గోల్డ్ మెడల్ సాధించి సూర్యాపేటకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన బంటు కృష్ణ

సూర్యాపేట, 25 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-విద్యారంగంలోని ఏ సబ్జెక్టులోనైనా డాక్టరేట్ పట్టాలు పొందడం సర్వసాధారణం అని, అయితే పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టా పొందడంతో పాటు అరుదైన బంగారు పథకాన్ని కూడా బంటు కృష్ణ సాధించి సూర్యాపేటకు కీర్తి ప్రతిష్టలు తేవడమే కాకుండా సూర్యాపేట పేరుని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడేలా చేయడం గర్వకారణం అని తెలుగుదేశం పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఆకారపు రమేష్ అన్నారు. గోల్డ్ మెడల్స్ సాధించి ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాసైన సందర్భంగా మంగళవారం డాక్టర్ కృష్ణ బంటు స్వగృహానికి వెళ్లి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా ఉన్న డాక్టర్ కృష్ణ జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా ఇటీవల జరిగిన ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్ష కూడా పాస్ కావడం హర్షనీయమన్నారు. కేవలం విద్యావేత్తగానే కాకుండా సామాజికవేత్తగా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామి కావడం, అంబేద్కర్ ఐడియాలజీ, ప్రోగ్రెసివ్
థాట్ తో కుల, మత, వర్గ, వర్ణ రహితసమాజం కోసం కృషి చేస్తున్న బంటు కృష్ణ ఆశయం నెరవేరాలని రమేష్ ఆకాంక్షించారు. విద్య ద్వారానే ప్రతివారు సమాజం పట్ల అవగాహన పెంచుకొని ఉన్నతంగా జీవించవచ్చని, తాము అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని వివరించారు. ప్రపంచ మేధావి, జ్ఞాన శిఖరం అంబేద్కర్ జీవితాన్ని ఆశయంగా చేసుకొని ప్రతివారు విజ్ఞానవంతులు కావాలని, అంతరాల దొంతరలు లేని సమానత్వ సమాజం కోసం కృషి చేయాలని రమేష్ కోరారు.