కుటుంబ బంధాల బలోపేతం ఆవశ్యకత ఆర్థిక అరాచకత్వ పరిరక్షణ కంటే ముఖ్యమైనది.
కుటుంబ బంధాల బలోపేతం ఆవశ్యకత ఆర్థిక అరాచకత్వ పరిరక్షణ కంటే ముఖ్యమైనది.* ఆర్థిక క్రమశిక్షణతో పెడదోరనులను అధిగమించవచ్చు కానీ బంధాలు విచ్ఛిన్నమైతే వ్యవస్థ మొత్తం కుంటుపడి సామాజిక అశాంతి ప్రబలుతుంది.* ఏది ప్రాథమిక అవసరమో విజ్ఞత ప్రదర్శిస్తే తెలుస్తుంది.*
*****************************----*---------
---వడ్డేపల్లి మల్లేశం 9014206412
---06....03....2025********************
సమాజ నిర్మాణానికి ఆర్థిక బలోపేతం ఎంత ముఖ్యమో సామాజిక సంబంధాల కూ ర్పు కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న కారణంగా ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనటువంటి ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సమిష్టి, వ్యస్టీ కుటుంబాలు ఏవైనా కుటుంబ సభ్యుల యొక్క సంపాదన, ఆదాయము, పొదుపు, ఖర్చు క్రమ పద్ధతిలో జరుగుతున్న కారణంగా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మరింత బలో పేతంగా ఉండడానికి ఈ ఆకృతి పునాదిగా పనిచేస్తున్నది అని ఆర్థికవేత్తలు ప్రశంసించిన సందర్భాలు అనేకం. ఇతర పాశ్చ్చాత్య దేశాలలో కుటుంబ బంధాలు బలంగా లేకపోవడం, వ్యక్తుల మధ్యన సంబంధాలు బలహీనంగా
ఇష్టారాజ్యంగా వ్యవహరించుచున్న కారణంగా స్వేచ్ఛ మరి ఎక్కువ కావడం వల్ల కూడా ఆర్థిక అరాచకత్వంతో పాటు సామాజిక కట్టుబాట్లు ఎదుగుదల పటిష్టంగా లేకపోవడాన్ని మనం గమనించవచ్చు. ప్రపంచంలోనే భారతదేశంలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నదని విశ్వసిస్తున్న తరుణంలో తాత్కాలిక ప్రయోజనాలు, ఆర్థిక అరాచకత్వము, స్వార్థము, కుటుంబ సంబంధాల లో వస్తున్న విచ్ఛిన్న వ్యతిరేక పోకడలు భారతదేశంలో గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఆర్థిక క్రమశిక్షణకు విగాథము కలిగిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నా, భారతదేశంలో మానవ సంబంధాలు బలంగా ఉండాలన్న, బలమైనటువంటి సమాజాన్ని నిర్మించాలన్న, అంతిమంగా సమ సమాజాన్ని స్థాపించాలన్న కట్టుబాట్ల కంటే ముఖ్యంగా సజీవ మానవ సంబంధాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని సామాజిక తత్వవేత్తలు మానసిక వేత్తలు విశ్వసిస్తున్న తరుణంలో కుటుంబ సంబంధాల బలోపేతానికి కింది స్థాయి నుండి ప్రణాళిక అబద్ధమైన కృషి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థలో కులవృత్తులు, ఉత్పత్తులు, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల ద్వారా విస్తరిస్తున్న మానవ సంబంధాలు తద్వారా పరస్పర అవసరాలను తీర్చుకోవడం ఒక ప్రణాళిక బద్ధంగా కొనసాగుతున్న విషయాన్ని మనం ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు స్పష్టమవుతుంది. భారతదేశంలో మానవ సంబంధాలకు ఏ మాత్రం విఘాతం కలిగిన మనము తట్టుకోలేక పోతున్నాము కానీ ఇతర దేశాలలో మనుషుల మధ్యన సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలే ప్రధానమని విశ్వసిస్తున్న తరుణంలో మనదేశంలో కొంతవరకు మెరుగైన సామాజిక వ్యవస్థను చూడగలుగుతున్నాము. అయితే ఆధునిక పోకడల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఆర్థిక అరాచకత్వం, ఆర్థిక సంబంధాలే ప్రధానంగా కొనసాగడాన్ని గమనించినప్పుడు భారత దేశంలో కూడా మనిషిని మనిషిగా చూడగలిగే సాంప్రదాయం క్రమంగా సన్నగిల్లుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మానవ సంబంధాలకు విఘాతం కలిగించే పాశ్చాత్య దో రనులతో పాటు సినిమాలు, టీవీ ప్రసారాలు, ఆధునిక పోకడలు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి సంస్కృతి కూడా భారతదేశం మీద అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతున్నది. ఆ రకమైనటువంటి దుందు డుకు పరిస్థితుల నుండి మనం బయటపడవలసిన అవసరం చాలా ఉన్నది.
