మానవాభివృద్ధికి కడుదూరంగా కోట్లాది ప్రజానీకం
మారని బతుకుల మధ్యన జిడిపి పేరుతో భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థ అవుతుందన్న ప్రచారం పసలేని వాదన.
సామాజిక రాజకీయ ఆర్థిక జాడ్యాలను అంతం చేయడమే అంతిమ పరిష్కారం.
- వడ్డేపల్లి మల్లేశం
మురుగు కాలువను శుద్ధి చేయకుండా దుర్గంధాన్ని ఆపలేనట్లే సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక జాఢ్యా లను, అసాంఘిక పద్ధతులను, సామాజిక రుగ్మతలను, అంతరాలు అసమానతలను నిర్మూలించకుండా మానవాభివృద్ధిని సాధించలేము పేదల బతుకుల్లో వెలుగులు చూడలేము .ప్రతి ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం అంతరాలను నిర్మూలించడం ద్వారా సమానత్వాన్ని సాధించడం, అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ పలాలను చట్టబద్ధంగా అందించడం, ప్రతివారు ఆత్మగౌరవంతో జీవించే సుపరిపాలనను కొనసాగించడమే . త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అమెరికా చైనా తర్వాత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేయడం అంటే నేల విడిచి సాము చేయడమే అవుతుంది . జాతీయ స్థూల ఉత్పత్తి ప్రకారంగా అంకెల గారడీ మేరకు భారతదేశo జర్మనీ జపాన్ దేశాలను అధిగమించిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిజజీవితంలో ప్రజల బ్రతుకులు మారిన తీరు , మానవాభివృద్ధిలో వచ్చిన పరిణామం , సమానత్వం వైపుగా జరుగుతున్న కృషిని మాత్రమే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూచికలుగా తీసుకావాలి. కానీ అందుకు భిన్నంగా ఉన్న జన జీవితాన్ని పరిశీలిస్తే అనేక చేదు వాస్తవాలు కళ్ళ ముందు కనబడతాయి.
"విద్యా అవకాశాలు, మానవ పౌర హక్కులు , స్థిరమైన ప్రభుత్వాలు, శాంతిభద్రతలు ,సామాజిక న్యాయము , అంతరాలు లేని సమానత్వం, ఆరోగ్యకరమైన ప్రజా జీవనం వంటి అంశాలతో పాటు కనీస జీవన అవసరాలను మాత్రమే ఒక దేశ అభివృద్ధికి ప్రమాణాలుగా తీసుకోవలసి ఉంటుంది"
భారత ప్రఖ్యాత ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ప్రజల అవసరాలను సంపూర్ణంగా తీర్చగలిగిన పరిస్థితిని మానవాభివృద్ధిగా గుర్తించి దాని ఆధారంగా ప్రజల జీవన స్థితిగతులను దేశాభివృద్ధిని అంచనా వేయాలని చేసిన హెచ్చరిక పాలకులకు, ప్రజలకు గుణపాఠం కావలసిన అవసరం ఉన్నది .
పాలనలోని డొల్లతనాలు- దేశమంతా విస్తరించిన కొన్ని చేదు వాస్తవాలు:-
*********
2021లో ఆక్స్ఫాం ఇండియా నివేదిక ప్రకారం 84 శాతం కుటుంబాల ఆదాయం గతం కంటే కరిగిపోయినట్టు తెలుస్తుంది. కానీ అదే సంవత్సరం సంపన్న వర్గాల ఆస్తులు రెండింతలకు పైగా వృద్ధి జరిగినట్లు కరోనా సమయంలో పెద్ద ఎత్తున ప్రచారమైన విషయం తెలిసిందే. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడకుండా ప్రజలందరూ కనీస అవసరాలను తీర్చుకోగలిగిన పరిస్థితులు కొంతైనా దేశ అభివృద్ధికి కొలమానం కాగా " ఆదేశిక సూత్రాలు సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడకూడదని" ఆదేశిస్తూ ఉంటే దానికి భిన్నంగా దేశంలోని 40 శాతానికి పైగా సంపద కేవలం 1 శాతం ఉన్న సంపన్న వర్గాల చేతుల్లో నిబిడీకృతమైనప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పుంజుకున్నట్లు? మానవాభివృద్ధి ఎక్కడ సాధించినట్లు? మనం ప్రశ్నించుకోవలసి ఉంటుంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రతి ఏటా మానవాభివృద్ధి సూచిని ప్రచురిస్తున్న క్రమంలో 2015 సంవత్సరంలో 188 దేశాలకు గాను భారత 130వ స్థానంలో ఉంటే 2021- 22 నాటికి 191 దేశాలకు గాను 132వ స్థానానికే పరిమితమైనది అంటే ద శాబ్దాలు గడిచిపోతున్నా ప్రజల జీవితాల్లో మార్పు రానప్పుడు అవసరాలు తీరనప్పుడు భారతదేశ ఏ రకంగా ప్రపంచంలో గుర్తించదగిన ఆర్థిక వ్యవస్థ అవుతుందో సమాధానమివ్వాల్సి ఉంటుంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం బీహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్ ,అస్సాం, ఛత్తీస్గడ్, ఒడిస్సా వంటి కొన్ని రాష్ట్రాలలో దారిద్ర రేఖ దిగువ న ఉన్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్యన కూడా తీవ్రమైన అసమానతలు ఉన్నట్లు నీతి అయోగ్ ఇటీవల వెల్లడించిన విషయాన్ని గమనిస్తే భారతదేశం ఒక అంతరాల దొ0 తరగా మనం భావించవలసి ఉంటుంది. విద్యా వైద్యం పూర్తిగా ప్రైవేటుపరమై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతి తక్కువ నిధులను కేటాయిస్తూ ఉంటే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రమంగా మసకబారుతూ, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆత్మహత్యలు గణనీయంగా పెరుగుతూ ఉంటే కార్మికులు, కర్షకులు, వలస జీవులు, చేతివృత్తుల వాళ్లు, చిరు వ్యాపారులు
నిత్యం కడగండ్ల బారినపడి చావలేక బతకలేక జీవిస్తున్న సంగతిని మనం అంచనా వేయకపోతే ఎలా? వైద్యం అందక లక్షల్లో చనిపోతుంటే పోషకాహార లోపం కారణంగా ఏడాదికి 17 లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుంటే
అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఎలా అవుతుందో పాలకులే ఆలోచించాలి .మానవ హక్కులు, పౌరహక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కనుమరుగై, నిర్బంధం అణచివేత దోపిడీ పీడిన వంచన అత్యాచారాలు ఒకవైపు కొనసాగుతుంటే
సామాజిక భద్రత లేని వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గొప్పలు చెప్పుకోవడం అర్థరహితం .ప్రజల హక్కుల పరంగా 142 దేశాలకు గాను మన దేశానికి 99 వ స్థానం దక్కగా ప్రజల సామాజిక న్యాయపరంగా 111వ స్థానానికి దిగజారడం ప్రజాస్వామ్య బలహీనతకు నిదర్శనం .
పారదర్శక సమర్థవంత పాలనకు పటిష్ట చర్యలు అవసరం :-
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి బదులుగా నిరంకుశ పరిపాలనలో ఉన్న దేశాలలో భారత్ కూడా ఒకటనీ "వరల్డ్ డెమోక్రసీ 2023" నివేదిక నిష్కర్షగా విమర్శించడం ఆందోళనకరమే కదా.! ఈ పరిస్థితులలో రాజకీయ రంగంలో సంపన్నులకు మాత్రమే అవకాశం ఉన్న ఎన్నికల వ్యయాన్ని పూర్తిగా అదుపు చేయగలిగి అవినీతిని తుడిచి పెట్టే విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థల్లో నిస్పాక్షతకు పెద్దపీట వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. సామాజిక రాజకీయ ఆర్థికపరమైనటువంటి అవ లక్షణాలను అంతం చేయడానికి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమమే రావాల్సిన అవసరం ఉన్నది . బలమైన ఆర్థిక వ్యవస్థ అని ప్రచారం చేసుకోవడం కంటే సంపదను సృష్టించి ప్రజలందరికీ పంచి అంతరాలను నిర్మూలించగలిగిన నాడు మాత్రమే సామాజిక పరిస్థితులు మెరుగుపడి బలమైన ఆర్థిక వ్యవస్థ అనడానికి ఆస్కారం ఉంటుంది . ప్రజా ఆకాంక్షలకు అనుగుణమైన పరిపాలనను మాత్రమే అనుమతించగలిగి చట్టసభల్లో జరుగుతున్న చర్చలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు నిఘా వేసి ఉంచినప్పుడే సమానత్వ సాధన కోసం ప్రజా ఉద్యమం తీవ్రమైనప్పుడే మానవ అభివృద్ధి , అంతరాలు లేని వ్యవస్థ, సామాజిక రాజకీయ స్వావ లంబన సాధ్యమవుతుంది. అదే అభివృద్ధి చెందిన భారతావ నికి గీటురాయి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )