వ్యాసం శిల్పము. - ప్రయోజనాలు
కొందరి సందేహాలకు సమాధానాలు .* మిగతా ప్రక్రియలతో గల భిన్నత్వం .చర్చ సద్విమర్శకు ఆస్కారం ఉండేదే నిజమైన వ్యాసం.
అంతేకాదు పరిశోధకుల పరిశోధనకు తోడ్పడాలి కూడా.
--- వడ్డేపల్లి మల్లేశం
విభిన్న ప్రక్రియల లో కొనసాగుతున్న సాహిత్యం సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ చారిత్రక సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో దాని ప్రయోజనాలను కలిగి ఉంటుంది . ఒక్కొక్క ప్రక్రియ ఒక్కోరకంగా ప్రజల జీవితాల పైన ప్రభావం చూపే శక్తి కలిగి ఉన్నప్పుడు రచయితలు తాము ప్రవేశము ఉన్న ప్రక్రియతో పాటు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రక్రియను కూడా పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. కొన్ని ప్రక్రియలు కేవలం సాహిత్యం అని చెప్పుకోవడానికే కానీ అంతగా ప్రభావం ఉండ ని అంశాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు కవిత్వంలో భావ కవిత్వం ఊహ లోకంలో విహరింపజేసేదిగా ఆచరణ సాధ్యం కాని దాన్ని అనూహ్యంగా మలుచుకోవడం వంటి శిల్ప ప్రక్రియ అందులో కొనసాగుతుంది . రచయిత యొక్క శిల్ప ప్రతిభను పొగడమే తప్ప దానివల్ల సమాజానికి వనగూ రే ప్రయోజనాన్ని కూడా రచయితలుగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. .ప్రధానంగా గేయాలు పాటలు ప్రజా జీవితాన్ని విస్తృతంగా ప్రభావితం చేస్తాయి ప్రజల నుండి ప్రజా ఉద్యమాల నుండి వచ్చినటువంటి పాటలు ఆ కోవలో రాసే రచయితల యొక్క పాటలు అద్భుతమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం నాడు అనేక బుర్రకథలు హరికథలు ఒగ్గు కథలతో పాటు ఇటీవలి తెలంగాణ తొలి మలి వివిధ దశల ఉద్యమ సందర్భంగా కూడా విస్తృతమైన కవిత్వం వ్యాప్తిలోకి వచ్చినప్పటికీ ప్రధానంగా పాట తన ప్రభావాన్ని చూపిన తీరు ఉద్యమానికి తలమానికమని చెప్పక తప్పదు .సమస్యను విప్పి చెప్పి కర్తవ్యం వైపు దృష్టిసారించేలా పాఠకులను సిద్ధం చేసే తీరు పాటకు ఉన్న మంచి లక్షణం .
మరికొందరు పద్య కావ్యాలు నవల నాటకము కథ గల్పికలు లలిత గేయాలు బాల గేయాలు సామాజిక చైతన్య గేయాలు ఇలాంటి రూపాలలో సమాజానికి హితాన్ని చేకూర్చడానికి కవులు రచయితలు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు . తెలంగాణ ఉద్యమ కాలంలో పాటలను కవితలను రాయడంతో పాటు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి అనేకమంది కవులను మనం చూడవచ్చు అందులో దాశరథి కాళోజి అగ్రభాగాన నిలిచిన విషయం మనకు తెలిసిందే .
వ్యాసం యొక్క ఉనికి కొన్ని లక్షణాలు :-
-------------
సాధారణంగా మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు వ్యాసాల పైన ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన సందర్భంలో ఆనాటి భాషా ఉపాధ్యాయులు వ్యాసం అంటే ఉపోద్ఘాతం, విషయ వివరణ, లాభాలు, నష్టాలు, ముగింపు అనే శీర్షికలు ఉండాలని స్పష్టంగా తెలిపేవారు. ఈ పద్ధతి విద్యార్థి దశలో పోటీకీ కనీస అవగాహన కోసం నిర్దేశించబడినది . అదే ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయిలో వ్యాస ప్రక్రియ మరింత విస్తృత స్థాయిలో కొనసాగించవలసి ఉంటుంది .వచన రూపంలో కొనసాగే వ్యాస ప్రక్రియలో సందర్భోచితంగా కొన్ని కవితా పంక్తులు, సూక్తులు, పద్య పాదాలు, గేయంలోని భాగాలను కూడా పొందుపరచడం జరుగుతూ ఉంటుంది . కొన్ని సందర్భాలలో అంశానికి సంబంధించి ఒక వ్యక్తి లేదా సమూహం తన భావాలను విప్పి చెప్పినప్పుడు ప్రత్యక్షంగా అదే మాటల్లో పొందుపరచడం కూడా వ్యాసంలో ఒక కీలక అంశం .అన్ని ప్రక్రియలలో వలేనే సామాజిక, రాజకీయ, ఆర్థిక ,చారిత్రక, భౌతిక, పౌరాణిక ,ఆధ్యాత్మిక విభాగాలకు సంబంధించిన వ్యాసాలు ఉంటాయి ఆయా రంగాలలో నిపుణులు ఆ వ్యాసాలను రాస్తూ ఉంటారు. ప్రధానంగా మనిషి జీవితానికి సంబంధించి చరిత్ర గమనములో వర్తమానం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భావి సవాళ్లను అధిగమించే క్రమంలో ఎదురవుతున్న ఆటంకాలను అవిగమించే ప్రయత్నాలను, బాధ్యత విస్మరిస్తున్న వర్గాలను ఎత్తిచూపుతోనే తన ముగింపును వ్యాసం లో రచయిత ఇస్తాడు. ముఖ్యంగా రాజకీయ చారిత్రక వ్యాసాలలో గణాంకాలు సాధారణంగా పొందుపరచవలసిన అవసరం ఉంటుంది .తద్వారా ఆ అంశానికి సంబంధించి సరైనటువంటి ఆధారాలను సమకూర్చినట్లు అవుతుంది. అవసరాన్ని బట్టి, విషయాన్ని బట్టి, దాని పరిధిని బట్టి , విశ్లేషించడం వర్ణించడం పోల్చడం వంటి కోణంలో రచనలు కొనసాగించవలసిన అవసరం ఉంటుంది . .నడుస్తున్న చరిత్ర దాని వెనుక ఉన్న పూర్వాపరాలు దానీ పైన భిన్నాభిప్రాయాలను రచయిత తన ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా రాబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని దగ్గరి దారిలో ప్రజా ప్రయోజనాన్ని అందించడానికి సాహిత్యానికి ఉన్నటువంటి బాధ్యతను చక్కగా నిర్వహించవలసిన అవసరం ఉంటుంది .
వ్యాసరచనకు సంబంధించి లక్షణాలు సందేహాలను పాఠకులు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ప్రధానమైనటువంటి అంశం ప్రజా జీవితాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తున్న అంశాలను ఎంపిక చేసుకోవడం మొదటి మెట్టు . గూగుల్ , పత్రికలు పఠించడం ద్వారా, సంబంధిత పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా, అంతేకాదు ప్రజా జీవితానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించడం కూడా రచయిత తన రచనలను ప్రజల ముందు సజీవంగా ఉంచడానికి చాలా తోడ్పడుతుంది. రచయిత ముందు ఆత్మవిశ్వాసంతో వాస్తవాలను మాత్రమే సేకరించి తన యొక్క ఊహాశక్తితో పరిణామాలను అంచనా వేసి ఒక ముగింపుకు రావాల్సిన అవసరం ఉంటుంది. పాలకులు లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ లేదా పౌర సమాజం ఎవరివల్ల వ్యవస్థకు హాని జరుగుతున్నదో అది స్పష్టంగా పేర్కొనడం రచయిత యొక్క కర్తవ్యం. క్షేత్ర స్థాయి పర్యటనలు అనుభవాలతో పాటు సమ వ్యయ స్కులతోని సమకాలీన అంశాల పైన నిరంతరం చర్చించడం కూడా రచయితకు చాలా అవసరం.
ఊహ వర్ణన కీర్తించడం వంటి అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే పౌరాణిక ఆధ్యాత్మిక వ్యాసంగాలు ఆ భావన గల వారికి మాత్రమే నచ్చుతాయి. "మెజారిటీ ప్రజానీకం నిత్యం జీవన సంఘర్షణలో సమాజం ఎదుర్కొంటున్న సంక్షోభంలో బ్రతకవలసిన అవసరం ఉంటుంది కనుక ఆ పరిస్థితుల నుండి బయటపడడానికి అవసరమైన మార్గాలను అన్వేషించడం కూడా రచయిత యొక్క బాధ్యత . ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కొందరిని ఆదర్శంగా చేసుకోవడంతో పాటు తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా జీవితంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తూ అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వంచన లేనటువంటి వ్యవస్థను చేరుకోవడానికి తాను రాసే వ్యాసాలు దారి చూపగలగాలి." అన్వేషణలు మనిషికి తోడ్పడాలి .నిత్య జీవితంలో పౌర సమాజం కూడా తన బాధ్యతలను విస్మరిస్తూ అన్నింటికి ప్రభుత్వాలు ఉద్యోగులపైనే ఆధారపడి వ్యవస్థకు ద్రోహం చేస్తున్న సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. పర్యావరణ పరిరక్షణకు భిన్నంగా మనం నిత్యం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ ఇతర బాటిల్స్ ఆచరణలో వినియోగిస్తున్న వస్తువులు స్వచ్ఛందంగా మనకు మనం బహిష్కరించవలసిన అవసరం లేదా ? .వ్యాసరచన సందర్భంలో రాజ్యాంగము, స్వతంత్ర న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధుల సంస్థల పరిధి పనితీరు పైన వ్యాఖ్యానం చేసేటప్పుడు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది . అట్లనీ వ్యవస్థలను వాటి లోపాలను దాచి పెట్టవలసిన అవసరం లేదు. " శక్తి సామర్థ్యం, సామాజిక స్పృహ, చొరవ, అంకితభావం, ధిక్కార స్వభావము, ప్రశ్నించే ధోరణి వంటి అంశాల పైన రచయిత యొక్క వ్యాసం ఆధారపడి ఉంటుంది . ఎవరితో నాకేమిటి? అనవసరంగా గొడవ ఎందుకు? అనుకొని రాజీ పడే వ్యక్తులు లేదా రచయితలు తమ రచనల ద్వారా ప్రభావితం చేయలేరు . ఊగిసలాట మనస్తత్వం, రాజీ ధోరణి, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసే రచయితలు రచయితలు కారు. అలాంటి దుర్మార్గపు పద్ధతులకు ఓడిగడితే ప్రజలే రచయితలను చీత్కరిస్తారు."
వ్యాసాలు రూపం - సారం":-
********
ఇక వ్యాసం యొక్క రూపాన్ని పరిశీలించినప్పుడు చర్చలకు సందేహాలకు ప్రశ్నలకు తావిచ్చే విధంగా ఉండాలి. ఎంత చర్చ చేసిన దానిని ఆహ్వానించడానికి రచయిత సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అది మరింత లోతుగా ప్రజల్లోకి వెళుతుంది. ప్రజల జీవితానికి వాస్తవానికి దగ్గరగా ఉంటూ అచేతనత్వం నుండి చైతన్యం వైపు, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు, అవగాహన రాహిత్యము నుండి స్థిరమైన స్వతంత్ర ఆలోచన వైపు పాఠకులను నడిపించేది వ్యాసం అని చెప్పడంలో సందేహం లేదు . ఇక కొంతమంది రచయితలు రాజీ ధోరణితో మర్మ గర్భంగా స్పష్టంగా చెప్పకుండా రాసేవాళ్ళు లేకపోలేదు. అలాంటి రచనలతో ఈ సమాజానికి ప్రయోజనమే చేకూరదు అని గ్రహిస్తే ఉత్తమ రచయితలు ఉత్తమ పాఠకులు చైతన్యవంతమైన వ్యాసాలను అధ్యయనం చేసి తమ అనుభవాలతో జోడించి రంగరించి క్షేత్రస్థాయిలో పర్యటించి ముగింపుకు రావలసినటువంటి అవసరం ఉంది. తద్వారా మరిన్ని పరిశోధనాత్మక వ్యాసాలు రాయడానికి ఈ వ్యాసాలు తోడ్పడితే అంతే చాలు కావలసింది వీటిని విశ్వసించి, క్షేత్రస్థాయిలో పర్యటించి ,అనేక అంశాలను క్రో ఢీకరించి ముగింపుకు రావడం, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగిపోవాలి .అప్పుడే వ్యాసాల వల్ల సమాజానికి ప్రయోజనం ఉన్నట్లు లెక్క ప్రధానమైన ఈ అంశంపైనే రచయితలు దృష్టి సారించడం వలన సాహిత్యానికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అందులో వ్యాసం పాఠకుల పైన స్పష్టమైన వైఖరిని కలగజేయడానికి ఎంతో తోడ్పడుతుంది అనడం అతిశయోక్తి కాదు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)