ప్రశ్నిస్తే శత్రువులవుతామని  ఆగి పోదామా?

Aug 22, 2025 - 18:22
 0  1

 ప్రశ్నించకుంటే బానిసలుగా మిగిలిపోవలసి వస్తుందని  పునరాలోచన చేద్దామా?* నిజాన్ని  మాట్లాడడంలో  ఆత్మగౌరవం, బాధ్యత దాగి ఉన్నది.* శత్రువులవుతామని ఆగితే ఓటమి వెంటాడుతుంది.*
************
---- వడ్డేపల్లి మల్లేశం 9014206412
-----03....02....2025****-*-       అనుమానం,  సందేహం,  ప్రశ్న, అన్వేషణ,  అవసరమైతే ప్రతిఘటన ద్వారానే  నూతన పరికల్పనలు ఆవిష్కృతమైనవి. సందేహం రాకుంటే   అనుమానము నివృత్తి కాదు,  ప్రశ్నించకుంటే సమాధానము దొరకదు,  అన్వేషణ లేకపోతే  శాస్త్రీయ పరిశోధన సాధ్యం కాదు,  పరిశోధన శాస్త్రీయ పద్ధతిలో కొనసాగకుంటే  అనేక అంశాలు సందేహాస్పదంగా  సమస్యలుగా  మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.  అనారోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలకు వైద్యరంగంలో పరిష్కారాలు దొరకడానికి  నూతన పరికల్పనల ఆవిష్కృతమే    ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతోపాటు  జీవితాన్ని మరింత పొడిగి o చుకోవడానికి ఆస్కారం ఏర్పడింది నిజం కాదా ?ప్రస్తుతం హరిత విప్లవం దుష్పరిణామాలను ఈ వ్యవస్థ  ఎదుర్కొంటున్నది వాస్తవమే కావచ్చు కానీ  తొలి దశలో  పెరుగుతున్న జనాభాకు సరిపోయే స్థాయిలో ఆహారాన్ని అందించడం కోసం అనివార్యమైన పరిస్థితిలో  నూతన వంగడాలు, పురుగు మందులు, వ్యవసాయ విధానాలు, నీటిపారుదల సౌకర్యాలను  తెరమీదకి తెచ్చినటువంటి హరిత విప్లవం  ఆనాటి అవసరము నుండి పుట్టిన అన్వేషణకు  మరొక రూపమే  కదా! అడిగితే కసురుకుంటారని,  కసురుకుంటే  స్థానం ఉండదని, అడగడం మానేస్తే విద్యార్థులకు అనేక సందేహాలు  తరగతి  గదిలో మిగిలి పోవాల్సిందే కదా! కొటారి సూచించిన ప్రకారంగా తరగతి గది దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని  చేసిన  వ్యాఖ్యానం  నిజం కావాలంటే తరగతి గదిలో ఎన్నో రకాల చర్చలు సాగవలసిందే కదా!ఈ చర్చలో  ప్రశ్నలు సందేహాలు అనుమానాలు అన్వేషణలు  ఆరాటాలు పోరాటాలు  కొనసాగాలి.  సమాజాన్ని తరగతి గదిలోకి తరగతి గదిని సమాజంలోకి  తీసుకు వెళ్లడం ద్వారా  ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకు తోడుగా తమ అనుభవాలు, జ్ఞాపకాలను  విద్యార్థుల ముందు ప్రదర్శించడం ద్వారా  క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా  మరెన్నో అభ్యసన అంశాలు పాఠ్యపుస్తకాలు రెఫరెన్స్ బుక్స్ శాస్త్రీయ పరిశోధనలు  మేధావులు ప్రసంగాల ద్వారా  విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయడానికి అవకాశం ఉన్నది.ప్రస్తుతం తరగతి గదిలో కొనసాగుతున్నది అదే విధానం కూడా!  సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి  కొందరు  అదే పాఠశాల కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో చదివి ఉన్నత స్థానానికి ఎదిగిన వాళ్ళు మరి కొందరు  కొన్ని కొన్ని సందర్భాలలో ఆ విద్యాలయాన్ని సందర్శించినప్పుడు  వారి అనుభవాలను విద్యార్థుల ముందు ఉంచడం  విద్యార్థులు తమ ప్రశ్నలను సంధించడం  ఆ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలను  వివరణ రూపంలో  ఇవ్వడం  నిత్యం కొనసాగుతున్నటువంటి ప్రక్రియగా మనం భావించాలి. అది ప్రతి చోట నిరంతరం జరగాల్సిన అవసరం కూడా ఉన్నది  ఎందుకంటే సమాజానికి ప్రతిబింబం పాఠశాల కనుక  సమాజంలోని భిన్న వర్గాలను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా కూడా  పాఠశాల సమాజం మధ్యన మరింత సాన్నిహిత్యాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత  ఉపాధ్యాయులకు  అటు సమాజంలోని  బుద్ధి జీవులకు ఉన్నది.
         తరగతి గదిలో  జరగాల్సిందేమిటి ?
*****-----**-***-*-
సహజంగా తరగతి గదిలో  పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాన్ని  విద్యార్థుల ముందు ఉంచడం  విద్యార్థుల అభిప్రాయాలను తీసుకోవడం సందేహాలకు వివరణ ఇవ్వడం  పాఠ్యాంశము చివరన ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను చర్చించుకోవడం  పరీక్షలలో వాటిని  సంతృప్తికరంగా వ్రాయడం ద్వారా తగిన మార్కులను తెచ్చుకోవడం మాత్రమే  చదువు యొక్క పరమార్థమని  అందరం ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే సిలబస్    ఉపాధ్యాయుడికి కేవలం పనిముట్టు మాత్రమే  అది కేవలం  నిర్ణీత పద్ధతిలో దారి చూపే  దీపం మాత్రమే అవుతుంది కానీ పూర్తి జ్ఞాన జ్యోతి మాత్రం కాదు. ఉపాధ్యాయులు తమ అనుభవాలను, పరిశోధన, సామాజిక చింతన, క్షేత్ర పర్యటన  ఇతర పరిశోధనల ద్వారా సా ధించినటువంటి  జ్ఞానాన్ని  తరగతి గదిలో విద్యార్థులకు అందించడంతోపాటు భావి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి తగిన  శక్తివంతులుగా విద్యార్థులను తయారు చేయడం  విద్యా బోధన యొక్క లక్ష్యం అని  నిర్వచించుకోవలసిన అవసరం చాలా ఉన్నది. అప్పుడు మాత్రమే  ఉపాధ్యాయులు విద్యార్థులు తమ పరిధిని విస్తృతం చేసుకోవడం,   ప్రశ్నలు సమాధానాల యొక్క  ఆవశ్యకతను గుర్తించడానికి  వీలుంటుంది. విద్యార్థులు తరగతి గదిలో ఎంత ప్రశ్నిస్తే అంత సమాధానం దొరుకుతుంది  ఎన్ని రకాల సందేహాలను వ్యక్తం చేస్తే అంత వివరణాత్మకమైనటువంటి ఆలోచనకు  పునాది ఏర్పడుతుంది.  విద్యార్థులను ప్రశ్నించే వాళ్లుగా తయారు చేయాలంటే ముందుగా అధ్యాపకులు ప్రశ్నించే వాళ్ళు కావాలి  ఇప్పటికీ కొందరు ప్రశ్నించడం నేరమని  దానికి ఒక పరిధి ఉంటుందని  పాఠ్యాంశాలను  ప్రస్తావిస్తే సరిపోతుందని బయట విషయాలతో సంబంధం లేదని  సామాజిక చింతన అవసరం లేదని  మాట్లాడేవాళ్లు విద్యార్థుల హెచ్చరించే వాళ్లను కూడా మనం  చూడవచ్చు. దానివల్ల  విద్యార్థులకు మనం అందించే  సామర్థ్యం కూడా అంతంత మాత్రమే అవుతుంది  తరగతి  గదిలో ఎదిగినటువంటి విద్యార్థులు రాజకీయ నాయకులుగా మేధావులుగా శాస్త్రవేత్తలుగా పరిశోధకులుగా  ఉపాధ్యాయులుగా విభిన్న రంగాలలో ప్రతినిధులుగా  తయారయ్యే అవకాశం ఉంటుంది అంటే భిన్న వర్గాలను తయారు చేసే కర్మాగారాలుగా పనిచేసే విద్యాసంస్థలలో  ఉపాధ్యాయులు ఎంత నైపుణ్యం కలవార యితే అంత గొప్ప వాళ్లను మనం తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది..ఇప్పటికీ ప్రశ్నించే వాళ్లను మందలించే వాళ్ళు బెదిరించే వాళ్ళు  నిందించే వాళ్లను కూడా మనం చూడవచ్చు అంటే ఎదుగుతున్నటువంటి మొక్కను  ఆదిలోనే విరిచినట్లు అవుతుంది  అని ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి గుర్తించాలి ఆ పద్ధతిని మానుకోవాలి.
         చైతన్యం,బానిసత్వంలో     మనం ఎటువైపు ?
**----***********
ప్రాథమికంగా ప్రశ్నించడం సమాధానాలు ఇవ్వడం తరగతి గదిలో ప్రారంభమైనప్పటికీ  అది ఎదిగి ఎదిగి  చట్టసభల్లో  ప్రశ్నించేదాకా  హక్కులకై పోరాటం చేసేదాకా  రాజ్యాంగ పలాలను అందుకోవడానికి ప్రజా ఉద్యమాలలో  పాల్గొనేలా ప్రజలను ప్రజాస్వామికవాదులను ఉద్యమకారులను చివరికి ప్రతి వ్యక్తిని కూడా ప్రోత్సహిస్తుంది  శిక్షణ ఇస్తుంది అంటే   అతిశయోక్తి కాదు.  పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా   ప్రశ్నిస్తే శిక్షించడం, అణచివేతకు  గురి చేయడం,నిర్బంధాలతో కాలరాచే పద్ధతులకు రాజ్యం  ఈనాడు నడుం బిగించింది . కనీసమైన హక్కులను ప్రశ్నించినప్పుడు  అవసరాలను అధికారులు ప్రజా ప్రతినిధుల ముందు  ప్రస్తావించినప్పుడు  ఇటీవల కాలంలో అనేక సభలు సభా వేదికల లో  పాల్గొన్న మంత్రులు అధికారులు పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేసిన సందర్భాలను మన దేశంలో గమనించవచ్చు.  పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని,  ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలని,  ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని  ప్రశ్నించి ఉద్యమాలు లేవదీసినందుకు  రైతులు కార్మికులు పేదల చేతులకు బేడీలు వేసిన చరిత్ర  తెలంగాణలో మనము స్పష్టంగా చూడవచ్చు  ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా  ప్రశ్నించడాన్ని  నిషేధించిన సందర్భం మనకు తెలుసు.  1975లో అత్యవసర పరిస్థితి సందర్భంగా 21 మాసాల పాటు కొనసాగినటువంటి  నిర్బంధ పరిస్థితుల్లో  ప్రశ్నించినందుకు ఎంతోమంది  జైలుశిక్ష   రకరకాల హింసకు  చిత్రవధకు గురైన సందర్భాలు మనకు తెలుసు. కానీ ప్రస్తుతం దేశంలో  అత్యవసర పరిస్థితి లేకపోయినప్పటికీ  ప్రజల కోసం,  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం,  పేదరిక నిర్మూలన కోసం, ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న ప్రభుత్వ విధానాన్ని అడ్డుకోవడం కోసం  పోరాడుతున్నటువంటి ఎంతోమందిని  ప్రశ్నించినందుకు ప్రతిఘటించినందుకు  ఊపిరి లేకుండా చేస్తున్న సందర్భాలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాo.  ప్రశ్నిస్తే శత్రులం అవుతాం అని ఆగిపోదామా?  రాజీ పడదామా? మానవీయ విలువలరీత్యా  సరైనది కాదని  బాధ్యతను సామాజిక చింతనను గుర్తించడం అంటే  ప్రశ్నించి  ప్రతిఘటించడమేనని  ముందుకు సాగిపోదామా? నిర్ణయించుకోవాల్సిన తరుణ మీది.  ప్రశ్నించకుంటే  పోరాడకుండా రాజీ పడితే  హక్కులను కోల్పోవడం కాదు శాశ్వతంగా బానిసలుగా  మిగిలిపోతాం. పాలకులు పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు  రాజకీయ వ్యాపారులు భూ కబ్జాలకు పాల్పడుతున్న వాళ్లు  అవినీతిని పెంచి పోషిస్తున్న వాళ్లు  ప్రశ్నించే వాళ్లను అడుగడుగునా అణచివేయాలని చూస్తూనే ఉంటారు. అయితే ఈ దేశ సంపద ప్రజలందరికీ చెందాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసుకొని  కొద్ది మంది చేతిలో బందీ కావద్దని  ఆదేశ సూత్రాలలో  లిఖి o చుకున్నప్పటికీ  60 శాతం సంపద కేవలం 10 శాతం సంపన్న వర్గాల చేతిలో చిక్కి  విలవిల కొట్టుకుంటుంటే మెజారిటీ ప్రజలు అధికారానికి నోచుకోక ఉత్పత్తిలో భాగస్వాములైనా  ఫలితాన్ని అనుభవించకుండా  పేదరికంతో అల్లాడిపోతూ ఉంటే  ప్రశ్నించకుండా ఎలా ఉండగలం?  ఆ రకంగా రాజీ పడడం అంటే  బానిసలుగా మిగిలిపోవడమే నిర్జీవులుగా మారిపోవడమే  దానికంటే ఆత్మగౌరవానికి ఆలంబనగా  రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకునే క్రమంలో  పోరాట వీరులుగా   పోరు చేయడం  శ్రేయస్కరం కాదా? తరగతి గదిలో ప్రశ్నించకుంటే  తల ఊపి తలవంచి  సందేహాలను నివృత్తి చేసుకోకుండా రాజీపడి  బానిసగా ప్రవర్తించి ఉంటే  నేడు ఈ ప్రజాస్వామిక యుద్దభూమిలో  ఓటమి పాలు కావాల్సిందే కదా! అందుకే ప్రశ్నించే తత్వానికి, ప్రతిఘటించే  ఆత్మగౌరవానికి పునాది అంకురార్పణ పాఠశాల స్థాయిలో జరగాలి, అది బాల్యంలోనే  జీవితంలో భాగంగా  కొనసాగాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333