కారణాలు ఏవైనా న్యాయస్థానాల తీర్పుల్లో జాప్యం ప్రజలకు న్యాయం అందడంలో పెద్ద అవరోధం.
విచారణ ఖైదీలుగా దశాబ్దాలు అప్రకటిత శిక్ష అనుభవించడం కూడా దీని ఫలితమే.అవసరమైన మేరకు సిబ్బందిని నియమించడo ద్వారా ప్రభుత్వం
అప్రతిష్టను దూరంచేసుకోవాలి.
వడ్డేపల్లి మల్లేశం 90142 06412
03...09...2024
న్యాయస్థానాల తీర్పుల్లో జరుగుతున్న జాప్యం సామాన్య ప్రజలకు న్యాయం అందడంలో విపరీత పరిణామాలకు కారణం అవుతుంటే సామాన్యులు విచారణ ఖైదీల పేరుతో దశాబ్దాలు శిక్ష అనుభవిస్తే చట్టసభల్లో నేరం ఆరోపించబడిన వారు రాజకీయ రంగం, పారిశ్రామిక, ఇతరత్రా నేరగాళ్లుగా కొనసాగుతున్నప్పటికీ శిక్షకు దూరంగా కనీసం విచారణ ఖైదీలుగా కూడా నమోదు కాకపోవడం ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసంబద్ధ నేర వ్యవస్థకు అద్దం పడుతున్నది . వందమంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిర్దోషి కి శిక్ష అమలు కాకూడదని భారతీయ న్యాయ శాస్త్రం నినదిస్తున్నప్పటికీ నిజంగానే నేరస్తులు తప్పించుకుంటున్నారు కానీ అదే సందర్భంలో నేరం చేయని వాళ్ళు కడుపు తి ప్పలకు, పిడికేడు మెతుకులకు, ఉపాధి కోసం చేసిన చిన్న పొరపాట్లను కారణంగా చూపి దశాబ్దాలు విచారణ ఖైదీలు గా కొనసాగుతున్న ఈ వ్యవస్థలో ఏది న్యాయం? ఏది అన్యాయము? న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అగ్ర న్యాయమూర్తులు కూడా ఈ దేశంలో న్యాయవ్యవస్థలో మరింత ప్రక్షాళన జరగాలని, సామాన్య ప్రజలకు ఉచితంగా నాణ్యమైన స్థాయిలో న్యాయాన్ని చేరువ చేయాలని బహిరంగ ప్రకటనలు చేసిన సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. భారతదేశంలో అనేక మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తులు కొన్ని సందర్భాలలో జరుగుతున్నటువంటి అనుచిత సంఘటనలను ప్రస్తావిస్తూ కఠిన చర్యలు కచ్చితంగా తీసుకోవాల్సిందే, నేరస్తులకు శిక్ష పడాల్సిందే, నిర్దోషి శిక్ష నుండి తప్పించుకోవాల్సిందే అని ప్రవచించిన సందర్భాలు అనేకం. అంతేకాదు పార్లమెంటును, పార్లమెంటుకు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వాలను, పోలీసు వ్యవస్థను కూడా తప్పు పట్టినటువంటి న్యాయమూర్తులు ఈ దేశంలో ఉండడం కనీసం వాస్తవాలను చర్చించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పడానికి పెద్ద ఆస్కారంగా భావించవలసిన అవసరం ఉంది .
నిర్దోషులైనా విచారణ జాప్యంతో శిక్ష అనుభవించాల్సిందేనా ?
:-********
ఇటీవల భారత దేశంలో 10 ఏళ్ల తర్వాత విచారణ ఖైదీగా ఉన్న ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను 90% అంగవైకల్యంతో చిత్రవధకు గురైనప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసిన విషయాన్ని గమనిస్తే విచారణలోని జాప్య మే కదా ఆయన సుమారు 10 ఏళ్ల పాటు జైలు శిక్షను అకారణంగా అనుభవించడానికి. విచారణలో జాప్యానికి, ఖైదీలకు, జై ల్ల కు అవినాభావ సంబంధం ఉన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. భారతదేశంలో 2022 నాటి గ నాంకాల ప్రకారం ఉన్న 1300 జైళ్లలో నాలుగు లక్షల 36 వేల మందిని మాత్రమే నిర్బంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కానీ విచారణలో కొనసాగుతున్న జాప్యం, మౌలిక సౌకర్యాలతో పాటు సిబ్బంది లేకపోవడం, ఇతరత్రా కొన్ని రాజకీయ కారణాలు ఏవైతే నేమి ప్రస్తుతము అందుబాటులో ఉన్న జైళ్లలో 5లక్షల 73 వేల మందిని నిర్బంధంగా శిక్షించడంతో ఇక ఖైదీలలో సంస్కరణకు ప్రక్షాళనకు మానసిక పరివర్తనకు ఆస్కారము ఎక్కడిది ? ఎందుకొరకు అరెస్టు చేయబడినారో తెలియని అమాయకులు లక్షలాదిమంది శిక్షించబడడం సిగ్గుచేటు కాగా మానవ హక్కులకు ఉపయోగపడాల్సినటువంటి పోలీసు పౌర వ్యవస్థలు భక్షణ కేంద్రాలుగా మారితే నిజంగా అపరాధం లేకుండా శిక్ష అనుభవించడం మామూలు అయిపోయిన ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పలుచబడితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించకూడదా?
అఖిల భారత జైళ్ల సంస్కరణల కమిటీతోపాటు 2024 మే 9 వ తేదీన ఒక కేసు విచారణ సందర్భంగా భారత సర్వోన్నత న్యాయస్థానం కారాగారాలలో రద్దీని తగ్గించడానికి నిర్బంధ పద్ధతిలో అకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి బహిరంగ జైల్లు తోడ్పడతాయని చేసిన సూచనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. అదే సందర్భంలో కేసుల విచారణ జాప్యం కారణంగా సామాన్యులు పేదలు అమాయకులు ఎక్కువ శిక్షకు గురవుతున్నారు అనే విషయాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం సానుభూతిగా ఆలోచించవలసిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడినది. 5,73,000 మంది ప్రస్తుతం ఖైదీలు సౌకర్యాలు లేని కిక్కిరిసిన చోట శిక్ష అనుభవిస్తుంటే అందులో 76% మంది కేవలం విచారణ ఖైదీలేనని ప్రభుత్వం తెలియజేస్తుంటే, అంతేకాదు 17వ లోక్సభలో 83%, రాజ్యసభలో 36% నేర చరిత్ర ఉన్నవాళ్లు ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారని తెలుస్తుంటే ఆలస్యంగా విచారణ జరిగినా కూడా నేరస్తులకు శిక్ష పడుతుందని, పేదలకు ఆరోపించబడిన వారికి అమాయకులకు రక్షణ ఉంటుందని అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులు వాటి కాల పరిమితి:-
కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పెండింగ్లో ఉన్నటువంటి నేరాల విచారణ పైన సమగ్రమైన దర్యాప్తు జరిపించడానికి అందుకు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలతో పాటు, న్యాయమూర్తులు, సిబ్బంది , నిర్వహణకు నిధుల సమీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉన్నది. సౌకర్యాలు లేకుండా న్యాయవ్యవస్థ కూడా నిస్సహాయంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడితే అందుకు బాధ్యత ప్రభుత్వాలదే. అదే సందర్భంలో న్యాయవ్యవస్థకు అన్ని సౌకర్యాలను కల్పించడంతోపాటు పూర్తి స్వేచ్చని ఇవ్వడం ద్వారా అనర్థాలకు ఆస్కారం లేకుండా విచారణలో జాప్యానికి థా వు లేకుండా నిజమైన నేరస్తులకు కఠిన చర్యలు విధించే నూతన వ్యవస్థ ఆవిష్కరించబడాలి.
జాప్యం వలన ప్రజలకు సకాలంలో న్యాయం జరగకపోగా నిర్దోషులకు అకారణంగా శిక్షలు పడడంతో పాటు కొందరు అమాయకులు, న్యాయవ్యవస్థను అందుకోలేని వారు తనువూ చాలించిన సందర్భాలు, ఓడిపోయిన సన్నివేశాలు, శిక్షించబడి విగత జీవులైన వాళ్ళు అనేకం. జాతీయ జ్యూడిషియల్ గ్రిడ్ అంచనాల ప్రకారంగా దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో సుమారు 4.5 కోట్ల కేసులు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు కారణాలు ఏవైనా ఎన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేద్దాం( 1) ఒక సంవత్సరం లోపు పెండింగ్ లో ఉన్న కేసులు ఒక కోటి 62 లక్షల 87 వేల 970 ఈ కేసుల శాతం మొత్తంలో 35.71 .(2) ఒకటి నుండి మూడేళ్ల లోపు పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య ఒక కోటి 7లక్షల86 వేల 724. మొత్తంలో ఇది కేసుల శాతం 23.65%.( 3) మూడు నుంచి ఐదేళ్లలోపు పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 6 3 లక్షల 57 వేల 311. మొత్తంలో ఈ కేసుల శాతం 13.94.
(4) ఐదు నుంచి 10 ఏళ్లలోపు పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 78 లక్షల 89 వేల 772 .మొత్తంలో వీటి శాతం 17.3 (5)10 నుండి 20 ఏళ్ల మధ్యన పెండింగ్లో ఉన్న కేసులు 36 లక్షల 51 వేల 223 .మొత్తంలో వీటి శాతం 8.01 .(6)20 నుండి 30 ఏళ్ల పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 5,36,978 మొత్తంలో వీటి శాతం 1.18 (7). 30 ఏళ్లకు పైబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 1,00,904 .మొత్తములో వీటి శాతం 0.2 2.
ఒక నిర్ణయములో నిర్ణీత కాలానికి మించి జాప్యం జరిగినప్పుడు లబ్ధిదారులకు అన్యాయమే జరుగుతుంది అనేది నగ్నసత్యం ఇక్కడ ఏడాది నుండి 30 ఏళ్ల పైబడి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడంలో పాలకులకు ఇంత నిర్లక్ష్యమా? లోపం ఎక్కడుంది, కారణాలు ఏమిటి, వ్యవస్థ గతమైన అవసరాలు ఏమున్నాయి,? న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయ వ్యవస్థగా తీర్చిదిద్దవలసిన బాధ్యతను విస్మరించిన పాలకుల యొక్క స్వప్రయోజనాలకు ఏమైనా ఆస్కారం ఉన్నదా? ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఇది అత్యంత సున్నితమైన సమస్య. అయితే న్యాయం లభించక విచారణ ఖైదీలుగా సంవత్సరాల తరబడి శిక్షలు అనుభవిస్తున్నటువంటి సామాన్యులు, అమాయకులు, పేదలు, ముఖ్యంగా ఆదివాసీలు , అక్కడక్కడ విద్యావంతులై ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యానికి బలవుతున్న వారు తమ పోరాటాలను ముమ్మరం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. న్యాయ వ్యవస్థ కూడా తాము ఎదుర్కొంటున్న సమస్యల పైన బహిరంగ ప్రకటన చేయడం ద్వారా ప్రజలు కూడా న్యాయ వ్యవస్థకు మద్దతిస్తారు. అంతిమంగా స్వయం ప్రతిపత్తితో కూడిన న్యాయవ్యవస్థను కాపాడుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది చేయని నేరానికి అప్రతిష్ట పాలు కావడం అంటే న్యాయవ్యవస్థను ఉద్దేశ్య పూర్వకంగా విఫలం చేయడమే . రాజ్యాంగపరంగా రావలసినటువంటి ఫలాలను, పొందాల్సినటువంటి హక్కులను ప్రజలకు హామీ ఇచ్చి రాజ్యాంగ పీఠికను రాసుకున్నాము. ఆ రకంగా స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని, సౌబ్రాతృత్వాన్ని ప్రజలకు అందించవలసిన ప్రభుత్వాలు న్యాయాన్ని నిర్లక్ష్యం చేయడం వాంఛనీయం కాదు. ఈ అసమతుల్యతను వెంటనే నివారించి నిజమైన నేరస్తులకు శిక్ష పడేలా అకారణంగా విచారణ ఖైదీలుగా కొనసాగుతున్న వారిని నిర్దోషులుగా విడుదల చేయడం కోసం తగు ఏర్పాట్లను కొనసాగించడం ద్వారా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయిత ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)