అన్నీ తెలుసు అనుకుంటే అగాధములో పడ్డట్టే

Sep 7, 2025 - 20:56
 0  4

వివిధ రంగాల నిపుణులతో చర్చిస్తే గౌరవం దక్కి పాలన సమర్థవంతంగా ఉంటుంది. ప్రజలు మెచ్చే పాలన బదులు ప్రజలపై స్వారీ చేస్తే పతనమైనట్లే.

*************************************

---- వడ్డేపల్లి మల్లేశం 90142206412

----23....02....2025****************** అబద్ధపు ప్రచారాలతో ప్రజలను నమ్మించిన వాళ్లు, నిరంకుశ అధికారాలతో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజలపై స్వారీ చేసినవాళ్లు, నిపుణులను సంప్రదించకుండా ఆధిపత్యంతో అంతా తెలుసని పాలన సాగించిన వాళ్లు, ప్రజల ఆశలు ఆకాంక్షలకు భిన్నంగా ఒంటెద్దు పోకడతో వ్యవహరించిన వాళ్లు రాజరికంలోనూ ప్రజా పాలనలోనూ పతనమైన వాళ్లే ఎక్కువ. ఆడంబరాలకు,అహంభావానికి,ఆధిపత్యానికి, అరాచక వాదానికి ఇచ్చిన విలువ స్థానం ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు ప్రజాస్వామ్య ఆలోచన ధోరణికి మానవీయ విలువలకు ఇవ్వని కారణంగా పాలకులు చరిత్రలో మట్టి కరిచి న సందర్భాలు కోకొల్లలు. .చరిత్ర తెలిసి కూడా కనీసమైన జాగ్రత్త పాటించకుండా నిబద్ధత ప్రజాస్వామ్యమును మరిచి రాచరిక పోకడతో, ప్రజా పాలనకు బదులుగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వంత పాడుతూ, కన్న బిడ్డల వలే పాలించవలసిన ప్రజలను మరిచి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పాలన కొనసాగిస్తున్న పాలకవర్గాలే ఎక్కువ. జన రంజకంగా కొనసాగవలసిన పాలన కొన్ని వర్గాలకు మాత్రమే ధారాధత్వం చేయడం వలన విసిగి పోయిన జనం తమ అసహనాన్ని ప్రదర్శించడమే కాదు అలాంటి పాలకుల పైన తిరుగుబాటు బావుటాలు ఎగురవేసిన సందర్భాలు చరిత్రలో అనేకం. అప్పటికి ప్రభుత్వాలకు సోయి రాకుంటే మార్పు అనివార్యమైన పరిస్థితిలో బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులు ప్రజల పక్షాన పోరాడుతుంటే ఆ మార్పు కోరే ప్రతినిధులను అణిచివేయడమే తప్ప వాళ్ల వాదనలోని వాస్తవాన్ని పాలకులు గుర్తించడం లేదు. కనుకనే పాలకులు ఒంటరివాల్లు గా మిగిలిపోతున్నారు ప్రజల అభిమానాన్ని చూర గొనలేకపోవడం పెద్ద లోపం.

         సుపరిపాలన అందించాలంటే పాలకులు రాజీ పడాలి --నిపుణులతో చర్చించాలి:*

********************************

  విదేశీ వ్యవహారాల లోపల అనేక సంబంధాల గురించి చర్చలు జరపాల్సిన సందర్భంలో కేవలం ప్రధానమంత్రి మంతృ ల స్థాయిలోనే పర్యటనలు కొనసాగిస్తే ప్రయోజనం ఉండదు. విదేశీ వ్యవహారాల నిపుణులను కూడా సంప్రదించడం వలన మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది శాస్త్ర సాంకేతిక రంగాలలో ఒప్పందాలను చేసుకోవడం ఇతర రంగాలలో ప్రపంచంలోని కొన్ని దేశాలు సాధించిన ప్రగతిని భారతదేశానికి వర్తింప చేయాలనుకున్నప్పుడు ఇక్కడి శాస్త్రవేత్తల బృందాన్ని కూడా పంపడం పరిశీలింప చేయడం చాలా అవసరం. కానీ రాజకీయ నాయకత్వం ఎప్పుడు నిపుణులు మేధావులను పక్కనపెట్టి మాట వరసకు మాత్రమే మాట్లాడి తమ ఆధిపత్యాన్ని తెరమీద చూపడానికి ప్రయత్నించుకోవడం వల్ల ఆ పార్టీకి ప్రభుత్వానికి తాత్కాలిక ప్రయోజనం జరగవచ్చు కానీ ప్రజల దృష్టిలో ఓటమి తప్పడం లేదు. తెలంగాణ సాధన జరిగిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన విషయంలో పూర్తి బాధ్యతలను అధికారాన్ని నిర్వహణను తానే చేపట్టినట్లు నిపుణులతో సంప్రదించకుండా తన ఇష్టం వచ్చినట్లు నిర్మించినట్లు ఇటీవలి గోష్ కమిటీ వెల్లడించడం అనేక ఆరోపణలు రావడం గమనిస్తే సాంకేతికపరమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి తన మాటే చెల్లుబాటు కావాలని కోరడం తగునా? ఇది జ్ఞానాన్ని అర్హతను సాంకేతిక నైపుణ్యాన్ని ధిక్కరించడమే కాదా? కావాలని కొనితెచ్చుకోవడమే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామిక హక్కుల గురించి పౌర సంఘాలు మేధావులతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ గత పాలన కంటే పెద్దగా భిన్నంగా లేకపోవడం ఇప్పటికీ అనేక రకాల ఆంక్షలు కొనసాగడం మేధావులు బుద్ధి జీవులు చేసిన సూచనలను కనీసం కూడా పాటించకపోవడం ఆర్థిక లోటు అప్పుల భారం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వెనుక పాటు తనానికి ఆర్థికవేత్తలతో కనీసమైన సంప్రదింపులు కూడా చేయకపోవడం అంటే తమ అధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఆర్థిక నిపుణులను పక్కన పెట్టడం కొరివితో తలగో క్కు న్నట్లే ఉంటుంది. నిబద్దత ఏది?

