సహస్ర హత్య కేసు.. భవనంలోనే హంతకులు.. వీడని మిస్టరీ

కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో వీడని ఉత్కంఠ
నివాసముంటున్న భవనంలోని వారి పనేనని పోలీసుల అనుమానం
నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ
శరీరంపై 20 కత్తిగాట్లు.. పక్కా ప్రణాళికతోనే హత్యగా నిర్ధారణ
ఆర్థిక,వ్యక్తిగత కక్షల కోణంలో ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు
సొంతూరులో చిన్నారి అంత్యక్రియలు పూర్తి
నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కూకట్‌పల్లి బాలిక సహస్ర (10) హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ దారుణానికి పాల్పడింది బయటి వ్యక్తులు కాదని, చిన్నారి నివాసముంటున్న జీప్లస్2 భవనంలోని వ్యక్తులేనని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. భవనం ప్రధాన ద్వారం నుంచి కొత్త వ్యక్తులు ఎవరూ లోపలికి రాలేదని తేలడంతో, దర్యాప్తు మొత్తం భవనంలోని నివాసితులపైనే కేంద్రీకృతమైంది.
సోమవారం ఉదయం ఈ దారుణం జరగ్గా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, విచారణలో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో మంగళవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుకను కూడా పిలిపించి వివరాలు సేకరించారు. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం సహస్ర శరీరంపై దాదాపు 20 కత్తి గాయాలున్నాయి. ఒక్క మెడపైనే 10 వరకు పోట్లు ఉండటం హత్య తీవ్రతకు అద్దం పడుతోంది. సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య ఈ ఘాతుకం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ సమయంలో చిన్నారి కేకలు విన్నామని పక్క భవనంలోని వారు చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇది ఆవేశంలో జరిగింది కాదని, బలమైన కక్షతో పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఈ కేసులో భాగంగా భవనంలో నివసించే ఓ యువకుడు చేతబడి నెపంతో హత్య చేశాడనే ప్రచారం జరిగినా, పోలీసులు దానిని ధ్రువీకరించలేదు. సాంకేతిక ఆధారాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో సరిపోల్చడం, సెల్ ఫోన్ డేటాను విశ్లేషించడం వంటి పనులను ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, సహస్ర మృతదేహానికి సోమవారం రాత్రి ఆమె స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా మక్తాక్యాసారంలో అంత్యక్రియలు నిర్వహించారు.