విజయంలో విషాదం, అరెస్టుపై ‘అ’రాజకీయం -తెలకపల్లి రవి

హీరో అల్లు అర్జున్‌కు మామూలు బెయిల్ లభించడం ఊహించిన విషయమే. ఆయన అరెస్టయిన రోజునే హైకోర్టు నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చినపుడే ఆ విషయం స్పష్టమై పోయింది. అయితే ఆ తర్వాత మీడియాలో ఆరోపణలు, ప్రత్యా రోపణలు, రాజకీయ పార్టీలు, సినిమా వర్గాలు వెలిబుచ్చిన స్పందనలు వాతావరణాన్ని వివాదాస్పదం చేశాయి. దీనిపై ఇంత చర్చ ఏమిటంటూనే ఎవరికి వారు తమ వంతు దోహదం చేశారు. అరెస్టు రోజునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వేడిని పెంచాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏ అంశమైనా రభస తప్పదనీ, చర్చ ఎక్కడో మొదలై ఎక్కడికో పోతుందని మరోసారి తేలిపోయింది. వీటన్నిటిలో తమ తమ అవసరాలకొద్దీ, ఆక్కసుల కొద్దీ మాట్లాడిన వారే ఎక్కువ. ఒక సామాజిక కోణంలో దురదృష్టకర సంఘటనపై ఎలా స్పందించాలనే దానికి అవసరమైన సంయమనం గానీ, సమతుల్యత గానీ బొత్తిగా లోపించాయి.మరీ ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకోవడానికి పడిన తంటాలు హాస్యాస్పదంగా పరిణమించాయి.ఇందులో మరీ దారుణమైంది ఏమిటంటే ఎర్రజెండాలు పాలకపార్టీకి లోబడిపోయాయని ‘నమస్తే తెలంగాణ’లో చేసిన వ్యాఖ్య ఈ మధ్య అనేకసార్లు, వివిధ రూపాల్లో ఆ పత్రికలో వేర్వేరు వ్యాసకర్తలు రాశారు.
కొందరు బీఆర్‌ఎస్ నాయకులు కూడా ఇదే ఆరోపణలు వల్లెవేయడం పరిపాటి అయింది. పదేండ్లు పాలించి ప్రజల తిరస్కరణకు గురైన మాజీ పాలకపార్టీగా చేసుకోవలసిన ఆత్మవిమర్శ లేకపోగా ప్రజల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులపై నిందారోపణలు చేయడమే ఇక్కడ విడ్డూరం.కొంతమంది దీన్ని మరీ ముందుకు తీసుకుపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలాగా చేసి సినిమావాళ్లను తామేదో బహిష్కరిస్తున్నట్టు మాట్లాడటం కూడా అలాంటిదే.ఇన్ని విపరీత ధోరణుల కారణంగా ఈ అంశాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
ఖర్చులు,లాభాల పోటీ
బాహుబలితో మొదలుపెట్టి ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ పాట హిందీలోనూ తెలుగు, తమిళ సినిమాలలోనూ బాగా వినిపిస్తున్నది. చిన్న పరిశ్రమ అయిన కన్నడ కూడా కెజిఎఫ్ తర్వాత ఈ హడా వుడిలో భాగస్వామి అయింది. ఈ క్రమంలో ఖర్చులు విపరీతంగా పెంచి అవసరం లేని హంగులతో అతి భారీగా తీస్తేగానీ నడవబోవనే భావం బలపడింది. భారీగా పెట్టుబడులు కుమ్మరించగలిగిన లేదా భారాలు భరించ గలిగిన కొన్ని కుటుంబాలు, సంస్థలే చక్రం తిప్పుతున్నాయనే భావం బలపడింది.
