గ్యారంటీలు, రాయితీలు, ఉచితాలు  ప్రజల చైతన్యాన్ని నిర్వీర్యం చేస్తే

Feb 13, 2025 - 20:37
Feb 13, 2025 - 20:38
 0  2

   సామాజిక అవగాహన లేని ప్రతిపక్షాలకు  ప్రభుత్వాన్ని విమర్శించడానికి తోడ్పడుతున్నాయి.

 ఉపాధి ఉద్యోగ  అవకాశాలు నాణ్యమైన ఉచిత విద్య వైద్యాన్ని  అందిస్తే ప్రజలు  మరి ఎంతో అభివృద్ధి చెందుతారుకదా!

---  వడ్డేపల్లి మల్లేశం 

  దేశ సంపద కొద్ది మంది  వ్యక్తుల చేతిలో బంది కావడాన్ని  వ్యతిరేకిస్తూనే  సాధ్యమైనంతవరకు  అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి  ఉద్దేశించిన భారత రాజ్యాంగం లోని  నియమావళి  ఆచరణలో నీరుగారిపోయి  40 శాతం సంపద కేవలం ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో చిక్కి  విలవిలలాడుతున్నా   ఇది సామాజిక  న్యాయానికి వ్యతిరేకమని  ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు  భావించలేదు. అంటే బుద్ధిపూర్వకంగానే ప్రభుత్వాలు పెట్టుబడిదారీ వర్గాన్ని ప్రోత్సహిస్తూ  కన్న బిడ్డల వలె పాలించవలసిన ప్రజానీకాన్ని మాత్రం  సవతి తల్లి ప్రేమతో చూడడాన్ని ప్రతి  సందర్భంలోనూ మనం గమనించవచ్చు.  ఉత్పత్తిలో భాగస్వాములయ్యే వాళ్ళు కొందరైతే సేవారంగంలో పనిచేసే వాళ్లు మరి కొందరు  కాయకష్టం చేసుకుని బ్రతికే వాళ్ళు  నిర్మాణ  పారిశ్రామిక ఇతర  రంగాలలో పనిచేస్తున్నటువంటి కోట్లాది కార్మికులు  తమ బ్రతుకు దెరువు  కోసం  అందుబాటులో ఉన్న ఉపాధిని అంటిపెట్టుకొని  కుటుంబాలను పోషణ చేస్తున్న విధానం  కొందరిదైతే  మరికొందరు విద్య అవకాశాల కారణంగా ఉద్యోగ ఉపాధి  రంగాలలో పనిచేస్తుంటే,  వారసత్వ ఆస్తులతో పాటు   అక్రమ లాభార్జన భూకబ్జాలు  అవినీతి కారణంగా  మరికొంతమంది  అత్యంత సంపన్నులు ఈ దేశంలో  పరిపాలనా వ్యవస్థను శాసించడాన్ని మనం గమనించినప్పుడు  ఆశించిన లక్ష్యం ఒకటైతే ఆచరణలో  భిన్నమైన పద్ధతిలో పరిపాలన కొనసాగడం  జీర్ణించుకోలేని సమస్య.

