నేటి చదువుకు సార్థకత ఎందుకు లభించడం లేదు?

Oct 12, 2025 - 00:50
 0  0

విద్యా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవడం లేదా ?విద్య సరైన దారిలో ప్రజలకు అందకపోవడానికి ప్రభుత్వానికి బాధ్యత కాదా? విద్యా లక్ష్యాలను పునర్ నిర్వచించుకుంటే మంచిది. *

**************************************

----వడ్డేపల్లి మల్లేశం 9014206412 

----22....09....2025********************

చదువు, విద్య అంటే కేవలం అక్షర జ్ఞానానికి మాత్రమే పరిమితమని వ్యవహారిక పదాలతో పాటు కొన్ని కఠిన గ్రాంధిక భాషా పదాలను నేర్చుకుంటే విద్యావంతులే అన్నట్లుగా ప్రచారాన్ని ముమ్మరం చేసిన కారణంగా కేవలం అక్షర జ్ఞానం ఉంటే విద్యావంతులే అనే భావన బలపడిపోయింది కానీ అది సత్య దూరం. అక్షరాలను నేర్చుకోవడం తిరిగి రాయడం అప్పగించడం అక్షరాల కూర్పుతో ఏర్పడే పదాలను రాసి సరిపోల్చుకోవడమే విద్యావంతుల లక్షణం అనుకుంటే సరిపోదు. చదువుకు

సార్థకత ఉండాలి అనే మాట తరచుగా వింటూ ఉంటాము. దానికి మరింత విస్తృతార్థంలో విద్య అని నిత్యజీవితంలో వాడుతూ ఉన్నాం. అక్షర జ్ఞానంతో పాటు పదాల పొందిక, వాక్య నిర్మాణము, భాషా ప్రయోగాలు, భావము, అర్థము, సందర్భ వినియోగాన్ని చదువుగా భావించవచ్చు. దానికి మరింత విస్తృతార్థం అంటే లక్ష్యము, ఆదర్శము, పూర్వ నేపథ్యము, తెలియని విషయాలను తెలుసుకోవడం, వాటిని నిలువ చేసుకోవడం, సమయానుకూలంగా వినియోగించడం, సమయస్ఫూర్తి వీటి సమాహారం విద్య అని చెప్పుకోవడం సబబుగా ఉంటుంది. అందుకే చాలామంది విద్యార్థులు మేధావులు చదువును అక్షరాజ్ఞానానికి మాత్రమే పరిమితం చేయడం సమంజసం కాదని చదువు అంటే అర్థవంతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విభిన్న ఆలోచనలు కోణాలని నొక్కి వక్కాణించిన సందర్భాలు కూడా అనేకం. అంటే చదువు విద్య అన్నప్పుడు పర్యాయపదాలు గా అర్థం చేసుకోవాలి కానీ భిన్నమైనటువంటి ఆలోచనలుగా భావించకూడదు.

   "అసలు విద్య అంటే తెలుసుకోవడం అని అర్థం. తెలుసుకున్నటువంటి అంశం లిఖితపూర్వకంగా ఉన్నప్పుడు, హేతుబద్ధంగా ఆలోచించినప్పుడు, కార్యకారణ సంబంధాలను కూడా దానికి జత చేసినప్పుడు, లోతైన ఆలోచన చేసినప్పుడు, విశ్లేషణతో కూడుకున్నటువంటి అవగాహనను పెంపొందించుకుంటే ఆ క్రమములో సాధించిన పరిజ్ఞానమంత విద్య అవుతుంది" .అయితే ఈ విశాలమైన అవగాహనకు సంబంధించిన విద్యకు మూలాధారం అక్షరాలు. అక్షరాలతో ఏర్పడినటువంటి పదాలు, పదాల పొందికతో ఏర్పడినటువంటి ధ్వని, తద్వారా విషయ అవగాహనకు, విషయ సేకరణకు, పరస్పర అభిప్రాయాల మార్పిడికి దోహదపడినప్పుడు అదే చదువు.. ఆ తర్వాత భాష అంతిమంగా విద్య అవుతుంది. విద్యావంతులు అనగానే ఒక రంగంలో నిష్ణాతులు అని మనం సాధారణంగా చెప్పుకుంటాం .అయితే ఏ రకమైన నైపుణ్యం సంపాదించాలన్న దానికి అక్షరాల పొందిక, భాష ,తద్వారా భావవ్యక్తీకరణ చేసే పదాల ఉచ్చరణ అంతా కూడా చదువు అని అనబడుతుంది. చదవడం ద్వారానే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి, తిరిగి బావ వ్యక్తీకరణకు, సందేహాలకు సమాధానం ఇవ్వడానికి, మరింత లోతైన సమాచారం కోసం అధ్యయనం చేయడానికి కూడా తోడ్పడేది చదు వే కదా!

  చదువుకు సార్థకత ఎప్పుడు ?

**************************

"స్వతంత్ర జీవితం గడిపినప్పుడు, స్వయంకృషితో కష్టపడి పని చేయడానికి ఇష్టపడినప్పుడు, నైతిక విలువలకు కట్టుబడి జీవించినప్పుడు, మానవ ప్రకృతి అనేక రకాల వనరులను సద్వినియోగం చేసుకున్నప్పుడు, ఇ న్ని రకాలుగా మనిషిని తీర్చిదిద్దునటువంటిదే నిజమైన చదువు అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. కానీ మొక్కుబడిగా అక్షరాల యొక్క పొందిక మాత్రమే చదువు కాదని" సామాజిక ఉద్యమకారులు, విద్యావేత్త బాపూరావు పాటిల్ స్పష్టంగా ప్రకటించడాన్ని మనం మరింత లోతుగా చర్చించవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది .అక్షర జ్ఞానం నేర్చిన ప్రతివాళ్ళు వ్యవస్థను, వివిధ అంశాలను, ప్రకృతిలోని రహస్యాలను నిప్పి చెప్పలేరు. అంటే చదువు అక్షరజ్ఞానా నికే పరిమితం కాదు అని అర్థం. నిరక్షరాశులు కూడా సామాజిక చింతన సమాజ పరిశీలన ద్వారా మానవీయ కోణంలో ఆలోచించడం, మానవ విలువల పైన దృష్టి సారించడం, నైతిక విలువలకు కట్టుబడి ఉండడాన్ని మనం గమనించినప్పుడు అక్షర జ్ఞానము లేని వాళ్ళు కూడా ఈ రకంగా నిజాయితీపరులుగా బ్రతకగలుగుతున్నారు కనుక చదువు అంటే అక్షరజ్ఞానం మాత్రమే కాదు అని మనకు రూఢీ అవుతున్నది. అయితే అక్షరాజ్ఞానం, చదువు విశ్లేషణకు విద్యారంగ పరిపుష్టికి మనిషిని సర్వోన్నతుని చేయడానికి ఎంతో తోడ్పడుతుంది అనడంలో సందేహం లేదు.

         .. అక్షరాల పరిజ్ఞానముతో చదివినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుని సమాజంలో పరిశీలించిన అంశాలను క్రోడీకరించుకొని ఒక నిర్ణీత అభిప్రాయానికి రావలసినటువంటి అవసరం కూడా ఉంటది. అంటే చదువు అనేది స్వతంత్ర జీవనం గడపడానికి అవసరమైనటువంటి శిక్షణ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఉత్పత్తి యొక్క ప్రాధాన్యతను గనుక గుర్తించినప్పుడు కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే సంపద సృష్టించబడుతుందని ఆ సంపదను ప్రజలందరికీ పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయని అప్పుడప్పుడు ప్రజల సంపదను ప్రభుత్వాలు పెట్టుబడిదారులు దోచుకుంటారని తెలుసుకునే క్రమము లోపల మనిషి యొక్క చదువుతోపాటు వ్యవహారిక జ్ఞానం కూడా ప్రజలను చైతన్యం చేయడానికి తోడ్పడుతుంది. వాస్తవంగా పాఠశాల ద్వారా అనేక రకాల నైపుణ్యాలు, మె లకువలు, ఆలోచనలు, బావ ప్రకటన స్వేచ్ఛ, సామాజిక సర్దుబాటు, ప్రకృతిలోని రహస్యాలు మానవీయ కోణంలో జీవించే ఆలోచనల సరళిని నేర్పే క్రమంలో నైతిక విలువలను కూడా నేర్పించడం పాఠశాల ద్వారా కొనసాగుతున్నటువంటి ఉత్తమమైన ప్రక్రియ. నైతిక విద్య అని పూర్వకాలంలో ప్రత్యేకంగా సిలబస్ ఉండేదని ఆనాటి విద్యావంతులు చెబుతుంటారు. విద్యారంగంలో అనేక విషయాలు దృష్టికి రావడం వలన నైతిక విద్య కొంత కనుమరుగై ఆధునిక టెక్నాలజీ వైపు దృష్టి సారించడం వలన కూడా ముఖ్యంగా ఉన్నత తరగతులలో నైతిక విలువలు కుంటుపడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు ప్రేమానురాగాలకు సంబంధించిన అంశాల పైన చర్చ లేదు, సంప్రదింపులు లేవు, కుటుంబంలో కూడా అలాంటి అవకాశాలు లేకపోవడంతో పాటు సామాజిక మాధ్యమాలు టీవీ సినిమా ప్రసారాలలో కూడా మానవ సంబంధాల ఊఁ సే లేని కారణంగా సమాజము రోజు రోజుకు విచ్ఛిన్నం అవుతుంది. తద్వారా సమాజంలో నైతిక విలువలు దిగజారుతున్నాయి ఆ దిగజారుతున్నటువంటి నైతిక విలువలను పునరుద్ధరించడానికి చదువు తోడ్పడాలి. అందుకు సంబంధించి పాఠ్యాంశాలలో విభిన్న అంశాలు చోటు చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా చదువు అనే ఆయుధం మనకు జ్ఞప్తికి చేస్తున్నది.

   విద్యారంగం పైన లోతైన చర్చ ప్రభుత్వ బాధ్యత  

***************************************

విద్యా వ్యవస్థ పైన లోతైన చర్చ జరిపించడం ద్వారా దేశాభివృద్ధిలో చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తింప చేయడం ప్రభుత్వము యొక్క బాధ్యత అని మేధావులు బుద్ధి జీవులు గతంలో నిర్ణయించిన అనేక కమిటీలు కూడా సిఫారసు చేసినప్పటికీ పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. అదే విషయాన్ని ప్రస్తుతం సామాజిక ఉద్యమకారులు ప్రముఖ విద్యావేత్త బాపూరావు పాటిల్ గారు విద్య యొక్క బాధ్యతలను గుర్తిస్తూ దేశంలోనే ప్రకృతి మానవ ఇతర వనరుల యొక్క సద్వినియోగాన్ని చేసుకోవడానికి ఉపయోగపడే చదువు కీలకంగా పనిచేస్తుందని, ప్రజలు స్వతంత్ర జీవితం గడపడానికి నైతిక విలువలను పెంపొందించడం ద్వారా మానవీయ సమాజాన్ని ఆవిష్కరించడానికి చదువు స్ఫూర్తిదాయకం కావాలని చేస్తున్న సూచన పాలకులకు విద్యావేత్తలకు కూడా ఒక బాధ్యతగా పనిచేస్తుంది..వాస్తవంగా విద్యా లక్ష్యాలు అయినటువంటి పైన తెలిపిన అంశాలు నేడు గాలికి వదిలి వేయబడినవి. వనరుల సద్వినియోగం ఏనాడో మరిచిన పాలకులు నైతిక విలువలకు భిన్నమైనటువంటి పాఠ్యాంశాలతో పాటు టీవీ సినిమా ప్రసారాలను సెల్ఫోన్ వ్యవస్థ ద్వారా మనిషి ఆలోచనను మరింత క్రుంగధీస్తూ ఉంటే కష్టపడి పనిచేసే స్వభావానికి దూరంగా మనిషి నెట్టివేయబడుతున్నాడు. మనిషి శ్రమ చేయకుండా దోపిడీ పద్ధతిలో ఆదాయాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే సిద్ధమైన తరుణంలో మోసాలు ద్వేషాలు దోపిడీలు హత్యలు రోజురోజుకు పెరిగిపోవడాన్ని మనం గమనించవచ్చు.వీటన్నింటికీ మూలం మానవీయ కోణాన్ని మరిచిన ప్రస్తుత విద్యా విధానంలోనే దాగి ఉన్నదని గుర్తించడం చాలా అవసరం. "శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని" శ్రీశ్రీ అంటే శ్రమ చేయడానికి బదులుగా ఉపాయాలతో బతకాలని ఇతరులను మోసగించాలని నేటి సామాజిక పరిస్థితులు ఒకవైపు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కష్టపడి పని చేసే స్వభావం ఏ రకంగా డెవలప్ అవుతుంది? అలాంటప్పుడు నైతిక విలువలు పునరుద్ధరించబడే ఆస్కారమే లేదు కదా! ఇక వనరులను సద్వినియోగం చేసుకోవడం కాదు గదా! ప్రకృతి వనరులను కొంతమంది తమ స్వార్ధ ప్రయోజనానికి కొల్లగొట్టడం రివాజుగా మారిన దౌర్భాగ్య పరిస్థితుల మధ్యన చదువు తెల్లబోయింది. విద్యావ్యవస్థ తన లక్ష్యాన్ని సా కారం చేయలేక దుఃఖిస్తున్నది. ఇది నేడు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక ముఖచిత్రంగా భావించినప్పుడు మౌలికమైనటువంటి విద్య అందుకు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు సమగ్రంగా ఉన్నప్పటికీ వాటి అమలులో ఏర్పడినటువంటి అవాంతరాలు అంతరాయం పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్య పైన కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ దారి తెన్ను లేని పద్ధతిలో విద్య కొనసాగుతుండడం వలన ఆశించిన ఫలితాలు చేకూరడం లేదు, నైతిక సమాజం ఆవిర్భవించడం లేదు, ఉత్పత్తి లో ప్రజలందరికీ వాటా లభించడం లేదు,. అంతరాలు అసమానతలు మరింత పెరుగుతూ ఉంటే సమానత్వం మేడిపండు చందముగా మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో సమర్థవంతమైన పాలకులు,సంపూర్ణ అవగాహన కలిగినటువంటి మేధావులు బుద్ధి జీవులు, ప్రశ్నించే ప్రజలు, పోరాట శక్తి గల ప్రజాస్వామ్యవాదుల సమీష్టి కృషి వల్ల మాత్రమే చదువుకు సార్థకత లభిస్తుంది. వనరుల సద్వినియోగం సాధ్యమై దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333