సంక్షేమ గృహాలు, పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు
కార్యక్రమంకు పండుగ వాతావరణంలో ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్..బి.యం. సంతోష్

జోగులాంబ గద్వాల 12డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని ఈనెల 14 శనివారం రోజు జిల్లాలోని అన్ని విద్య సంస్థలలో పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సంక్షేమ వసతి గృహాలు,పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తారని, అందుకు అనుగుణంగా విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తు ఆహ్వానాలు పంపాలని, విద్యాసంస్థ ఆవరణలో శానిటేషన్ చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరమైన భోజనం సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల పై ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధనలు అందించుటకు కృషి చేస్తుందని, అందులో భాగంగానే జిల్లాలో ప్రతి హాస్టల్ కి ఒక అధికారిని నియమించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రణాళిక ప్రకారం విద్యార్థుల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ అందిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేస్తూ ఉన్నామని తెలిపారు. జిల్లాలో పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ ,నర్సింగరావు, జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ బాబు, ఏస్సి వెల్ఫేర్ సరోజా, ప్రిన్సిపల్స్, అన్ని సంక్షేమ శాఖల వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు...