ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు బలంగా లేవూ
బిజెపి పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది.
కూటమి పార్టీలపై ఆధారపడిన కేంద్రం ప్రజాకాంక్షలను
ఏ మేరకు అమలు చేస్తుందోనని ప్రజల సందేహం....
--వడ్డేపల్లి మల్లేశం
బలమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునాదులను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది . కేంద్రం బలంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల సమస్యలు పరిష్కారం కావడం కానీ కేంద్ర రాష్ట్రాల మధ్యన సంబంధాలు కానీ సజావుగా సాగుతాయి. గతంలో ఈ మేరకు సర్కారియా కమిషన్ ఈ ప్రాధాన్యతను నొక్కి చెప్పింది ఈ నేపథ్యంలో ఇటీవల 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలను గనుక పరిశీలించినప్పుడు కేంద్రంలో బిజెపి సొంతంగా2 40 సీట్లు కూటమితో కలిసి 293 గెలుపొందిన విషయం తెలుసు . అదే ఇండియా కూటమి 230 సీట్లను సాధించుకొని బలమైన ప్రతిపక్షంగా నిలబడింది గతంతో పోల్చుకున్నప్పుడు ప్రతిపక్ష బలం భారీగా పెరగడం ప్రభుత్వ పక్షం బలం తగ్గిపోవడం గమనించదగిన పరిణామం . అంతేకాకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని బిజెపి 53 సీట్లకు కూటమిలోని పార్టీల పైన ఆధారపడక తప్పలేదు అది కూడా కనీస మైనటువంటి బలానికి దరిదాపుల్లోకి రావడం ఆలోచించ తగిన విషయం . 2014, 2019 ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించి అధికారాన్ని చేపట్టినప్పటికీ అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలుసు. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వసం చేసిందని రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం ద్వారా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోయిందని సర్వత్ర వినబడుతున్న మాట సంవత్సరానికి కోటి ఉద్యోగాల పేరున ఇచ్చినటువంటి హామీ మొక్కుబడిగా మిగిలిపోగా పేదరికం ఇప్పటికీ
డామినేట్ చేయడాని అంతే స్థాయిలో సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడాని గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోనట్లు అర్థమవుతున్నది. రాజ్యాంగపరంగా సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ 40 శాతం సంపద ఒక్క శాతంగా ఉన్న సంపన్న వర్గాల చేతిలో ఉన్నది అంటే అందుకు బీజం గత 10ఏళ్లలో బలంగా ఉందని చెప్పక తప్పదు. ఇటీవల ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి బలమైనటువంటి ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేసిన సందర్భం చాలా తక్కువ ఎంతసేపు 400 సీట్లకు పైగా గెలిపిస్తే రాజ్యాంగాన్ని సవరిస్తామని బహుళ ప్రచారం కావడం, రామాలయ నిర్మాణం పైన దృష్టి సారించడం , ప్రజల విశ్వాసాలను అభిప్రాయాల పైన మాత్రమే ఫోకస్ చేసినంత ప్రజా సమస్యల మీద దృష్టి సారించకపోవడం వలన మూడవసారి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సాధించదలచుకున్న లక్ష్యాలు ఏమిటో స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థిగా మోడీ గారు ఎన్నికైన సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది .ఆ ప్రజల ఆకాంక్షలు ఏమిటో? ఈ లక్ష్యాలను సాధించడానికి అసలు దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏమిటి? అనే విషయం పైన దృష్టి సారించినప్పుడు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి అవకాశం ఉంటుంది .ఈ సందర్భంలో దేశములో ప్రజలను ప్రజాస్వామ్యవాదులను విభిన్న వర్గాలను ముఖ్యంగా బీసీ జనాభాను రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలను పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం యొక్క నిబద్ధతను ప్రశ్నించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది . ఆ మేరకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రశ్నలను చేరవేసినప్పుడు మాత్రమే మూడవసారి ప్రభుత్వం ఏ మేరకైనా విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది . కూటమి సభ్యుల యొక్క చొరవ సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది కనుక కొన్ని విషయాలలో ఏకాభిప్రాయాన్ని సాధించడం కూడా కష్టమే. అందుకోసం కేవలం బిజెపి అభిప్రాయాలకు మాత్రమే కాకుండా కూటమిలోని పార్టీల యొక్క అభిప్రాయాలను, ప్రజల ఆకాంక్షలను, ప్రజా సమస్యలను దృష్టిలోకి తీసుకొని ఎజెండాగా మార్చుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవడానికి ఆస్కారం ఉంటుంది.
దేశాన్ని, ప్రజలను, భిన్న వర్గాలను పట్టిపీడిస్తున్న కొన్ని సమస్యలు:-
56 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లేదు ఏ రాజకీయ పార్టీ కూడా ఇటీవల ఎన్నికల్లో స్వచ్ఛందంగా బీసీ వర్గాలకు అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టలేదు దీనికి పరిష్కారం చట్టసభల్లో రాజ్యాధికారానికి రిజర్వేషన్ బిల్లు ఆమోదించడమే పరిష్కారం. అంతేకాదు 1931 తర్వాత దేశంలో కుల గణన జరగలేదు బీసీ వర్గాల యొక్క జనాభా ఎంత వారి ఆర్థిక పరిస్థితులు ఏమిటి తీసుకోవలసిన చర్యలు ఏమిటి అనడానికి కూడా ఎలాంటి గణాంకాలు లేకపోవడం విడ్డూరం . కులగనన విషయంలో ప్రధానమంత్రి గతంలో అభ్యంతరం చెప్పిన సందర్భం కూడా లేకపోలేదు కానీ ఈసారి కచ్చితంగా ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు ప్రతిపక్షం బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆస్కారం ఉన్నది.
-- ఇప్పటికీ 2021 జనాభా లెక్కలు 2020 గృహ గణన చేయలేదు దానివల్ల అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలియదా వెంటనే చేపట్టాలి..
-- పదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా పేద వర్గాల ప్రయోజనాన్ని కాపాడాలి .81 కోట్ల మందికి పైగా మామూలు బియ్యాన్ని సమకూర్చి ఇదేదో మేలు చేసినామంటే కుదరదు ఆయా పేద వర్గాలకు పోషకాహారంతో పాటు పప్పులు నూనెలు సిరి ధాన్యాల వంటి బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలను నామ మాత్రపు రేటుకు అందించడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకోవాలి .
-- విద్యా వైద్య రంగాలకు బడ్జెట్లో నామమాత్రం కేటాయించడం బాధ్యతారాహిత్యమే. దేశంలో ఎక్కడైనా చికిత్సను పొందడానికి ఉచిత విద్యను అభ్యసించడానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు తో పాటు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం పేద వర్గాల పిల్లలకు చదువుకు కార్డును సరఫరా చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత కూడా కేంద్రం పైన ఉంటుంది. కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించి ఆ రకమైన వెసులుబాటును కల్పించడం కూడా అవసరం. కొఠారి కమిషన్ సిఫారస్ ప్రకారంగా కేంద్రము తన బడ్జెట్లో 10% విద్యకు కేటాయించాలి కానీ ఒకటి రెండు శాతం కూడా దాటడం లేదు.
-- స్పష్టమైన గణాంకాలను సర్వే చేయడం ద్వారా పేదరికాన్ని గుర్తించి దారిద్ర రేఖ దిగువన ఉన్న వాళ్ళ శాతాన్ని కూడా లెక్కించడం వారి బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవడం మూడవ ప్రభుత్వంలో తప్పనిసరిగా జరగాలి .గృహ వసతి లేక కోట్లాదిమంది రోడ్లమీద జీవితాలను గడుపుతూ ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశమని, ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థ స్థాయికి దేశం ఎదిగిందని చెప్పుకుంటే సరిపోతుందా ? కనీస సౌకర్యాలను పేద వర్గాలకు కల్పించడం ద్వారా అమర్త్యసేన్ సూచించినటువంటి మానవ అభివృద్ధిని సాధించడం ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకోవాలి.
-- భారీ నేరగాళ్లను నేర చరిత్ర ఉన్న వాళ్ళను చట్టసభల నుంచి తీర్మానం చేసి తొలగించే బాధ్యతను తీసుకుంటే మంచిది. కానీ ఏ నేరం చేయనటువంటి కోట్లాది మందిని దేశంలోని జైల్లో నెట్టి సంవత్సరాల తరబడిగా విచారణ ఖైదీలుగా చూడడం విచారకరం . మానవ పౌర హక్కులను సామాజిక న్యాయాన్ని వ్యక్తి స్వేచ్ఛను కాపాడడానికి ప్రమాణం చేయాలి . ప్రశ్నించే ప్రతిఘటించిన వాళ్లను మేధావులను ప్రతిపక్షాలను అకారణంగా కేసుల్లో ఇరికించడం దాడులకు పాల్పడడం భవిష్యత్తులో మానుకోవాలి. గతంలో ఈ ప్రభుత్వం మీద ఈ ఆరోపణలు బలంగా ఉన్నాయి.ఉపా చట్టాన్ని రద్దుచేయాలి.
- కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంతో పాటు మత్తు పదార్థాలు కల్తీ ఆహార పదార్థాలు నిషేధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు అరాచక ఆకృత్యాలకు నిలవైనటువంటి ప్రాంతాలను నిషేధించాలి.
- నిత్యావసరాలతో పాటు పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ తదితర సామాన్యులకు ఉపయోగపడే సామాగ్రి ధరలను తగ్గించి పేదల ప్రభుత్వంగా నిలబడాలి. ఈ మేరకు ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయగానే తన స్పష్టమైన ఎజెండాను ప్రకటించడం ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తుందని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు . ఈ మేరకు ప్రజలు ఎప్పటికప్పుడు చర్చించుకోవడం సంప్రదించుకోవడం ప్రశ్నించడం పాలకులను నిలదీయడం సమాంతరంగా జరగాల్సిందే.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )