వరి కోతల షెడ్యూల్ ప్రకారం ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కొనుగోలు
నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర పై కొనుగోలు
వానాకాలం పంట సీఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలి
త్రాగునీటి సరఫరా ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలి
ధాన్యం కొనుగోలు, త్రాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26:- యాసంగి 2023-24 ధాన్యం వరి కోతల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళికపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐ డి ఓ సి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా , అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, యాసంగి పంట కోతలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వరి కోతల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తననియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం చేయాలని, ఎక్కడా ప్రజా ప్రతినిధులు పాల్గోనవద్దని అన్నారు.
ప్రతి జిల్లాలో వరికోతలననుసరించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు షెడ్యూల్ రూపోందించుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు.
యాసంగి పంట కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా, టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు, టార్ఫాలిన్లు, గన్ని బ్యాగులు సన్నద్ధం చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.
చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎక్కడ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదనే సందేశం రైతుల వద్దకు వెళ్లేలా అవగాహన కల్పించాలని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతంపై విస్తృత అవగాహన కల్పించాలని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో వరిసాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సిఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు.
వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ త్రాగునీటి సరఫరాలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు స్థాయిలో త్రాగునీటి సరఫరాకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలు అరికట్టాలని తెలిపారు.
జిల్లాలో త్రాగునీటి అవసరాల మేరకు బోరు బావులను, పాత త్రాగునీటి సరఫరా మోటార్లను పునరుద్ధరించాలని, త్రాగునీటి సరఫరా నిమిత్తం అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని, ఎక్కడ నిధులకు ఆటంకం లేనందున అత్యంత ప్రాధాన్యతతో త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని అన్నారు.
గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలో ఉన్న త్రాగునీటి వ్యవస్థను ఒకసారి పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు పూర్తిచేయాలని తెలిపారు. త్రాగునీటి సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం కావాలని ప్లాన్ బీ తయారు చేసుకోవాలని అన్నారు.
ప్రతి మున్సిపాలిటీలో చివరి వార్డ్, గ్రామాలలో చివరి ప్రాంతం వరకు త్రాగునీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రతి అంశాన్ని రోజు పర్యవేక్షించాలని, ప్రజలకు నీటి సరఫరా లో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నయ ఏర్పాట్లు సత్వరమే చేయాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేర ప్యాడి క్లీనర్లు వేయింగ్ యంత్రాలు , తేమ యంత్రాలు, ఇతర సామాగ్రి సన్నద్ధం చేస్తున్నామని, వేసవి దృష్ట్యా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ,రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు.జిల్లాలో లక్ష 11,369 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా తో 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి అదనపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను. కొనుగోలు కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై చెక్ లిస్ట్ జారీ చేస్తామని ఆ ప్రకారం ఏర్పాట్లు చేసి ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఆదేశించారు. మన జిల్లాకు సమీప రాష్ట్రాల నుండి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున నియంత్రణకు సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని చెక్పోస్టుల వద్ద రెవెన్యూ పోలీస్ మరియు అగ్రికల్చర్ అధికారులు విధులు నిర్వహించే విధంగా నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు ఎటువంటి తేడాలు ఉన్న కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రాలకు ఇంచార్జ్ అధికారులను నియమించాలని, కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్లు, మొదలగు అన్ని సౌకర్యాలు కనిపించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రాన్ని, సీఎంఆర్ మిల్లులను తనిఖీ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి ని ఆదేశించారు.
అనంతరం జిల్లాలోని త్రాగునీటి సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో మంజూరైన పనుల పురోగతిపై ప జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ డి ఈ లు,పబ్లిక్ హెల్త్ ఈ ఈ లు మరియు ఎంపీడీవో లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తానని అధికారులకు తెలిపారు. ఈ సమీక్షలో ప్రతిరోజు పనులు పురోగతిపై మరియు పెండింగ్ పనులపై నివేదికను అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ ఈ సదాశివం, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, డిఎం సివిల్ సప్లై త్రినాథ్ బాబు, జిల్లా సహకార శాఖ అధికారి ఖుర్షీద్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.