గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్–ఎస్పీ సమన్వయం
జోగులాంబ గద్వాల 22 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ డిసెంబర్ 23 పర్యటన నేపథ్యంలో, జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రోటోకాల్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., మాట్లాడుతూ గవర్నర్ పర్యటన సజావుగా, ప్రశాంతంగా జరిగేలా ఆలయ పరిసరాలు, కలెక్టరేట్, ప్రయాణ మార్గాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలు పోలీస్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. కలెక్టర్–పోలీస్ శాఖల సమన్వయంతో గవర్నర్ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు.