శ్రమ గుర్తించబడక వివక్షతకు గురైనప్పుడు ఉత్పత్తిలో భాగస్వాములై ఆచరణశీలురు కార్యసాధకులు అయిన సగటు జీవులే శతాధి క గ్రంథకర్త కంటె కూడా గొప్పవాళ్లు
సాహిత్యం సిద్ధాంతాన్నoదిస్తే శ్రమ దానిని నిజ జీవితంలో రుజువు చేస్తోంది కనుక.*
**************
--- వడ్డేపల్లి మల్లేశం 90 14206412 ----- 09-02...2025**********
సిద్ధాంతం ఆచరణలో ఏది గొప్పది అనుకున్నప్పుడు రెండు కూడా సమాజాన్ని బండి ఎడ్ల లాగా ముందుకు లాగుతాయి అనడంలో సందేహం లేదు. అయితే మనకు అనేక సందర్భాలలో దృష్టికి వస్తున్న అంశం ఏమిటంటే "మాటలు కాదు పని ఉండాలి, " "చెప్పడం కాదు చేసి చూపెట్టాలి," "మాటలు అనగానే సరిపోతుందా?", " నడుమువంచి పనిచేయడం ముఖ్యం కానీ మాటలు ఎన్ని అయినా చెప్పవచ్చు", "చేసేవాడు ఉన్నంతవరకు చెప్పేవాళ్లు చలా యి స్తూనే ఉంటారు" ,అనే మాటలు అనునిత్యం సమాజంలో చర్చకు వస్తున్న అంశాలు. మాటలకు పనికి పొంతన లేనప్పుడు, మాటలకు మాత్రమే పరిమితమైనప్పుడు, ఉత్పత్తి ఆగిపోయినప్పుడు ఈ వాదనకు ఎక్కువగా బలం చేకూరుతుంది. ఇప్పటికీ పొలాలలో, కార్ఖానాలలో అసంఘటిత రంగంలో, చిన్న చిన్న ఉత్పత్తి రంగాలలో, వ్యవసా చిరు, వీధి వ్యాపారాలలో, వృత్తి, నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న వాళ్లు అలసటకు అతీతంగా ఉత్పత్తి సేవను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని తమ లక్ష్యాన్ని విస్మరించకుండా అంకిత భావంతో పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎందరో. ప్రమాదకరమైన పనులలో, భూగర్భంలో, నీటితో,నిప్పుతో, ప్రకృతితో, వానతో, వరదలతో చలగాటమాడి న మాదిరిగా సాధన చేస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ వృత్తికి అంకితమై పనిచేస్తున్న వాళ్లను నిజంగా ఈ దేశ నిర్మాణంలో పాల్గొంటున్న కార్య సాధకులుగా, త్యాగశీలురుగా, శ్రమను గౌరవించిన శ్రామికులుగా సమాజం గుర్తించవలసిన అవసరం ఉంది. కానీ శ్రమను గౌరవించడం పక్కన పెట్టి తోటి మనిషిని సాటి మనిషిగా చూడని వాళ్లు, వృద్ధులను పేదలను అవమానిస్తున్న వాళ్లను మనం ఎంతోమందిని చూడవచ్చు. మాటలతోనే కాలం గడిపి, శ్రమకు అతీతంగా అక్రమ సంపాదనకు మాత్రమే అలవాటు పడిన వీళ్లకు శ్రమను గుర్తించే సంస్కారం ఎలా సాధ్యమవుతుంది.?
పనిచేయడమే నేరమైనట్లు తీయటి మాటలే కడుపు నింపినట్లు ఆకలితో అలమటించే వానికి పిడికెడు మెతుకులు అందకుండా చేస్తున్న అవినీతిపరులు, అక్రమార్కులు,నేరస్తులు, లంచగొండ్లు, భూ కబ్జాదారులు రాజ్యపాలన చేస్తుంటే అలాంటి అవినీతిపరుల చిట్టావి ప్పడానికి సాహసం చేయని సాహితీవేత్తలు ఎన్ని గ్రంథాలు రాస్తేనేమీ? ఎన్ని పురస్కారాలు పొందితేనేమి? గండ పెండేరాలు అనుభవిస్తే నేమి? "నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించి నిలదీసి తన నోటికాడి బుక్కను దోపిడీ చేసే వారిని ఎండగట్టే సామాన్యుల ముందు రాజకీయాన్ని ప్రస్తావించని సాహితీవేత్తలు వర్ణనకు ఆడంబర జీవితానికి మాత్రమే పరిమితమైన రచయితలు గొప్పవాళ్లేమి కాదు అని గుర్తించవలసిన అవసరం ఉంది". "శ్రమ ఒకరిది అయితే సిరి మరొకరిది, అన్నపురాసులు ఒకచోట ఉంటే ఆకలి మంటలు మరొకచోట ఉన్నప్పుడు అసమానతలు అంతరాలు వి వక్షత పేదరికం తమ కళ్ళ ముందు తాండ వి స్తుంటే కూడా పేదలు కార్మికులు శ్రమజీవులు కార్యసాధకుల గురించి పట్టించుకోకుండా ఆడంబర జీవితానికి అలవాటు పడిన వాళ్లు శతాధిక కాదు కదా సహస్ర అధిక గ్రంథ రచయితలైన నిరుపయోగమే."
నిజంగా సాహిత్యం అంటే సమాజానికి మేలు చేసేది దానికి ప్రతినిధి రచయిత ఆ సామాజిక బాధ్యతను మోస్తున్నారనే కదా ఈ సమాజం కవులు రచయితలకు గౌరవాన్ని స్థానాన్ని ఇచ్చేది.... అలాంటప్పుడు సరైన సమయంలో సరైన విషయాల పట్ల పీడి త వర్గాల పట్ల స్పందించకుండా తమ వరకు మాత్రమే పరిమితమై ఆడంబర జీవితానికి అలవాటు పడితే అలాంటి వారిని సమాజం రచయితలుగా అంగీకరించకూడదు. పాలకులను ప్రశ్నించిన మాదిరిగా రచయితలను కూడా సామాజిక బాధ్యత నిర్వహించడం లేదని ప్రజలు ప్రశ్నించినప్పుడు మాత్రమే సాహిత్యం యొక్క పాత్ర, ప్రాధాన్యత, ఆవశ్యకత కనుమరుగు కాకుండా కాపాడబడుతుంది. దారి తప్పుతున్న రచయితలకు కనువిప్పు కలిగిస్తుంది. "కార్యసాధకులుగా ఉన్నవాళ్లు ప్రజల కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసం, అసమానతలు అంతరాలు లేని వ్యవస్థ కోసం, అంతిమంగా తమ సమాజ స్థాపన కోసం లక్షలాది మంది పని చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర పడి కనుమరుగవుతుంటే కళ్ళుండి చూడలేక చెవులు ఉండి వినలేక నోరు ఉండి నిలదీయలేక చేతులు ఉండి ఆ అన్యాయాన్ని రాయలేక పోయినప్పుడు ఉత్పత్తిలో భాగస్వాములు నిజాయితీకి ప్రతినిధులుగా వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్న సామాన్యులు గొప్పవాళ్లు కాకమరేమవుతారు? అందుకే ప్రముఖ విప్లవ కవి కాళోజీ నారాయణరావు గారు "అన్యాయాన్ని ఎదిరించే వాళ్లే నాకు ఆరాధ్యులు" అని ప్రస్తావించిన తీరులో ఈ దేశ సామాన్య జనం పాత్ర గణనీయం అనక తప్పదు .డబ్బు, భాష, ఉన్నత విద్యార్హతలు, మేధస్సు మాత్రమే ముఖ్యం కాదు కార్యసాధకులు అయిన సామాన్యులే కీలకం అని, ఒక దశలో సిద్ధాంతాన్ని మించినదే ఆచరణని, ఆచరణకు నోచుకోని సిద్ధాంతం నిష్ప్రయోజనం అన్నా అతిశయోక్తి లేదని గుర్తించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. శ్రమను గౌరవిద్దాం!శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధిద్దాం! సమాజ మార్పుకు దోహదపడే సాహిత్యాన్ని ఆహ్వానిద్దాం.!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)