ఆదాయంలోనూ సంపదలోను వేతనాలలోనూ  కార్మికులకు కూలీలలోనూ   భారీ వ్యత్యాసాలు ఉన్న కారణంగా  అసమానతలు అంతరాలు ఈ దేశంలో  భూమికి ఆకాశానికి ఉన్నంత తేడాలో మనం గమనించవచ్చు. అలాంటి సందర్భంలో సమానత్వాన్ని సాధించడం  రాజ్యాంగంలో సామ్యవాదం అనే పదాన్ని రాసుకోవడం కేవలం  అలంకారప్రాయంగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితులను ఆసరా చేసుకున్నటువంటి పాలకవర్గాలు  కొన్ని  దశాబ్దాలుగా  సామాన్య ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి  వారి ఓట్లను పొందడానికి  ఆదాయాన్ని సంపదను పెంపొందిస్తామని ఉచితాలు  రాయితీల ద్వారా  ప్రభుత్వాలు మీకోసమే పనిచేస్తాయని నమ్మబలికే ప్రయత్నం కొనసాగుతూ వస్తున్నది. "చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా  రావలసిన వాటా, హక్కులను పొందే బదులు ప్రజలు కూడా బలహీనులై  పార్టీల   మేనిఫెస్టోలు ఎన్నికల ప్రకటనల పైన ఆధారపడిన కారణంగా  వాగ్దానాలు, హామీలు,  రాయితీలు, గ్యారంటీలు, ఉచితాలు అనే పదాలు  రాజకీయంలో పరిపాలనలో ప్రధాన  స్థానాన్ని అలంకరిస్తే  ప్రజాసేవ, సమానత్వము,  ప్రజలే ప్రభువులు  అనే పదాలు అడుగంటిపోయినవి.  అందుకే ప్రభువులు  గా చూడవలసినటువంటి ప్రజలు బానిసల స్థానంలో ఉంటే  ప్రజల సంపదకు కాపలాదారులుగా ఉండవలసినటువంటి పాలకులు ప్రభువులు యజమానుల స్థానంలో  సింహాసనాన్ని   ఎక్కి ఆధిపత్యాన్ని చలారిస్తున్నారు"  ఈ రకమైనటువంటి అంతర్గత వ్యవహారాన్ని,  పరిణామ క్రమాన్ని, పాలకుల కుట్రను  ప్రజలు తమ బలహీన మనస్తత్వం తో  గ్రహించలేక  ప్రలోభాలకు అలవాటు పడిన కారణంగా  ఎన్నికల్లో అవినీతి, ప్రభుత్వం ఏర్పాటులో అవినీతి,  ఏర్పడిన ప్రభుత్వం  ఐదేళ్ల పాలనలో కూడా అవినీతి స్పష్టంగా చూడవచ్చు.. ఇచ్చిన రాయితీలు వాగ్దానాలు హామీలను అమలు చేయలేక   తలసరి అప్పు  పెరుగుతూ ఉంటే  ఆ విషయాన్ని గమనించని ప్రజలు  ప్రభుత్వాలు తమకు  రాయితీల రూపంలో  వ్యవసాయదారులు కార్మికులు చేతివృత్తుల వాళ్ళు ఉద్యోగులు వ్యాపారులు చిరు వ్యాపారులకు  ఇచ్చిన హామీలను  అమలు చేస్తూ ఉంటే వాటిని పొంది ఇదే  చట్టబద్ధంగా మాకు రావలసిన వాటా అని  భ్రమ పడుతున్నారు.  స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో  పాలకులలోనూ ప్రజలలోనూ పెట్టుబడిదారీ వ్యవస్థలోను కొo త  నిజాయితీ విలువలు  సేవా దృక్పథం  ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయడం  ప్రజలను నిజమైన ప్రభువులుగా పాలకులు గుర్తించడం  వంటి లక్షణాలతో   పాలన కొనసాగిన మాట వాస్తవం. గత మూడు నాలుగు దశాబ్దాలుగా  పాలనలోని  డొల్లతనానికి  ఈ హామీలే ప్రధాన కారణమని ఇప్పటికైనా పాలకులు, రాజకీయ పార్టీలు, ప్రజలు గుర్తించి వాటిని క్రమక్రమంగా  రద్దు చేయడం ద్వారా  ప్రజలు తమ హక్కుల కోసం డిమాండ్ చేసే స్థాయికి  ఎదగాలి. పాలకులు కూడా  ఎన్నికల నుండి మొదలుకొని పరిపాలన ఆశాంతం కూడా అవినీతికి తావు లేకుండా  ప్రజల  కష్టార్జితాన్ని తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేసే  నూతన వ్యవస్థ ఆవిష్కరించాలి .

ప్రతిపక్షాలు హామీలు, ఉచితా లను వ్యతిరేకించాలి

ఇక ప్రతిపక్షాలు  ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడూ అమలు చేస్తావు ఎట్లా అమలు చేస్తావు నిధులు ఎక్కడివి  ఇచ్చిన సమయం అయిపోయింది కదా వెంట పడతాం విడిచిపెట్టం వేటాడుతాం అంటూ  గుడ్డిగా  ప్రకటనలకు మాత్రమే పరిమితమైన సందర్భాన్ని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూడవచ్చు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో ఇచ్చిన హామీలు అతిగా ఉన్న మాట వాస్తవమే. అంతకుమించి  బి ఆర్ ఎస్ హయాంలో కూడా ఇచ్చిన హామీలను అమలు చేయక  ప్రజలను ప్రలోభ పెట్టిన విధానం అందరికీ తెలుసు  2023 ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే మిన్నగా  టిఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు.  హామీలు ఇవ్వడంలో రెండు పార్టీలు పోటీపడి  ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసినప్పుడు  ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లోపల  శాస్త్రీయత ఉండాల్సిన అవసరం ఉంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి  వచ్చిన ప్రభుత్వాన్ని ఎలా అమలు చేస్తావని ప్రశ్నించడం,  వెంట పడతామని  బ్లాక్ మెయిల్ చేయడం మరి విడ్డూరం.  అంటే ప్రలోభాలు వాగ్దానాల విషయంలో పోటీ పడినటువంటి రాజకీయ పార్టీలలో  ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రమే దోహదపడుతున్నటువంటి ఈ రాయితీలను   ఎక్కడో ఒక దగ్గర నిలుపుదల చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాల్సిన అవసరం ఉంది.  నిబద్ధత ఉన్న ప్రతిపక్షం అయితే  ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలి కానీ ఉచితాలను  మరింత పెంచడానికి అనుమతించకూడదు. ఆ స్థానంలో విద్యా వైద్యము సామాజిక న్యాయము ఉపాధి ఉద్యోగ అవకాశాలకు  పెద్దపీట వేయడం ద్వారా  ప్రజలు స్వతంత్రంగా స్వావలంబనగా  తమ కాళ్లపై తాము బ్రతికే విధంగా  ప్రభుత్వ విధానాలను ఏర్పాటు చేయడానికి  అందరము మద్ద తీయవలసిన అవసరం ఉంది.. ప్రజాధనానికి కాపలాగా ఉండవలసినటువంటి పాలకులు తమ జేబు నుండి ఇచ్చినట్టుగా బ్రమ  పడుతూ  తీసుకుంటున్నటువంటి ప్రజలను  మాత్రం  బానిసలు  లేదా యాచకులుగా దిగజార్చుతూ  ఉంటే ప్రతిపక్షం కూడా ఈ పద్ధతికి వంతపాడితే   ఇది   ఆత్మవంచన తప్ప ఏమీ కాదు.  ప్రతిపక్షాలు కూడా హామీలు ఉచితాలను వ్యతిరేకించాలి. క్రమంగా ప్రజలను  చట్టబద్ధంగా రావలసినటువంటి హక్కుల కోసం పోరాడే విధంగా  తీర్చిదిద్దాలి. ఇదే సందర్భానికి సంబంధించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  "ఓటు హక్కును ఉపయోగించుకొని యజమానిగా  నిలబడతావా లేదా ఓటును అమ్ముకొని బానిసగా బ్రతుకుతావా తేల్చుకోమని" చేసిన హెచ్చరిక  ఇక్కడ పాలకులకు ప్రజలకు కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది.  "తొలి దశలో రాయితీలు, ఉచితాలను ఒక ప్రభుత్వం రద్దు చేస్తే కొంత వ్యతిరేకత రావచ్చు కానీ  దేశంలోని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా  ప్రజల హక్కులను ప్రచారం చేస్తూ ఉచితాలను రాయితీలను  వ్యతిరేకిస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకోవడానికి  పూనుకుంటే ప్రజలు కూడా స్వతంత్ర  ఆలోచన విధానానికి అలవాటు పడతారు.  అడుక్కోవడానికి  వ్యాచించడానికి  కాకుండా పాలకులను శాసించడానికి  పోరాటానికి సిద్ధమవుతారు అలాంటి వ్యవస్థను  ఈ దేశంలో నెలకొల్పవలసిన అవసరం చాలా ఉన్నది అప్పుడు పాలకుల కుట్రలు కుతంత్రాలు,  ఒంటెద్దు పోకడ, ఆధిపత్య ధోరణి  క్రమంగా సన్నగిల్లి  ప్రజలు ఆత్మస్థైర్యంతో తల ఎత్తుకొని బ్రతికే రోజులు వస్తాయి" .గెలుపు కోసం  లేదా brs  తో పోటీ పడడానికి అనివార్యమైన పరిస్థితిలో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే  డిమాండ్ చేయడం టిఆర్ఎస్ ప్రతిపక్షం యొక్క బాధ్యత కాదు. ఈ రాష్ట్ర సంపద  ఏ రకంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందాలో  ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. కేవలం  రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి  రైతు వర్గానికి సంబంధించిన డిమాండ్లను మాత్రమే  నిత్యం జపం చేస్తూ ఉంటే  ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది శ్రమజీవులు,  వలస కార్మికులు, నిరుపేదలు,  పట్టణ పేదలు,  చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, చేతివృత్తుల వాళ్ళు  ఈ దేశ జనాభాలో భాగం కాదా? వాళ్ల గురించి చట్టసభలో గానీ బయట గానీ ఏనాడు కూడా ప్రస్తావించిన సందర్భం లేదు. టిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నోటా ఎప్పుడు రైతుల మాటే తప్ప మిగతా వర్గాల పూసే లేదు.  అందుకే  "ఇకనుండి పాలక ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలకు సంబంధించి క్రమంగా తగ్గించుకుంటూ  ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా  కష్టపడిన వాళ్లకు ఆదాయం,  పంటలు పండించిన వాళ్లకు  గిట్టుబాటు ధర,  దున్నే వాళ్లకు భూమి సమకూర్చడం,  ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించడం, మానవాభివృద్ధి సాధనలో క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా మాత్రమే ప్రభుత్వం  ప్రజాధనాన్ని పరిరక్షించాలి  ప్రజలకు పంపిణీ చేయాలి. కానీ  కొన్ని వర్గాల పట్ల  ప్రత్యేకత కనబరిచి  మెజారిటీ ప్రజలను విస్మరిస్తే అది పరిపాలన కాదు  పక్షపాత ధోరణి అవుతుంది. " ఇప్పటికైనా ఉచిత విద్య వైద్యం సామాజిక న్యాయం  ఉపాధి ఉద్యోగ అవకాశాలు  మా మేనిఫెస్టో లోని ప్రధాన అంశాలని  ఏ రాజకీయ పార్టీ అయినా  చెప్పడానికి సిద్ధంగా ఉందా? లేదు  ఎందుకంటే విద్య వైద్యాన్ని ఉచితంగా అందిస్తే ఆరోగ్యంగా ఉండి  విద్యావంతులై చైతన్యూలై   పాలకులను నిలదీస్తారు ప్రశ్నిస్తారు అనే భయం  రాజకీయ పార్టీలలో ఉంటుంది" కనుక.ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా  ప్రస్తావించిన విషయాన్ని మరిచిపోకూడదు .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333