జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి

Jan 12, 2026 - 17:21
 0  29
జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి
జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి

 జోగులాంబ గద్వాల 12 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ఔత్సాహిక క్రీడాకారులకు సీఎం కప్ గొప్ప అవకాశమని, జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు.

జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం గద్వాల ఇండోర్ మైదానంలో సీఎం కప్ క్రీడా పోటీల టార్చ్ ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదనపు ఎస్పి శంకర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా ఆయన చిత్రపటానికి ముఖ్య అతిథులు పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం కప్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా టార్చ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. చీకట్లో ఏదైనా వస్తువును వెతికేందుకు టార్చ్ లైట్లు ఎలా వినియోగిస్తామో అలాగే ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీసేందుకు ఈ టార్చ్ ర్యాలీ దోహదపడుతుందన్నారు. యువతకు తన సందేశాలతో జాగృతం చేసిన స్వామి వివేకానంద జయంతి రోజునే ఈ సీఎం కప్ కార్యక్రమం ప్రారంభించుకోవడం శుభసూచకమని పేర్కొన్నారు. స్వామీజీ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో యువత క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. సమాజంలో వ్యసనాలను రూపుమాపి, నవ సమాజ నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ క్రీడలకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో  కొంత సమయాన్ని ఆటలు ఆడేందుకు కేటాయిస్తే ఆనందంగా ఉండవచ్చన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు వచ్చిందని పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ చాలామంది ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకు సీఎం కప్ దోహదపడుతుందని పేర్కొన్నారు. క్రీడాకారులు జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జోగులాంబ గద్వాల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఉక్కు కండరాలు, దృఢమైన శరీరం కలిగిన యువత దేశాభివృద్ధికి అవసరమని పేర్కొన్న స్వామి వివేకానంద సూక్తులను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. 

అదనపు ఎస్పీ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండడమే కాక మానసికంగానూ ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు ఉపయోగపడతాయన్నారు. గ్రామస్థాయిలో నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలు దోహదపడతాయన్నారు. దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉండగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణించే క్రీడాకారుల సంఖ్య తక్కువగా ఉందని, యువత సీఎం కప్ ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. ఫలితంగా పుట్టిన ఊరుకు, దేశానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.  క్రీడాకారులు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండాలని దాంతో ఏ పని చేసినా విజయవంతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు క్రీడాకారులకు సీఎం కప్ టీ షర్టులను అందజేశారు. అనంతరం టార్చ్ ను వెలిగించి ర్యాలీ ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో డిఈఓ విజయలక్ష్మి, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, డివైఎస్ఓ కృష్ణయ్య, ఎస్ జిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి బీసన్న, పలువురు పిఈటిలు, పీడీలు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. 

..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333