భవిష్యత్తుకు పదవ తరగతి తొలి మెట్టు జిల్లా కలెక్టర్
తిరుమలగిరి 12 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
భవిష్యత్తుకు పదవ తరగతి మొదటి అడుగు అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. పదవ తరగతిలో మంచి మార్కులు, విషయపరిజ్ఞానాన్ని సంపాదిస్తే ఇంటర్ తో పాటు, అన్నింటిలో రాణించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల స్పెషల్ క్లాస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందరికీ పుస్తకాలు వచ్చాయా? సిలబస్ ఎంతవరకు అయిందని? హాస్టల్లో భోజనం బాగుందా? చదువులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగారు. అనంతరం చదువు ప్రాధాన్యత, పదవ తరగతి ప్రాముఖ్యతను ఆయన తెలియజేస్తూ పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చేందుకు బాగా కష్టపడి చదవాలని, జీవితంలో ఏదైనా సాధించేందుకు పదవ తరగతి తొలిమెట్టు అని అన్నారు. దీనివల్ల అనుకున్న కళాశాలలో ఇంటర్లో సీటు వస్తుందని, అంతేగాక ఏదైనా ఉపాధి ,ఉద్యోగాలకు పదవ తరగతిని అడుగుతారని చెప్పారు. పరీక్షల పట్ల భయం లేకుండా చదవాలని, దానివల్ల తప్పులు లేకుండా రాస్తే మంచి మార్కులు వస్తాయని, ఇందుకు భయాన్ని వదిలివేయాలని, ఏ రోజు పాఠాలు ఆరోజు సాయంత్రం తిరిగి ఒకసారి చదువుకోవాలని, పరీక్ష వాతావరణంలో చదవడం, అభ్యసనం చేయాలని అన్నారు. ఒక అంశం పట్ల సమాచారం తెలిస్తే భయం అనేది ఉండదని, ఆత్మవిశ్వాసంతో చదవడం వల్ల అనుకున్నది సాధించవచ్చని అన్నారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు .. వారు వెంట ఎం ఈ ఓ శాంతయ్య తహసిల్దార్ భాషేటి హరిప్రసాద్ ప్రిన్సిపల్ దామర శ్రీనివాస్ ఉపాధ్యాయులు అధికారులు తదితరులు పాల్గొన్నారు