************************* ఈ రకంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తో సహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ రాజకీయ యంత్రాంగము తెరమీద కనపడుతూ అధికారులు నిపుణులు తెరవెనుక కృషి చేస్తున్నప్పటికీ వాళ్లను గుర్తించకపోవడం సూచనలను పాటించకపోవడం భారతదేశంలో మొదటి నుండి వస్తున్నటువంటి ప్రవృత్తి. 1966 లో కొఠారి కమిషన్ ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని, విద్యకు కేంద్రం 10% రాష్ట్రాలు 30% కేటాయించాలని, కామన్ స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టాలని, కులాల వారి విద్యను ప్రోత్సహించకూడదని చేసినటువంటి గొప్ప సూచనలు ఒక్కటి కూడా ఈనాటి వరకు 59 సంవత్సరాలైనా అమలు పరచక పోవడం అంటే ఈ దేశ పాలకులకు చిత్తశుద్ధి నిబద్ధత ఉన్నదని మీరు భావిస్తారా? రాజ్యాంగంలో పొందుపరచుకున్నటువంటి ఉచిత విద్య వైద్యానికి సంబంధించి పాలనలో ఎక్కడ కూడా చోటు లేదు. ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో ఉచిత విద్య వైద్యాన్ని నాణ్యమైన స్థాయిలో అందిస్తామని ప్రకటించకపోవడం సిగ్గుచేటు కాదా! ప్రజలు ప్రశ్నించే విషయాలను పక్కనపెట్టి, ప్రజల అవసరాలను దాటవేసి, తమ ప్రాబల్యం పెంచుకోవడానికి పబ్బం గడుపుకోవడానికి వాగ్దానాలు హామీల రూపంలో కొనసాగుతున్నటువంటి రాజకీయ పార్టీల గుట్టును రట్టు చేయాలంటే చే దించాలంటే మేధావులు బుద్ధి జీవులు కూడా కేవలం సిద్ధాంతపరమైన కృషికి మాత్రమే కాకుండా ఆచరణలో కార్యకర్తలుగా పనిచేయవలసినటువంటి పరిస్థితులు దాపు రించినవి. వరదలు ముంపు ప్రాంతాలు కొండ చర్యలు విరిగిపోవడం తొక్కిసలాటలు, ప్రాజెక్టులు వంతెనలు కొట్టుకుపోవడం, నిర్మాణాత్మకమైనటువంటి రహదారులు డ్రైనేజీలు సరిగా లేకపోవడం, వరద ప్రాంతాలలో ప్రజల యొక్క జీవనం చిన్నాభిన్నం కావడం, పంట పొలాలు మొత్తం నీటి మునగడం అంటే ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లనే అనుకోవడం కూడా సరైనది కాదు.పాలకుల యొక్క తప్పుడు విధానాల కారణంగా అవసరమైన రంగాలపైన దృష్టి సారించకపోవడం, శాస్త్రవేత్తలు మేధావులు వివిధ రంగాల నిపుణుల సూచనలను పాటించకపోవడం, తమ ఆలోచనలే ప్రభుత్వ విధానంగా అమలు చేయడం వలన భారతదేశంలో ఈ దుస్థితి దాపురించినది." కేంద్రం ఈ దేశం వెలిగిపోతున్నదని వెయ్యేండ్ల ప్రణాళిక తమ వద్ద ఉన్నదని చెబుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంపదను సృష్టిస్తాం సంపదను పంపిణీ చేస్తాం అని ఒక మాట ప్రజల్లోకి చేరవేయడం, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మా పోటీ ప్రపంచం తోనే అని సగర్వంగా చాటుకోవడం బాగానే ఉంది కానీ ఆ స్థాయిలో కార్యాచరణ ఉండాలి అనుకున్నప్పుడు రాజకీయ యంత్రాంగం యొక్క ఆలోచన పరిధి సరిపోదు కేవలం వాళ్లు మాటలకు మాత్రమే పరిమితం. దాన్ని లోతుగా తరచి అన్వేషించి కార్యాచరణ ప్రకటించడం, కార్య కారణ సంబంధాలను వెతకడం వంటి అంశాలను మేధావులు బుద్ధి జీవులు మానవ హక్కుల కార్యకర్తలు శాస్త్రవేత్తలు నిపుణులకు అప్పగించి వాళ్లతో ప్రతి స్థాయిలోనూ ప్రత్యేకమైనటువంటి కమిటీలు వేసి చట్టబద్ధమైన అధికారాలను కల్పించినప్పుడు మాత్రమే ఈ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుంది. రాజకీయ నాయకత్వానికి చేదోడుగా నిలుస్తుంది, పరిపాలన సుపరిపాలన వైపు దారి తీ సే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తే ఆ ప్రభుత్వాలు పతనం కాక తప్పదు అలాంటి సంఘటనలు చరిత్రలో మనకు ఎన్నో కనబడుతున్నాయి. ఆ దుస్థితి మన దేశానికి రాకూడదనేది ప్రజల అభిప్రాయం."

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333