గల్లీ...కో ...బెల్ట్

బెల్టు షాపుల బీభత్సం గ్రామాలను కూలుస్తున్న మద్యం బానిసత్వం
ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వాహకులు
మా ఆరోగ్యం కాపాడండి - మా కుటుంబాలను కాపాడండి
బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయండి
తిరుమలగిరి 08 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- మండల పరిధిలోని ఆయా గ్రామీణ ప్రాంతాలు మద్యం మత్తులో కూరుకుపోతున్నాయి. గత కొన్నేళ్లుగా అత్యంత తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది ఆయా గ్రామాల బెల్టు షాపుల వ్యవహారం. అనధికారిక అనుమతులు లేకుండా నడుస్తున్న బెల్ట్ షాపులకు వైన్స్ నిర్వాహకుల నుండి కొండంత అండతో రోజురోజుకు బెల్ట్ షాపులు పెరిగిపోతూ ప్రజల జీవితాన్ని దెబ్బతీస్తున్నాయని మేధావుల, విశ్లేషలకుల అభిప్రాయం. మీ దగ్గరికి ఎవరు రారు మేము చూసుకుంటాం అని భరోసానిస్తున్నారు. ఒక్కో బీరుపై రూ 10, మద్యం బాటిల్ పై రూ 10, 30 వసూలు చేస్తున్నారు. బెల్టు షాపు నిర్వాహకులు వినియోగదారుల నుంచి ఒప్పో సీసాపై రూ 30-50 వసూలు చేస్తున్నారు. ఇది కేవలం మద్యం అమ్మకమే కాదు గ్రామాల భవిష్యత్తును బలి తీసుకుంటున్న దోపిడీ వ్యాపారం అని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇక కిరాణం కొట్టులే బెల్ట్ షాపులు, గ్రామాలలో ఉన్న కిరాణం షాపులే మద్యం దుకాణాలు, ఇక్కడ ఏ టైంలో నైనా మద్యం దొరుకుతుంది. రోజువారి కూలీలు, రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బంతా సగం కూలి పైసలు బెల్ట్ షాప్ కే వెళ్తున్నాయని, పిల్లలకు పుస్తకాలు కొనలేక పోతున్నామని, బట్టలు కొనలేకపోతున్నామని, కానీ మద్యం మాత్రం ఆపలేకపోతున్నామని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కన్నీటి బాధతో మొరపెట్టుకుంటున్నారు. పేద కూలి వర్గాలే ఈ బెల్ట్ షాపుల బారిన ఎక్కువగా పడుతుండగా తమ కుటుంబాల మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. బెల్ట్ షాపుల్లో తాగే మద్యం వల్ల కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఒకవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక కష్టాలు, అన్ని ఈ బెల్ట్ షాపుల వల్లే తెచ్చి పెడుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. సమాజంలో మద్యపానం పెరుగుతుండటంతో రైతులు పొలాలలో శ్రమ తగ్గించడమే కాక అప్పులు పెంచుకుంటున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఆ కారణం చేత అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయని ప్రజలు తెలుపుతున్నారు. ఒకప్పుడు మధ్యమనేది వయోజనుల అలవాటు అని భావించేవారు. ఇప్పుడు చాలామంది యువకులు 35 సంవత్సరాల లోపే మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని, మద్యం వల్ల వందలాది కుటుంబాలు ఆర్థికంగా కూలిపోతున్నాయని మేధావులు సూచిస్తున్నారు. ఇది సాధారణ వ్యాపారం కాదు, ఇది మెల్లగా మనుషుల ప్రాణాలను చేసే విషమని ప్రజలు గుండెలు అవిసిపోయేలా చెబుతున్నారు. తమ భర్తల సంపాదనంత మద్యానికి ఖర్చవుతున్నాయని, మద్య మత్తులో వచ్చి గొడవలు చేస్తున్నారని, పిల్లలు చదువుకోవాలని డబ్బులు అడిగితే డబ్బులు లేవంటున్నారు కానీ మద్యానికి మాత్రం డబ్బులు ఉంటున్నాయని ఆయా గ్రామాల మహిళలు గుండెలు బాదుకుంటున్నారు. యువకులు పనులు మానేసి, సోమరితనంగా మారి, మద్యానికి బానిసై దేనికి పనికి రాకుండా మారిపోతున్నారని, మద్యం మత్తులో చిన్న, పెద్ద గొడవలు, బెల్ట్ షాపులో తాగి రోడ్డు పక్కనే కుప్పకూలి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. వారి భార్యలు పిల్లలు ఇల్లు కట్టే స్థితికి చేరాయని మృతుల కుటుంబాల గాధ వర్ణాతీతం అని, వందలాది ఇండ్లలో పునరావృతం అవుతున్న పరిస్థితి వాస్తవమని కళ్ళారా చూసిన ప్రజలు తెలుపుతున్నారు. గ్రామాల్లోని బెల్ట్ షాపులను కట్టడి చేయకపోతే గ్రామీణ సమాజం మొత్తం పతనమౌతుందని నిపుణులు సూచిస్తున్నారు. తమ భర్తలు సంపాదించిన ప్రతి రూపాయి మద్యం దుకాణానికి వెళ్తుందని ఆయా గ్రామాల మహిళలు తెలుపుతున్నారు. సంబంధిత ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహిస్తున్న స్థిరమైన పరిష్కారం మాత్రం కనిపించడం లేదని, తక్షణమే బెల్ట్ షాపులను మూసివేయాలని, నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. బెల్ట్ షాపుల వల్ల కుటుంబ సమస్య మాత్రమే కాదు, సమాజాన్ని, యువతను, దేశ భవిష్యత్తుని చీకటిలోకి నెడుతున్న సమస్య. కుటుంబాలను సర్వ నాశనం చేసే మహా సమస్యగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు అన్నారు, ప్రజల ఆరోగ్యం, ఆర్థిక భద్రత, యువత భవిష్యత్తు కాపాడాలంటే సంబంధిత ఎక్సైజ్ శాఖ, మరియు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఉన్న సంబంధిత శాఖల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో తనిఖీలు చేసి ఈ అక్రమ బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.