పదోన్నతులు బదిలీపై వెళ్లే ఉపాధ్యాయులను అడ్డుకుంటున్న విద్యార్థులు.
సంవత్సరాల అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ కన్నీరు పెడుతున్న శిష్యులు. అంతే స్థాయిలో విద్యార్థులను ఓదార్చుతూ వెళ్లక తప్పదని బుజ్జగిస్తున్న టీచర్లు.* బోధనాభ్యసన ప్రక్రియకు గురు శిష్య సంబంధం కీలకమని తెలిపే కొన్ని ఘట్టాలు కన్నీటి దృశ్యాలు.*
***************
-- వడ్డేపల్లి మల్లేశం
బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు విద్యార్థులు కీలకమైతే అందుకు ఆధార భూతమైనది సమాజం . సమాజానికి ప్రతిబింబమైనటువంటి పాఠశాలలో సామాజిక అంశాల పైన శిక్షణ ఇవ్వడం ద్వారా రేపటి భావి సవాళ్లను అధిగమించడానికి విద్యార్థులను తీర్చిదిద్దే ఉత్కృష్ట కార్యక్రమాలకు వేదిక పాఠశాల కావడం గమనార్హం . అదే క్రమంలో సమాజాన్ని మరింత అవగాహన చేయించడం కోసం తరగతి గదిలో ఉన్న పిల్లలకు సమాజాన్ని చూపించే క్రమంలో భాగంగా విస్తృత క్షేత్ర పర్యటనలకు ఉపాధ్యాయులు పూనుకోవడం ద్వారా సమాజంతో మరింత సంబంధాన్ని కొన సాగించడానికి వీలవుతున్నది. గత మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో బోధనా అభ్యసన ప్రక్రియలో తరగతి గది బోధనలో వచ్చిన మార్పుల కారణంగా పాఠ్యాంశాలు బోధన అంశాలకు సంబంధించి గ్రామంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామములో తిరిగి అనేక విషయాల్లో సర్వేలు పరిశోధనలు చేయడం ముమ్మరమైనది. ఈ క్రమము లోపల ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలతో సన్నిత సంబంధం మరింత బలోపేతం కావడం గమనార్హం ఆ క్రమంలో పల్లెలో వరుసలతో పిలుచుకోవడం వీలున్నచోట ఉపాధ్యాయులు అదే గ్రామంలో ఉంటున్న కారణంగా మరింత సన్నిహిత సంబంధాలు పెంపొందడాన్ని మనం గమనించవచ్చు . పాఠశాలలో జరిగే సందర్భోచిత కార్యక్రమాలకు గ్రామస్తులు తరచుగా రావడం, సభలు సమావేశాలలో పాల్గొనడం, పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలలో నిర్వహించే సమావేశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కమిటీలు సర్పంచి ప్రజాప్రతినిదులను, యువతను తరచుగా పిలవడం వల్ల పాఠశాల చర్చలకు సంభాషణలకు రాజకీయాలకు చివరికి విద్యార్థుల బాగోగు లను మాట్లాడుకోవడానికి వేదిక కావడం ఇటీవల కాలంలో అనూహ్యమైన పరిణామం. స్వయం పరిపాలన దినోత్సవం, వార్షికోత్సవాలు, పతాకావిష్కరణలు, పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశాలు, ఉపాధ్యాయుల బదిలీ పదోన్నతి వీడ్కోలు సమావేశాలు
జరిగిన సందర్భంలో కూడా గ్రామస్తులు పాల్గొనడంతో పాఠశాలకు విద్యార్థులకు గ్రామానికి గ్రామ ప్రజలకు ఉపాధ్యాయులకు అవినాభావ సంబంధం ఏర్పడడంతో మంచి చెడుల విచక్షణ, వ్యక్తిత్వాన్ని కొనియాడడం , సమర్థత నైపుణ్యాన్ని ప్రశంసించడం తరచుగా జరిగే అంశాలు . ఈ విషయాలలో ఉపాధ్యాయుల యొక్క చొరవ, పట్టుదల, సమర్థత ,ప్రతిఫలం, విద్యార్థులు నిరంతరం గమనిస్తూ ఉన్న కారణంగా అలాంటి ఉపాధ్యాయులు మరికొంత కాలం ఉండాలని భావన వారిలో మొలకెత్తడం ఇటీవల కాలంలో బాగా గమనించవచ్చు. దాని పరిణామమే ఉపాధ్యాయులు పదోన్నతులు బదిలీల సందర్భంగా కొంతకాలం ఒకే పాఠశాలలో ఉండి ఇతర పాఠశాలకు వెళ్లిపోతున్న సందర్భంలో కన్నీరు కార్చే సందర్భాలు సన్నివేశాలను గమనిస్తే ఊహిస్తే మనకు కూడా మానవత్వం ఉన్న ఎవరికైనా కన్నీరు రాక మానదు. అది నిజంగా విద్యార్థి ఉపాధ్యాయులకు ఉన్న బంధం మానవ సంబంధాలకు నిదర్శనం అంటే అతిశయోక్తి కాదు నిజంగా ప్రేమానురాగాలకు కార ణం కూడా అదే .
బదిలీ పదోన్నతులలో దుఃఖ సన్నివేశాలు :-
********
ఉద్యోగులు తప్పకుండా బదిలీపై ప్రమోషన్ల పైన ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లవలసిందే. కానీ ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఈ విషయంలో అనూహ్యమైన ప్రత్యేకతను మనం చూడవచ్చు సుమారుగా రెండు మూడేళ్లకు ఒకసారి జరిగే బదిలీల సందర్భంగా ఇలాంటి సన్నివేశాలు పాఠశాలల్లో సాధారణంగా కనిపించేవి ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బదిలీ ప్రక్రియ కొనసాగి ఉపాధ్యాయులు పదోన్నతుల పైన బదిలీల పైన వెళుతున్న సందర్భంలో చేసిన గోల, పెట్టిన కన్నీరు, కాళ్ళ వేళ్ళబడి అడ్డుకున్న తీరు , పాఠశాలను విడిచి వెళ్లొద్దని తలుపులు తాళాలు వేసిన గగ్గోలు, ఇవన్నీటిని టీవీ ప్రసారాలలో చూపించిన తీరు మనసున్న ఎవరికైనా కన్నీరు తెప్పించక మానదు. కొందరు పాఠశాల కిరాయిని భరించి విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తే, మరికొందరు ఉపాధ్యాయులు లేకున్నా ఉన్నంతలో అన్ని విషయాలను బోధించి జేబు నుండి ఖర్చు పెట్టుకుని పాఠశాలను నడిపిన తీరు కూడా గమనించదగిన విషయాలు. ఇక కొంతమంది దశాబ్దాల తరబడిగా ఒకే పాఠశాలలో ఉండి విద్యార్థులతో సంబంధాలు బలంగా గడిపి పోతున్న సందర్భంగా తట్టుకోలేని విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించడాన్ని చూస్తే నిజంగా ఆందోళన కలగక మానదు. తమ ఇంట్లో ఏదైనా సంఘటన జరిగితే ఏడుస్తారో లేదో కానీ పాఠశాలలో ఈ రకంగా ఉపాధ్యాయులు వెళుతున్న సందర్భంలో కన్నీరు పెట్టడం కాళ్ళ వేళ్ళ పడి అడ్డుకోవడం మమ్ముల విడిచిపెట్టి వెళ్లొద్దని వేడుకోవడం చివరికి తలుపులు తాళాలు వేసి నిర్బంధించడం వంటి సన్నివేశాలను మనం గమనించవచ్చు .ఇదంతా ప్రేమానుబంధం , మానవ సంబంధాలు, తోటి మనిషిని సాటి మనిషిగా చూసిన సంస్కారం తను నిండా నింపుకొని మనసు గగ్గోలు పెడుతుంటే తట్టుకోలేని స్థితిలో వచ్చే ఆవేదనకు ప్రతిరూపమే ఈ ప్రవర్తన . ఇది కావాలని చేసేది కాదు ఉపాధ్యాయులను అవమాన పరచాలని నిర్బంధించడం అసలే లేదు. తమ ప్రేమను అభిమానాన్ని చాటుకోవడం, ఆత్మీయతను పంచుకోవడం , ఇదే రకమైన విధానాన్ని భవిష్యత్తులో కొనసాగించాలని చెప్పకనే చెప్పడం కూడా మనం గమనించాలి. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్యన చెలరేగుతున్న ఘర్షణ కన్నీరు ఆవేదన ఆందోళన బాధ రెండు వర్గాలకు కూడా గుణపాటాన్ని కలిగించేది భవిష్యత్తులో కూడా ఎవరెవరు ఎక్కడ ఉన్నా ఇదే రకమైన పద్ధతిలో సంబంధాలను కొనసాగించాలని గురువులను విద్యార్థులు గౌరవించాలని విద్యార్థులను గురువులు ప్రేమించి ఆదరించి వారి అభివృద్ధి కోసం తీర్చిదిద్దాలని పరస్పరం కోరుకోవడమే ఈ కన్నీటి వీడ్కోలులోని అంతరార్థం . ఎంత ఆపిన ఎంత కాల్లా వేళా పడినా తలుపులు తాళాలు వేసిన ఉపాధ్యాయులు వెళ్ళక మానరు అది విద్యార్థులకు తెలుసు కానీ కట్టలు తెంచుకొని వస్తున్న దుఃఖం మాటు న తొణికిస లాడుతున్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఒకే ఒక్క అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఎలా అనే ఆరాటమే ఈ ప్రవర్తనకు మూల కారణం . అనుభవాలు జ్ఞాపకాలను అమితంగా తరగతి గదిలో విప్పి చెప్పే వాళ్ళు కొందరైతే, పాఠ్యాంశాలకు తోడుగా ప్రాపంచిక పరిజ్ఞానాన్ని తాత్విక ఆలోచనలను తార్కిక విషయాలను నిబద్ధతగా బోధి0 చేవారు మరికొందరు ఉంటారు. పుస్తకం కేవలం సహాయకునిగా మాత్రమే ఉపాధ్యాయుడికి పని చేస్తుంది తాను నమ్మిన సిద్ధాంతం కోసం విద్యార్థులలో సాధించవలసిన లక్ష్యాలను భావిసవాళ్ళ ను అధిగమించే సామర్థ్యాన్ని నింపడం కోసం ఉపాధ్యాయులు ఎంత చేసినా తక్కువే. అలాంటప్పుడు కేవలం పుస్తకం మీదనే ఆధారపడితే అది నామ మాత్రమే అవుతుంది అందుకే ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క శైలిలో తమ బోధన కొనసాగిస్తూ విద్యార్థులతో సంబంధాలను గడుపుతూ వారితో అనుబంధాన్ని పెంచుకుంటూ తమ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునే విధంగా విద్యార్థులకు తమ అనుభవాలను జ్ఞాపకాలను కానుకలుగా అందిస్తారు .
ఏదేమైనా బదిలీ పదోన్నతుల పైన ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిందే కొత్త ఉపాధ్యాయులు రావాల్సిందే వచ్చిన ఉపాధ్యాయులను విద్యార్థులు గౌరవించవలసిందే. అదే స్థాయిలో ఉపాధ్యాయులు పిల్లలలో ప్రేమానురాగాలను నింపి తమకంటూ స్థానాన్ని కల్పించుకోవాల్సిందే. ఈ రకమైనటువంటి బంధాలు బలంగా ఉంటే ఇటీవల కాలంలో గొప్పగా సాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు పదవ తరగతి ఏడవ తరగతి పూర్తి అయిన తర్వాత 10, 20, 30 ఏళ్ల తర్వాత తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనాటి ఉపాధ్యాయులను ఆహ్వానించి చిన్ననాటి అనుభూతులు అనుభవాలు జ్ఞాపకాలను చిలిపి మాటలను ప్రేమతో ఉపాధ్యాయుల ముందు చిలుక పలుకుల్లాగా పలుకుతూ ఉంటే ఆ అనుభూతి అనుభవించవలసిందే తప్ప చెబితే తీరేది కాదు. ఈ రకంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్యన ఏర్పడుతున్నటువంటి బంధాలు, అనుబంధాలు, ఘర్షణలు, ప్రేమానురాగాలు నిరంతరం కొనసాగాలని జీవితంలో బ్రతికి ఉన్నంతవరకు ఎప్పుడు ఎక్కడ కలిసినా ఆత్మీయంగా పలకరించుకుని సజీవ సంబంధాలను కొనసాగించడం విద్యార్థులకు ఉపాధ్యాయులకు కనీసమైన ధర్మం .ఆ ధర్మాన్ని కాపాడడమే విద్యా లక్ష్యాన్ని పూర్తి చేయడం పాఠశాల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం అవుతుంది. ప్రతి పాఠశాల మీద" విద్య కైరము విశ్వసేవకై పొమ్ము" అనే నినాదం దాదాపుగా ఉంటుంది పాఠశాలల్లో ప్రవేశించి 10 సంవత్సరాలు విద్యను అభ్యసించి బయటి లోకానికి వెళ్లిన తర్వాత తన అనుభవాలను తన ఉపాధ్యాయుల జ్ఞాపకాలను సమాజానికి అందించే క్రమంలో పాఠశాల ఎంత గొప్పదో తన అనుభవాలు ఎంత మధురమైనవో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది .ఆ మధురస్మృతులను మించిన అనుభూతి ప్రపంచంలో ఏమీ ఉండదు అందుకే ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం అనుబంధం జన రంజకమైనది, శాశ్వతమైనది, సజీవమైనది. ఆ బంధాన్ని తల్లిదండ్రులు సమాజము పాఠశాల కమిటీలు ప్రభుత్వాలు గుర్తించినప్పుడు విద్యా ప్రమాణాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలను మిన్నగా ప్రోత్సహించడం ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకున్నప్పుడు ఈ రకమైన అనుబంధాలు మరింతగా విస్తరిల్లే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )