దున్నే వాడికి భూమి నినాదములో ఎంత వాస్తవం ఉందో పండించే వాడికే ప్రతిఫలం దక్కడం లో కూడా అంతే.
యాచకులుగా మార్చిన ప్రభుత్వాల అహంకారాన్ని బద్దలు కొట్టి
రైతులు హక్కుల కోసం పోరాటం చేయాలి.
పండించిన పంటకు భారీ ధరలు చెల్లించి రైతులను రాజులుగా చూడాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
వాస్తవాలతో కూడుకున్న నినాదాలు నామమాత్రంగా మిగిలిపోతే ఆకర్షణ పథకాలు, దు డ్డు ఉన్న వాడిదే బర్రె, డబ్బున్నోడిదే రాజ్యం అన్నటువంటి తప్పుడు విధానాలు అమలవుతున్న విషయం మనందరికీ తెలుసు. దున్నేవాడిదే భూమి అనే సహజ న్యాయానికి సంబంధించిన నినాదం దశాబ్దాల తరబడి నినాదం గానే మిగిలిపోయింది. క్షేత్రస్థాయిలో కష్టపడి డొక్కాడలేని నిరుపేదలు చెమట వడిసి వ్యవసాయం చేసి ఉత్పత్తులను పెంచితే పండించిన దానిలో ఎలాంటి వాటా లేకుండా చివరికి తన భూమిలో తనే కూలిగా మిగిలిపోవడాన్ని ఇటీవల మనం గమనించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన ప్రజా ఉద్యమాలు దున్నేవాడికి భూమి చెందాలనే పోరాటాలు, భూ సంస్కరణలు కొంత ఊపందుకున్న మాట వాస్తవం కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడిన టిఆర్ఎస్ నాయకత్వంలోని తొలి ప్రభుత్వం రైతులను అన్ని వర్గాలను యాచకులుగా బానిసలుగా మార్చిన విషయం గమనించాలి. ప్రలోభాలు వాగ్దానాల పేరుతో అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను సోమరులుగా తయారుచేసి, ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా, ఉపాధి అవకాశాలను మెరుగుపరచకుండా, ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో లీకేజీలకు పాల్పడి, యువతను పెడదారి పట్టించిన సంగతి మనందరికీ తెలియదా?. సంస్కృతి టీవీలు సినిమా ప్రసారాలలోని తప్పిదాలను ఉద్యమ కాలంలో ఎత్తిచూపి వాటిని మార్చాలని తెలంగాణ ఏర్పడితేనే సాధ్యమవుతుందని నమ్మబలికిన ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్లలో ఏనాడు కూడా సమీక్షించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సా కారం అయ్యే నాటి వరకు విద్యారంగానికి సుమారు 11 శాతం నిధులు బడ్జెట్లో కేటాయిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల కాలంలో 6 శాతాన్ని కూడా దాటకపోవడం అంటే విద్యార్థులను యాచకులుగా మార్చడమే కాదు ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించి ఏటా 10% ఫీజులను పెంచుకోవచ్చునని సిఫారసు చేసినటువంటి తిరుపతిరావు కమిషన్ను ఆమోదించడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదా! ఇది పాలకులను యాచకులుగా మార్చడం కాదా ?ఏ వర్గం ప్రశ్నించకుండానే తాము అధికారంలోకి వస్తే దళితులని ముఖ్యమంత్రి చేస్తామని, దళితులకు మూడెకరాల భూమిని కట్టబెడతామని, పేద వర్గాలకు అన్ని రకాల సహకారం అందిస్తామని నమ్మబలికితే దళితులకు ముఖ్యమంత్రి అనే మాటకు ఇప్పటికీ సమాధానం లేదు, మూడెకరాల భూమి అసలే లేదు, దళిత బంధు పేరుతో పార్టీ కార్యకర్తలకు మాత్రమే పది లక్షల రూపాయలను కొద్దిమందికి ఇచ్చి సంపన్నులు కోటీశ్వరులకు కూడా మంజూరు చేయడంలో సమానత్వం సిద్ధాంతం ఎక్కడ దాగి ఉన్నదో టిఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది.
రైతుబంధు పేరుతో యాచకులుగా మార్చిన ఆనాటి ప్రభుత్వం :-
తెలంగాణ రాష్ట్ర మని సెంటిమెంట్ను ఆధారం చేసుకొని ఒక టర్మ్ బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని రెండవ టర్మ్ పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ కనీసమైన బతుకును కూడా ఇవ్వలేక రాష్ట్రాన్ని అప్పుల గుండం గా మార్చిన విషయం మనకు తెలుసు. 2016లో రైతుబంధు స్కీం ప్రవేశపెట్టిననాడు టిఆర్ఎస్ ప్రభుత్వం పంటల ఉత్పత్తికి సాయంగా రైతు పెట్టుబడి తో అప్పుల పాలు కాకుండా ఉండటం కోసం ఒక్కో పంటకు 5000 చొప్పున ఎకరానికి రెండు పంటలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని అమలు చేసిన విషయం తెలుసు. కానీ పంటలు పండించడానికి సహాయము అంటూ పంటలు పండనటువంటి అడవులు, గు ట్టలు, ఇళ్ల స్థలాలు, వెంచర్లకు, రోడ్లకు కూడా రైతుబంధు నగదును ఇవ్వడం అనేది ఎంత అవినీతిని పెంచి పోషించడమో అర్థం చేసుకోవాలి. హక్కులకై పోరాడే వాడు బాధ్యతలను మరిచినట్లు టిఆర్ఎస్ ఆనాడు తన బాధ్యతలు విస్మరించి ప్రజాధనాన్ని వృధాగా చేసి భూస్వాములకు వందలాది ఎకరాలకు కూడా కోట్లాది రూపాయలను అప్పనంగా కట్టబెట్టి పెట్టుబడిదారీ విధానానికి మద్దతిచ్చి ఆ ముసుగులో పేద రైతులకు సహాయం చేసినట్లు ప్రకటించడం అంటే నిజంగా ఆనాడే రైతులను యాచకులుగా మార్చినట్లు లెక్క.. ఏ రైతైతే కష్టపడి ఉత్పత్తి చేస్తున్నాడో అతడు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అధికంగా ప్రకటించి ఆర్థికంగా చేయూతనిస్తే అది చట్టబద్ధంగా ఉండేది. కానీ ప్రతి పంటకు రైతుబంధు పేరుతో అప్పనంగా కట్టబెట్టడం అంటే అది నిజంగా యాచకులుగా తయారు చేయడమే .హక్కు పూర్వకంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరను కొట్లాడి సాధించడం న్యాయబద్ధమైతే ప్రభుత్వం దయాదాక్షిణ్యముతో ఇచ్చినటువంటిది రైతుబంధు కావడం వల్ల ఆనాడే రైతులు యాచ కులుగా మారినారనేది నిజం .
2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ నేర్పిన దారిలో అనేక హామీలు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా పెంచిన మొత్తం ఇవ్వాలని, వివిధ రకాల డిమాండ్లతో పరిపాలనను ఆలోచించకుండా ఆదిపత్య ధోరణితో శాపనార్థాలు పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క విధానాన్ని మనమందరం గమనించి ఉన్నాం. ఇటీవలి కాలంలో రైతు భరోసా రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకున్నప్పుడు వచ్చిన అనేక సూచనలు కొందరు పండించిన భూమికే రైతు భరోసా ఇవ్వాలంటే దానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ మాత్రం హరీష్ రావు కేటీఆర్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి సాగుభూమి మొత్తానికి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం ఏర్పర్చిన మంత్రివర్గ ఉప సంఘం పండించిన పంటకు మాత్రమే ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని పంట వేసినట్లుగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రైతులను కోరినప్పుడు దానిపై స్పందించినటువంటి కేటీఆర్ గారు రైతులను బిచ్చగాళ్ళుగా మార్చినారు అని చిలుక పలుకులు పలకడంలో అర్థం లేదు.
--- రైతులను బిచ్చగాళ్ళుగా యాచకులుగా మార్చింది టిఆర్ఎస్ పార్టీ. --- పండించని భూములు గుట్టలు చెట్లకు రైతుబంధు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. ---ఆ రకంగా సుమారు 22 వేల కోట్ల రూపాయలను అదనంగా ప్రజాధనాన్ని అప్పనంగా భూస్వాములకు కట్టబెట్టింది టిఆర్ఎస్ పార్టీ.---- కౌలు రైతులను విస్మరించింది టిఆర్ఎస్ పార్టీ. ---భూమిలేని కార్మికులు నిరుపేదలను విస్మరించింది టిఆర్ఎస్ పార్టీ అని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం.
