ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి కలెక్టర్.
జోగులాంబ గద్వాల 05 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున మొక్కలను నాటాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్. అన్నారు. బుధవారం గద్వాలలోని కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. జిల్లాలో అటవీ శాతం చాలా తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మొక్కలను నాటి, సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణాన్ని రక్షించడం వలన ప్రకృతి మన భవిష్యత్తరాలకు మేలు చేస్తుందన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కలను నాటడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని, చెట్లను కాపాడుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని కూడా నివారించాలని, పాలిథిన్ వ్యర్ధాలు భూమిలో కలవకుండా జాగ్రత్త పడితే భావి తరాలకు మేలు చేసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్, ఇంజనీర్లు నితీష్ రెడ్డి, ప్రహర్ణి, కృష్ణ, మెప్మా సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.