మహిళలను అంగడి సరుకుగా  ఆట బొమ్మగా  అశ్లీలంగా చూపించడాన్నీ

May 11, 2024 - 22:31
Jun 6, 2024 - 17:06
 0  20
మహిళలను అంగడి సరుకుగా  ఆట బొమ్మగా  అశ్లీలంగా చూపించడాన్నీ

వ్యతిరేకించడానికి మహిళా సంఘాలకు గల అభ్యంతరం ఏమిటి ?

సమాజం, బుద్ధి జీవులు,   స్త్రీలు మౌనంగా ఉంటే  

అంగీకరించినట్లే అవుతుంది కదా!* 

 అసభ్యంగా చూపించే ప్రతి సన్నివేశాన్ని  

సమాజం ముక్తకంఠంతో ఖండించి  పాలకుల కళ్ళు తెరిపించాలి .

---వడ్డేపల్లి మల్లేశం 

అసమానతలు అంతరాలు లేని వ్యవస్థను,  పరిస్థితులను,  కుటుంబాలను  ఏ మూలకైనా భారతదేశంలో చూడలేనట్లే  స్త్రీలను అంగడి సరుకుగా ఆట బొమ్మగా మార్కెట్ వస్తువుగా  అశ్లీలంగా  అసభ్య పదజాలంతో  వికృతంగా ప్రదర్శింప చేసే  దుష్ప్రచారo  లేని చోటు  ఎంత వెతికినా దొరకదు . మంచిని పెంచాలి  మమతలు పంచాలి  అనేది పెద్దలు చెప్పిన నానుడి  దానికి భిన్నంగా చెడు తలంపులు  వికృత ఆలోచనలు  అసమ సమాజం సర్వత్ర వ్యాప్తి చెందిన చోట  స్త్రీల పట్ల సమాజం యొక్క  వివక్షత ధోరణి  అంతా అంతా కాదు.  

 అయితే దీనికి గల మూలాలను తెలుసుకోవలసిన అవసరం  అందరి పైన ఉంది.  ఒక ఇంటి కోడలు  వయసు పైబడి  కోడలు వచ్చిన తర్వాత అత్తగా మారి  ద్వంద ప్రమాణాలు పాటించినట్లు  ఆదర్శాలు వల్లించి  స్త్రీలు కన్నీరు కార్చకూడదని,  స్త్రీలు గౌరవించబడనీ దేశం స్మశానంతో సమానమని  నినదించే ఈ దేశంలో  అదే మగాళ్లు  తమ కుటుంబ సభ్యులైతే ఒక తీరు ఇతరులైతే మరొక తీరుగా వ్యవహరిస్తున్న ద్వంద నీతి కారణంగా  ఇలాంటి వికృత ప్రచారాలకు ప్రదర్శనలకు ఆజ్యం పోస్తున్నట్లుగా మనం భావించవలసి ఉంటుంది. .

  అనేక ఇతర కారణాల వలన  ప్రదర్శనలు ప్రచారాలు పబ్బులు క్లబ్బులు ఈవెంట్లలో నడుస్తున్నటువంటి వికృత చేష్టలు క్రీడల వలన  పరిణామ క్రమంలో అత్యాచారాలు అకృత్యాలు, హత్యలకు దారితీస్తున్న విషయాలను కూడా మనం గమనించాలి . తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారం లోపించి,  స్వార్థం అసూయ కుట్ర కుతంత్రాలతో  వ్యక్తిగత జీవితాన్ని చట్టబద్ధం చేసుకుంటున్న ఈ సమాజంలో  ప్రతి అవకాశాన్ని కూడా  స్వప్రయోజనాలకు వాడుకునే క్రమంలో  స్త్రీలు బలవుతూనే ఉన్నారు. అయినప్పటికీ  ప్రతిఘటించకపోవడం,  ఉద్యమించినా తాత్కాలికంగా చల్లారడం , సంఘటనలపై తగిన శిక్షలు లేకపోవడం,  ఇది మామూలే తప్పదు అనే ధోరణిలో పాలకులు, వ్యవస్థ  వ్యవహ రిస్తున్న కారణంగా  మార్చలేనంత స్థాయికి ఎదిగి  వికృత చేష్టలే చట్టబద్ధమా? అని  ప్రశ్నించుకోవలసిన గడ్డుకాలం దాపురించినది.

 కొన్ని సందర్భాలను పరిశీలిస్తే :-

మార్కెట్లో ప్రతి వస్తువు యొక్క ప్రచార కార్యక్రమంలో  స్త్రీల  బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి.  అదికూడా అర్ధ నగ్నంగా  రెచ్చగొట్టే విధంగా  వికృత ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా ఉండడం  మనం నిత్యం కల్లారా చూస్తూనే ఉన్నాం.  ఈ విధానం ఏమి రాజ్యాంగంలో రాయబడి లేదు, ఇది చట్టబద్ధమని కూడా ఎక్కడా చట్టాలు చెప్పలేదు. కానీ ఎందుకు అమలవుతున్నది.?  చైతన్యం లేకపోవడం,  ప్రతిఘటించకపోవడం,  ఇంతేలే అని మనసు మార్చుకోవడం,  తప్పదు అని తృప్తి పడడం వంటి  దుర్నీతి,  బలహీనత  సోమరితనము,  దా ట వేసే ధోరణి,  వాయిదా వేసే మనస్తత్వం  వలన ఇలా జరుగుతున్నదని అందరం అంగీకరిస్తే పరిష్కారం దొరుకుతుంది .

 ఇక బయట కనిపించే హోర్డింగులు బోర్డులు ఫ్లెక్సీలు, బ్యానర్స్ వాల్ పోస్టర్లు  ప్రతి చోటా కూడా  ఏదో రకంగా స్త్రీ పాత్రకు  అవకాశమిచ్చి  ప్రత్యేకంగా చూపించి  ఆకర్షించే విధంగా  ప్రదర్శించడం వ్యాపార వాణిజ్య వర్గాలకు అలవాటుగా మారిపోయింది.  ఇక టీవీలలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో కూడా  న్యాయ నిర్ణయితలే అర్ధ నగ్నంగా వ్యవహరించడం  పాత్రధారులు కూడా  అసభ్యంగా అశ్లీలంగా  తమ పాత్రలను పోషించడం  సమాజంలో ముఖ్యంగా మగవాళ్ళలో రెచ్చగొట్టే విధంగా  డ్రెస్సింగ్ అలంకరణ  ఉనికి  చూపరు లను కట్టిపడేసే విధంగా  ఉండడాన్ని మనం గమనించవచ్చు.  ఇది పాత్రలను పోషిస్తున్న వాళ్లదా ? లేక నిర్వాహకుల యొక్క  నిర్బంధ  ఆదేశమా?  డబ్బు కోసం ఏ స్థాయికైనా దిగజారి  నటించే దౌర్భాగ్యమా?  ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతుక్కోవలసిన అవసరం ఉంది .

 "వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం" అని శ్రీశ్రీ  ప్రజా జీవితానికి నిర్వచనం ఏనాడో ఇవ్వడం జరిగింది . టీవీ ప్రసారాలలో సినిమాలలో  ఇలాంటి బూతు సన్నివేశాలు మాటలను  ప్రజల ముందుంచినప్పుడు  ప్రశ్నించడానికి ప్రతిఘ టించడానికి వ్యతిరేకించడానికి  అవసరమైతే నిషేధించడానికి ఉద్యమాలు చేయడానికి అయినా ప్రజలు వెనుకాడరని నిర్వాహకులు పాలకులు గుర్తిస్తే మంచిది.  పరిమితి మించితే ఏదైనా  విసర్జించ తగినదే.  ఇక ప్రభుత్వం ఆమోదించినటువంటి ప్రైవేటు నిర్వహణలో నడుస్తున్నటువంటి క్లబ్బులు పబ్బులు ఈవెంట్లలో  అర్ధరాత్రి వరకు కూడా యదేచ్చగా యుక్త వయసులో ఉన్న స్త్రీ పురుషులు  విచ్చలవిడిగా వ్యవహరిస్తూ  నాగరికతకు  నైతిక ప్రవర్తనకు ద్రోహం చేస్తున్నట్లుగా అనేక కథనాలు  మేధావులు బుద్ధి జీవులు అభిప్రాయపడుతున్నారు .

 అలాంటి వాటిని ప్రభుత్వమే చట్టబద్ధంగా అనుమతించి నిర్వహించడం సిగ్గుచేటు.  వెంటనే నిషేధించడంతోపాటు  నిర్వాహకుల పైన కేసులు పెట్టి జైలు పాలు చేయాలి  ప్రజా జీవితం ప్రశాంతంగా గడవాలన్నా,  మనుషులంతా సమానమే అని బుద్ధుని బోధనలు అమలు జరగాలన్న,  ఇలాంటి వికృత చేష్టలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఉక్కు పాదం కూడా మోపాలి. ఇక సెల్ఫోన్ వ్యవస్థలో చూసినప్పుడు  నేను ఒంటరిగానే ఉన్నాను వస్తారా,  నన్ను పెళ్లి చేసుకుంటారా,  నేను వితంతువును మీకు నచ్చితె రండి,  నా భర్త మా ఇంట్లో లేడు వెంటనే రండి .....

 అంటూ అనేక వ్యాఖ్యలతో కూడినటువంటి ఫోటోలు వీడియోలు అనునిత్యం యూట్యూబ్లో దర్శనమిస్తూనే ఉన్నాయి . ఈ ఫోటోలను ఎవరు డిమాండ్ చేశారు? ఎవరు ప్రసారం చేస్తున్నారు? దీనికి బాధ్యులు ఎవరు?  బాధితులు మాత్రం తెలియకుండా వేల సంఖ్యలో ఉంటారు జాగ్రత్త!  ఫేస్బుక్లో గాని యూట్యూబ్ లో గాని  అనేక  వీడియోలు ఫోటోలను పరిశీలించినప్పుడు  కొన్ని మాత్రమే జ్ఞానానికి  మేధస్సుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కానీ  మిగతా అన్ని విషయాలు కూడా స్త్రీలు లేకుండా ఏ  అంశం లేకపోవడం  అతిగా వ్యవహరించడం మితిమీరి మాట్లాడడం  నోరు జారడం  మనసు చంపుకొని  మనిషి అమ్ముడు పోయినట్లుగా వ్యవహరించడం  నాబోటి వారి కైతే  మనసు గాయపడడంతో పాటు  అన్నింటిని చూస్తూ మౌనంగా  అనుభవిస్తున్నటువంటి ఈ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిందే అనిపిస్తున్నది . వీటి పరిణామాలను  పరిశీలించినప్పుడు  ముఖ్యంగా పేదవర్గాలపైన  ఆకృత్యాలు అత్యాచారాలు దోపిడీ, హత్యల పేరున అనేక రకాలుగా  ప్రభావం పడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అనేక ఆధారాలు గణాంకాలు కూడా మనకు స్పష్టంగా ఉన్నాయి.

  ఇదే అదనుగా భావించి కొన్ని  వర్గాలు  అట్టడుగు వర్గాలను కనీసం మనుషులుగా కూడా చూడకుండా ఆట వస్తువుగా బొమ్మగా భావించి  అన్ని రకాల అనుభవించి ఆ కుటుంబాలను నాశనం చేసిన సందర్భాలను కూడా ఈ దేశంలో అనాదిగా మనం చూడవచ్చు.  అత్యాచారాలు  హత్యలు జరిగిన సందర్భంలో  చట్టాలు రూపొందినప్పటికీ  మహిళలను  చిన్న చూపు చూడడం,  వ్యాపార వాణిజ్య అవసరాలకు  లాభాలకు వస్తువుగా  వినియోగించడం,  ఆ క్రమంలో   పొంగుతున్న భావావేశం  కలుగుతున్న అనుభూతి,  అనంతర కాలంలో వికృత ఆలోచనగా పరిణామం చెంది అనేక కృత్యాలకు దారితీస్తున్న విషయాన్ని  మేధావులు మానసిక వేత్తలు  ప్రభుత్వాలకు నివేదికల రూపంలో అందించినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం  ఏ లాంటి చర్యలు తీసుకున్న దాఖలా లేదు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెల్ఫోన్ వ్యవస్థ టీవీ వ్యవస్థ ప్రసార వ్యవస్థ  వ్యాపార వాణిజ్య  రంగం  అన్నింట్ల ఎంతో కొంత తేడాతో దేశవ్యాప్తంగా అమలు కావడాన్ని మనం గమనించవచ్చు.  ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో?

వికృత క్రీడకు  ముగింపు లేదా?

మహిళలు మహిళా సంఘాలు  ప్రతిఘటించడంలో ముందు వరుసలో ఉండే బదులు ఎక్కడా కూడా ప్రశ్నించిన దాఖలా కనిపించకపోవడంతో  ప్రతిఘటించడానికి అభ్యంతరం ఏమిటో  అర్థం కావడం లేదు  .అమలు అనేది తర్వాత విషయం కానీ  వ్యతిరేకించడం  మన జన్మ హక్కు అనే ఆలోచన లేకపోతే ఎలా?    ఈ దేశ భవిష్యత్తు  యువత పైన ఆధారపడి ఉన్నదని గొప్పగా చెప్పుకునే మనం  ఆ యువతే  ఇలాంటి వికృత  చేష్టలకు  సారథిగా కేంద్రంగా నిలిస్తే  ఇక ప్రశ్నించే వారెవరు ?

 బుద్ధి జీవులు మేధావులు ప్రజల సమస్యలు  ఆటుపోట్లు ఆక్రందనల పైన దృష్టి సారించినంత స్థాయిలో  స్త్రీల సమస్యలు  అశ్లీలత అర్ధ నగ్న దృశ్యాలు  వివక్షత పైన దృష్టి సారించకపోవడం కూడా  ప్రజా ఉద్యమాలు బలంగా రాకపోవడానికి కారణం కావచ్చు . మహిళా రచయిత్రులు  సామాజిక కార్యకర్తలు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ  ఇతర వర్గాలు కళాకారులు మేధావులతో కలిసి ఉద్యమించవచ్చు కదా ! అలాంటి ఉమ్మడి ఆలోచన కూడా లేకపోవడం చాలా విచారకరం.  వ్యక్తిగత జీవితాన్ని చట్టబద్ధం చేసి ప్రజాజీవితంగా మార్చి బహిరంగపరిచి  ప్రశ్నించకూడదంటే  ఎలా ? పబ్లిక్ లోకి వచ్చిందంటే ప్రశ్నించడమే  మన హక్కు ఆనవాయితీ కూడా.  రాజకీయ నాయకులు కూడా ఎక్కడ కూడా  ప్రస్తావించిన దాఖలా కనిపించదు పైగా  ఈ అంశాలను పట్టించుకోకుండా విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతోనే ముగిస్తారు.

 తమ కుటుంబ సభ్యులకు తమధాకా వస్తే కానీ తెలియదన్నట్లు ఎవరికైనా  అనుభవంలోకి రాకుండా  ఆవేదన,  రోదన అర్థం కాదు కూడా . ప్రజలు కూడా ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి  ప్రజా సంఘాలు బుద్ధి జీవులు  అన్నింటి పైన నిషేధం విధించే విధంగా మత్తు పదార్థాలు మద్యం  మనిషిని పెడదారి పట్టించే ఇతర అంశాలను  తుద ముట్టించే వరకు పోరాటం చేయడమే ఏకైక మార్గం.  పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నట్లు ప్రశ్నించకుండా పోరాడకుండా వ్యవస్థలో ఏ మాత్రం మార్పు కూడా సాధ్యం కాదు ." అందుకే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా" అని  శ్రీశ్రీ  హెచ్చరించిన తీరు  మనకు,  పౌర సమాజానికి జ్ఞానోదయం అయినప్పుడే  స్త్రీల సమస్యలతో పాటు  ముడిపడిన సమాజంలోని అన్ని సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది .


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333