భవిష్యత్తరాల కోసం కలత చెందిన దార్శనికులు – డా. దేవరాజు మహారాజు

Jan 6, 2025 - 00:13
Jan 6, 2025 - 00:22
 0  3
భవిష్యత్తరాల కోసం కలత చెందిన దార్శనికులు                 – డా. దేవరాజు మహారాజు

 సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌గా ప్రసిద్ధుడయిన భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌, మన భారత రాజ్యాంగ రూపశిల్పి. తొలి కేంద్ర న్యాయ శాఖా మంత్రి, ఆర్థిక వేత్త, సంఘ సంస్కర్త. ముఖ్యంగా అంటరానితనం, కుల నిర్మూలన కోసం సంఘర్షించిన రాజకీయవేత్త. దేశంలో నవయాన బౌద్ధానికి దారులు వేసిన ఆధునిక నవబౌద్ధుడు. కాలం గడుస్తున్నకొద్దీ ప్రజలు అంబేద్కర్‌ని బాగా అర్థం చేసు కుంటున్నారు.

దళితులు బహుజనులు మాత్రమే కాదు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారూ అంబే ద్కర్‌ చూపిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే 1956 మార్చి 18న ఆగ్రా నగరంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఆరోజు డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ (1891 ఏప్రిల్‌ 14 – 1956 డిసెంబర్‌ 6) తన అనుచరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై, ఉన్న ఫళాన కంటతడిపెట్టారు. ‘ఏమిటీ? ఏమైంది?’ అని అనుచరులు కంగారు పడి అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అవి ఇలా ఉన్నాయి. తన జాతి వాసుల్ని తను ఎలా చూడాలనుకున్నారు? వాళ్లు ఎలా తయారయ్యారు? అన్న విషయం బేరీజు వేసి చూపారు. తనవాళ్లను ఉద్దేశించి ఇలా అన్నారు –

నేనేమో మిమ్మల్ని రాజులను చేయాలనుకున్నాను. మీరేమో లాభసాటి నౌకర్లలా మిగిలి పోవాలని అనుకుంటున్నారు. నేనేమో మిమ్మల్ని రత్నాలుగా చూడాలనుకున్నాను. మీరేమో మట్టి పెళ్లలుగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు.

నేనేమో మీరు సంఘటిత శక్తిగా ఎదగాలనుకున్నాను. మీరేమో ఎవరికి వారు వ్యక్తులుగా ఎదగాలని అనుకుంటున్నారు. నేనేమో రాజ్యాంగమనే ఆయుధంతో గౌతమబుద్ధుడు, జ్యోతీరావుఫూలే మొదలు పెట్టిన యుద్ధం గెలవాలని అనుకున్నాను. మీరేమో రిజర్వేషన్‌ ఫలాలు అనుభవిస్తూ నిద్రపోవాలని అనుకుంటున్నారు.

నేనేమో పూర్వికుల చరిత్ర చదివి, ఆచరించి, పీడిత తాడిత మూల వాసుల తరఫున మీరంతా నిలబడాలని అనుకున్నాను. మీరేమో మన పూర్వీకుల చరిత్రే చదవకూడదని అనుకుంటున్నారు.

నేనేమో వచ్చిన స్వాతంత్య్రం నుంచి వేరే ఇంకో స్వతంత్రం కోరుకోవడం లేదు. – వెట్టిచాకిరి, బానిసత్వం, కులం, మతం, దోపిడీ, దౌర్జన్యం – సంకెళ్ల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయాలని అనుకున్నాను. మీరేమో ముందు చూపులేకుండా, రాబోయే పెనుముప్పును చూసుకోకుండా కండ్లు మూసుకుని కాలక్షేపం చేయాలని అనుకుంటున్నారు.

స్పృహ లేని ఉద్యోగాల కోసం, స్ఫూర్తి లేని రాజకీయ నాయకుల కోసం, సంఘటితం కాని సంస్కర్తల కోసమేనా నా ఈ కన్నీళ్లూ?

”మీరంతా నా అనుచరులు గనుక, నా జాతివాసుల కోసం, నాదేశ ప్రజల కోసం నేను పడు తున్న ఆవేదనను మీరు సరిగా అర్థం చేసుకుంటారని భావిస్తాను. నా కన్నీళ్లు వథాపోవనీ, వాటి విలువను మీరు వారికి తెలియజెప్తూ ఉంటారని ఆశిస్తాను!” అని అన్నారు అంబేద్కర్‌. భవిష్యత్తరాల అభ్యున్నతి కోసం డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ పడిన ఆవేదన వథా కాకూడదు. మనం మనముందు తరాల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం – ఒక బాధ్యతగా స్వకరించాలి!

నేటి బాల బాలికలే రేపటి పౌరులు గనక, వారి విద్యాభ్యాసం ఎలా జరగాలి? వారు ఉన్నతమైన ఆశయాలతో ఎలా పెరగాలి?- అన్న విషయం అబ్రహం లింకన్‌ (12 ఫిబ్రవరి 1809- 15 ఏప్రిల్‌ 1865) ఒక ఉత్తరంలో నమోదు చేశారు. అమెరికాకు పదహారవ అధ్యక్షుడయిన లింకన్‌, తన చిన్న కుమారుడైన ట్లాడ్‌ లింకన్‌కు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి ఒకలేఖ రాశారు. అందులో అనేక విష యాలున్నాయి. ఇది కేవలం తన కుమారుడి కోసం రాసిందే అయినా, ఆయన దృష్టిలో ప్రపంచ యువత ఎలా ఎదగాలి – అన్న విషయం చర్చించారు. ఆ ఉత్తరం ఇలా సాగుతుంది – ప్రతి ఉపాధ్యాయుడూ ఈ ఉత్తరం తనకు వచ్చినట్టుగానే భావించుకోవాలి !

గౌరవనీయ ఉపాధ్యాయుడా!

ఈ భూమి మీది మనుషులందరూ న్యాయమైన వాళ్లుకాదు, నిజమైన వాళ్లూ కాదు. ఈ విషయాలు మా అబ్బాయి కచ్చితంగా తెలుసుకోవాలి! మీరు మా వాడికి ఇవి నేర్పించాలి!

ప్రతి ఉత్తముడికి ఒక నీచుడున్నాడు. ప్రతి స్వార్థ రాజకీయ నాయకుడికీ అంకిత భావంతో పని చేసే ఒక నాయకుడున్నాడు. ప్రతి శత్రువుకీ మనకు ఒక మిత్రుడున్నాడు. లేనిదాని గురించి దిగులు పడే గుణాన్ని మా వాడిలోంచి పారద్రోలండి. వీలయితే నిశ్శబ్దంగా నవ్వుకోగల రహస్యాన్ని వాడి గుప్పిట్లో పెట్టండి.

తనకు కొన్ని విషయాలు చిన్న తనంలోనే తెలియాలి. అల్లరి చిల్లర కబుర్లు ఆసక్తి కలిగిస్తాయి. కానీ, వాడికి పుస్తకాల మత్తు, మహత్తూ ఏమిటన్నది అర్థం చేయించండి! అలాగే ఆకాశంలోని పక్షులు, తేనెటీగలు, పచ్చటి కొండల అనంత రహస్యాలను అన్వేషించడానికి వీలయినంత ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పండి.

మోసం చేయడం కంటే, ఫెయిల్‌ కావడమే గౌరవప్రదమైన అంశమని, పాఠశాలలో పిల్లలకు మీరు తప్పక బోధించాలి. ఇతరులు తప్పు పడుతున్నారని కాకుండా తన ఆలోచనలపై తనకు ధృఢమైనా విశ్వాసం ఉంచుకోవడం మంచిదని చెప్పండి. 

మర్యాదస్తులతో మర్యాదగా, మొండివాళ్లతో మొండిగా మసలు కోవాలన్నది నేర్పించండి! వీలయితే మా అబ్బాయికి ఈ జ్ఞానాన్ని పంచండి – అందరూ వెళుతున్నారు కాబట్టి, మనమూ ఆ దారిలోనే పరిగెత్తుదామన్న గొర్రెదాటు పద్ధతిని అనుసరించకుండా – నిగ్రహించుకునేట్లు చేయండి! ఎవరేది చెప్పినా, వినగలిగే ఓపికను మా కుర్రవాడిలో పెంపొందించండి.

అయితే, సత్యాసత్యాల నిగ్గుతేల్చుకుని, అసలైనదాన్ని మాత్రమే స్వీకరించాలన్నది- నేర్పించండి!

మీకు సాధ్యమైతే ఈ కింది మెళకువలు కూడా నేర్పించండి –

దుఃఖంలో నవ్వాలని, కన్నీళ్లు వస్తే సిగ్గు పడాల్సింది ఏమీలేదని, ప్రతి దానికీ రంధ్రాన్వేషణ చేసేవాడిని పరిహసించాలని – అలాగే ప్రతి చిన్నపనినీ పొగిడేవాడి గూర్చి జాగ్రత్తగా మసలు కోవాలన్నది బోధించండి!

తన కండను, మెదడును అత్యంత ఎక్కువ ధర చెల్లించేవాడికి అవసరమైతే అమ్ముకోవచ్చు. కానీ, తన మనసుకు, అంతరాత్మకూ ఎప్పుడూ ఎక్కడా, ఎన్నడూ వెల నిర్ణయించకూడదనీ, ఆ పరిస్థితి అసలు తెచ్చుకొనే తెచ్చుకోగూడదనీ బాగా అర్థమయేట్టు చెప్పండి!’ పనికి మాలిన అరుపులకు చెవి ఒగ్గు గూడదని, తను సత్యమని బలీయంగా నమ్మిన దాని కోసం ఎదురొడ్డి పోరాడాలనీ చెప్పండి!

మా అబ్బాయితో కాస్త సున్నితంగానే వ్యవహరించండి. కానీ, మరీ ముద్దు చేయకండి. ఎందు కంటే ఉక్కు ధృఢత్వం తెలిసేది అగ్ని పరీక్షకు గురైనప్పుడే కదా?

ధైర్యంగా ఉండగలిగే సహనం తనకు కావాలి! అయితే, అవసర మైనప్పుడు తన అసహనాన్ని ప్రదర్శించే ధైర్యం కూడా తనకు ఉండాలి!

ఎల్లవేళలా తనమీద తనకు అంచంచలమైన విశ్వాసం ఉండేలా తీర్చిదిద్దండి. అప్పుడే ఆవయసు పిల్లలకు మానవ జాతి మీద ఎనలేని విశ్వాసం ఏర్పడుతుంది.

ఇవన్నీ చిన్న కోరికలేమీ కావు – చాలా పెద్దకోరికలే. కానీ, ప్రయత్నించి చూడండి. ముద్దులొలికే నా బంగారు తండ్రికోసం – ఇందులో మీరు ఏమేమి చేయగలరో ప్రయత్నించి చూడండి. మీ ప్రయత్నం సఫలమైతే, ఆ ఫలితం నా కుమారుడొక్కడికే కాదు-మొత్తం కొన్నితరాలకు అందించిన వారవు తారు. దయచేసి ఆలోచించండి-

– అబ్రహం లింకన్‌; ఫాదర్‌ ఆఫ్‌ ట్యాడ్‌ లింకన్‌ (పేరెంట్‌)

19 అక్టోబర్‌ 1952 షిల్లాంగ్‌-మేఘాలయలో జరిగిన పెద్ద బహిరంగసభలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఉపన్యాసం ఈ విధంగా సాగింది. దేశమంటే ఏమిటీ? అంకిత భావంతో పని చేసే దేశ నాయకులు చేయాల్సింది ఏమిటి? అన్నది ఆయన చెప్పకనే చెప్పారు.

”దేశమంటే కొన్ని పర్వతాలు, కొన్ని నదులు, మైదానాలు, పొలాలూ మాత్రమే కాదు. పెద్దవీ చిన్నవీ అయిన నగరాలు, పట్టణాలు గ్రామాలు మాత్రమే కాదు. దేశమంటే ఇవన్నీ ఉంటాయి కానీ, దేశ మంటే ఇవి మాత్రమే కాదు. దేశమంటే, దేశంలో నివసిస్తున్న ప్రజలు- అందువల్ల, నా భారత దేశంలో ఉన్న ప్రజలను నేను అర్థం చేసుక వడానికి ప్రయత్నించాను. గతంలో ఉన్న ప్రజలను, ప్రస్తుతం ఉన్న ప్రజలను వారి జీవితాలను చాలా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చాను. దేశమంతా విస్తకృతంగా పర్య టిస్తూ వచ్చాను. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణపు అంచు కన్యాకుమారి దాకా – అలాగే పశ్చి మాన ఉన్న మన సరిహద్దుల నుండి ఇటు తూర్పున ఉన్న సముద్రతీరం దాకా లక్షలాది ప్రజలను కలిశాను. వారి కండ్లలోకి సూటిగా చూస్తూ వారి మనోభావాల్ని పసిగట్టాను. వారి ఆశలేమిటి ?

ఆకాంక్షలేమిటీ? తెలుసుకున్నాను. వారు చెప్పేదేమిటో విన్నాను. వారు చెప్పలేక పోయిందే మిటో కూడా అంచనా వేసుకున్నాను. మొత్తానికి మొత్తంగా, నా దేశ ప్రజల్ని కొంతలో కొంత అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఇది నాకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే విషయం!”

ఆనాటి పండిట్‌ నెహ్రూ ఉపన్యాసం పూర్తిపాఠం-జవహర్‌లాల్‌ నెహ్రూ – సెలెక్టెడ్‌ వర్క్స్‌ -సెకెండ్‌ సీరిస్‌ – వాల్యూమ్‌ – 20;పేజి. నెం.3లో ఉంది.

”జవహర్‌లాల్‌ నెహ్రూ పట్ల పార్టీలో ఆరాధనా భావం పెరిగిపోతూ ఉంది. దీన్ని అరికట్టకపోతే ఆయన మరో సీజర్‌లా తయారయ్యే అవకాశం ఉంది – ఇది పార్టీ మనుగడకు ఎంత మాత్రం సరైంది కాదు” చాణక్య. నెహ్రూ అంటే గిట్టని వారెవరో ఇలా రాస్తున్నారని అందరూ అనుకునేవారు. ఇంతకూ ఎవరా చాణక్య- అని కొందరు ఆరా తీసేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- చాణక్య ఎవరో కాదు. పండిట్‌ నెహ్రూయే! అది ఆయన కలం పేరు. ఆరోజుల్లో కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో పండిట్‌ నెహ్రూయే స్వయంగా ‘చాణక్య’ అనే పేరుతో విరివిగా రాస్తుండేవారు. ఈ కాలంలో అలాంటి నిజాయితీ పరుల్ని చూడగలమా? ఆయన దార్శనికతను అర్థం చేసుకోలేని వారు మాత్రమే, ఆయనను తక్కువ చేసి మాట్లాడగలరు. వివేకవంతుడికి, మూర్ఖుడికీ పోలికలు ఉండవు కదా!

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333