నీటి ప్రమాదాల నుండి మానవ వనరులను కాపాడుకోలేమా

May 26, 2024 - 22:18
Jun 2, 2024 - 01:16
 0  19
నీటి ప్రమాదాల నుండి మానవ వనరులను కాపాడుకోలేమా

చిన్నారులు యువత  ప్రాణాలు కోల్పోవడం  కుటుంబాలకు దేశానికి భారీ నష్టం

రాష్ట్ర  ప్రభుత్వాలు  నివారణ పై దృష్టి సారించాలి.  

అపరిచిత ప్రాంతాల్లో అతి సాహసం ప్రమాదకరం. 

--- వడ్డేపల్లి మల్లేశం 

నీటి ప్రమాదాలలో మృత్యువాతకు  అనుకోని ప్రమాదాలతో పాటు  ప్రాణాలతో చెలగాటమాడే  పోకిరి విధానాలు  కూడా కారణమని  చెప్పక తప్పదు.  అశ్రద్ధ అతిసాహసం ,అతిఉ త్సాహం,  నిలకడ లేని తనం, సూచనలు పాటించకపోవడం,  పరిస్థితిని సరిగా అంచనా వేయకపోవడం  వంటి కారణాల వలన  ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో  నీటి  ప్రమాదాలు మునకలు కొట్టుకుపోవడం వంటివి  భారీగా జరుగుతున్నవి .ఇది ఒక రకంగా  ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఉన్న యువతకు సంబంధించిన భారీ నష్టంగా భావించవచ్చు.  ఒక అంచనా ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా   2ల,36 వేల మంది  ప్రమాదాల్లో నీట మునిగి చనిపోతున్నట్లు  అంచనా వేశారు.  అయితే ముఖ్యంగా  పేద మధ్యతరగతి దేశాలలోనే ఇలాంటి ప్రమాదాలు  90 శాతం వరకు  జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయడం  పరిశీలించదగిన విషయం.  అందులో భాగంగా  అభివృద్ధి చెందుతున్న భారత్లో 2022లో నీటిలో మునిగి సుమారు 38 వేల మంది మృత్యువాత పడ్డారని జాతీయ నేర గణాంకాల సంస్థ  ఆందోళన వ్యక్తం చేయడం  పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది . అంతేకాకుండా  నీట మునిగి చనిపోతున్న వారిలో 21 శాతం 18 ఏళ్ల లోపు వారేనని  చేసిన హెచ్చరిక పైన  ప్రభుత్వాలు దృష్టి సారించవలసిన అవసరం వుంది.  ఇక  ప్రమాదాలకు గురవుతున్న వాళ్లలో 1-9 సంవత్సరాల మగ పిల్లలే ఎక్కువగా  ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తుంటే  ఆయా కుటుంబాల సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను కూడా అంచనా వేయవలసి ఉంటుంది.
     నేటి ప్రమాదాలు భిన్న పరిస్థితులు కారణాలు:-
**************  ఈతకు వెళ్లి  మునిగి చనిపోయిన వాళ్ళు,  సంపులో పడి చనిపోయిన బాలలు,  సముద్ర తీరంలో ఈతకు వెళ్లి కొట్టుకుపోయిన  యువత,  బురదతో ఏర్పడకుండా ఉన్న బావిలో దూకి చనిపోయిన పిల్లలు  ఇలా పలు రకాల కారణాలతో  పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి.  ఇక పేద కుటుంబాలకు సంబంధించిన ఇండ్లలో  తల్లిదండ్రులు పనులకు పోతే పిల్లలను ఇంటి దగ్గర ఒంటరిగా వదిలిపెట్టడంతో  చిన్నపిల్లలు నీటి తొట్టిలో పడి చనిపోవడం  ఇక అంతకు పెద్దవాళ్ళు అయితే తోటి పిల్లలతో కలిసి ఈతకు వెళ్లి  తెలిసి తెలియని వయసులో  మృత్యువాతపడడాన్ని మనం గమనించవచ్చు.  చెరువులు, బావులలోకి దిగడంతో ఈత రాకపోవడంతో  ఉత్సాహం ప్రదర్శించడం ద్వారా క్షణకాలంలో మృత్యు ఒడిలో చేరుతున్న వాళ్లు అనేకం.  సముద్ర తీరంలో లేచే అలలు,  ప్రమాదాలను అంచనా వేయకపోవడం , అలల తీవ్రత  పట్ల అవగాహన లేకపోవడం  తో పాటు  మునిగిపోయిన వారిని రక్షించే క్రమంలో కూడా మరికొందరు  ప్రాణాలకు తెగించిన ప్రయోజనం లేకపోగా వాళ్లు కూడా చనిపోవడాన్ని మనం గమనించవచ్చు.  అవసరాలకు ఏ పనులు చేసిన అభ్యంతరం లేదు కానీ కొన్ని సందర్భాలలో అతి ఉత్సాహంతో అతి సాహసంతో ప్రాణాలకు తెగించి చేసే ఏ పనులైనా  సహించకూడనివే. అందులో ఇలాంటి తెగించి నీటిలో దూకే పనులను  మనం ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.  