తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరు ఆసక్తికరo

Apr 7, 2024 - 19:07
Apr 12, 2024 - 02:30
 0  20

 కట్టు కథలు కల్లబొల్లి కబుర్లతో  తప్పించుకునే ప్రయత్నాలు.

వాదోపవాదాలు,  అధికారపక్షంపై  బెదిరింపుల ధోరణి .

పాలకుల విధ్వంసాన్ని ప్రజలకు  విప్పి చెప్పే ప్రయత్నమే ఈ లఘు చర్చ.

చర్చల్లో మాతృభాషకు గ్రహణం. ఇంకా చావని పులుపు.

అసెంబ్లీ సమావేశాలు  ప్రజాధనంతో  నిర్వహించబడే  బాధ్యతాయుతమైన  పాలనకు ప్రతిరూపాలు.  ఎక్కువ పని దినాలు నిర్వహించడం ఎంత ముఖ్యమో  బాధ్యతాయుతంగా  ప్రజా సమస్యల మీద  చర్చించడం కూడా అంతే ముఖ్యం.  కానీ అందుకు భిన్నంగా ఇటీవరి కాలంలో పార్లమెంట్ తో సహా  అనేక రాష్ట్రాలలోని చట్టసభలు  తమ పని దినాలను తగ్గించుకోవడమే కాకుండా  ప్రతిపక్షాల చర్చలకు  ప్రశ్నలకు  సమాధానాలు ఇవ్వలేక  తప్పించుకో చూసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి.  కానీ  తెలంగాణ రాష్ట్రంలో గత 10ఏళ్ల కాలంలో  పని దినాల సంఖ్య కూడా  తగ్గడమే కాకుండా  బలమైన ప్రతిపక్షాలను లేకుండా చేసి ఏకస్వామ్య పాలన  కొనసాగించిన తీరు,  అసెంబ్లీలో చర్చకు తావులేని సందర్భాలు  మనమందరం చూసి ఉన్నాము. కానీ దానికి భిన్నంగా  ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో  టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి  కాంగ్రెస్ ప్రభుత్వం అవతరించిన తర్వాత జరిగిన  శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన జరిగిన ఒకటి రెండు రోజుల చర్చల్లోనూ,  రెండు రోజుల వ్యవధి   తర్వాత ఆర్థిక పరిస్థితి పైన   ఏర్పాటుచేసిన ప్రత్యేక  సమావేశంలోనూ  అసెంబ్లీలో జరిగిన చర్చ  వాదోపవాదాలు, విమర్శలు, బెదిరింపులు  దిగజారిన రాజకీయానికి గుర్తుగా మనం భావించవలసి ఉంటుంది .

 ఓటమి తర్వాత కూడా  తమకు అధికార పార్టీ కంటే కేవలం  25 సీట్లు మాత్రమే తక్కువ వచ్చి నట్లు  కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలో కొనసాగడాన్ని సహించని  బి ఆర్ ఎస్ పార్టీ  శాసనసభ్యులు  ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ ఇతరులు  అధికార పార్టీ  ప్రకటించిన గత పాలనలోని ఆర్థిక అరాచకత్వాన్ని  సహించడానికి సిద్ధంగా లేక రెచ్చిపోయిన సందర్భాలను మనం గమనించవచ్చు.  గవర్నర్ ప్రసంగాన్ని,  ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి లఘు చర్చ నివేదికను  కూడా తప్పుల తడకగా అభివర్ణించడం  టిఆర్ఎస్ పార్టీకే చెల్లింది . తమ పరిపాలనా కాలంలో  అనుత్పాదకరంగం మీద ఖర్చు చేసి అప్పులు పెంచి  నిరుద్యోగులకు చేసిన మోసాన్ని  ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నాణ్యత ప్రమాణాల లోపాన్ని  బారాస పార్టీ అంగీకరించడానికి సిద్ధపడకపోవడం  పైగా అధికార పార్టీని  ఆర్థిక నివేదికను తప్పుపట్టే ప్రయత్నం చేయడం
ఆడ లేక మద్దెల ఓడింది అన్నట్లుగా మనకు కనిపిస్తున్నది . తమకు శాసన సభ్యత్వంలో అనుభవం ఎక్కువగా ఉన్నదని,  తామే పాలనా దక్షులమని,వక్తలమని  కాంగ్రెస్ పార్టీ  వర్గాలకు పరిపాలన సాధ్యం కాదని  అవగాహన లేదని  మాటల్లో కాకపోయినా చేతల్లో హేళన చేసే ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉన్నది.  కానీ పది సంవత్సరాల పరిపాలన తీరు, చేసిన అప్పులు,  ఆర్థిక అరాచకత్వం, ఆర్థిక విధ్వంసం  ,రాష్ట్రంలో  ఉన్నటువంటి
నిధుల లోటు,  కనీసం ఉద్యోగులకు కూడా వేతనాలు సకాలంలో చెల్లించలేని  దుస్థితిని విమర్శించినప్పుడు తట్టుకోలేకపోవడం  పరోక్షంగా వైఫల్యాన్ని ఓటమిని అంగీకరించడమే అవుతుంది .  స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రుల  స్థానాలను, చట్టసభలను  గౌరవించడానికి సిద్ధంగా లేని  ఆదిపత్య ధోరణినీ  ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ  పక్షాన మాట్లాడిన నాయకులలో  చూడవచ్చు.
       
  కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలు  గత పాలనా కాలంలోనే వైఫల్యాలను  సమీక్షించిన అధికారులు విషయాలను దాచిపెట్టినట్లు  నిర్మాణం చేసిన కంపెనీ ఎల్ అండ్ టి  ఎన్నికల సమయంలో పునర్నిర్మించడానికి సిద్ధమని ప్రకటించినట్టు పత్రికల్లో చూసి ఉన్నాము. కానీ ప్రస్తుతము  ఒప్పందం ముగిసిపోయిందని తమకేమీ సంబంధం లేదని L &T  కథనాలు రావడం వెనుక  టిఆర్ఎస్ పార్టీ యొక్క  కుట్ర దాగి ఉన్నట్లుగా శాసనసభలో వారి మాటలను బట్టి తెలుస్తుంది . ఏది ఏమైనా అన్ని నిర్మాణాలతో పాటు ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల  మేడిగడ్డ అన్నారం బ్యారేజీలలో  కనిపిస్తున్నటువంటి వైఫల్యాలను  సుదీర్ఘంగా చర్చించి  సిట్టింగ్ జడ్జ్ లేక ఇతరత్రా వేదికల ద్వారా విచారణకు ఆదేశించడం ద్వారా  గత ప్రభుత్వం యొక్క అవినీతిని బట్టబయలు చేయవలసిన అవసరం మాత్రం తప్పకుండా ఉన్నది. ఈ విషయంలో ప్రతిపక్షం కూడా మాట వరసకు సహకరిస్తామని చెప్పడం వెనుక  ఉన్న రహస్యం విచారణ తర్వాత కానీ తెలియరాదు.

ఆర్థిక చర్చ  గత పాలకుల వైఫల్యాన్ని ప్రజలకు తెలియ చెప్పడానికి  ఎంతో దోహదపడుతుంది:-

