మద్యం, మత్తు, ధూమపానం  అవినాభావ సంబంధం కల అంశాలు

Jul 25, 2024 - 09:22
 0  6

క్లబ్బులు, పబ్బులు ,ఈవెంట్లు , శృంగార ప్రదర్శనలు,

అశ్లీల సాహిత్యం  అరాచకాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

ఈ అంశాలను పక్కనపెట్టి  గంజాయి, డ్రగ్స్ కట్టడి  చేస్తామని ప్రకటించడం  నేల విడిచి సాము చేయడమే.

---  వడ్డేపల్లి మల్లేశం

మానవ బలహీనతలకు మరింత ఆజ్యం పోసే  మత్తు పదార్థాలు మద్యపానం ధూమపానం  గంజా యి డ్రగ్స్  ప్రభుత్వ కను సన్నల్లోనే  ప్రజలకు సరఫరా అవుతూ ఉంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం  ప్రభుత్వాల నిర్లక్ష్యం    భారతదేశాన్ని  డ్రగ్స్  మహమ్మారిగా  మార్చే అవకాశం ఉన్నది.  చట్టబద్ధంగా కొనసాగుతున్నటువంటి మద్యపానం ధూమపానం క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు శృంగార ప్రదర్శనలు  అశ్లీల సాహిత్యము  టీవీ ప్రసారాలు సెల్ ఫోన్లలో  అసభ్యకర దృశ్యాలు కూడా  మనిషిలో దాగి ఉన్న  అరాచకత్వాన్ని  అకృత్యాన్ని బయట పెట్టడానికి తోడ్పడుతున్నాయి . ఈ క్షణికావేశంలో జరుగుతున్నటువంటి అనేక నేరాలు ఘోరాలు  హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు  పలు అసాంఘిక కార్యక్రమాలకు దారితీస్తున్న నేపథ్యంలో  దీని వెనుక ఉన్నటువంటి  మూలాలను  ప్రభుత్వం  గమనించవలసిన అవసరం ఉన్నది . ఇవన్నీ చట్టబద్ధంగా జరుగుతూ ఉంటే ఇటీవలి కాలంలో డ్రగ్స్ మత్తు పదార్థాలు  పాఠశాలలో కళాశాలలో యువతకు   భారంగా పరిణమించిన వేళ  అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్న సందర్భంలో  ఒక రాష్ట్రము నుండి మరొక రాష్ట్రానికి అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా ప్రభుత్వాలు ఆరోపణలు చేస్తూ ఉంటే  దీనికి మూలం ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటీవల  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పొలిమేరలో నుండి అక్రమ రవాణా డ్రగ్స్ గంజాయి జరుగుతున్నట్లు ఆరోపణలు చేస్తూ ఉంటే  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా అందు తున్నట్టు చేసిన ప్రత్యారోపణలకు సమాధానం చెప్పేది ఎవరు ?

దశాబ్దాల తరబడిగా ఈ దేశంలో మద్యపానాన్ని ప్రభుత్వమే  అనుమతించి  నిధుల వసూలు కోసం  ఆరాటపడుతూనే  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరికించి  మరింత అక్రమంగా సొమ్మును  వసూలు చేస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు  ."మద్యపానం సేవించి వాహనాలు నడపరాదు అనే సూక్తి  ఆమోదయోగ్యమైనది కానీ  మద్యం  విక్రయ0 ద్వారావచ్చే ఆదాయంతో ప్రభుత్వాలను నడుపవచ్చునా?"  ప్రభుత్వమే  బార్లు రెస్టారెంట్లకు అనుమతించి  అందులో తాగి  జల్సా చేయడానికి ప్రోత్సహించి అందులో నుండి బయటికి రాగానే పోలీసు డిపార్ట్మెంట్  డ్రంక్ అండ్ డ్రైవ్  అరెస్టు చేసి  వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించడం  గత ప్రభుత్వ హయాంలో బాగా జరిగినప్పటికీ ప్రస్తుతం కూడా అదే విధానం కొనసాగించడం సరైనది కాదు. అది కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనది కాదు ఏ రాష్ట్రంలోనూ  దాబాలు  రెస్టారెంట్లు  ఉండకుండా కేవలం పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలను అనుమతిస్తే కొంతవరకు  ఆమోదయోగ్యం  .అయినా  బీహార్ ,గోవా,  గుజరాత్, తో పాటు కొన్ని రాష్ట్రాలు పూర్తిగా మద్యపానాన్ని నిషేధించి  తమ సత్తా చాటి పరిపాలనను విజయవంతంగా కొనసాగిస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలతో  సమాలోచన జరిపి దేశవ్యాప్తంగా మద్యపానాన్ని నిషేధిస్తే తప్పేమిటి ? ఇక మరికొన్ని రాష్ట్రాలు గ్రామీణ ప్రాంతాలలో అమ్ముతున్నటువంటి బెల్ట్  షాపులను బందు చేస్తామని ప్రకటించి  మాట వరకే పరిమితమైన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు.

ఇక మద్యపానం ధూమపానం  గుట్కాలు మత్తు పదార్థాలు   ప్రభుత్వ ఆమోదంతోనే కొనసాగుతూ ఉంటే  వాటి పైన చట్టబద్ధమైన నియంత్రణ లేకుండా  ప్రభుత్వం ప్రజలకు  అలవాటు చేసి తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి చూపుతున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేకపోవడం విచారకరం.  ఇక ఈ మత్తు పానీయాలు మద్యపానం  తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు  అనేక ఆకృత్యాలను మనం చూడవచ్చు . మహిళల పైన లైంగిక వేధింపులు అత్యాచారాలు హత్యలు, ఆత్మహత్యలు  క్షణిక ఆవేశంలో జరుగుతున్నటువంటి దారుణాలు ఘోరాలకు అంతే లేదు. తద్వారా అనేక కుటుంబాలు వీది పాలవుతుండడం కుటుంబ యజమాని  అనారోగ్యం పాలు కావడం  అప్పుల పాలు కావడంతో  ఆత్మహత్యకు  దారి తీయడాన్ని కూడా గమనించవచ్చు . ప్రభుత్వాలు రాయితీలు, పెన్షన్ల పేరుతో  ఆర్థిక సహాయం చేస్తున్నప్పటికీ  తిరిగి మద్యం  మత్తు పదార్థాలు ధూమపానం  గుట్కాల అమ్మకంతో తిరిగి ఆ డబ్బును  ప్రభుత్వం  నిర్బంధంగా వసూలు చేస్తున్న విషయాన్ని కూడా గమనించినప్పుడు  ప్రభుత్వం కూడా మద్యం మత్తు పదార్థాలతో ప్రజలతో వ్యాపారం చేస్తున్నది అని చెప్పక తప్పదు .అలాంటప్పుడు ప్రజల యోగక్షేమాలను పట్టించుకునే ప్రసక్తి ఎక్కడిది? డ్రగ్స్, గంజాయి  వంటి వాటిని  రద్దుచేసి  అలాంటి అక్రమ రవాణా చేసే వాళ్లపైన ఉక్కు పాదం మోపాలని ప్రభుత్వాలు ఘాటుగా స్పందించడం మాట వరసకే కానీ అందులో పసలేని వాదన అని చెప్పక తప్పదు .

