ప్రాణాలు పోస్తూనే ఆగిపోతున్న గుండె వైద్యుల ఊపిరి.

Oct 12, 2025 - 00:41
 0  1

పని ఒత్తిడి,తీరికలేని పని వేళలు, నిద్ర కరువు కారణమంటున్న విశ్లేషకులు. వైద్యుల సగటు జీవితకాలం 59 ఏళ్లలోపేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేయడం ప్రమాదకరం.

---- వడ్డేపల్లి మల్లేశం

ఇటీవల జరుగుతున్నటువంటి వైద్యుల ఆకస్మిక మరణాలు, పని ఒత్తిడి, కొన్నిచోట్ల దాడులు, మరికొన్నిచోట్ల అత్యాచారాలు హత్యలను గమనించినప్పుడు వైద్య వృత్తి కూడా విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా సమాజం గుర్తించవలసిన అవసరం ఉంది. సమాజం ఆ రకంగా వైద్యుల పట్ల సానుభూతి గౌరవంతో పాటు వాళ్ల ఆరోగ్య భద్రత పైన కూడా దృష్టి సారించడం అవసరమే. అంతేకాదు ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు యాజమాన్యాలు కూడా వైద్యుల భద్రత పట్ల పూర్తి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు తగిన విశ్రాంతిని ఇవ్వడం కూడా అవసరం. చాలీచాలని వేతనాలతో పాటు పని ఒత్తిడిని భారంగా మోపే యాజమాన్యాలు ప్రభుత్వాలు కూడా లేకపోలేదు.అలాంటి దుర్భర పరిస్థితుల్లో కేవలం గుండె వైద్యులు మాత్రమే కాదు ఏ విభాగం లో పనిచేస్తున్న వైద్యులకైనా ప్రాణాపాయము పొంచి ఉన్నట్లేనని గుర్తించాలి. ప్రజలకు ప్రాణాలు పోయగలరు కానీ తమ ప్రాణాలను కాపాడుకోలేని దుస్థితిలో వైద్యులు ఉన్నారంటే అది ఆ వైద్యుల యొక్క బలహీనత కాదు... పని ఒత్తిడి, ఇతర సామాజిక పరిస్థితులు, ప్రస్తుత అలవాట్లు, వాతావరణ కాలుష్యం, అందుబాటులో ఉన్నటువంటి ఆహారం లభ్యతలోని లోపాలుగా భావించవలసినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సరైనటువంటి పోషకాహారాన్ని ఇతర రక్షణ చర్యలను చేపడుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ అనివార్యమైన పరిస్థితులలో ప్రాణదాతలు విధినిర్వహణలోనూ విశ్రాంతిలోనూ పని ఒత్తిడిలోనూ ఇతర అనేక పరిస్థితుల్లో ఇటీవల కాలంలో మృత్యువాత పడడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది సమాజం యావత్తు ఆందోళన చెందవలసిన పరిస్థితి. వైద్యులు యాజమాన్యాలు రోగులు అనే వివక్షత కాదు కానీ అనారోగ్యానికి సంబంధించినటువంటి మూలాల పైన పరిశీలన పరిశోధన జరగవలసిన అవసరం మరింతగా ఉన్నదని ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు మృత్యువాతపడడాన్ని సీరియస్ గా సమాజం పట్టించుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సమర్థులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో సమాజాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కారణాలు ఏవైనా ఇలాగే రోజుకి కొన్ని ప్రాణాలు గాలిలో కలిసి పోతూ ఉంటే ఇప్పటికే అరకొరగా ఉన్నటువంటి వైద్య సిబ్బంది యొక్క అందుబాటు మరింతగా తగ్గిపోయి రోగులు వైద్యుల యొక్క నిష్పత్తి మధ్యన చాలా వ్యత్యాసం రావడం వలన కూడా భవిష్యత్తు ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.

        విధులలో తీవ్ర ఒత్తిడిని నివారించలేమా?

      రాత్రి పగలు పని వేళలను క్రమబద్ధీకరించలేమా?

********************************************

ముఖ్యంగా ఇటీవలి కాలంలో వైద్యులపైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు కొన్ని రోజుల క్రితంవైద్యుడు హైదరాబాద్ లో భోజనం చేస్తూనే కనుమూసిన సంఘటన మరిచిపోక ముందే ఇటీవల చెన్నైలో తా జాగా రోగులను చూస్తూనే గుండెపోటుతో గుండె వైద్యుడు మృతి చెందడాన్ని గమనించినప్పుడు అంతేకాదు ముఖ్యంగా యువ వైద్యులకు గుండెపోటు రావడం సర్వసాధారణమైనటువంటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకుంటే ప్రాణదాతల ఊపిరి ఈ రకంగా ఆగిపోవాల్సిందేనా? దీనికి ప్రత్యామ్నాయం లేదా? కారణాలను అన్వేషించలేమా? అని వ్యవస్థ, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పాలకులు, చివరికి వైద్యులు కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైనది. ఈ రకంగా నిపుణులైనటువంటి వైద్యులను ఈ దేశం కోల్పోతూ ఉంటే బతుకుదెరువు లాభార్జన పేరుతో అనేక మంది వైద్యులు ఇతర దేశాలకు వలసబోతు ఉంటే ఈ దేశం అనాధగా మిగిలిపోవాల్సిందేనా? ఆలోచించవలసిన తరు ణం ఎప్పుడో మించిపోయింది కూడా కోట్లాది ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వైద్యులకు రాత్రి పగలు తీరికలేని పని ఒత్తిడి,నిద్రలేని రాత్రులు తరచూ ఎదురైనప్పుడు కూడా ప్రాణాలు పోసే వైద్యులే ఊపిరి వదలడం ఆందోళన కలిగించే విషయం. తీవ్రమైన ఒత్తిళ్ల మధ్యన అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండెపోటు వంటి వాటితో ప్రాణాలు వదలడం కారణాలు ఏమీ లేకుండా మృత్యువాతపడడాన్ని మనం గమనించినప్పుడు అంతర్గతంగా వీటికి సంబంధించినటువంటి పరిశీలన మరింత లోతుగా జరగవలసిన అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా మామూలుగానే ఉన్నప్పటికీ రెండు మూడు రోజుల తర్వాత గుండెపోటుతో కన్నుమూసిన వైద్యుని రికార్డును పరిశీలించినప్పుడు అనారోగ్యమైన పరిస్థితులు లేవని కేవలం ఒత్తిడి వల్లనే జరిగిందని వైద్యులు ముగింపుకు వచ్చారంటే ఏమనుకోవాలి? తాజాగా తమిళనాడులోని చెన్నైలో కార్డియాక్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయి వార్డులో రోగులను పరిశీలిస్తూనే గుండెపోటుతో ప్రాణాలు వదిలడాన్ని పరిశీలించినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల సంఘటనల పైన స్పందిస్తూ దేశంలో ప్రజల సగటు ఆయుర్దాయము 69 నుంచి 72 ఏళ్లు ఉంటే వైద్యుల సగటు జీవిత కాలం మాత్రం 59 ఏళ్లలోపేనని ఆందోళన వ్యక్తం చేయడం విచారకరమైన విషయం. ప్రభుత్వ ప్రైవేటు రంగంతో సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి ఈ మృత్యు సంఘటనల పైన చాలా లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం మాత్రం వుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వైద్య సేవలో వైద్యులు ఉంటున్నట్లు, అవుట్ పేషెంట్లను చూడడంతో పాటు వార్డుల్లో రోగులతో మాట్లాడడం, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం, శస్త్ర చికిత్సలకు ఏర్పాటు చేయడం, శస్త్ర చికిత్సలు గంటలు తరబడి చేయడం, ఇంటికి వచ్చినప్పటికీ ఆసుపత్రి నుండి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తగిన సమాధానం చెప్పడం వంటి అనేక రకాలైనటువంటి పని ఒత్తిళ్ళు వైద్యులు ఎదుర్కొంటున్నట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్యులు కూడా మామూలు మనుషులే అనే కనీస మైనటువంటి అవగాహనకు వచ్చినప్పుడు అందరిలాగా వాళ్లకు కూడా అవసరమైనటువంటి విశ్రాంతి ఉల్లాసము ప్రోత్సాహము అవసరమని అంగీకరించక తప్పదు. కానీ ప్రభుత్వాల యాజమాన్యాల యొక్క స్వార్థపూరిత ప్రయోజనాల కోసం సిబ్బందిని సరిగా నియమించకుండా అరకొర సిబ్బందితో అత్యధిక సేవలను తీసుకోవడంలో ప్రభుత్వాలు ప్రైవేటు యాజమాన్యాలు రెండు కూడా పోటీపడుతున్న తరుణంలో ఇలాంటి మృత్యుఘో ష జరగక ఏమవుతుంది? సరైన సమయంలో నిద్రాహారాలు పొందలేకపోవడం, ఇక ప్రైవేటు వైద్యశాలలైతే వైద్యులకు కూడా టార్గెట్లను విధించడం వంటి నిర్ణయాల కారణంగా కూడా ప్రైవేటు వైద్యుల పైన ఒత్తిడి పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇక సొంతంగా వైద్యశాలలు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు వైద్యులు కూడా కొంత లాభాపేక్షతో ఒత్తిడికి గురి కావడం, కొద్దిమంది సిబ్బందితో విధులను పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేయడం, ఆస్పత్రిలో పేరు కోసం ఆరాటపడి పని భారాన్ని ఎక్కువగా మోయవలసి రావడం వంటి అనేక కారణాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వైద్యుల పైన ఒత్తిడి పెరగడానికి కారణం అవుతున్నట్లు విశ్లేషకులు నిపుణులు అభిప్రాయపడుతున్నరు. ఈ తరుణంలో ఈ పరిస్థితుల నుండి గట్టెక్కడానికి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయడం అనివార్యం కూడా.

 కొందరు ప్రముఖ వైద్యుల అభిప్రాయాలు అవలోకిస్తే:-

స్టార్ ఆసుపత్రి లో పనిచేస్తున్న సీనియర్ కార్డియాలజిస్ట్ జాయింట్ ఎండి డాక్టర్ రమేష్ గూడపాటి గారు ప్రజలకంటే పదేళ్లు వైద్యులు గా తాము తక్కువగా బతుకుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేయడం విచారకరం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారంగా చాలామంది వైద్యులు 50 నుండి 55 ఏళ్ల మధ్యలోనే చనిపోతున్నారని అమెరికాలో వైద్యులు రోజుకు 8 గంటలు పనిచేస్తే, యూకే లో వారమంతా కలిసి 36 గంటలు మాత్రమే పని చేస్తే భారతదేశంలో మాత్రం రాత్రి పగలు వైద్యులు పరుగులు పెట్టాల్సిందేనని వైద్యులపై మోపిన భరోసాతో నమ్మకంతో కాదనలేక సాయంత్రం వరకు కూడా భోజనం చేయకుండా సేవలు నిర్వహించడం కూడా ఒక కారణంగా వారు తమ ఆవేదన వ్యక్తం చేయడం గమనించాలి. ఇక వైద్య వృత్తి ప్రధానంగా ఒత్తిడితో కూడుకున్న జీవితమని చాలా సందర్భాలలో అర్ధరాత్రి వరకు కూడా తీరిక ఉండదని రోగి పరిస్థితి సీరియస్ గా ఉంటే ఏ సమయంలోనైనా తిరిగి వెళ్లాల్సిందేనని తమ ఆరోగ్యం గురించి కాకుండా రోగుల గురించి ఎక్కువగా ఆలోచించవలసిన రావడం వల్ల కూడా తెలియకుండానే ఒత్తిళ్లకు గురవుతున్నట్లు దానివల్ల తట్టుకోలేక చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ హయగ్రీవ రావు గారు కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కార్డియాలజిస్టు ఇతర రోగుల మాదిరిగా వైద్యులకు కూడా అన్ని ఆసుపత్రుల్లో ఒకరోజు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారంటే వైద్య వృత్తిలో దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాలలో అయితే వైద్యులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తారని మిగతా రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో గడుపుతారని మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడమే కాకుండా ఒత్తిడికి గురై తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్న కారణంగా వైద్యులు మృతి చెందుతున్నట్లు ప్రస్తుత పరిస్థితి లోపల వైద్యులు కూడా తమ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని సిటిజన్ ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ సుధీర్ కోగంటి గారు చేస్తున్న సూచనను ప్రభుత్వాలు, ప్రైవేటు యాజమాన్యాలు, సమాజం కూడా పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది.

వైద్యులు కూడా ప్రజల్లో భాగమేనని వారి అవసరాలను విశ్రాంతిని సమాజము ప్రభుత్వము యాజమాన్యాలు గుర్తించాలని సిబ్బందిని అధికంగా సమకూర్చుకోవడం తోపాటు వైద్యులకు కూడా తరచుగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా పరిస్థితులు ఉండాలని మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రత్యేక వాతావరణం ఏర్పాటు చేయడం కూడా కీలకమని మానసిక నిపుణులు మేధావులు బుద్ధి జీవులు చేస్తున్న సూచనలను యాజమాన్యాలు ప్రభుత్వాలు పాటిస్తే కొంతవరకైనా ఈ వైద్యుల మృత్యుఘోష ను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333