ఎన్నికల్లో నల్లధన ప్రవాహం

Mar 2, 2024 - 16:26
Apr 15, 2024 - 17:39
 0  2
ఎన్నికల్లో నల్లధన ప్రవాహం

అక్రమ సంపాదనతో దాగుడుమూతలు   ఇంకెంతకాలం?

ఎన్నికల సంఘం  బాధ్యతారాహిత్యమే ప్రజాస్వామ్యం అపహాస్యం కావడానికి  కారణము కాదా!

కఠిన చట్టాలతో  ప్రజా కంటకుల  దు నుమాడ లేమా ?

అధికారకాంక్షతో  అవినీతిని చట్టబద్ధం చేస్తూ  ఎన్నికల్లో  నల్లధనాన్ని విస్తారంగా కుమ్మరించి  నోటు తో ఓటును కొనుగోలు చేసి  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా  గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల సంఘం  పట్టించుకోని కారణంగా  ఈ ఆర్థిక రుగ్మత మరింతగా పెరిగిపోయింది.  "ధనవంతులతో సమానంగా పేదలు అణచివేత వర్గాలు కూడా  రాజ్యాధికారం సాధించే దిశలో  పోటీ పడడానికి  అవకాశం కల్పించేదే ప్రజాస్వామ్యమని  బలహీనుల పాలిట  భారత రాజ్యాంగం నీడలో  అది సాధ్యపడాలని  పడుతుందని  ఆశాభావం వ్యక్తం చేసిన  మహాత్మా గాంధీ" కలలు  ఏ నాడు నిజం కాలేదు. "నైతిక విలువలకు కట్టుబడి,  సమర్థులై, విద్యావంతులై,  ప్రజా సేవే  కర్తవ్యం గా పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ  బలహీనులకు  ప్రస్తుత ఎన్నికల్లో  గెలుపు అవకాశాలు లేకపోవడాన్ని  గమనించినప్పుడు  మన ప్రజాస్వామ్యం నేతి బీరకాయలోని నెయ్యి వంటిదే అని తేలిపోయింది."  ప్రజల చేత ప్రజల కొరకు  ప్రజలు తమను తాము  పరిపాలించుకునే అత్యంత ఉత్కృష్ట  విలువలతో కూడినది ప్రజాస్వామ్యం అని గర్వంగా చెప్పుకుంటే  ప్రస్తుతము" అవినీతి వలన  నల్లధనం చేత  నేరగాళ్లు సంపన్న వర్గాల కొరకు మాత్రమే  ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యం  ధనస్వామ్యానికి గుండాయిజానికి నేరగాళ్లకు నిలయంగా మారడం అత్యంత విచారకరం".  చట్టాలు, బలమైన రాజ్యాంగం, అంతకుమించిన ఎన్నికల సంఘం  ఎన్నికల సమయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా ఈ. సీ.కటినంగా వ్యవహరించనీ కారణంగా   పరిపాలనలో ఎన్నికల్లో సర్వత్ర అవినీతి నేర స్వభావం పెరిగిపోవడానికి  కారణమవుతున్నది.  పర్యవసానంగా ప్రస్తుత లోక్సభలో 83%  రాజ్యసభలో 36% మంది  అవినీతిపరులు నేరగాళ్లు  సభ్యులుగా ఉన్నారంటే  మన ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల సంఘం వైఫల్యాలు- కొన్ని గణాంకాలు:-

  96 కోట్ల మంది ఓటర్లతో  ప్రపంచంలోనే  అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకుంటున్నా  ఎన్నికల వ్యవస్థకు పట్టిన చీడపీడలను  నిర్మూలించవలసిన ఎన్నికల సంఘం  ఇతర ప్రభుత్వ సంస్థలు  ఎన్నికల్లో అవినీతిని నిర్మూలించి  నల్ల ధన ప్రవాహాన్ని అడ్డుకున్న దాఖలాలు లేకపోవడం  మన ప్రజాస్వామిక వైఫల్యానికి అద్దం పడుతున్నది.  2023 నవంబర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి  నగలు, నగదు, మద్యం, మాదకద్రవ్యాలు  మొత్తం కలిపి 1760 కోట్ల   మేర పట్టుబడినట్లు,  2018 నాటితో పోలిస్తే  ఏడింతలు  ఎక్కువ అని ఎన్నికల సంఘం చెబుతున్నది అంటే అర్థం చేసుకోవచ్చు.  అంతేకాదు దేశంలో ని  నల్లధన ప్రవాహంలో ఈ మొత్తం  ఒక నీటి బొట్టంత అని  ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారంటే  చట్టానికి  అందకుండా ఎంత అక్రమ సంపాదన  ప్రజా జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు . ప్రభుత్వ నిబంధనల మేరకు పార్లమెంట్కు 95 లక్షలు అసెంబ్లీకి 40 లక్షలు నుంచి ఖర్చు చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ  పట్టించుకునే రాజకీయ పార్టీలు కానీ  అక్రమాలను అడ్డుకునే సామర్థ్యంలో ఎన్నికల సంఘం లేకపోవడం  హద్దు అదుపు లేకుండా అవినీతి చెలరేగడానికి నల్లధనం ప్రవహించడానికి మరీ కారణమవుతున్నది.  2022లో  తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా  వందల కోట్ల రూపాయలు  రాజకీయ పార్టీలు ఖర్చు చేసినట్లు,  ప్రత్యక్ష నగదు బదిలీ  తమకు అందలేదని ప్రజలే వీధుల్లో  పోరాడిన దాఖలను పరిశీలిస్తే    ఎన్నికల సంఘం ఎందుకు నిర్వీర్యం అవుతున్నదో అర్థం కావడం లేదు.  పైగా ప్రతి ఎన్నిక సందర్భంలోనూ  2o పైగా వివిధ ఎన్ఫో ర్సుమెంట్ ఏజెన్సీలను రంగంలోకి దింపి  చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు అవినీతిని అడ్డుకుంటున్నట్లు    ఎన్నికల సంఘం ప్రకటించడం  సందిగ్ధతకు దారితీస్తున్నది.  1998లో సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు  కలిసి  అక్రమంగా సక్రమంగా ప్రవహింపజేసిన మొత్తము 10 వేల కోట్ల రూపాయలు అని అంచనా వేస్తే,  2014 నాటికి అది 35 వేల కోట్లకు, 2019లో 60 వేల కోట్లకు ఎగబాకిన విషయాన్ని  గమనిస్తే  అవినీతిలో ప్రపంచంలోనే మనం తారాస్థాయికి చేరుకున్నామా? అనే సందేహం కలగక మానదు.  ఈ లెక్కన ఆలోచిస్తే 2024లో జరిగే సార్వత్రీక ఎన్నికల్లో  లక్ష కోట్ల రూపాయల నల్లధనం  చేతులు మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు . 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో  3456 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం  స్వాధీనం చేసుకుని  అక్రమార్కులకు దడ పుట్టించినామని అవినీతిని అడ్డుకున్నామని   గొప్పలు చెప్పుకునే ఎన్నికల సంఘం  అంతకుమించి ముందుకు  వెళ్లలేకపోవడంతోనే  అక్రమాలు జోరందుకుంటున్నాయి.

ఎన్నికల నిర్వహణ- కొన్ని సూచనలు హెచ్చరికలు 

2017 జూలైలో  ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన  అరుణ్ జట్లీ  ఈ దేశంలో ఏడు దశాబ్దాలుగా  ప్రజాస్వామ్యానికి నల్లదనమే ఇందరంగా మారిందని  దాన్ని అరికట్టడంలో ప్రభుత్వము పార్టీలు పార్లమెంటుతో పాటు  ఈ.సీ. కూడా విఫలమైందనే  కటోర సత్యాన్ని  ప్రకటించిన తీరు  నేటి పాలకులకు ఎన్నికల సంఘానికి కనువిప్పు కావాలి.  ఎన్నికల్లో పరిమితికి మించి అభ్యర్థులు చేసే ఖర్చును  కట్టుదిట్టంగా నియంత్రణ చేసేందుకు  ఎన్నికల సంఘం పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తగు ఆదేశాలు ఇవ్వాలని  సుప్రీంకోర్టులో గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా  నల్లధనం పెరగడం ఆందోళన కరమే అని అంగీకరిస్తూనే ఎన్నికల సంఘం  2010లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  వ్యయ పర్యవేక్షణ సంఘాన్ని అతిగా వినియోగిస్తున్నామని ఇంకేమీ యంత్రాంగం అవసరం లేదని  ఎన్నికల సంఘం కోర్టుకు నివేదించడం అంటే  తను నేరాన్ని అంగీకరించినట్లేనా ?

భారతదేశంలో  సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం  అమలులో ఉన్నందున ఎన్నికల ప్రజా ప్రతినిధులతో పాటు ఓటర్ల నిజాయితీని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేన ని  ఆ వైపుగా కృషి జరగాలని  గత 65 సంవత్సరాల క్రితమే జస్టిస్ చాగ్లా  హెచ్చరించిన తీరు  పౌర సమాజం బాధ్యతను, పాలకుల కర్తవ్యాన్ని,  ఎన్నికల సంఘంతో పాటు న్యాయ వ్యవస్థ  చొరవను  ఆహ్వానించినట్లుగా భావించాలి  .19 90-- 96 మధ్యకాలంలో భారత ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన శేషన్  ఉన్న చట్టాలను ఉపయోగించి  అవినీతి అక్రమ పద్ధతులను  కట్టుదిట్టం చేసిన అనుభవాన్ని  నేటి పాలకులు ఎన్నికల సంఘం  గమనంలోకి తీసుకోవాలి. ఈసీ తనపై వస్తున్న  ఆరోపణలు, ఫిర్యాదులు,  లోపాలపై  ప్రభుత్వాన్ని  అవసరమైన చట్టాలను చేయమని కోరడం ద్వారా  తన సత్తాను నిరూపించుకోవాలి.  140 కోట్ల భారతీయుల  సంపదను  కొద్దిమంది నల్లధనం గా మార్చే అధికారం  ఈ దేశంలో ఎవరికీ లేదు. ఆ వైపుగా కేంద్రం మరిన్ని చట్టాలను చేసి  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో పూర్తిస్థాయి బాధ్యత వహించవలసి ఉంటుంది.

--- వడ్డేపల్లి మల్లేశం

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333