ఆటోలో ప్రయాణాలు అటో..ఇటో

ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని వైనం
మైనర్ లే కూలీలు....
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల.: వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళా కూలీలు ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి వీరిది. ఎక్కడ పని దొరికితే అక్కడకు చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుంటారు. నిత్యం గద్వాల, మల్దకల్, అయిజ తదితర మండలాలో మిరుప,పత్తి చేనులో పని చేసేందుకు కేటిదొడ్డి, ధరూర్, గట్టు మండలాల నుంచి కూలీలను తరలిస్తున్నారు. అయిజ,మల్దకల్, గద్వాల్ ధరూర్, కేటిదొడ్డి మండలాలకు వెళ్లే మార్గాల్లో ఆటోల్లో కూలీలను పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. ఒక్కో ఆటోలో 30 మందికిపైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ దారుల్లో లారీలు, బస్సులు ఇతర భారీ వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఆటోలు కూడా అతివేగంతో వెళుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టుతప్పితే ప్రయాణికుల ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటికైనా ప్రయాణికులు తమ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యమివ్వాలి. అధికారులు కూడా ఇలా సామర్థ్యానికి మించి ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.