రైతులు నష్టపోకుండా నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు చేయాలి
జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్ సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు పత్తి ఆరబెట్టుకుని వచ్చేలా సంబంధిత ఏఈఓ లు అవగాహన కల్పిస్తే, రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% లోపు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేస్తున్నందున రైతులు దాని ప్రకారం ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం స్లాట్ బుకింగ్ విధానంలో ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తుండగా, 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని, అకాల వర్షాలతో పత్తి దెబ్బతినడంతో తేమ ఎక్కువగా ఉన్న కొనాలని పలువురు రైతులు కలెక్టర్ ను కోరారు. ఇటీవలే ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాహనాల్లో రైతులు అమ్మేందుకు తీసుకొచ్చిన పత్తిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ జిన్నింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, సిసిఐ అధికారి రాహుల్ కలాన, తదితరులు ఉన్నారు.