 వివిధ రకాలైనటువంటి మత్తుకు బానిస అయినటువంటి వ్యక్తి  ఆవేశం, ఆహ్లాదం,  ఆనందం,  శృంగారం,  అశ్లీల సన్నివేశాలకు అలవాటు పడిన కారణంగా అలాంటి అవకాశాలను ప్రభుత్వమే పట్టణాలలో ప్రోత్సహిస్తూ క్లబ్బులు పబ్బులు ఈవెంట్ పేరుతో కొనసాగిస్తూ ఉంటే రాత్రి 1:00 వరకు  అందుబాటులో ఉన్నప్పుడు  మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్లు అలాంటి  చోట్ల  మరింత రెచ్చిపోవడానికి తప్పులు చేయడానికి అసాంఘిక శక్తులుగా తయారు కావడానికి అవకాశం కల్పించినట్లు కాదా ? డ్రగ్స్ గంజాయి మీద మాత్రమే ప్రభుత్వం కట్టడి చేయాలని పూనుకోవడం  నేల విడిచి సాము చేయడమే అవుతుంది  అనేక రకాల మత్తు పదార్థాలు పానీయాలు  ఆహార పదార్థాలు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు  నిరుద్యోగ యువత  విద్యార్థులు  మధ్య వయస్కులు  ఎక్కువగా వీటి బా రిన పడే ప్రమాదం ఉన్నది .ఇటీవలి కాలంలో గమనించినప్పుడు గంజాయి డ్రగ్స్ తీసుకొని  అకారణంగా  ఘర్షణ పడడం, చంపుకోవడం,  దాడులకు పాల్పడడం,  స్నేహితులని పిలిచి  ఘర్షణ పెట్టుకోవడం,  మనిషిని మనిషి గుర్తించకుండా  మత్తు లోకి వెళ్లిపోవడం ద్వారా  అనేక తప్పుడు పనులకు ఆస్కారం ఏర్పడుతున్నది.  ముఖ్యంగా పాఠశాల కళాశాలలో విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు  విద్యారంగంలో ఎదుగుతూ భవిష్యత్తు  సవాళ్లను అధిగమించే  సృజనాత్మక శక్తి గల  ప్రతిభావంతులుగా ఎదగవలసిన స్థాయిలో  డ్రగ్స్  గంజాయి కి అలవాటు పడుతున్న కారణంగా తల్లిదండ్రుల యొక్క లక్ష్యం దెబ్బతినడంతో పాటు తమ పిల్లల ఆరోగ్యం  భవిష్యత్తు  అగమ్య గోచరంగా మారడమే కాదు రాష్ట్రం దేశంలోని విద్యా వ్యవస్థ తన లక్ష్యాన్ని కోల్పోతున్నది .  యువతను తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు  అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రాలుగా మారిపోవడం  దీని మూలాలు ఎక్కడో  అక్రమ రవాణా దారుల వద్ద ఉన్నాయని ప్రభుత్వం పోలీసు యంత్రాంగం అనుకుంటున్నది కానీ  చట్టబద్ధంగా  నడి బజార్లలో వీధుల్లో  అమ్ముతున్నటువంటి మత్తు పదార్థాలు మద్యం ధూమపానం సంగతి ఏమిటి ? వీటి కారణంగా  యువత  మరింత మత్తు లోకి వెళ్లాలని కోరుకుంటున్న కారణంగా  అవకాశాలున్న ప్రతి చోటా వినియోగించుకోవడానికి అలవాటు పడడమే డ్రగ్స్ గంజాయి వాడకం మరింత పెరగడానికి యువత నిర్వీర్యం కావడానికి ప్రధాన కారణం అని ప్రభుత్వం పోలీసులు యంత్రాంగం గ్రహించాలి.  నేరం ఎక్కడున్నా శిక్షించబడాలి  నేరస్తులు ఎక్కడున్నా ఉక్కు పాదం మోపాలి.   మత్తు పదార్థాలు ధూమపానం వంటివి కూడా  సమాజాన్ని  నిర్వీర్యం చేస్తున్నాయి అనే సోయి ఆలోచన ఇప్పటికి పాలకవర్గాలకు ఎందుకు లేదు  కేంద్ర ప్రభుత్వం  వెంటనే రాష్ట్రాలతో సంప్రదించి  అన్ని రకాల మత్తు పదార్థాలను  నిర్మూలించే విధంగా చర్యలు తీసుకున్నప్పుడు  దానికి  వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని ఆస్కారం ఏర్పడదు . అధికారులు యంత్రాంగం  అక్రమ రవాణా  ముఠాలపైనా ఉక్కు పాదం మోపినప్పుడు  డ్రగ్స్ రహిత భారత దేశంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది . టీవీ ప్రసారాలలో మద్యాన్ని తాగినప్పుడు  మద్యపానం నిషేధమనీ తెరమీద చూపించడం,  మత్తు పదార్థాలు  అశ్లీల శృంగార ప్రదర్శనలను బహిరంగంగా చూపించడం,  సెల్ఫోన్ వ్యవస్థలో విచ్చలవిడిగా  దర్శనం ఇవ్వడం  వీటన్నింటికీ ప్రభుత్వ ఆమోదం  ఉన్నప్పుడు ఈ దేశంలో  డ్రగ్స్ ను ఎలా కట్టడి చేయగలము  ఒక దానికి మరొక దానికి అవినాభావ సంబంధం ఉన్నప్పుడు  మద్యం మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు తద్వారా సుఖాన్ని సంతోషాన్ని అనుభవించాలని దుర్మార్గపు ఆలోచన ఉదయించినప్పుడు  అనివార్యంగా  హత్యలు అత్యాచారాలు  లైంగిక వేధింపులు జరుగుతున్న విషయం ఆ మాత్రం పాలకులకు తెలియదా?  తెలిసి  మూలాన్ని మరిచి  కేవలం డ్రగ్స్ ను మాత్రమే కంట్రోల్ చేస్తామని పోలీసులతో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి ఉత్తర్వులు జారీ చేసి  రాగం లేని పాట లాగా  పసలేని ఉత్తర్వులను జారీ చేస్తే ప్రయోజనం నిండు స్తున్న  ఇప్పటికైనా  ఉమ్మడి కార్యాచరణ ద్వారా  అమలు చేసినప్పుడు మాత్రమే ఈ విషయంలో  సక్సెస్ కావడానికి  మత్తుకు ఆస్కారం లేని భారతదేశము  సా కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333