కబ్జాకి గురైన ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాల స్థలాన్ని కాపాడాలి"పూర్వ విద్యార్థుల సంఘం నేత దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్*విజయవాడ

Oct 14, 2024 - 19:41
Oct 14, 2024 - 20:55
 0  12
కబ్జాకి గురైన ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాల స్థలాన్ని కాపాడాలి"పూర్వ విద్యార్థుల సంఘం నేత దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్*విజయవాడ

ఆపరేషన్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ వెంటనే చేపట్టాలి

`కబ్జాకి గురైన ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల స్థలాన్ని కాపాడాలి

`ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నేత దోనేపూడి శంకర్‌, దోనేపూడి కాశీనాథ్‌, చెరుకూరి కృష్ణ కుమార్‌ 

విజయవాడ:  ఆక్రమణల చెరలో ఉన్న నగరంలోని ప్రసిద్ధి చెందిన ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ కళాశాల స్థలాన్ని కాపాడాలని కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు దోనేపూడి శంకర్‌ డిమాండ్‌ చేశారు. కళాశాలకి చెందిన స్థలం ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో స్థానిక బీఆర్‌టీఎస్‌ రోడ్డు గులాబితోట వద్ద కాలేజీ స్థలాన్ని సంఘం నేతలు సోమవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకి చెందిన రూ.300కోట్లు విలువ చేసే 6.67 ఎకరాల స్థలం కబ్జాకి గురవుతున్నా కళాశాల యాజమాన్యం, ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థలాన్ని కాపాడుకోవటం కోసం దశాబ్దా కాలంగా ఉద్యమం జరుగుతున్నా పాలకవర్గాలు ప్రభుత్వ స్థలం కబ్జాకి గురవుతున్నా నిమ్మకునీరెత్తినట్లు ఉండటం బాధాకరం అన్నారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకి చెందిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని 2009లో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఎలా కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు? నగర పాలక సంస్థ ఎలా అనుమతులు ఇస్తుందని నిలదీశారు. రవీంద్రభారతి విద్యాసంస్థల అధినేత కొసరాజు వంశీకృష్ణ 4000 చదరపు గజాలు ఎలా కొనుగోలు చేశారని సందేహం వెలిబుచ్చారు. 2017లో ఇదే విధంగా స్థలం కబ్జాకి గురైన నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చేయటం జరిగిందని గుర్తు చేశారు. దసరా పండుగ సందర్భంగా కొంత మంది ప్రైవేటు వ్యక్తులు కళాశాల స్థలంలో శంకుస్థాపనకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.సృజన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే తహసీల్దార్‌ని స్థల పరిశీలన చేయటానికి పంపి జరుగుతున్న పనిని నిలుపుదల చేశారని చెప్పారు. అందుకు కలెక్టర్‌కి పూర్వ విద్యార్థుల సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్‌ బుడమేరు చేపడతామని ప్రభుత్వం ప్రకటించటాన్ని స్వాగతిస్తూ అలాగే ఆపరేషన్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ని నిర్వహించి అక్రమణదారుల నుంచి కళాశాల స్థలాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దశల వారీ పోరాటంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, విద్యా శాఖా మంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. దాదాపు 87 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న శ్రీ రాజారంగయ్యప్పారావు అండ్‌ చుండూరు వెంకట రెడ్డి (ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌) ప్రభుత్వ కళాశాల స్థలాన్ని కాపాడటంలో ప్రజలు, విద్యార్థులు స్పందించాలని కోరారు.

పూర్వ విద్యార్థుల సంఘం నేతలు దోనేపూడి కాశీనాథ్‌, చెరుకూరి కృష్ణ కుమార్‌, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లంకా జానయ్య, కార్యదర్శి చిగురుపాటి యుగంధర్‌లు మాట్లాడుతూఎన్టీఆర్‌ రామారావు, చలసాని శ్రీనివాసరావు, చలసాని కాంచనరావు, రావి భీమారావు వంటి అనేక మంది ప్రముఖులు ఈ కళాశాలలో విద్యాభాస్యం చేశారని తెలిపారు. తమ ప్రాణాలను ప్రజల కోసం అర్పించిన నేతలు ఆవిర్భవించారని చెప్పారు...ఒక దశలో విజయవాడ నగరపాలక సంస్థలో ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల పూర్వ విద్యార్థులు 12 మంది కార్పోరేటర్లుగా ఉన్నారని గుర్తు చేశారు. అటువంటి రాజకీయ చైతన్యం ఉన్న కళాశాల స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా సాగే ఈ ఉద్యమంలో కళాశాల విద్యార్థులు, నగర ప్రజలు వెన్నంటి నిలవాలని విజ్ఞప్తి చేశారు. కళాశాల స్థలాన్ని కాపాడుకోవటం కోసం విద్యార్థి సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 

అదే సమయంలో జలసూత్రం శ్రీనివాసరావు అనే కబ్జాదారుడు తాను ఆక్రమించిన స్థలంలో మెరక వేసేందుకు ట్రాక్టర్‌తో మట్టి వేసేందుకు చేసిన ప్రయత్నాన్ని పూర్వ విద్యార్థులు అడ్డుకుని ట్రాక్టర్‌ని తిప్పిపంపారు. 

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు ఆళ్ల వేణుగోపాలరావు, నల్లమోతు వెంకటేశ్వరరావు, కేవీ.వెంకట నాంచారయ్య, న్యాయవాదులు శ్రీనివాసరావు, రాజశేఖర్‌, మహబూబ్‌ ఆజం, ఏఐఎస్‌ఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ కె.కార్తీక్‌, ఏఐవైఎఫ్‌ విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State