బీఎస్పీ అధినేత టిఆర్ఎస్ లో చేరడం  ఎందుకు ఇంత చర్చకు దారి తీసింది?

Mar 30, 2024 - 23:44
 0  1

 బహుజన భావజాలాన్ని ఆకాశానికి ఎత్తి  తప్పుకోవడాన్ని  ఎ లా చూడాలి ?

ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో  సమాజం పెద్ద ఎత్తున స్పందిస్తే!

---- వడ్డేపల్లి మల్లేశం 

సాంప్రదాయ రాజకీయ పార్టీలు  అవకాశవాద అంశాలను ప్రాతిపదికగా చేసుకొని  సందర్భానుసారంగా తమ అంశాలు, లక్ష్యాలు, ఆదర్శాలు, మేనిఫెస్టోలను మార్చుతూ ఉంటాయి.  గెలుపు కోసం అధికారం కోసం పార్టీలను  కూటములలో విలీనం చేస్తే  మరికొన్ని సందర్భాలలో  పార్టీలోని క్రియాశీల నాయకులు ఇతర పార్టీలలో చేరి  అవకాశాన్ని అధికారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు . దేశవ్యాప్తంగా  ఇదే తీరు కొనసాగుతుంటే మరింతగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల ముందు  ఇలాంటి వికృత చేష్టలను ఎక్కువగా చూడవచ్చు.  ద శాబ్దాల తరబడి ఒక పార్టీలో కొనసాగి ఎన్నికల్లో టిక్కెటు రానంత మాత్రాన వెంటనే మరొక పార్టీకి మారడం ఒక విషయం అయితే,  ఎన్నికల్లో ఓటమి పాలై ప్రజల ఆగ్రహానికి గురై  చావు తప్పి కన్ను లొట్ట పోయిన రీతిలో బలహీనమైన పార్టీని వీడి ప్రజల పక్షాన  పనిచేయడానికి అనివార్యంగా పార్టీ మారక తప్పడం లేదని మరికొందరు ఇతర పార్టీలలో చేరుతున్నారు.  ఈ సన్నివేశానికి ఉదాహరణగా టిఆర్ఎస్ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత  జరిగిన సమీక్షల్లో కార్యకర్తలు నాయకులే నిందించిన సందర్భాన్ని పురస్కరించుకొని అనేకమంది ఇతర రాజకీయ పార్టీలలో చేరుతున్నట్లు మనం గమనించవచ్చు.  అయితే ఇటీవల ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం గత రెండున్నర సంవత్సరాలుగా ఆర్ ఎఎస్ పి గారు   బీఎస్పీ అధినేతగా  కొనసాగి  బహుజన ఉద్యమాన్ని భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి  కొంత ఊపును తెచ్చిన సందర్భాన్ని మనము కాదనలేము .కానీ అదే సందర్భంలో  నిరంతరము అనేకసార్లు  విమర్శించి నిందించినటువంటి బిఆర్ఎస్ పార్టీతోని ఒప్పందం కుదుర్చుకోవడం పొత్తులో భాగంగా  అధినాయకత్వం నుండి వ్యతిరేకత వచ్చింది అనే పేరుతో పార్టీకి రాజీనామా చేసి  మార్చి 18,2024 సోమవారం రోజున  కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిపోవడం  సర్వత్రా  చర్చనీయాంశం కావడం వెనుక  బలమైన కారణం లేకపోలేదు.   పోలీస్ అధికారిగా కొనసాగడంతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రత్యేక అధికారిగా  ఆ పాఠశాలల ఉత్తమ ఫలితాలకు విద్యార్థుల క్రమశిక్షణకు నైతిక విలువలకు  అంకితభావంతో పని చేసిన అధికారిగా  గుర్తింపు ఉన్న ప్రవీణ్ కుమార్ గారు  భవిష్యత్తు సర్వీస్ను వదిలిపెట్టి  బిఎస్పి లో చేరి ఏకాకి అధ్యక్షునిగా  బాధ్యతలు స్వీకరించి రెండున్నర సంవత్సరాల పాటు  బహుజనులలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మాట వాస్తవమే . అయితే  సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేదని  ఒకే వర్గం వారి చేతిలో నాయకత్వం ఉందని కొందరు విమర్శించినప్పటికీ  అగ్రవర్ణ ఆధిపత్యం ముందు  ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే క్రమంలో పేద మధ్యతరగతి దళిత అట్లడుగు ఆదివాసి బహుజన వర్గాలకు  తోడుగా ఉన్న మాట కూడా వాస్తవం.  అదే సందర్భంలో  అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో  ఘర్షణ వైఖరి అవలంబించి బహుజనుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసం కొన్ని సభలు సమావేశాలతో  భరోసా నింపినప్పటికీ  ఆ ముచ్చట  మూన్నాళ్ల పర్వంగానే మిగిలిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
    రాజీనామా ఎందుకు చర్చనీయాంశం అయింది ?:-
*********""""****
సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చు కోవడంతోపాటు  మెజారిటీ వర్గాల  ప్రయోజనం కోసం  లక్ష్యాత్మకంగా పనిచేసే క్రమంలో  ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని పనిచేయవలసినటువంటి  సందర్భంలో బహుజన సమాజ్ పార్టీని  జనంలోకి తీసుకురావడం,  రెండున్నర సంవత్సరాల పాటు నాయకత్వం వహించి  సామాన్య ప్రజల చెంతకు తీసుకువెళ్లడం , గతంతో పోల్చినప్పుడు కొంత  ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు  .ప్రజలకు భరోసానిచ్చి  ప్రభుత్వాలను  ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించి  ఎదురొడ్డి పోరాడినటువంటి అధినేతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు  బి ఆర్ ఎస్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని  అది నాయకత్వం  రద్దు కోరి నందుకు నిరసనగా రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరడం  చర్చనీయాంశం కాక మరేం అవుతుంది . ఇంతకాలం నమ్ముకున్నటువంటి ప్రజలను బహుజనులను  పక్కదారి పట్టించినట్లా? లేక  గందరగోళానికి గురిచేసినట్లా? అని విశ్లేషకులు  అభిప్రాయపడుతుంటే  నమ్ముకున్న ప్రజలు బహుజనులు కొంత ఆందోళనకు గురైన మాట వాస్తవమే . ఈ సందర్భంలో క్రింది స్థాయిలో ఉన్న పార్టీ శ్రేణులు కార్యకర్తలు  సందిగ్ధంలో ఉంటే మరికొందరు రాష్ట్రస్థాయి నాయకులు  అధినేత దారిలోనే టిఆర్ఎస్ లో చేరడాన్ని బట్టి  ఒక ఎత్తుకు ఎదిగిన బహుజన సమాజ్ పార్టీని ఈ రాష్ట్రంలో  దారి మళ్లించినట్లుగానే కనిపిస్తున్నది.  సిద్ధాంత ప్రాతిపదిక లేని రాజకీయ పార్టీలను ఎవరు విశ్వసించరు కానీ  బహుజన సిద్ధాంతం ప్రాతిపదికగా  సంపూర్ణంగా విశ్వసించి నాయకత్వ వహించి ఒక్కసారి  పార్టీ మారడం అంటే  అందులో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయి  ప్రజల ఆగ్రహానికి గురై  అంతేకాదు  ప్రవీణ్ కుమార్ గారి విమర్శలకు గురైనటువంటి పార్టీలో చేరడం........
ఇది ఆ పార్టీ వ్యక్తిగత అంశమే కావచ్చు కానీ పబ్లిక్ లో నిలబడినప్పుడు ఏ రాజకీయ పార్టీని అయినా ప్రజలు  నిలదీసి విమర్శించే అధికారం ఉంటుంది. కనుకనే ఇవాళ ప్రజలందరూ  ఈ అంశాన్ని  బహిరంగంగా చర్చించుకుంటున్నారు . దళిత బంధు వంటి పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఇది  దళితులను  మభ్యపెట్టడమేనని,  అవినీతి  ఆదిపత్య ధోరణి  ,పేద వర్గాల బహుజనుల అభ్యున్నతికి  టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు ఆటంకము కలిగిస్తున్నాయని  అనేకసార్లు విమర్శించినటువంటి ప్రవీణ్ గారు  అదే పార్టీలో చేరడం  వారు జీర్ణించుకోగలరేమో కానీ ప్రజలుగా  నిరంతరము బహుజన ఉద్యమంలో పరిశీలించి  కలిసిపోయి ఆచరించినటువంటి ప్రజలు అంగీకరించలేకపోతున్నారు.  టిఆర్ఎస్ పార్టీ కూడా 2001లో ఏర్పడిన సందర్భంలో  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ అని గొప్పగా చెప్పుకున్నప్పటికీ  2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే  పార్టీ నాయకత్వం ఆరోజే ఇది ఉద్యమ పార్టీ కాదని  పూర్తిగా రాజకీయ పార్టీ అని  ప్రకటించడాన్ని బట్టి  సాంప్రదాయ పార్టీల వలెనే  సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కూడా ఇలా  ప్రజల విశ్వాసాన్ని  వమ్ము చేయడం అంటే  బాధాకరమే.  ఈ సందర్భంలో ముఖ్యంగా బహుజన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నాయకులు  ప్రజలు  ఇలాంటి సందర్భంలో ఎక్కడికక్కడ స్పందించాలి.  ఉద్యమం ఏరకంగా బలపడింది ? ప్రస్తుతం నాయకత్వ  రాజీనామా వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏంటి ? ఈ నష్టాన్ని పూడ్చుకోవడం ఎలా ?  అధినేతగా ఉండి రాజీనామా చేసిన  సందర్భాన్ని  ఎలా చూడాలి? అనే అంశం పైన లోతుగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది . అదే సందర్భంలో ఓటమిపాలైన పార్టీలో,  నిందించిన పార్టీలోనే  తిరిగి చేరడం ఎవరి ప్రయోజనాల కోసం ? ఇప్పటికే క్రమక్రమంగా ఖాళీ అవుతూ  కార్యకర్తలు నాయకుల విమర్శలకు గురవుతున్న టిఆర్ఎస్ పార్టీలో 
చేరడం అంటే  దాని వెనుక ఉన్న ప్రయోజనాలు ఏమిటో  వేచి చూస్తే కానీ అర్థం కాదు.  అయినా సిద్ధాంతాలకు  కట్టుబడి సమర్థతతో పనిచేసినటువంటి నాయకులు  ఇలాంటి సందర్భాలలో పార్టీలు మారినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ కోవలోని వారే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావడ మే చర్చ జరగడానికి మరింతకారణమయ్యింది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు  హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట  తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333