పేద వర్గాలకు ఏం చేస్తున్నామని  ప్రతి ప్రభుత్వం ఆలోచించాలి

May 26, 2024 - 22:21
Jun 4, 2024 - 13:01
 0  18
పేద వర్గాలకు ఏం చేస్తున్నామని  ప్రతి ప్రభుత్వం ఆలోచించాలి

విద్య వైద్యం కనీస సంవత్సరాలు తీర్చుకోలేక  

అప్పుల పాలవుతుంటే కనిపించడం లేదా ?

రైతులకు రుణమాఫీ రైతు భరోసా  చేస్తే  భూమిలేని పేదలను

 ఉద్ధరించింది ఏమిటి? 

----వడ్డేపల్లి మల్లేశం 

భారతదేశంలో  అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి  కూలీలు  ప్రైవేటు కార్మికులు   చిరు వ్యాపారులు పేదలు  ఆదివాసీలు  నిరుపేదలు  వలస కార్మికులు  దినదిన దండం గా బ్రతుకుతున్న అశేష ప్రజానీకం  అవస్థలు మాత్రం తప్పడం లేదు. పాలకులు  సామాన్య ప్రజల కోసమే పని చేస్తున్నామని చెప్పుకున్న  ఫలితం మాత్రం నిండుసున్న.  దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ  దేశంలో ప్రజల సంపద 40 శాతం  ఒక శాతం ఉన్న సంపన్న వర్గాల చేతిలో బందీ కావడమే.  ఉద్యోగ వ్యాపార వర్గాలు సంపన్న వర్గాలు  మధ్యతరగతి  తమ  శాశ్వత నికరదాయంతో  ప్రభుత్వ సౌకర్యాలను అంతో ఇంతో  వినియోగించుకుంటూ  హాయిగా జీవిస్తూ ఉంటే  అట్టడుగు వర్గాలు మాత్రం  అరకొ ర ఆదాయంతో బ్రతుకుతున్న సందర్భంలో  విద్యా వైద్యానికి చేస్తున్న ఖర్చు ఇవ్వాళ  70 శాతానికి పైగా చేరుకోవడంతో  అనివార్యమైన పరిస్థితుల్లో ప్రైవేటు రంగాన్ని ఆశ్రయించడం ద్వారా  ఈ ఖర్చు  భారీగా పెరిగి కొనుగోలు శక్తి తగ్గి పేదలు మరీ పేదలుగా మారిపోతున్నారు.  

 అయితే ఈ వర్గాలకు విద్య వైద్యం పరంగా ప్రభుత్వం  అందిస్తున్న సహకారం అంతంత మాత్రం కాగా  అనివార్యమైన పరిస్థితిలో  ప్రైవేటు విద్యా వైద్య సంస్థలను ఆశ్రయించక తప్పడం లేదు.  వ్యవస్థాగత లోపాల కారణంగా ప్రతి ప్రభుత్వం కూడా పెట్టుబడిదారుల చేతిలో చిక్కి  ప్రైవేట్ రంగాన్ని అనివార్యంగా మోస్తూ  ప్రభుత్వ రంగాన్ని  నిర్వీర్యం చేస్తున్న పరిస్థితులను మనం కల్లారా చూడవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల పాఠశాల స్థాయి విద్యార్థులు ఉంటే సగానికి పైగా ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుకోవడాన్నీ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు . ప్రభుత్వ రంగాన్ని  పాలకులు నిర్లక్ష్యం చేయడం, ప్రజలు విశ్వాసం కోల్పోవడం,  ప్రైవేట్ రంగం పైన భ్రమలను కల్పించడం , కారణాలు ఏమైతేనేమి పేద వర్గాలు కూడా ప్రైవేటు  సంస్థలను నమ్ముతున్న కారణంగా  తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కోల్పోవలసి వస్తున్నది.  

 ఈ రకమైనటువంటి విద్యా వైద్యం సామాజిక న్యాయం ఉపాధి అవకాశాలకు సంబంధించి చేస్తున్న ఖర్చు పేద వర్గాలకు గుదిబండగా మారితే  మధ్యతరగతి సంపన్న వర్గాలకు  ఎలాంటి తేడా తెలియడం లేదు.  ఈ పరిస్థితుల్లో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవలసింది ఎవరిని ?ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేయాలి? అనే ఆలోచన సోయి లేకుండా కేవలం ఉచిత పథకాలను వాగ్దానాలను ప్రకటిస్తూ  కాలయాపన చేస్తూ ఉంటే  పేద వర్గాలు దిక్కులేని వారు కావాల్సిందేనా,?  అప్పుల పాలై పేదలు రైతులు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు చేనేత కార్మికులు  ఇతరుల మాదిరిగా అన్ని వర్గాలు కూడా  ఆత్మహత్యలకు బలికావాల్సిందేనా ?ప్రత్యామ్నాయం ? తలసరి ఆదాయాన్ని పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి విద్య వైద్య రంగాలను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలో నాణ్యమైన  స్థాయిలో అందించగలిగినప్పుడు  ఈ దుస్థితికి చెక్ పెట్టవచ్చు కదా,!

