సీఎం నివాసంలో కుల గణన సర్వే సేకరిస్తున్న కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్ 28 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యావత్ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ,జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి ,ఇతర అధికారులు, ఎన్యుమరేటర్లు, సిబ్బందితో కూడిన సర్వే బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు.సర్వే పురోగతి వివరాలను, సర్వేలో పాల్గొన్న ప్రజల స్పందన గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సూచించారు.ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా సర్వేలో వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.