ఇక ఈ  నీట మునిగిన సందర్భంలో రాళ్లు  ఇతర వస్తువులు థా కి తలకు శరీర భాగాలకు గాయమై శాశ్వతంగా అంగవైకల్యమైన వాళ్లను కూడా మనం చూడవచ్చు . కానీ మానవ ప్రమేయం లేకుండానే వరదలు వచ్చినప్పుడు  నివాస ప్రాంతాలు నీట మునిగి కొట్టుకుపోయినప్పుడు , భారీ వర్షాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు దారి తెన్ను తెలియక డ్రైనేజీలో పడి  చనిపోవడం వంటి అనేక రకాల సంఘటనలు  అనునిత్యం ఏదో ఒక మూల దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి . కారణాలు ఏవైనా  యువత చిన్న పిల్లలు మధ్య వయస్కులు భిన్న వయస్సుల వారిని కోల్పోవడం ద్వారా భారతదేశ  ఎంతో నష్టపోయినట్లుగా భావించాలి. అంతేకాకుండా వాళ్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిపోవడం  బాధాకరం  ఇందులో మానవ ప్రమేయంతో కొన్ని ప్రమేయం లేకుండా అనివార్యమైనా పరిస్థితులు కొన్ని ప్రమాదాలు జరగడాన్ని అంచనా వేసి ఒక నిర్దిష్టమైన ముగింపుకు రావాల్సిన అవసరం ఉన్నది.
       ప్రమాదాల పైన  అంచనా కొన్ని నివారణ చర్యలు:-
**************
  ఇప్పటికీ శాస్త్ర సాంకేతికంగా అనేక ముందడుగు వేసినప్పటికీ నీటి ప్రమాదాల వలన చనిపోతున్న వారి సంఖ్యను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది . అంతేకాకుండా  నీటి ప్రమాదాలను నివారించే సమర్థ కార్యాచరణ గాని సాంకేతిక పరిజ్ఞానం కానీ  ప్రపంచవ్యాప్తంగా ఊహించిన దాని కంటే తక్కువగా ఉండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది . ముఖ్యంగా వేసవి సెలవులలో విద్యార్థులు ఈతకు వెళ్లడానికి  ఆసక్తి చూపుతారు కానీ అందులో ఎక్కువ మంది ఈత రాని వాళ్లే ఉండడం ఆలోచించదగ్గ విషయం . ఈ పరిస్థితుల మధ్యన  జాగ్రత్త పడడం తల్లిదండ్రులు పిల్లలకు తగిన శిక్షణ అవగాహన కల్పించడం చాలా అవసరం . ఇటీవల పడవ ప్రయాణంలో అనేక ప్రాంతాలలో  ఎంతోమంది చనిపోయినటువంటి సందర్భాలను గమనించినప్పుడు  ప్రయాణికులందరూ లైఫ్ జాకెట్ లను  వినియోగించకపోవడం  ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు .
       ముఖ్యంగా విద్యార్థులు యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రమాదాలు ఏర్పడినప్పుడు బయటపడే మార్గాలను కూడా  అవగాహన కల్పించాలి . ప్రథమ చికిత్స చేయడం ద్వారా కూడా ప్రమాదానికి గురి అయిన ఎంతో మందిని కాపాడే అవకాశం ఉంటుంది. ఆ అవగాహన జ్ఞానము  శిక్షణ ద్వారానే సాధ్యమవుతుంది.  బంగ్లాదేశ్ లో పిల్లలు ప్రమాదాలకు ఉరిగాకుండా ఉండడానికి  తల్లులకు పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చినట్లు తద్వారా చిన్న పసిపిల్లల నుండి పెద్ద వయసు వారి వరకు కూడా ప్రమాదాల బారిన పడకుండా  అదుపు చేయగలిగినట్లు ఫలితాలను బట్టి తెలుస్తున్నది . ఆరోగ్య వైద్య సిబ్బంది ఇతర ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి సిబ్బంది  ఇంటింటి సర్వే సందర్భంగా కూడా  చిన్నపిల్లలు నీటి తొట్టెలు  సంపులు డ్రైనేజీలు ఇతరత్రా పడి చనిపోకుండా ఉండడం కోసం  కఠినమైన సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులను  హెచ్చరించాలి. జాగ్రత్తపరచాలి.  కాపలా లేని రైల్వే క్రాసింగ్ ల దగ్గర ప్రమాదాలు జరిగినట్లు  పర్యాటక ప్రదేశాలలో కూడా కొన్ని వింత  పద్ధతిలో నీటి వనరులు జలపాతాలు అందుబాటులో ఉంటే  అక్కడి పరిస్థితి అంచనా వేయడానికి సూచనలు బోర్డులను పర్యాటక శాఖ ఏర్పాటు చేయాలి. లేకుంటే  పరిస్థితులు తెలవక లోతు ఎంతో కానరాక మృత్యు బారిన పడే అవకాశం ఉంటుంది . కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తో పాటు  వైద్య ఆరోగ్యశాఖ కూడా  ఉమ్మడి కార్యాచరణ ద్వారా నీటి ప్రమాదాలను అరికట్టడానికి ఒక ప్రత్యేక విధానాన్ని  ప్రకటించడం ద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశం ఉండాలి  .ప్రజలు ఎంత చైతన్యవంతంగా జాగ్రత్తగా  ఉండాలో అంతే జాగ్రత్త  బాధ్యతలతో ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు మాత్రమే ఇలాంటి నీటి ప్రమాదాలను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది.  కుటుంబ సభ్యులను కోల్పోవడం కుటుంబాలకు ఎంత  నష్టమో, మానవ వనరులను కూడా  కోల్పోవడం దేశానికి భారీ నష్టమని పాలకులు గుర్తించినప్పుడు మాత్రమే  ఇలాంటి ప్రమాదాలను సాధ్యమైనంత వరకు తగ్గించే అవకాశం ఉంటుంది .
( ఈ వ్యాసకర్త  సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు  హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333