యువతలో ఒత్తిడికి వ్యాయామమే మందు
రోజువారి జీవితంలో నడక తేలికపాటి ఎక్సర్సైజులతో ఆత్మ న్యూనత నుండి బయటపడవచ్చoటున్న నిపుణులు.*
*************
--- వడ్డేపల్లి మల్లేశం 9014206412
----14....07....2025*******
ముఖ్యంగా ఇటీవల కాలంలో యువత విద్యార్థులు మద్యం మత్తు పదార్థాలు డ్రగ్స్ ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతుండడంతో లక్షలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఒత్తిడికి గురి కావడం, త ప్పుడు పనులకు పాల్పడడం, ఉపాధి అవకాశాలు కొరవడడం తో పాటు ఆన్లైన్ బెట్టింగులు ఇతరత్రా అనేక రకాల మోసాలకు గురవుతున్న విషయం కూడా మనకు స్పష్టంగా తెలుసు. ఇటీవల కాలంలో పత్రికల్లో టీవీ కథనాలలో ఎంతోమంది ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా లక్షలాది రూపాలను కోల్పోయి మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా కోకొల్లలు. చట్టపరమైనటువంటి అనేక నిభందనలు ఉన్నప్పటికీ
బాధ్యతారాహిత్యం, ఉపాధి లేకపోవడం, తల్లిదండ్రుల యొక్క గారాబం, సమ వయస్కుల యొక్క ప్రభావం కారణాలు ఏమైనప్పటికీ కూడా తప్పుడు పనులకు పాల్పడడం అనేది జరుగుతున్నటువంటి వాస్తవం .ఈ విషయంలో కూ రుకుపోయిన వాళ్ళు తప్పులను సవరించుకునే వరకే జీవితం సగభాగం గడిచిపోతున్నటువంటి సందర్భం అత్యంత బాధాకరం. విద్యా వ్యవస్థ లోపల కూడా వ్యవస్థాపరంగా ఉన్నటువంటి లోపాలు సిలబస్ యాంత్రికంగా ఉండడం, సంస్కృతి నాగరికత, ఆరోగ్యం
నైతిక విలువలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు లేకపోవడంతో ఉన్నత విద్యా స్థాయి పూర్తిగా ఆటవిడుపుగా సాంకేతిక పరంగా మాత్రమే మిగిలిపోవడంతో వాళ్లలో మానవీయ విలువలు కొర వ డుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. "సమాజం యొక్క పోకడలను అవగాహన చేసుకోకపోవడం, వ్యక్తిగత స్వార్థానికి ఆలోచనకు పరిమితం కావడం, అవకాశముంటే అత్యాశతో సంపాదనకు ఎగబడడం, క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మద్యం వంటి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి వ్యసనాలకు బానిసలు కావడం వలన కూడా సృజనాత్మకత వైపు కాకుండా అభద్రత వైపు నెట్టివేయబడుతున్నారు." దాని కారణంగా ఒత్తిడికి గురికావడం మార్గాంతరం లేని పరిస్థితిలో ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం కష్టాన్ని దుఃఖాన్ని మరిచిపోవడానికి మత్తు పదార్థాలకు అలవాటు పడడం ఇతర వ్యసనాల బారిన పడిపోవడంతో తాత్కాలిక ఉపశమనం కలుగుతున్నదే కానీ విలువైన జీవితం చిన్న వయసులోనే బుగ్గిపాలు కావడాన్ని మనం గమనిస్తే ఎంతోమంది తల్లిదండ్రుల కడుపుకోతకు కారణాలను అన్వేషించాల్సినటువంటి బాధ్యత సమాజం మేధావులు తల్లిదండ్రులు పాలకుల పైన ఉన్నది అని ముగింపుకు రావలసిన అవసరం ఉన్నది. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మొత్తంలో యువత ఉన్న సందర్భం ఒకవైపు గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ యువత ఉత్పత్తిలో, సమాజ సంక్షేమంలో, అభివృద్ధిలో కానీ ప్రజాస్వామిక పరిరక్షణలో కూడా భాగస్వాములు కాలేకపోవడాన్ని గమనించినప్పుడు ఈ దేశం ఎంత నష్టపోతున్నదో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ప్రభుత్వమే కల్పిస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు అభద్రత నిరుద్యోగము పాలనాపరమైన లోపాల కారణంగా యువతకు నష్టం జరుగుతున్న విషయాన్ని ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
మరొకవైపు తల్లిదండ్రులు సమాజము కూడా ఆత్మ న్యూనతకు గురై మద్యం డ్రగ్స్ కు అలవాటు పడి వాస్తవ జీవితానికి దూరమవుతున్నటువంటి వారిని గురించి సీరియస్ గా పట్టించుకోవడం తప్పనిసరి. దీనికి సంబంధించినటువంటి ఇటీవలి పరిశోధనలను బాధ్యతగా స్వీకరించి అమలు చేయవలసిన కర్తవ్యం మనందరిపై ఉన్నది.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల కృషి
************-*--
ఒత్తిడికి గురి కావడం, ఆత్మన్యూనతకు బలైపోవడం అనే విషయం కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది ప్రపంచ స్థాయి అంశం కనుక దీనిపైన సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన ఫలితాలను మనదేశంలో యువతకు అన్వయిoచు కోవడం ద్వారా వారిని కాపాడుకోవాల్సిన భాద్యత పాలకులతో పాటు సమాజానిది కూడా. అయితే ఇటీవల కాలంలో వీళ్లకు ఉన్నటువంటి డిప్రెషన్ లేదా వ్యాధి తీవ్రతను బట్టి మానసిక వైద్యులు బిహేవియర్ థెరపీ తో పాటు మందులు కూడా ఇస్తున్నప్పటికీ చాలామందిలో ఈ చికిత్స ద్వారా ఫలితాలు కనపడకపోవడం ఒక అంశం కాగా ఆర్థిక స్తోమత లేని కారణంగా కూడా మరికొందరు ఈ చికిత్సను పొందలేక పోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా కనీసం 40 శాతం యువతలో కూడా ఈ చికిత్స ద్వారా ఫలితం కనపడడం లేదని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వారి పరిశీలన ప్రకారంగా సుమారు 32 వేల మంది యువత పైన జరిపిన అధ్యయనం ప్రకారం గా ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామమే దివ్యమైన ఔషధం అని మందుల కంటే చివరికి ఎక్సర్సైజుల ద్వారానే పూర్తిగా స్వస్థత చేకూరుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేసినట్లుగా తెలుస్తున్నది. తొందరగా ఆవేశానికి రావడం, ఆత్మనూనెతకు గురికావడం, తనను తాను బలహీనునిగా పరిగణించడం, జీవితం పైన విరక్తిని వ్యక్తం చేయడం, బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడం వంటి లక్షణాలతో కు o గుబాటుకు గురవుతున్నటువంటి సమస్య ఉన్న వారిలో ముఖ్యంగా శ్రమతో కూడినటువంటి ఏరోబిక్ , బరువులు ఎత్తే వ్యాయామాలు అద్భుతంగా వారిని తీర్చిదిద్దగలవ ని వాళ్ల పరిశీలన ద్వారా తెలిసింది. నడక, జాగింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు కూడా ఎంతో ఉపయోగపడతాయని ఆ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే రోజువారి జీవితంలో వ్యాయామానికి సంబంధించిన విభిన్న అంశాలను భాగం చేసుకోవడం ద్వారా కొంత సమయాన్ని కేటాయించినట్లయితే మానసిక ప్రశాంతత, మానసిక కేంద్రీకరణ ద్వారా కొద్ది నెలలలోనే చక్కటి ఫలితాలు ఉంటాయని ఆ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నది. అంతెందుకు ఇప్పటికీ ప్రతి అనారోగ్యానికి కూడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వ్యాయామాలు ఏ రకంగా ఉపశమనం కలిగిస్తున్నాయో మనం అర్థం చేసుకున్నట్లయితే వ్యాయామాల యొక్క పాత్ర యువతను ముఖ్యంగా కాపాడుకోవడానికి ఎంతో తోడ్పడుతుందని అంగీకరించడం అత్యాశ ఏమీ కాదు. పైగా శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారంగా రుజువైనటువంటి అంశం కనుక సానుకూల దృక్పథంతో కుటుంబ సభ్యులు సమాజం సహకారంతో ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారికి ప్రత్యేకమైనటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా తిరిగి మామూలు మనుషులుగా జనంలో కలిసిపోవడానికి అనువైన ఆలోచనలను కలిగించడం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం వల్ల కూడా ఈ రుగ్మత నుండి బయట పడడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా పాలకులు కూడా దృష్టి సారించడం అది వారి సామాజిక బాధ్యత.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఆరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)