పదవి అధికారం చలాయించడానికి కాదు  సామాజిక బాధ్యత నిర్వహించడానికి

May 26, 2024 - 22:01
Jun 6, 2024 - 16:17
 0  13
పదవి అధికారం చలాయించడానికి కాదు  సామాజిక బాధ్యత నిర్వహించడానికి

ఈ నిజాన్ని గుర్తించని పాలకులు  ఆదిపత్యం చెలాయిస్తూ,  

అక్రమాలకు పాల్పడుతూ,  సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తున్నారు.

ప్రజాస్వామ్యానికి మూలమైన  ప్రజలను  

ప్రభువులుగా చూచే బదులు  బానిసలుగా చిత్రీకరిస్తున్నారు.

ప్రజలు   కీలెరిగి వాత పెడితేనే  ప్రజల ముందు తలవంచుతారు.

ప్రజలకు పౌర సమాజానికి  పాలకులని చెప్పబడుతున్న  ప్రజా ప్రతినిధులకు కూడా సామాజిక బాధ్యత తప్పనిసరి  హక్కులకై కల బడుతూనే బాధ్యతలకు నిలబడాలి అనే ప్రాథమిక  సూత్రాన్ని  అమలు చేయకుండా  మనుగడ సాగించే అధికారం ఎవరికి లేదు . కానీ అందుకు భిన్నంగా ప్రజలు కూడా తమ బాధ్యతను అప్పుడప్పుడు  విస్మరిస్తుంటే  అంతకుమించిన స్థాయిలో  పాలకులు రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు  తమ పదవిని అధికారాన్ని చలాయించడం కోసమే  వినియోగిస్తూ  సరదాగా గడపడాన్ని గమనించవలసిన అవసరం ఉన్నది . ప్రతి వృత్తి  బాధ్యతలు,   ప్రయోజనాలు, లక్షణాలను కలిగి ఉంటుంది.  

 అలాగే ప్రజా ప్రతినిధి కూడా  తనకున్న పరిధిలో  బాధ్యతలను సంపూర్ణంగా  నిర్వహించే బదులు  ప్రజల ఒత్తిడి  ప్రతిఘటన క్రమక్రమంగా తగ్గుతున్న కారణంగా  పాలకులు  రాజకీయాన్ని క్రీడగా సరదాగా  చివరికి ఆధిపత్యంతో కూడిన అహంకారం  ప్రదర్శించడానికి సిద్ధపడటాన్ని ప్రజాస్వామ్యానికి  పే ను ప్రమాదంగా భావించవలసి ఉన్నది .   ఓటమిపాలైన తర్వాత కొన్ని రాజకీయ పార్టీల భవితవ్యం  ప్రజల చేతిలో ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో స్వీయ రాజకీయ పార్టీకి చెందిన వాళ్లు  ఈ ఓటమికి పార్టీ అధినేత యొక్క అహంభావమే కారణమని  నొక్కి చెప్పిన సందర్భాలు అనేకం.  ఇటీవల టిఆర్ఎస్ పార్టీ ఓటమికి  నాయకత్వం యొక్క అహంకారమే ప్రధాన కారణం అని  సీనియర్ పార్టీ నాయకులు  శాసనమండలి చైర్మన్ ప్రస్తావించడాన్ని మనం గమనించవచ్చు.  

 ఎన్నికల సమయంలో ఆ తర్వాత ప్రజల వద్దకు వెళ్లిన ప్రతిసారి కూడా పాలకులు  తాము  శాసించే వాళ్ళం కాదని, అధికారాన్ని చలాయించడానికి అంతకు సిద్ధంగా లేమని, ప్రజలకు సేవకులుగా మాత్రమే  పనిచేయడానికి  సిద్ధమని  అతి వినయాన్ని ప్రదర్శించడాన్ని మనం ఇటీవల కాలంలో ఎక్కువగా  చూడవచ్చు.  ఇంకా ప్రజలే దేవుళ్ళని, ప్రజలే గెలవాలని  అనేక రాజకీయ పార్టీలు ఇటీవల ప్రచారం చేస్తూ  గెలుపు కోసం చేసే ప్రయత్నాల సరళి  వెనక కుట్ర కుతంత్రాలు  అధికారకాంక్ష  పెద్ద మొత్తంలో కనిపిస్తుంది . చూసే కోణాన్ని బట్టి సమస్య యొక్క స్వభావం, మూలం,  కారణాలను గుర్తించినట్టుగా  రాజకీయ పార్టీల నాయకులు పాలకులు  తమ  ప్రచార  సరళిని  ప్రజలు తీక్షణంగా పరిశీలిస్తే కానీ లోగోట్టు అంతగా  తెలియదు . ఇక మరికొందరు వచ్చిన అధికారం తిరిగి రావచ్చు రాకపోవచ్చు  పదవి శాశ్వతం కాదు కనుక ఉన్న నాడే  అనుభవించడం,  ఆదిపత్యం చెలాయించడం, భూ కబ్జాలకు పాల్పడడం, అక్రమాస్తులను సంపాదించడం  తో పాటు సంపన్న వర్గాలకు ఊ డిగం చేయడానికి  చేస్తున్న కృషిని గనుక గమనిస్తే  90 శాతం గా ఉన్నటువంటి అట్టడుగు సామాన్య ప్రజానీకాన్ని  ఏ రకంగా   పాలకవర్గాలు  దోపిడీ చేస్తున్నాయో  సునాయాసంగా గమనించవచ్చు .

ఇది సంపన్న వర్గాలకు ఊడిగం కాదా?  పేద వర్గాలకు ఇంతకంటే ద్రోహం   ఏముంటుంది?

ఈ దేశంలో   ఉన్నటువంటి ప్రజా సంపద 40%  కేవలం ఒక్క శాతం ఉన్నటువంటి అత్యంత సంపన్న వర్గాల చేతిలో బందీ అయ్యింది అంటే  పెట్టుబడిదారులకు ఊడిగం కాక మరేమిటి?  పారిశ్రామికవేత్తలు  నిరంతరం ప్రభుత్వాలను మోసం చేయడానికి  చేసే ఎత్తుగడలో భాగంగా ఈ దేశంలో  ప్రభుత్వ బ్యాంకులలో రుణాలు తీసుకొని ఇతర దేశాలకు పారిపోవడం,  పన్నులను తీసుకున్న రుణాన్ని ఎగవేయడంతో పాటు  కేంద్ర ప్రభుత్వమే  పెట్టుబడిదారులకు 14 లక్షల కోట్ల  రూపాయలకు పైగా మాఫీ చేసిన విషయాన్ని  ఎలా చూడాలి ?

  ఇక తెలంగాణ రాష్ట్రంలో  రైతుబంధు పేరుతో  సుమారు ఏడు సంవత్సరాలు  భూస్వాములకు  వందల ఎకరాలు ఉన్నటువంటి  బడా  సంపన్నులకు అందులో పండించని పంట భూములు ఇళ్ల స్థలాలు అడవులు  గుట్టలకు రైతుబంధు పేరుతో ప్రభుత్వం డబ్బును  కుమ్మరించడం అంటే  ప్రజాధనాన్ని వృధా చేయడమే కాదు పేద వర్గాలకు ద్రోహం చేయడమే అవుతుంది.  దేశంలోని అనేక రాష్ట్రాలలో  మద్యం, మత్తు పానీయాలు, ధూమపానం,  క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల పేరుతో ప్రభుత్వం ఆమోదించిన  మేరకు అరాచక అకృత్యాలు అధికారికంగా కొనసాగుతూ ఉంటే  దాని విష ఫలితాలను సామాన్య ప్రజలు అనుభవిస్తూ  సంపన్న వర్గాలకు క్రీడగా విలాసంగా మారిన నేపథ్యంలో  జరిగిన పరిపాలన ఎవరి ప్రయోజనం కోసం తెలియదా ?

 ప్రజాస్వామ్యం ప్రకారంగా  ప్రజలను ప్రభువులు గా చూడాల్సినటువంటి పాలకులు  తమ వాగ్దానాలు ప్రలోభాల ద్వారా యాచకులుగా మార్చి  రాజకీయ నాయకుల  చుట్టూ తిరిగేలా  హక్కులను రాజ్యాంగబద్ధంగా కాకుండా యాచించే దుస్థితికి తీసుకురావడం వెనుక ఉన్న కుట్ర  కుతంత్రాలు  అధికారం పేరుతో కొనసాగుతున్న  పాలనలోని  అంతరార్థం కాదా?  ఇక ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు పరస్పరం దాడులకు ఎగబడుతూ  ప్రజలను వంచిస్తూ  ప్రలోభాలతో  స్వార్థ ప్రయోజనాలకు  తెగించిన విషయాలు అనేక ఉదాహరణలు గా చూడవచ్చు.  నేరస్తులు,  నేరం రుజువై జైల్లో ఉండి శిక్ష అనుభవించి  బెయిల్ పైన వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ముఖ్యమంత్రిగా చలామనవుతున్నారు

  మరొక్కవైపు  సామాన్యుల నుండి అసామాన్యుల వరకు మానవహ పౌర హక్కుల కార్యకర్తల వరకు బుద్ధి జీవులు మేధావులు ప్రజల పక్షాన పోరాటం చేసిన వాళ్లు  దశాబ్దాలుగా విచారణ ఖైదీలుగా కొనసాగినటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు ఈ దేశ పాలకులకు  ఉరిశిక్ష విధించినా తక్కువే అని చెప్పక తప్పదు . దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఢిల్లీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను సుమారు పది సంవత్సరాలు విచారణ ఖైదీగా శిక్షించి  నేరం రుజువు కానందున నిర్దోషి అని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన తీరు  ఆ శిక్ష అనుభవించిన ప్రొఫెసర్  కోల్పోయిన జీవితానికి  ఎవరు బాధ్యులు ? అంత బాధ్యతారాహిత్యంగా ఈ దేశ పాలన కొనసాగుతూ ఉంటే  పెట్టుబడిదారీ వర్గాల కోసం కోట్లాది  అప్పుల కుప్పలు చేసి  ఆ భారాన్ని సామాన్య ప్రజల పైన  మోపడం నిజంగా  దేశద్రోహం కాక మరేమిటి?

 మామూలు వార్డు సభ్యుల నుండి ప్రధానమంత్రి వరకు  పదవుల్లో ఉన్నవాళ్లు రాజకీయాలలో పనిచేసిన వాళ్లు  ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా కోట్లాది రూపాయల అక్రమార్జనకు ఎగబడి  నేరస్తులు నేర చరిత్ర ఉన్నవాళ్లు ఇవాళ చట్టసభల్లో రాజ్యమేలు తుంటే  ఎన్నికల సంఘం,  సిబిఐ, ఐటి,ఈడి  వంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు కూడా మొక్కుబడిగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి దాసోహం  కావడం సిగ్గుచేటు. అంతేకాదు  నేరస్తులు అధికార పార్టీలో చేరితే వెంటనే వారి శిక్షలను రద్దు చేస్తున్న తీరు నిజంగా అవకాశవాదం కాక మరేమిటి ?యి న్ని రకాలుగా ప్రజలకు ద్రోహం తలపెడుతున్నటువంటి పాలకులు ,రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, ఉన్నత స్థాయి అధికారులు  చివరికి సామాన్య పేద వర్గాలను మాత్రమే టార్గెట్గా చేస్తున్న వేళ ప్రజలు  తమ శక్తిని ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైనది. కీలెరిగి వాత పెట్టకపోతే పాలకులు రాజకీయ పార్టీ నాయకులు  అధికార యంత్రాంగం  మరింత చెల్లాచెదురుగా రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది  

  ఈ దేశంలో నేరస్తులను శిక్షించే  న్యాయస్థానాలు ఉన్నప్పటికీ  వాటిపైన అధికారులు  పాలకులు చూపుతున్న ప్రభావం కారణంగా  న్యాయస్థానాలు కూడా మౌనంగా ఉండక తప్పడం లేదు అని ప్రచారం... ఇలాంటి పరిస్థితిలో  ప్రజలు ప్రజా ఉద్యమాలు  ఉక్కు పాదం మోపడం ద్వారా ప్రతిఘటన, ప్రశ్న,  నిరసన ,విమర్శల ద్వారా  ప్రజా వ్యతిరేక విధానాలను పాలనలోని డొల్లతనాన్ని  మూర్ఖపు అవకాశవాద రాజకీయాలను ఎండగట్టాలని.  చర్చలు సంప్రదింపులు  చివరికి అఖిలపక్ష సమావేశంలో మీడియా సమావేశాలు కూడా లేకుండానే ఒంటెద్దు పోకడతో నియంత పరిపాలన కొనసాగిస్తున్న భారతదేశంలోని అన్ని స్థాయిలలోని పాలకులకు తగిన బుద్ధి చెప్పినప్పుడు మాత్రమే  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. పిడికెడు మెతుకులతో పూట గడవడమే కష్టమవుతున్నటువంటి కోట్లాది ప్రజలు ఒకవైపు ఉంటే  కోటానుకోట్ల సంపద ఏనుగునెక్కి నాణ్యాన్ని పైకి విసిరితే  ఎంత దూరం పోతుందో అంత ఎత్తు సంపద కూడా పెట్టినటువంటి అక్రమార్కులు మరొకవైపు నిలబడినప్పుడు ఈ దేశంలో  నైతిక విలువలు నీతి నిబద్ధత  ఎంత పతనావస్థలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .

 ప్రజలు తమ ఓటు హక్కు  ద్వారా  ద్రోహం తలపెడుతున్నటువంటి రాజకీయ పార్టీలకు  తగిన బుద్ధి చెప్పడం ద్వారా నిజాయితీపరులు సేవకులు ప్రజా ఆకాంక్షలను పట్టించుకునే వారికి మాత్రమే తమ ఓటును సవాలుగా విసిరినప్పుడు,  పాలకులు రాజకీయ పార్టీలు ఇచ్చే  ఉచితాలు రాయితీలు, నగదు సౌకర్యాలు లంచాలకు  లొంగకుండా ఉన్నప్పుడు మాత్రమే  ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టి అవుతుంది . దానికి ప్రజా ఉద్యమాలు,  ప్రజా సంఘాలు, కలిసి వచ్చే అఖిలపక్షాలు , అంతో ఇంతో నిబద్ధత కలిగిన వామపక్షాలను ఉమ్మడి వేదికగా చేసుకొని ప్రజా పోరాటాన్ని ఉధృతం చేయడమే  దుష్ట రాజకీయాల ముగింపుకు పరిష్కారం అవుతుంది.

---  వడ్డేపల్లి మల్లేశం 

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333