చిన్న చిత్రాలు, భిన్నచిత్రాలు కొన్ని విజయం సాధించినా ఆ ప్రయత్నాలకు పెద్దగా ప్రోత్సాహం లేదు. ప్రభుత్వాలు కూడా స్థిరమైన విధానాలతో ముందుకు రావడం లేదు.తారల తళుకులు, పైపై మెరుగులకు వచ్చిన ప్రాధాన్యత ప్రతిభకు, కొత్త గొంతులకు దక్కడం లేదు. రెండు వందల సినిమాలు వస్తుంటే పది కూడా విజయం సాధించడం లేదనే మాట అందరూ అంటున్నారు గాని అందుకు కారణాలు అన్వేషించడం లేదు. మొత్తం చర్చలో సాంకేతిక నిపుణులు,అంతకు మించి పనిచేసే సినీ కార్మికుల గురించి చర్చ జరగడం లేదు.
అంతకంతకూ ఖర్చులు పెంచుకుంటూ, అందులో పారితోషికాలకే అత్యధికంగా వెచ్చిస్తూ పరిశ్రమ ఎవరి అదుపులో వుందో తెలియని అయోమయావస్థలోనూ తమ హీరోల చిత్రాలకు కేరింతలు కొడుతూ, వున్న సొమ్ములు వెచ్చించే అభిమానులనే వారే పునాది. ఒకప్పటి అభిమాన సంఘాల పరిస్థితి మారి సోషల్ మీడియా, మీడియా ద్వారా వీరిని మరింత గట్టిగా ఉపయోగించు కోవడం ఒక వ్యూహంగా మారింది. దానికోసం పదేపదే ఈవెంట్లు, జాతరలు, ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్ ఇలా, ఈ క్రమంలోనే వేలాది థియేటర్లలో ఒకేసారి విడుదల చేసి,ఎక్కువ షోలు వేసిి తాజా సరుకులా అమ్మేసి సొమ్ములు చుట్టేసుకోకపోతే చల్లబడిపోతుంది.అందుకోసం మల్లీ స్క్రీన్‌ప్లెక్స్‌లు, వీటిపైనా కొద్ది మంది పట్టు. కాబట్టి గతంలో లేని విధంగా విడుదల తేదీలు, సీజన్లు కూడా కలసి నిర్ణయించుకోవడం, నెలల తరబడి వాయిదాలు వేసుకోవడం అంతా మార్కెట్ వ్యూహం.
ఆ మార్కెట్ కూడా తెలుగు రాష్ట్రాలను దాటి హిందీ ప్రేక్షకులకూ విదేశాల్లోని వారికి నచ్చేలా రూపొందించడం ఒక వలయంగా మారింది.ఇప్పుడు చూస్తున్న పరిణామాలన్నీ దాంట్లో భాగాలే. ఆదిమ భయంతో ఆడుకోవడం(ప్లేయింగ్ విత్ ప్రిమిటివ్ ఫియర్) అనేది హాలివుడ్ ప్రాథమిక ఫార్ములా. అందుకే కథాంశాలు కూడా మరింత మసాలాతోనే భారీగా మారిపోయాయి, నిజానికి గతంలోనూ తొక్కిసలాటతో ఒకటి రెండు వేడుకలను రద్దు చేసుకోవలసిన పరిస్థితులు కూడా ఎదురైనాయి.ఏం జరిగింది?
పుష్ప2 విడుదల సందర్భంగా తొక్కిసలాట ఎవరూ కోరుకున్నది కాదు గానీ ఊహించలేనిది కూడా కాదు. పోలీసులు ఆ అంచనాతోనే హీరోను రావద్దని చెప్పామం టున్నారు. వచ్చిన తర్వాతనైనా జాగ్రత్తలు తీసు కున్నట్టు కనిపించదు.ఇందుకు బాధ్యత ఎవరిదనే వారిపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా అందరి బాధ్యత వుంటుంది. ఆకర్షణగా వున్న హీరో పరివారం జాగ్రత్త తీసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.
రేవతి అనే మహిళ మృతి చెందడం నిజంగా విషాదకరం. ఆమె కుమారుడు శ్రీతేజ్ విషమంగా గాయపడి ప్రాణాలతో బయటపడటం ఊరట కలిగించినా అతను ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వుంటుంది. ఈ మరణం పట్ల లేటుగా స్పందించిన చిత్ర బృందం అతని విషమ పరిస్థితి సమాచారం చాలా ఆలస్యంగా బయటపెట్టింది. తర్వాత అందిస్తామన్న సాయం అందడానికి కూడా అనేక దశలు విమర్శలు కావలసి వచ్చింది. దాంట్లోనూ అనేక ఘట్టాలున్నాయి.
నిజానికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆ కుటుంబానికి భారీ సహాయం అందించాలని గట్టిగా కోరింది. తర్వాతనే నిర్మాతలు, హీరో కలసి రూ.2 కోట్లు అందించారు. థియేటర్ మూసివేత నోటీసుపై ఆ మేనేజ్‌మెంటు కూడా స్పందించింది. ఇవన్నీ మాట్లాడటం, సర్కారుకు మద్దతు తెలపడం ఎలాగో నోరుపారేసు కున్నవారికే తెలియాలి.ఈ ఘటనలను బట్టి పరిశ్రమనే పంపిం చేయాలన్నట్టు మాట్లాడిన వారిది కూడా తప్పే. అందులో ఆంధ్రా, తెలంగాణ తేడాలు తీసుకొచ్చినవారిది మరింత పొరబాటు. కావాలని చేయలేదనేది ఒకటైతే, కావలసిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తప్పక దిద్దుకోవలిసిన విషయం. భవిష్యత్తులో వచ్చే చిత్రాలు కూడా పొరబాటు జరగకుండా చూడవలసి వుంటుంది.
ముఖ్యమంత్రి, పరిశ్రమ
హీరో ఫంక్షన్‌లో తన పేరు మర్చిపోయారు గనక అల్లుఅర్జున్‌ను అరెస్టు చేయడం రేవంత్ కక్ష సాధింపుగా కొన్ని పార్టీలు తీవ్రారోపణలు చేశాయి.బీఆర్‌ఎస్, బీజేపీలు ఈ విషయంలో ముందున్నాయి.కాంగ్రెస్‌తో తమ రాజకీయ వైరాన్ని తీర్చుకోవడానికి, సినిమా పరిశ్రమకూ, హీరో అభిమానులకు దగ్గర కావడానికి అవి ఈ మార్గాన్ని ఎంచుకున్నాయా?ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్ బయటకు రాగానే ఫోన్‌చేసి సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఎన్డీయే భాగస్వామి కూడా. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అరెస్టును ఖండించడం చూస్తే బీజేపీ ప్రత్యక్ష, పరోక్ష మిత్రులు ఒక విధానం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది.
చెప్పాలంటే అల్లుఅర్జున్ మామయ్య మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయిన పవన్‌కల్యాణ్ చాలారోజుల వరకూ మౌనం పాటించారు. ఆ తర్వాత కూడా అరెస్టును పవన్ సమర్థించారు.చట్టం ముందు అందరూ సమానులేనని, జాగ్రత్తలు లోపించాయని వ్యాఖ్యానించారు. దీన్ని కేవలం కుటుంబ సంబంధాల కోణంలోనే చిత్రించిన వారున్నారు గానీ, పవన్ మాటలతో దృశ్యం మారిపోయింది. ఆ మాటలతో భంగపడిన బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తమ వాదనలు కొనసాగించినా పరిస్థితి మారిపోయింది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పరిశ్రమ ప్రతినిధులతో సహా టిఎఫ్‌డిసి ఛైర్మెన్ దిల్‌రాజు జరిపిన సమావేశంపైనా రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి, కానీ అవేమీ నిలిచింది లేదు. అల్లు అర్జున్ అరెస్టు అవకాశంగా తనపై రాజకీయ దాడికి పాల్పడుతుంటే పరిశ్రమ విడగొట్టుకోకపోవడం,హీరోకు తప్ప బాధిత కుటుంబాన్ని పట్టించుకోకపోవడం సరికాదని రేవంత్ చెప్పడంలో తప్పేమీ కనిపించదు. పుష్ప2 రేట్లు, షోలు విపరీతంగా పెంచుకోవడానికి అనుమతినిచ్చిన రేవంత్ రెడ్డి ఇకపై ఆ అవకాశం వుండదని ప్రకటించారు. పుష్ప వసూళ్లు తారాస్థాయికి చేరి తగ్గుముఖం పడుతుండగా మరో మెగాచిత్రం గేమ్ చేంజర్ విడుదల కాబోతున్నది.