కుటుంబ బంధాలేవిచ్చిన్నమైతే
**************************
ప్రభుత్వ లేదా ప్రజల యొక్క తప్పిదాల కారణంగా ఆర్థిక అసమానతలు అంతరాలు పేదరికము నిరుద్యోగం వంటి అనేక భయంకరమైన సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ప్రణాళిక బద్దంగా పరిష్కరించుకోవచ్చు. కానీ మానవ సంబంధాలు విచ్చిన్నమైతే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్వేచ్ఛ, సమానత్వము, సౌబ్రాతృత్వం వంటి అంశాలను సాధించడం గగనమే అవుతుంది. అందుకే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో బలవత్తరమైనటువంటి ప్రణాళిక బద్ధమైన కుటుంబ వ్యవస్థ మానవ సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఆధునిక పోకడల కారణంగా స్వార్థము, వ్యక్తిగత లబ్ది, విశాల హృదయంతో ఆలోచించకపోవడం, ప్రయోజనాలను తమ వరకే పరిమితం చేసుకునే క్రమములో భారతదేశంలో ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన గత రెండు మూడు దశాబ్దాలుగా మనిషిని మనిషిగా చూసే స్వభావము సన్నగిల్లిపోయింది. మానవ సంబంధాలు బలహీనపడ్డాయి కుటుంబ సంబంధాలు కూడా కరువు పీడిత ప్రాంతాలలో నీరు అడుగంటినట్లు అడుగంటి పోవడం చాలా ఆందోళన కలిగించే అంశం. ఐకమత్యమే బలం అని అనాదిగా మనం ఆచరిస్తూ వస్తున్నాం .ఇటీవల ఆధునిక సమాజం రూపుదిద్దుకున్న తర్వాత కొన్ని వర్గాలు మిగతా వర్గాల పైన చేస్తున్నటువంటి దాడుల సందర్భంలో ఐక్యంగా ఉద్యమించడం ద్వారా అటు ప్రభుత్వాన్ని ఇ టు పెట్టుబడిదారీ సమాజాన్ని కదిలిస్తున్నటువంటి సామాన్య పీడితుల ఐక్యత మాదిరిగా ఇవాళ సమాజాన్ని విచ్ఛిన్నం కాకుండా చూసుకోవలసిన ప్రధానమైన బాధ్యత ప్రజానీకం పైన ఉన్నది. కలిసి ఉంటే కలదు సుఖము అనే నానుడి మాదిరిగా సమాజంలోని భి న్న వర్గాలు ఒకవైపు కలిసిపోతూ మరొకవైపు ఆధిపత్య పెత్తందారీ వర్గాల మీద పోరాటం చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలి. తమ అధిపత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అదే నిజమైనటువంటి సామాజిక పరిణతి అంటే అతిశయోక్తి కాదు. మానవుడు సంఘజీవి అని ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పడంలో అర్థం ఏమిటి? సంఘంలో ఉండే అనేక భిన్నాభిప్రాయాలు వ్యత్యాసాలు ఎన్ని ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా మానవ సమాజ0 కలిసి ఉండడం ద్వారా ఆధిపత్య వర్గాల నుండి లేదా ఇతర దేశాల యొక్క పెత్తందారే విధానము నుండి తమను తాము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కారణంగానే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం, సామాజిక కూర్పు భారతదేశ సమాజానికి ఉంది కనుకనే ఈ మాత్రమైనా మనం రక్షించబడుతున్నాము. అయితే సాధించిన దానితో చూస్తే అదే విజయం అనుకొనుటే పొరపాటు అన్నట్లుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం ద్వారా సమసమాజాన్ని సా కారం చేసుకోవాల్సిన అవసరం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ఉన్నది. సామాజిక వ్యవస్థ బలంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఈ కనీసం అయినటువంటి సామాజిక సూత్రాన్ని ఆధారం చేసుకుని మానవ సంబంధాల విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నామని చెప్పుకుంటున్న మనము మన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే ప్రస్తుతం ఎంతో కొంత దిగజారినటువంటి మానవ సంబంధాల బలహీనతను తిరిగి పునికి పుచ్చుకోవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. స్వార్థ ప్రయోజనాలు, అవకాశాలను తమ వరకే పరిమితం చేసుకోవడం, మానవ సంబంధాల కూర్పు విషయంలో కుటుంబ బంధాలను కూడా బలంగా తెంపుకోవడం, ఆర్థిక సంబంధాలకి అతిగా ప్రాధాన్యత ఇవ్వడం వంటి కొన్ని బలహీనమైన లక్షణాలను ప్రస్తుతం మనం భారత సమాజంలో చూడవచ్చు. ఈ క్రమంలో కుటుంబ బంధాలు కూడా విచ్ఛిన్నమవుతూ మనిషిని మనిషిగా చూడనటువంటి అమానవీయ సంఘటనలు చోటు చేసుకోవడాన్ని గమనించినప్పుడు వీటి పునరుద్ధరణకు దృష్టి సారించవలసిన అవసరం మరింతగా ఉన్నది అని నిర్ణయానికి రాక తప్పదు. మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని ప్రముఖ మార్క్సిస్టు తత్వవేత్త మార్క్స్ అన్న విషయాన్ని అదిగమించే స్థాయిలో " మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదు మానవీయ విలువలతో కూడుకున్నటువంటి కష్టసుఖాలు కలిమిలేమిలోకూడా పరస్పరము కలిసి ఉండగలిగే, తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే ఉన్నత సమాజ నిర్మాణమే మన లక్ష్యం" అనే వైపుగా దృష్టి సారించాలి. ఆ వైపుగా శపధం చేయాలి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. తద్వారా మాత్రమే ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా భారతదేశము తన ఉనికిని అస్తిత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)