సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది..... సి ఐ.. డి. రామకృష్ణారెడ్డి
మునగాల 14 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని స్థానిక సీఐ డి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థు లకు మండల కేంద్రంలోని మోదుగు నిరంజన్ రెడ్డి గ్రంధాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన అభినందన మరియు సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నవ సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని,నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులతో పాటు గురువులపై కూడా ఎంతో ఉందన్నారు. నేటి యువత చెడు మార్గంలో పైనించకుండా సరైన మార్గంలో ఉంచేందుకు ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిని మించిన వృత్తి మరొకటి లేదన్నారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన నూతన అభ్యర్థులు పాఠశాలలోని పిల్లలను తమ పిల్లలుగా భావించి విద్యా బోధన చేపట్టాలని ఆయన సూచించారు. నేటి సమాజంలో యువత మాదకద్రవ్యాలకు మత్తు పదార్థాలకు బానిసై నైతిక విలువలను కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో వృత్తి పట్ల నిర్లక్ష్యం వహించకుండా విధులను సక్రమంగా నిర్వహిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త గంధం సైదులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కె. ఆర్. ఆర్. డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ అరవపల్లి శంకర్, విశ్రాంత ఎంఈఓ ఓరుగంటి రవి,గ్రంథాలయ అధికారిని దేవ బతిని లలితా దేవి, త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస్, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు మరియు సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ శ్రీనివాస్, కాసర్ల వెంకట్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఉద్యోగాలు సాధించిన సిరికొండ అనూష ,తంగెళ్ల శిరీష, కొండ అమూల్య, దినేష్ లను కుటుంబ సభ్యులతో పాటు శాలువలతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఇటువంటి సామాజిక కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తున్న గంధం సైదులును ఈ సందర్భంగా వారు అభినందించారు