ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఏకగ్రీవాలు

Nov 28, 2025 - 18:47
 0  17
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఏకగ్రీవాలు

 ఏకగ్రీవాలపై సమగ్ర విచారణ జరిపించండి.CPM 

 జోగులాంబ గద్వాల 28 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలలో జరుగుతున్న ఏకగ్రీవాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 


   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏకగ్రీవాలు జరుగుతున్న  గ్రామ పంచాయతీలలో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఏకగ్రీవ ఎన్నికల వల్ల కులం,డబ్బు ప్రాతిపదికన కేవలం పెత్తందారులకు,ధనవంతులకు మాత్రమే  రాజకీయ అవకాశం ఉంటుందని అన్నారు.లక్షలు,కోట్లు ఖర్చు పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్న అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి ఏం కృషి చేస్తారని ప్రశ్నించారు. ఏకగ్రీవ ఎన్నికల ద్వారా ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటు వేసే హక్కును,ఎన్నికలలో పోటీ చేసే హక్కు, నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక స్వపరిపాలన ప్రధాన ఉద్దేశం ప్రజలు చైతన్యవంతమై రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడమే అని అన్నారు.ఏకగ్రీవాల పేరుతో ప్రజలకు ప్రజాస్వామ్యానికి దూరం చేసి , ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కోట్లు ఖర్చుపెట్టిన అభ్యర్థులు స్థానిక సమస్యలపై కృషి చేయకపోగా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని అన్నారు.ఏకగ్రీవ గ్రామాలలో వేలంపాట ద్వారా లక్షలు,కోట్లు ఖర్చు చేస్తారు కాబట్టి నిరంకుశం, నియంతృత్వం పెరిగి బాధ్యతాయుత పాలన కరువుతుందని అన్నారు.ఏకగ్రీవాలు జరుగుతున్న గ్రామాలలో ప్రజలందరూ పాల్గొనడం లేదని, కేవలం కొంతమంది పెత్తందారులు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.ఎవరైనా పోటీకి సిద్ధపడితే గ్రామం మొత్తం వెలివేసే పరిస్థితులను సృష్టిస్తున్నారని విమర్శించారు.గతంలో కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన గ్రామాలకు ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం పదవుల పందేరం కాకూడదని, కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పోటీలో ఉండాలని,ఏకగ్రీవాల పేరుతో పోటీ చేసే హక్కును కోల్పోరాదని సూచించారు.జిల్లాలో ఏకగ్రీవాలు చేసుకున్న అభ్యర్థులపై IT,ED వంటి చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థల చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఏకగ్రీవాలు చేసుకున్న అభ్యర్థులు చెల్లించే డబ్బు ఎక్కడ నుండి సరఫరా అవుతుందో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు జి. రాజు,వివి నరసింహ ఉప్పేర్ నరసింహ, సవారన్న పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333