 ప్రైవేట్ రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా మెరుగైనటువంటి పాలన అందించవచ్చు  కానీ దానికి ప్రభుత్వాలకు సత్తా, పేద వర్గాలకు సేవ చేయాలనే తపన ఆరాటం, విభద్దత ఉంటేనే సాధ్యమవుతుంది  .ప్రజలకు సేవ చేసే  సేవకులం అని ఎన్నికల్లో చెబుతూ  అధికారానికి వచ్చిన తర్వాత  స్వారీ చేస్తూ శాసిస్తూ ప్రజలను యాచకులుగా మార్చుతూ  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని కేంద్రం ఇచ్చిన హామీ లాంటి అనేక హామీలను నిలబెట్టుకోలేక  ప్రజలను విశ్వాసాల పునాదిగా  నిర్వీర్యం చేస్తున్న   ధోరణి పాలకుల  ఒంటెద్దు పోకడకు నిదర్శనం.  కోటానుకోట్ల  బడ్జెట్ ప్రతిపాదించినప్పటికీ సుమారు 90 శాతం ఉన్న పేద వర్గాలకు 6% నిధులను కూడా  క్షేత్రస్థాయిలో కనీసం ఖర్చు చేయడం లేదంటే  ఈ పాలకవర్గాలు ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు.  

 సంపన్న వర్గాలు అనాదిగా  ప్రభుత్వ రంగ బ్యాంకులకు  బాకీ ఉన్న అప్పులను కేంద్రం మాఫీ చేసి  పెట్టుబడిదారుల పట్ల తన సానుభూతి చూపింది.  కానీ రైతులు పేద వర్గాల కోసం రుణమాఫీ చేయడానికి  ఆటంకాలు వస్తున్నాయంటే గమనించవచ్చు. ఇక  రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ   రైతు భరోసా కానీ  పేద మధ్యతరగతి రైతులకు మాత్రమే చేస్తే అర్థం ఉంటుంది కానీ  పదులు వందల ఎకరాలు ఉన్న వారికి కూడా  నిధులను కేటాయించి పండించని పంట భూములకు  రైతు భరోసా కల్పించి కూలీలు  చిరు వ్యాపారులు వలస జీవులకు మాత్రం  ఏ లాంటి సహకారం అందించకపోవడంలో ఉన్న ఔచిత్యం  ఏమిటి?  ఈ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా ఈ దేశ సంపదలో వాటా అందాల్సిన అవసరం ఉంది.  తమ హక్కుల కోసం,  మనుగడ కోసం,  కనీస జీవన ప్రమాణాల కోసం పోరాడుతున్నటువంటి పేద వర్గాలను  అణచి వేయడం ద్వారా పాలకులు మరింత ద్రోహం చేస్తున్న విషయాన్ని కూడా నిగ్గదీసి అడగాల్సిన అవసరం ఉంది .

 కరోనా సమయములో  పేదలు వలస జీవులు కూలీల యొక్క ఆదాయం  భారీగా తగ్గిపోయి  పిడికెడు మెతుకులకే నోచుకోని దుస్థితి దాపురిస్తే  పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల ఆదాయం మాత్రం రెట్టింపు అయినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తే  దానిని ఏ రకంగా పాలకులు సమర్థించుకుంటారో ఆలోచించుకోవాలి.  90 శాతం ఉన్నటువంటి పేద వర్గాల ఓట్ల ద్వారా అధికారానికి వచ్చి  ఆ వర్గ ప్రయోజనం కోసం పాకులాడకుండా సంపన్న వర్గాలకు ఊడిగం చేసే పాలకులు ఈ దేశానికి అవసరమా ? సంపద కొద్దిమంది చేతుల్లో పోగు పడకూడదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతుంటే  అందుకు సంబంధించినటువంటి నిబంధనలను  పాలకులు అనాదిగా అమలు చేయకుండా  కొద్దిమంది  కోసమే  పాకులాడి  పేదలను వంచించడం  నిజంగా దేశద్రోహమే అవుతుంది.  యూపీఏ హయాంలో ఈ దేశంలో దేశద్రోహం పేరుతో  కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టాన్ని  ఎన్డీఏ ప్రభుత్వం యధాతతంగా అమలు చేస్తున్నది.  

 అనేక రాష్ట్రాలలో  అక్రమంగా  కేసులు బనాయించి  పేదల కోసం పనిచేస్తున్న వారిని హక్కుల కోసం ఆరాటపడుతున్న వారిని చెరసాలలో బంధించిన తీరు గమనించినప్పుడు నిజంగా  పేదలను పట్టించుకోని ప్రభుత్వాలకు  ఆ దేశద్రోహ చట్టాన్ని వర్తింప చేస్తే బాగుండు . రాజకీయ పార్టీలు ఎన్నికల్లోను ఇతరత్రా సమయాలలో కూడా  పరస్పర దాడులకు పాల్పడుతూ ఎన్నికల సంఘాన్ని  యంత్రాంగాన్ని పోలీసు వ్యవస్థను న్యాయవ్యవస్థను  అపహాస్యం చేస్తున్న పరిస్థితులను గమనిస్తే  అధికారం మీద ఉన్న ప్రేమ  ఈ పాలకులకు ప్రజల పైన లేకపోవడాన్ని  సీరియస్ గా తీసుకోవలసిన అవసరం చాలా ఉన్నది.  అనేక సందర్భాలలో మేధావులు న్యాయవ్యవస్థలోని ప్రముఖులు  మాజీ సిజెఐ ఎన్.వి రమణ గారు కూడా  ఈ దేశంలో తయారవుతున్న చట్టాలు ప్రజలకు తోడ్పడాలని, చర్చించకుండా బిల్లులు ఆమోదించకూడదని,  యంత్రాంగం పోలీసులు పాలకులకు వత్తాసు పలకకూడదని , సమాజంలో ఉన్న   అన్ని వర్గాలకు వాటా కొనసాగాలని  చేసిన సూచనలను  ఎందుకు పాటిస్త లేరు?

 ఏ వర్గానికి చెందిన వాడు అధికారానికి వస్తే ఆ వర్గ ప్రయోజనాలను ఆ వర్గానికి చెందిన వాళ్ళని అధికారంలో శాశ్వతంగా నిలబెడితే ఇక చట్టసభల గడప దాటని  వర్గాల ప్రయోజనం చూసేది ఎవరు?  భూమి ఉన్న వారిని వివిధ రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం భూమిలేని వారికిమిగులు భూమిని పంచడం ద్వారా  న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది.  కనీస వేతన చట్టాన్ని ప్రైవేటు అన్ని రంగాలలో అమలు చేయడం ద్వారా  అల్పాదాయ వర్గాల యొక్క ఆదాయాన్ని గననీయంగా పెంచడానికి అన్ని ప్రభుత్వాలు  చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి.  అదే సందర్భంలో ప్రైవేటు విద్యా వైద్య సంస్థలు పేద వర్గాల నుండి  బలవంతంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజులను  నియంత్రించడంతోపాటు  ఆ భారాన్ని ప్రభుత్వమే మోయడం ద్వారా పేద వర్గాలకు ఊరట కల్పించాలి.

  కనీస జీవన అవసరాలను కల్పించినప్పుడే మానవాభివృద్ధి సాధ్యమని డాక్టర్ అమర్త్యసేన్ అనేక సందర్భాలలో పాలకులను హెచ్చరించినప్పటికీ  ఉచిత పథకాల  ప్రచార హోరులోనే సాగిపోతూ పేదలను శాశ్వతంగా  అభివృద్ధికి   దూరం చేస్తున్నటువంటి  ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. లేకుంటే  చైతన్యవంతం అయ్యే ప్రజానీకం  ఆకలితో అలమటించే పేద వర్గాల ఆక్రందనలు ఆగ్రహావేశాలకు  ఎప్పుడో ఒకనాడు పాలకవర్గాలు  బలి కాక తప్పదు.  అంతవరకు  సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు చితికి పోకముందే  పాలకులు సొయ్ తెచ్చుకొని  తమ బాధ్యతను గుర్తించి  పేద వర్గాల పట్ల  అంకిత భావంతో పనిచేసి సమ సమాజాన్ని  అసమానతలు అంతరాలు లేని సామ్యవాద వ్యవస్థను  స్థాపించడానికి కృషి చేయాలి . అసలు రాజకీయ రంగంలోకి  విద్య, జ్ఞానము, అవగాహన,  మేధస్సు,  తపన ఉన్న వారిని  అనుమతించవలసిన  అవసరం ఎంతో ఉన్నది.అలా  ప్రజల కోసం పనిచేసే పాలకులు  కొందరైనా పుట్టుకొస్తారు.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333