్రపంచంలోనే బలంగా ఉన్న దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉన్నది. దాని కారణంగానే ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉన్నదని ఆర్థికవేత్తలు మేధావులు ప్రశంసిస్తూ ఉంటే ఆ సమన్వయం తోనే కుటుంబ సభ్యులందరు కలిసి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ఉత్పత్తిని పెంచడంలో భాగ భాగస్వాములు అవుతున్నారని అనాదిగా సంబరపడుతున్న తరుణంలో కృషికి, శ్రమకు, పట్టుదలకు, వారసత్వానికి నిజమైన ప్రతినిధులై నటువంటి వృద్ధుల పట్ల నేటి సమాజం అమానవీయంగా వ్యవహరించడం అంటే భవిష్యత్తును అంధకారంగా మార్చుకోవడమే అని అంగీకరించి తీరాలి. కడుపులో పుట్టిన కొడుకులతో పాటు పరాయి ఇంట పుట్టినటువంటి ఆడపిల్లలు కూడా వృద్ధులను అవమానిస్తే ఎలా? మరి ఈ పరిస్థితి ప్రతి ఇంట్లో ఉంటుంది కదా! అందుకే దీనిని పోల్చుకోవడం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం చేయడం సరైనది కాదు. ప్రతి కుటుంబంలోనూ ఉన్న వాళ్ళందరికీ హక్కులు ఉంటాయని గుర్తించినప్పుడు, అవి అన్ని కుటుంబాలలో కూడా సమాన స్థాయిలోపల అమలు కావడానికి పరిస్థితులను కల్పించినప్పుడు, ఆ పద్ధతిని ఆచరించడానికి కుటుంబ సభ్యులు సమన్వయంతో ముందుకెళ్లినప్పుడు, తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలని విశ్వ మానవ భావన వెల్లివిరిసి నపుడు, తల్లిదండ్రులను గౌరవించాలి అనే మానవీయ విలువలు పూర్తిస్థాయిలో అమలైనప్పుడు మాత్రమే సమాజం ముందుకెళ్తుంది. అమానవీయ సంఘటనలకు ఆస్కారం లేనటువంటి వ్యవస్థ సా కారం అవుతుంది". ఆ వైపుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు కొనసాగాలని భవిష్యత్తులో మరింత బలో పేతం కావాలని మనసారా ఆశిద్దాం !!!
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)