బిజెపి పార్టీ పండించిన పంట భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని సూచన చేయడం జరిగింది. అదే సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకు కౌలు రైతులకు కూడా ప్రతిఫలం అందాల్సినటువంటి అవసరం ఉంది. భూస్వాములకు వందల ఎకరాల వారికి రైతు భరోసా ఇవ్వడం అంటే అసమానతలను పెంచి పోషించడమే కనుక ఆ విషయం పైన కూడా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది .
----పది ఎకరాల వరకు పండించిన భూములకు రైతు భరోసా కు సంబంధించిన ఆర్థిక సహాయం రైతులకు అందే విధంగా నిర్ణయం తీసుకోవాలి.
--- అంతకుమించి భూమి ఉన్నటువంటి భూస్వాములు పెద్ద రైతులకు రైతు భరోసా కు సంబంధించినటువంటి ఎలాంటి ప్రమేయం ఉండకూడదు.
--- ఆ సహకారం కూడా పండించిన పంట రైతు అమ్ముకున్నప్పుడు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజకు కూడా బోనస్ను చెల్లించడం ద్వారా చట్టబద్ధంగా గిట్టుబాటు ధర రూపంలో మాత్రమే రైతు భరోసా అందాలి.
--- ఎలాంటి లెక్కలు లేకుండా కేవలం ఎకరాల భూమి పేరుతో అకౌంట్లో రైతు భరోసా నిధులు వేయడం సరైనది కాదు. పండించిన పంటకు అమ్ముకునే క్రమంలోనే రైతుకు ప్రయోజనం చేకూరాలి. అప్పుడు కౌలు రైతులు కూడా లాభం పొందే అవకాశం ఉంటుంది.
--- పండించిన రైతులకు తమ కృషికి సరైన ఫలితం లభించింది అనే తృప్తి కూడా మిగులుతుంది.
--- రైతు భరోసా నిధులు అకౌంట్ లో వేస్తే ఆ డబ్బులు మళ్ళీ మద్యం షాపులకే ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే అవి ఉచితంగా వచ్చినాయి కనుక .కష్టపడి పండించిన ధాన్యo అమ్మితే వచ్చిన డబ్బు తమ శ్రమ ఫలితం అని పొదుపుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది.తాగుబోతుల సంఖ్య పెరగడానికి కారణమయ్యింది కూడా.
--- రైతులను యాచకులుగా చేసే పద్ధతికి తిలోదకాలు ఇవ్వడం కూడా ఈ కొత్త పద్ధతి యొక్క లక్ష్యంగా ఉండాలి.
--- టిఆర్ఎస్ హయాములో అక్రమంగా కట్టబెట్టినటువంటి పండించని పంట భూముల రైతుబంధు నిధులు విచారణ జరిపించి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే పంటలు సమృద్ధిగా పండే విధంగా ప్రభుత్వం తోడ్పడాలి. పండించిన పంటకు మేలైన ధరను ఇవ్వడం ద్వారా మాత్రమే రైతుల రాజులుగా చేయాలి.
--- ఉచితంగా నిధులు ఇచ్చే దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వాలు తి లోదకాలు ఇవ్వాలి.
-- ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం భవిష్యత్తులో అలాంటి పనికి పూనుకోకూడదు రైతులను స్వతంత్రంగా బ్రతకనివ్వాలి. ఉపాధి కల్పించాలి, ఆదాయాన్ని పెంచాలి కానీ ఉచితంగా నిధులు ఇచ్చే దుష్ట సంప్రదాయానికి మంగళం పాడాలి.
కానీ టిఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు చేస్తున్న వాదన అన్ని భూములకు ఇవ్వాలని చేస్తున్న డిమాండ్ రైతులను మరింత అప్పలపాలు చేయడం, మద్యం దుకాణాలకు గిరాకిని పెంచడం, రైతులను యాచకులుగా చూడడమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజల్లో రైతాంగంలో స్పృహను పెంచి స్పష్టమైన అవగాహన కలిగించి తన కొత్త విధానాన్ని ప్రకటించడం ద్వారా పండించిన పంటకు ధరను భారీగా పెంచడం ద్వారా మీ ఆత్మగౌరవాన్ని కాపాడతామని రైతులకు బహిరంగ పిలుపువడమే ప్రస్తుతం సరైన నిర్ణయం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )