ఉద్యోగ వర్గాలు ప్రజల పక్షాన పనిచేయాలి
మన వేతనాలు సంపద అంతా సామాన్య ప్రజల స్వేద బిందువులే !
అవినీతికి పాల్పడే ఉద్యోగులకు తగిన గుణపాఠం జరగాలి.
నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి గుర్తింపు రావాలి.
లంచగొండి ఉద్యోగులపై ప్రభుత్వం ప్రజలు ఉక్కు పాదం మోపాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధుల కంటే మిన్నగా పనిచేస్తున్న వారు ఉద్యోగులు అధికారులు సిబ్బంది అనడంలో అతిశయోక్తి లేదు . ప్రజా ప్రతినిధుల పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే క్షేత్రస్థాయి వరకు అమలు చేసి ప్రజలను చైతన్యం చేసి ఫలితాలను అందించేదంతా ఉద్యోగులే .అందుకే ఉద్యోగులు చాలా డిపార్ట్మెంట్లలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు . అదే సందర్భంలో ప్రజలను అమాయకులుగా భావించి ప్రయోజనాన్ని ఫలితాన్ని ఆశగా చూపి లంచం రూపంలో డబ్బులు వసూలు చేసి తమ కోరికలు తీర్చుకోవడం తోపాటు పేద ప్రజలను పీడించే మనస్తత్వం ఉద్యోగులలో ఉండడం సిగ్గుచేటు . ఇటీవల కాలంలో ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆగ్రహానికి అవినీతి పైన పోరాటానికి కొంత మంది ఉద్యోగులు బలైన విషయాన్ని కూడా మనం గమనించాలి.
అదే ఉద్యోగులు ప్రజలకు అనుకూలంగా పనిచేసి అంకిత భావముతో ప్రజాసేవలో లీనమైతే ప్రజలు ఉద్యోగులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు అనడంలో సందేహం లేదు. అవసరమైతే పై అధికారులు పర్యవేక్షణకు వచ్చిన సందర్భంలో కూడా సిబ్బంది యొక్క పాత్రను సేవలను నిజాయితీని ప్రజలు మనస్ఫూర్తిగా అంగీకరించి ప్రశంసించిన సందర్భాలు కూడా కోకొ ల్లలు. అదే ప్రజలకు ప్రభుత్వ విధానం కానీ ఉద్యోగుల ఆదిపత్యం కానీ విఘాతం కలిగించినట్లయితే సహించరు ఎంతటి దురాగతానికైనా సిద్ధపడతారు అనడానికి అటవీ ప్రాంతాలలో అక్కడక్కడ చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, హత్యలు .,అధికారుల కిడ్నాప్ ఇతరాలు కూడా. కాబట్టి ప్రజలతో మమేకం కావడం ద్వారా పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించవలసిన బాధ్యత సామాజిక స్పృహ ఉద్యోగులకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
దానికి భిన్నంగా ఎవరు ప్రవర్తించిన అటు చట్టం చేతిలో ఇటు ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని గుర్తించాలి ప్రజల పక్షాన ఎందుకు పని చేయాలి అని ప్రశ్నించుకున్నప్పుడు ఉద్యోగులకు వేతన రూపంలో ఇస్తున్న సంపద అంతా కూడా ప్రజలదే. ప్రజలు ఉత్పత్తిలో భాగస్వాములై సంపదను ఉత్పత్తి చేసి తమ కష్టార్జితాన్ని శ్రమను దేశ సేవలో వెచ్చించి నిజాయితీగా వ్యవహరించే సామాన్య ప్రజలు, కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వాళ్ళు, చిరు వ్యాపారులు, వలస కూలీలు, పేద వర్గాల చెమట బిందువులే అని అంగీకరించాలి . ఏ ప్రజల కష్టార్జితాన్ని వేతన రూపంలో తీసుకుంటున్నామో ఆ ప్రజల కోసం, పరిపాలనను గాడిలో పెట్టడానికి , రాజ్యాంగ పలాలను పేద వర్గాలకు క్షేత్రస్థాయికి అందించడానికి కృషి చేయడానికి ఉద్యోగులకు వచ్చిన ఇబ్బందులు ఏమిటి ? అదనపు సంపాదన అవసరమా? అక్రమార్జనకు ఆరాటపడితే జరిగే పరిణామాలు తెలియవా ?
నేరస్తులు అయితే శిక్షలు అనుభవించాలి కదా! అవినీతిపరులైతే ప్రజాకోర్టు లో దోషిగా నిలబడవలసిన వస్తుంది తెలియదా ? ప్రజలు చైతన్యవంతులై తమ హక్కులను సాధించుకునే క్రమంలో కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారినప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల పైన ఆగ్రహాన్ని విసుగును అసూయను పెంచుకుంటారు. తమ జేబులోనుండి ఇచ్చినట్లుగా భావించి ప్రజలను చిన్నచూపు చూసి స్పందించకుండా ప్రశ్నించిన పాపానికి గెంటివేసిన సందర్భాలను కూడా మనము గమ
నించవచ్చు. స్వయంగా మంత్రులు పాల్గొన్న సభలో పేద ప్రజలు తమ యొక్క హక్కుల గురించి ప్రశ్నించినప్పుడు మంత్రులు పోలీసులతో వారి మెడబట్టి గెంటించిన సందర్భాలను గమనిస్తే ఈ దేశంలో ప్రజల ఓట్ల ద్వారా గద్దెనెక్కిన రాజకీయ గద్దలకు తగిన బుద్ధి చెప్పాల్సిందే.
అదే సందర్భంలో ప్రజాసేవకు అంకితమై తమకు నిజాయితీగా వఛే వేతనాన్ని నమ్ముకుని పేద ప్రజల కష్టార్జితాన్ని అక్రమంగా ఆర్ధించడానికి నిరాకరించి ఇది అవినీతి అని ఎలుగెత్తి చాటి ప్రజల బాటలో నడిచిన ఉద్యోగులు అధికారులను కూడా మనం చూడవచ్చు . అలాంటి ఉద్యోగులకు యంత్రాంగానికి స్వాతంత్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులచే ప్రశంసలు పురస్కారాలు ఇప్పించిన సందర్భాలను కూడా మనం చూడవచ్చు . ప్రభుత్వ పురస్కారాల కంటే ప్రజల మధ్యన తమ వృత్తి కేంద్రాల దగ్గర ప్రజల గుర్తింపు చాలా గొప్పది. అనేక సందర్భాలలో తలలో నాలుకలాగా పని చేసినటువంటి ఉద్యోగులు బదిలీ లేదా పదోన్నతి పై వెళ్లిన సందర్భంలో గుర్తించి గౌరవించి అభిమానించి ఆదరించి ప్రశంసించి నిజాయితీకి పట్టము కట్టిన సందర్భాలను కూడా మనం చూడవచ్చు. నిజంగా ప్రజల దగ్గర ఎంత సేవాభావం గుర్తింపు త్యాగం ఉంటుందో.... అవమానం అన్యాయం దోపిడీ, పీడన జరిగితే అంతకుమించిన స్థాయిలో ఆవేశం ఆగ్రహం కూడా ఉంటుంది అని ఉద్యోగులు అధికారులు పాలకులు కూడా గ్రహించాలి .
అవినీతిపరులపై ప్రజలు, ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి :-
ఈ దేశంలో రాజకీయ చట్రంలో అవినీతి తారాస్థాయికి చేరుకోవడంతో ఉద్యోగ వర్గంలో కూడా దాని ఛాయలు తప్పడం లేదు. ఈ రెండు రంగాలలోనూ అవినీతిని లంచగొండితనాన్ని రెడ్ టేపిజమును ప్రజలను ఇబ్బంధికి గురి చేసే వాళ్లను ప్రజల సమక్షంలో శిక్షించగలిగితే అంతకుమించినటువంటి న్యాయస్థానం తీర్పు లేదు. ప్రజలు కూడా ప్రజాప్రతినిధుల యొక్క అక్రమార్జన భూ కబ్జాలు పైన విచారణకు డిమాండ్ చేయడంతో పాటు న్యాయస్థానాలు కూడా స్వతంత్రంగా విచారణ జరిపించగలిగినప్పుడు మాత్రమే ఈ దేశంలో పేద ప్రజల చెమటకు, శ్రమకు, శ్రమైక జీవన సౌందర్యానికి గుర్తింపు ఉంటుంది.
ఉద్యోగులు అవినీతిపరులని విచారణలో తేలితే అందిన ఫిర్యాదులు కార్యాచరణ ఆధారంగా శిక్షలను విధించి అవినీతి సొమ్మును రాబట్టి ప్రభుత్వ ఖాతాకు జమ చేసే విధంగా చట్టాలు బలంగా ఉండాలి . ప్రధాని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు మంత్రులతో సహా శాసనసభ్యులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ముక్కు పిండి వసూలు చేయగలగాలి. అందుకోసం ప్రజలు ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి . నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో కార్యాలయాలలో సామాన్యులకు 10 రూపాయల లాభం కోసం అధికారులకు 20 రూపాయలు ఇవ్వవలసినటువంటి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నవి . పెండింగ్ బిల్లుల మంజూరు , వ్యవసాయ రుణాలు, వివిధ విభాగాలలో నిధుల మంజూరి సందర్భంలో అధికారులు ఉద్యోగులకు అవినీతికి పాల్పడుతున్నట్లు నిధులను గోల్మాల్ చేస్తున్నట్లు నిధులను ఇతర పద్ధతులకు మళ్లిస్తున్నట్లు అనేక పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.
కానీ అంతవరకే పరిమితం కాకుండా ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు డిమాండ్ చేయాలి ప్రభుత్వాలు కూడా తమ చిత్తశుద్ధిని చాటుకొని విచారణ జరిపించాలి . ప్రభుత్వాలు వాయిదా వేసిన నిర్లక్ష్యం వహించిన ప్రజల చేతిలో ఆ ప్రభుత్వానికి పరాభవం జరిగితే ఎన్నికల్లో ఓటమిపాలైతే ప్రజాక్షేత్రంలో చీత్కరిస్తే అంతకుమించిన శిక్షలు లేవు. ఆ రకమైనటువంటి సంస్కరణ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అధికారులు పోలీసు వ్యవస్థలోనూ రావలసినటువంటి అవసరం చాలా ఉన్నది. హక్కుల కోసం కలబడుతూనే బాధ్యతలకు నిలబడాలి అనే నినాదాన్ని ఆసరా చేసుకుని పౌర సమాజం కూడా సుపరి పాలన కోసం తమ సామాజిక బాధ్యతను నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. చట్టం న్యాయం కర్తవ్యాలు బాధ్యతలు సమాంతరంగా కలిసి పనిచేసినప్పుడు ఈ వ్యవస్థ మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది . అసమానతలు అంతరాలు వివక్షత లేని సమ సమాజం స్థాపించబడాలన్న, సామ్యవాదం సుస్థిరం కావాలన్నా రాజకీయ ఉద్యోగ వర్గాలలో ఉన్న అవినీతిని నిర్మూలించడం కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా అందరం అంగీకరించి తీరాలి . అవినీతి చెట్టుకు పట్టిన చెదలు లాగా మనిషిని బలహీనుడిని చేసి కర్తవ్యాన్ని విస్మరించేలాగు దురాలోచనకు దగ్గర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది .
ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు అలాంటి వికృతమైనటువంటి భవభంధాల పరిధి నుండి బయటికి వచ్చినప్పుడు మాత్రమే తమ ఉనికి ప్రశ్నార్థకం కాకుండా గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది . ఇదే సందర్భంలో ఉద్యోగులు అవినీతిపరులైతే ఆయా ఉద్యోగుల సంఘాలు కూడా వారిని బహిష్కరించడం ద్వారా నీతికి పట్టం కట్టాలి. అవినీతిపైన నిఘా పెట్టాలి .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)