  రాష్ట్ర విభజన నాడు 64 వేల కోట్ల రూపాయల మిగులుతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం  ఆ తర్వాత టిఆర్ఎస్ పరిపాలన కాలంలో మద్యం ద్వారా తన ఆదాయాన్ని పదివేల కోట్ల నుండి సుమారు 40 వేల కోట్లకు పెంచుకోవడం ద్వారా  అధిక ఆదాయాన్ని సమకూర్చుకున్నప్పటికీ  ప్రభుత్వ భూములు అమ్మడం,
  భూ కబ్జాలకు పాల్పడడం,  అన్నింట్లో అవినీతి  లో ప్రభుత్వం భాగస్వామి అయినట్లు  ఇటీవల ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శనాస్త్రాలను బట్టి తెలుస్తుంది. కానీ  బారాస పార్టీ మాత్రం సరైన సమాధానం చెప్పకుండా దాటవేసి  అప్పులు పెరిగినప్పటికీ ఆస్తులు కూడా పెరిగినవి కదా వాటి గురించి ప్రస్తావించడం లేదు అని మాట్లాడుతూనే  50 కోట్ల రూపాయలతో  రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి చీఫ్ గా ఎన్నికైనడని  హరీష్ రావు చేసినటువంటి  ప్రకటన పెను వివాదానికి  విమర్శకు  దారి తీసినది.  స్పీకర్  విమర్శను వాపస్ తీసుకోమని ఆదేశించడం,  శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ అనేకమంది మంత్రులు శాసనసభ్యులు అధికార పార్టీ వాళ్లు హరీష్ రావును నిలదీయడం  జరిగింది.  రాజగోపాల్ రావు  చేసిన వ్యాఖ్య కు బదులుగా  విమర్శ చేశానని హరీష్ రావు చెప్పడం  సంబంధం లేని ముఖ్యమంత్రిని వివాదములోకి లాగడం  హరీష్ రావు యొక్క అసంబద్ధ విధానం కాక మరేమవుతుంది?  అందుకే మంత్రులందరు ముప్పేట దాడి చేసి  నోరు మూయించిన విషయాన్ని కూడా మనం అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసిన సందర్భంలో గమనించవచ్చు .  ఒక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత  రాబోయే ఐదేళ్ల కోసం పరిపాలన చేసే క్రమంలో గత పాలకుల యొక్క వైఫల్యాలను ఆర్థిక దుస్థితిని ప్రజలకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా చూపడానికి ప్రత్యక్షంగా  టీవీల ద్వారా చట్టసభల ప్రసారాలు  ఎంతో దోహదపడతాయని  మనం గుర్తించవచ్చు. ఎందుకంటే  టీవీల ముందు లేనటువంటి అనేక మంది సామాన్యులు కూడా  తమ సెల్ ఫోన్ల ద్వారా యూట్యూబ్ ఛానల్ లో  చట్టసభల చర్చలను వినడాన్ని బట్టి గమనిస్తే  ప్రజలు  అసెంబ్లీ సమావేశాల ప్రసారాల పట్ల ఎంత ఆసక్తిగా గమనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు . అంతేకాకుండా అధికారానికి వచ్చి కనీసం పది రోజులు కూడా కాకముందే  అధికారానికి వచ్చిన ఒకటి రెండు రోజులలో  ప్రభుత్వాన్ని విమర్శించడం, గ్యారంటీలను అమలు చేస్తారా లేదా అని ఆదేశించడం , నమ్మకం లేదు అని  అసహనాన్ని వ్యక్తం చేయడం,  గ్యారెంటీలను అమలు చేయడానికి మీకు ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? అని చట్టసభలో ప్రశ్నించడం  బట్టి చూస్తే  టిఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలను పదేళ్ల తర్వాత కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితులను గమనించినప్పుడు  ఈ పార్టీ శాసనసభ్యులకు నిన్న మొన్ననే అధికారానికి వచ్చిన ప్రభుత్వాన్ని  నిలదీసే హక్కు అర్హత ఎక్కడిది ?అని  ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు . ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడినటువంటి టిఆర్ఎస్ శ్రేణులు నాయకులు  ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారు అని  ఆశ్చర్యం వ్యక్తం చేసే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి  జారుకోవడం అత్యంత విచారకరం  .ఇదంతా అధికారం కోల్పోయి,  ప్రతిపక్షంలో కూర్చుని,  ఇతరుల నాయకత్వాన్ని అధికారాన్ని  గుర్తించడానికి గౌరవించడానికి సిద్ధంగా లేనటువంటి కుసంస్కారానికి నిదర్శనంగా మనం భావించవలసి ఉంటుంది .అయితే
  ఈ రకమైనటువంటి వాడి వేడి చర్చలు  గత సభలో లేకపోవడాన్ని మనం గమనిస్తే  ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేసి చర్చకు తావు లేకుండా చేసినారో మనం అర్థం చేసుకోవచ్చు.  వాస్తవంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షం బలంగా ఉండడం అనేది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది  నిజమైనటువంటి ప్రభుత్వ పని విధానానికి సూచికగా ప్రతిపక్షం యొక్క బలాన్ని అంచనా వేయవచ్చు.  చర్చలు ప్రశ్నలు ఎంత  విస్తరించినా అభ్యంతరం లేదు కానీ  చట్టసభల హుందాతనాన్ని  పదవిలో కొనసాగుతున్న వారి గౌరవాన్ని  కాపాడకపోయినట్లయితేనే  అది అహంకారానికి, అమర్యాదకు,  ఆత్మవంచనకు దారితీస్తుంది అని ముఖ్యంగా  టిఆర్ఎస్ పార్టీ గుర్తిస్తే మంచిది .

  ఇక ఒకటి రెండు పార్టీల సభ్యులు  57 ఏళ్లలో జరిగనటువంటి అభివృద్ధి కేవలం పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని  టిఆర్ఎస్ పార్టీని మెచ్చుకోవడం ప్రశంసించడం  ఏ రకంగా సబ బో అర్థం కాదు.  వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 35 సంవత్సరాల పాటు మాత్రమే కాంగ్రెస్ పరిపాలన చేసింది  ఇతర కాలమంతా తెలుగుదేశం పార్టీ  అధికారంలో ఉన్నది . ఇక గమ్మత్తయిన విషయం ఏమిటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పరిపాలన చేసింది అలాంటప్పుడు   ఇతర పార్టీల గురించి ప్రశ్నించే  ఆస్కారమే లేదు . ఇక  తెలంగాణ రాష్ట్రం అచ్చమైన తెలుగు రాష్ట్రం  .పరిపాలన , చట్టసభల నిర్వహణ , వెలువడే ఉత్తర్వులు అన్నీ కూడా తెలుగు భాషలో కొనసాగాలని అనేక దశాబ్దాలుగా  ఉద్యమాలు డిమాండ్లు వస్తున్నప్పటికీ  ఈ చట్టసభలో మాత్రం ఆంగ్లంలో మాట్లాడడానికి  పోటీ పడడం  సభ్యుల అవగాహనతో సంబంధం లేకుండా భాషను ప్రయోగించి  వ్యక్తిగత ప్రాబల్యాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం కూడా  తెలుగు భాషను చట్టసభల హుందాతనాన్ని అవమానించడమే అవుతుంది.  కచ్చితంగా అసెంబ్లీలో  చర్చ జరిగిన సందర్భంలో ప్రతి సభ్యుడు కూడా విధిగా తెలుగులోనే మాట్లాడాలని తద్వారా  ప్రసారాలను చూస్తున్నటువంటి సామాన్య ప్రజానీకానికి అవగాహన చేసుకోవడానికి వీలవుతుందని  స్పీకర్ ఆదేశించడం ద్వారా తెలుగు భాషను పూర్తిస్థాయిలో అమలు చేసే ప్రయత్నం జరగాలి.  చర్చలను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సామాన్య ప్రజానీకం కూడా చింత చచ్చినా పులుపు ఇంకా చావలేదని, ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు  కసి అహంకారం  నిజాలను జీర్ణించుకోలేకపోవడం  అలవాటుగా మారిందని ప్రజలు గుసగుసలు పెట్టుకోవడాన్ని  గమనిస్తే  అధికార పార్టీతో సహా అన్ని విపక్ష సభ్యులు కూడా  ప్రజల ముందు  చాలా జాగ్రత్తగా మర్యాదగా హుందాతనంగా  ప్రజల భాషలో ప్రజా కోణంలో ప్రజా సమస్యలపైనే మాట్లాడడం ద్వారా చట్టసభలకు  గౌరవాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుందాం. అహంకారం,  ఆధిపత్యానికి తావు లేకుండా  మానవీయ కోణంలో గౌరవ మర్యాదలతో సభలు కొనసాగాలని ఆశిద్దాం .

--  వడ్డేపల్లి మల్లేశం

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333