ఆరోగ్యాన్ని పెంచి పంచే  ఆనందం జీవితంలో భాగం కావాలి

Mar 30, 2024 - 23:40
 0  2

 నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అన్న  సినీ గేయ కవి  అంతరార్థం కూడా అదే .

ఆ మూలం నుండే  ప్రపంచ ఆనంద దినోత్సవం మొలకెత్తింది .

 కలిసి ప్రేమలు పంచుకుంటే మహావృక్షమవుతుంది.*

---  వడ్డేపల్లి మల్లేశం 

నిరాశ  నిస్పృహలతో  వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉంటే  చేదు అనుభవాలతో పాటు  మానసిక ఆందోళనకు గురికాక తప్పదు  .ఆత్మస్థైర్యం  నశించి ఆత్మీయ న్యూ నతకు  గురికావడమే ఇందుకు ప్రధాన కారణం కానీ దానికి భిన్నంగా  సానుకూల వైఖరితో,  భవిష్యత్తు పట్ల ఆశావాదంతో,  ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో  ఆత్మగౌరవంతో ముందుకెళితే  అన్ని వేళల్లో విజయం చేకూరకపోవచ్చు కానీ ఆనందం మాత్రం లభిస్తుంది.  "ఆనందమే జీవిత మకరందం" అని  సినీ గేయ కవి చెప్పినట్లు  ఆనందంగా ఉంటే  శరీరంలోని  జీవ కణాలలో  ఎండార్పిన్ అనే హార్మోన్ విడుదల కావడం వలన  ఆరోగ్యాన్ని,  జీవశక్తిని,  రోగ నిరోధక శక్తిని,  ఉల్లాసాన్ని  కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు ఇది శాస్త్ర సమతమైన విషయం . యాంత్రిక జీవితంలో  నిరాశ నిస్పృహలు, సంఘర్షణ,  ఆందోళన భాగమైన ఈ కాలంలో  కృత్రిమ  సన్నివేశాల ద్వారానైనా  ఆనందాన్ని పొందవలసినటువంటి అనివార్య పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో  అంతర్జాతీయ స్థాయిలో  చర్చకు వచ్చిన  పర్యవసానమే నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా   మార్చి 20వ తేదీన ప్రపంచ ఆనంద దినోత్సవాన్ని జరుపుకోవడం.
    ఆనందాన్ని పంచుకోవడానికి  ఉన్న అవకాశాలను వెతకడంతోపాటు  సమన్వయం, సానుకూల దృక్పథం, ప్రేమానురాగాలతో  జీవితాన్ని  విజయవంతం చేసుకోవడానికి  గల అవకాశాలను అన్వేషించే క్రమంలో 
ఏర్పాటైనదే ఈ ప్రపంచ ఆనంద దినోత్సవం.  ఆనందం అంటే డబ్బు, రాజభవనాలు, సంపద, బంగారం, ఆభరణాల్లో ఉండదని  మానసిక ధైర్యం,  ఉల్లాసం, సానుకూల దృక్పథంలోనే ఉంటుందని  అందుకు అనువైన పరిస్థితులను కల్పించుకోవడం వల్లనే సాధ్యమవుతుందని  మేధావుల ఆలోచనలను  మరింత ముందుకు తీసుకువెళ్లడం ద్వారా జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి కనీసం ఏటా ఒకరోజు  ఉండాలని ఈ ప్రాధాన్యతను  కట్టబెట్టినట్టు తెలుస్తున్నది.  "అనారోగ్యవంతులైన  సంపన్నులు  రాజభవనాలలో ఉండి  జీవించిన వారీ కంటే  ఆరోగ్యవంతులై న  పూరి గుడిసెలో ఉన్న పేదవాల్లు ఎక్కువ సుఖపడుదురు " ఈ వాక్యం చిన్న నాడు  ప్రాథమిక తరగతులలో  సామాన్య శాస్త్ర పుస్తకములో చదివినట్లు గుర్తు  .ఇది ఊహ మాత్రo కాదు మన ఆచరణలో కూడా చూస్తున్నదే కదా !
     ఆనంద దినోత్సవ చరిత్రలోకి వెళితే :-
*********"
1972 సంవత్సరంలో మన పొరుగున ఉన్న భూటాన్ రాజు  జిగ్మే సింగే వాంగ్చుక్  దేశ అభివృద్ధిని   ప్రజల సంతోషాన్ని బట్టి కొ లవవచ్చునని  ఉత్పత్తి సంపద డబ్బు  తో కాదని నిర్ధారణకు వచ్చి  ఆ అనుభూతికి "గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్" గా నామకరణము చేసి  భూటాన్ ప్రజల యొక్క  ఆనందాన్ని కొలవడానికి కొన్ని సూచికలను  నిర్దేశించడం  ఈ దినోత్సవానికి ప్రాతిపదికగా భావించవచ్చు.  మానసిక ఆరోగ్యం,  శారీరక ఆరోగ్యం,  సమయపాలన,  పర్యావరణము, విద్య,  మానవ సంబంధాలు,  నివసించే  పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా   ప్రారంభించినారు.  అందుకు గాను 300 ప్రశ్నలను తయారు చేసి  ప్రజలను సర్వే చేయడం ద్వారా  వారి ఆనందాన్ని అంచనా వేసినట్లుగా తెలుస్తుంది. ఈ  విధానాన్ని  కెనడా అమెరికా వంటి  కొన్ని దేశాలలోని  రాష్ట్రాల్లో  అమలు చేసినట్లుగా గుర్తించవచ్చు.  నిర్ధారించుకున్న ప్రశ్నల ఆధారంగా  వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవడానికి  వీలున్న కారణంగా  ప్రజలు అందుకు అనుగుణంగా మారినట్లు తద్వారా మంచి ఫలితాలు వచ్చినట్లుగా మనం గుర్తించవచ్చు.  ఇక ప్రధానమైనటువంటి  నేపథ్యంలోకి వెళ్ళినట్లయితే  భారతదేశంలోని కలకత్తాలో జన్మించిన జేం  ఇలియాన్  అనే  అతడు చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోగా  ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా   పర్యటించిన  అన్నా బె ళ్లి ఎలియన్ అనే అమెరికా నర్స్  అనాధలకు సహాయం చేయడానికి ఇండియా వచ్చిన సందర్భంలో  జేమ్ ను  తనతో అమెరికాకు తీసుకువెళ్లి   పెద్ద చేసింది . తన  జీవిత  అనుభవాలను  దృష్టిలో ఉంచుకున్న ఆయన  తనలాంటి పేద అనాధ పిల్లలను  చూసి జాలి పడి ఆ బాలల కోసం  వారి హక్కుల పరిరక్షణ కోసం  మానవ హక్కుల  రంగాలలో పనిచేసి  అంతర్జాతీయ స్థాయికి ఎదగడం  గొప్ప పరిణామం . ఆయనే తర్వాత కాలంలో  ఐక్యరాజ్యసమితి సలహాదారుగా పనిచేసిన సందర్భంలో  2011లో  అంతర్జాతీయంగా  సంతోషాన్ని ప్ర పంచమంతా పంచడానికి  అంతర్జాతీయ దినం ఉండాలనే ఆలోచన 2011 సంవత్సరంలో  చేయడం జరిగింది . 2012లో నాటి  ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి భాను కి మూన్  ఆ ప్రతిపాదనను ఆమోదించి  ప్రపంచానికి తీపికబురు అందించడం 2013లో అంతర్జాతీయ స్థాయిలో  ఆనంద   జీవితం పైన సదస్సు జరగడం  వెను వెంటనే    మార్చి 20వ తేదీ నుండి  ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక   భావనతో కొనసాగడం  మనం చూడవచ్చు.
     
  ఆనందం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు:-
********
  మానసిక శారీర ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి  సజీవ సామాజిక మానవ సంబంధాలు  అంతిమంగా  ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి చాలా తోడ్పడుతాయి . అంతేకాదు ఇతరులకు  సేవలు అందించడం,  సామాజిక చింతనతో  ఉద్యమించడం,  నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడం  కూడా ఆనందాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంటుంది.  సంతోషంగా వున్నవారు ఎక్కువ కాలం జీవిస్తారని,  అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని,  అధిక రక్తపోటు గుండె సమస్యలు  తగ్గుముఖం పడతాయని , రోగ నిరోధక శక్తి పెరుగుతుందని  వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.  సంతోషం సగం బలం అన్నట్లుగా ఆనందాన్ని  రెట్టింపు చేసుకోవడం ద్వారా  బలమైన శారీరక మానసిక వ్యవస్థ ఏర్పడడంతో  ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుందనే  అంశంపై  అంతేకాదు  ఆనందం యొక్క స్థాయిని పెంచడానికి  తీసుకోవలసిన చర్యల పైన కూడా  పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.  ఆనందంగా ఉన్నప్పుడు  నాయకత్వ లక్షణాలు  వృద్ధి చెంది,  సమయస్ఫూర్తిగా వ్యవహరించి,  సంస్కారవo తమైన జీవితానికి  దారి చేస్తుంది  .బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి,  సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకోవడానికి,  మరింత ఉత్సాహంగా  ముందుకెళ్లే అవకాశం సంతోషం వళ్ళ సాధ్యం అవుతుంది.
       అయితే ఆనందంగా ఉండడానికి కేవలం  మన మనసు సిద్ధపడితే  సంబంధాలు పెంచుకుంటే ముచ్చటిస్తే  మనుషులు కలిసిపోతే  మాత్రమే సాధ్యం కాదు  అందుకు ఆరోగ్యం కూడా సహకరించాలి.  అనారోగ్యాన్ని దూరం చేసి ఆరోగ్యాన్ని  పెంపొందించుకోగలిగిన చిట్కాలను కొన్ని పాటించగలిగితే
సంతోషం మరింత సులభంగా  మన చెంత చేరుతుంది . పోషకాహారం తీసుకోవడం  తో పాటు  తేలికపాటి వ్యాయామాలను చేయడం ద్వారా కూడా  మెదడు కొన్ని సంతోషకరమైన రసాయనా లను విడుదల చేస్తుందని  నిపుణులు తెలియచేస్తున్నారు.  విశ్రాంతి తీసుకోవడంతో పాటు,  మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండి,  వ్యతిరేక ఆలోచనలను వదిలిపెట్టి , అసంతృప్తిని  ఆమడ దూరం తరిమి , సానుకూల దృక్పథంతో ఉన్నప్పుడు  ఆరోగ్యం  మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  దీర్ఘ శ్వాస కూడా  శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువును  ఎక్కువ మొత్తంలో అందించి  ఉల్లాసంగా ఉండడానికి కారణం అవుతుంది.  అదే సందర్భంలో  ఇతరులతో కలిసి పోవడం,  ఏకాభిప్రాయం ఉన్న వారిని కలుపుకోవడం,  కలిమిడిగా వ్యవహరించడం కూడా  మన ఆరోగ్య స్థాయిని  పెంచే అవకాశం ఉంటుంది.  "తను తెగకుండా కత్తి తెగదు" అనే సామెత ప్రకారంగా  మనము సానుకూలంగా ఆలోచించి  వినూత్న   ఊహలను నిజం చేసి  మనసును ఉల్లాసపరుచుకోవడానికి సిద్ధపడితే తప్ప  సంతోషం తనంతట తాను మన చెంతకు రాదు.  శ్రీశ్రీ గారు"  ఏది తనంత తానై నీ దరికి రాదు  శోధించి సాధించాలి"  అన్నట్లు  ప్రకృతిలో  అంతట దాగి ఉన్న ఆనందాన్ని  అదిమి పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కదా  !ఈ భావనను విస్తృత పరచడానికి  నూతన అన్వేషణలు పరికల్పనలకు  తోడ్పడే ఆనంద క్షణాలను నిరంతరం  అనుభవించడానికి సిద్ధపడాలి.  అది కేవలం నీ వరకే కాదు ఇతరులతో పంచుకున్నప్పుడు  దాని పరిమితి రెట్టింపు అవుతుంది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333