హైదరాబాద్‌లో పరిణామాల రీత్యా ఈ వేడుక ఏపీలో అదీ పవన్ ముఖ్యఅతిధిగా జరుపుతున్నారు.దీనికీ ఏపీ ప్రత్యేక అనుమతులిస్తుండగా తెలంగాణలో ఏం జరిగేది చూడవలసివుంది. వసూళ్లు, ప్రమాదాల మధ్య పరిశ్రమ ఏమి పాఠాలు నేర్చుకుం టుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది?అనేది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వంపై విమర్శలు తప్పు కాదుగానీ జరిగిన దారుణాన్ని విస్మరించడమే సమస్య.
బీజేపీ రాజకీయాలు?
బాహుబలి రచయిత, ఆ చిత్ర దర్శకుడి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేయించింది.ఆయన ఆరెస్సెస్‌పై చిత్రం తీస్తానని ప్రకటించారు. అందులో నటించడం కోసం ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు కొన్నేళ్ల కిందట స్వయంగా హోంమంత్రి అమిత్ షా ప్రయత్నించడం గుర్తుండేవుంటుంది. ఎన్డీయే భాగస్వామిగానే గాక వ్యక్తిగతంగానూ పవన్ కల్యాణ్ సనాతన వాదాన్ని విపరీతంగా ముందుకుతెస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా లౌకికవాదులపై, వామపక్షాలపై దాడి చేస్తున్నారు.
పాత బస్తీలో మజ్లిస్‌ను ఎదుర్కొన్నందుకు సీపీఐ(ఎం) మాజీ ఎంపీ మధును గతంలో ప్రశంసించిన ఆ నాయకుడే ఇప్పుడు ఎవరూ మాట్లాడలేదని అభాండాలు వేస్తున్నారు. మరో చిన్ననటి తాడిపత్రిలో నూతన సంవ త్సర వేడుకలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటికి ఖండనగా టిడిపి ఛైర్మెన్ జేసీ ప్రభాకరరెడ్డి కూడా వికృత వ్యాఖ్యలు చేయడం ఓ దుమారం నడుస్తున్నది.అనేక రూపా ల్లో వాతావరణం కలుషితం చేయడానికి, స్వప్రయోజనాలు సాధించుకోవడానికి సాగుతున్న రకరకాల ప్రయత్నాల పట్ల ప్రజలు, పరిశ్రమ కూడా అప్రమత్తంగా వుండాల్సిన సమయమిది. కళాకారులు, రచయితలు, పాత్రికేయులపై అనేక విధాల నిర్బంధానికి నిషేధాలకు పాల్పడిన సంఫ్‌ు పరివార్ ఇక్కడ సంరక్షకురాలిగా మాట్లాడటం చెల్లుబాట య్యేదికాదు. అందరూ ఆనందించవలసిన కళలను సంకుచిత కోణాలతో చూడటం సరైంది కాదు.పరిశ్రమ కూడా మంచి చిత్రాలకు ప్రోత్సాహం, ప్రేక్షకులకు భద్రతాభారం తగ్గించడం గురించి యోచించాలి.