ఆరోగ్యం, పోషకాహారం,  కల్తీ నివారణ,  ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలపై  దృష్టి సారించాలి.

Mar 11, 2024 - 14:14
 0  3

వ్యవసాయ దేశమై ఉండి  దిగుమతి చేసుకోవడం  అంటే  ఉత్పత్తిపై సమతుల్యత సాధించనట్లే.*  రైతుకు గి ట్టుబాటు ధర లభించి ఆహారస్వావలంబన దిశగా దేశాన్ని  థీర్చిదిద్దే క్రమంలో పాలకులు తరచుగా  రైతులతో సమాలోచన చేయాలి.*
****************
----  వడ్డేపల్లి మల్లేశం

ప్రజలను కన్నబిడ్డల వలె  చూసుకోవడం అనే అర్థంలో  పరిపాలన అనే పదాన్ని  సాధారణీకరించి  ప్రజల అవసరాలు, ఆకాంక్షలు,  ప్రజా ప్రయోజనాలతో పాటు జీవన ప్రమాణాలను  పెంపొందించడానికి  పాలకులు చేసే నిజమైన కృషినే  సుపరిపాలన అంటాము.   విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగితే ఎంత ప్రయోజనం ఉంటుందో  అదే స్థాయిలో  ప్రజలు కేంద్రంగా సాగే పాలన అర్థవంతమై, సుభిక్షమై,  పరిపాలనకు నిజమైన నిర్వచనం గా ఉంటుంది అనడంలో సందేహం లేదు.  "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్" అని గురజాడ  ఎలుగెత్తి చాటినట్లు  దేశం అనేదానికి    ప్రజల ఉన్నతి, అభివృద్ధి, సంక్షేమం,  ఆరోగ్యవంతమైన , పోషకాహారంతో కూడుకున్న,  కల్తీ లేనీ,  దిగుమతి పై ఆధారపడకుండా,  ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా, ఎగుమతులపై  దృష్టి సారించగలిగితే  దేశం  అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది . ఆ రకమైన స్వావలంబన సాధించడానికి గల అవకాశాలను పాలకులు  వినియోగించుకోకపోవడం  ముఖ్యంగా వ్యవసాయ ఆరోగ్య రంగంలో  కల్తీ లేనటువంటి ఆరోగ్య భారతాన్ని  నిర్మించవలసిన అవసరాన్ని  విస్మరించడం వలన  ఆరోగ్య, వ్యవసాయ, పోషకాహారం, కల్తీ , ఆహార రంగంలో స్వయం సమృద్ధిలో  అసంబద్ధ విధానాలు చోటుచేసుకున్నవి . ఇటీవల జరిపిన పరిశోధనలో ముఖ్యంగా  భారతదేశంలో అతిగా పండించే వరి గోధుమ  రకాల లో  పోషకాలు గణనీయంగా తగ్గడం  నామమాత్రంగా మిగిలిపోవడం హరిత విప్లవం పేరుతో కొనసాగిన అధిక  రసాయనాల వినియోగమే కారణమని అని తేలినట్లు నిపుణులు భావిస్తున్నారు.
      కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి:-
********
  దేశం మొత్తానికి సంబంధించిన సార్వత్రిక అంశాల విషయంలో  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో  ప్రజల కోసం విస్తృతమైన చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం,  ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు,  ఆరోగ్య వ్యవసాయ  పోషకాహారం వంటి రంగాలలో  ప్రజలు రైతులకు  మార్గ నిర్దేశం చేసే స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది . ఆహార వ్యవసాయ రంగ నిపుణులు,  ఆర్థిక వేత్తల  సమాలోచనలతో కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రాల సహకారంతో  నిరంతరం రైతులతో సమాలోచనలు చేయడం చాలా అవసరం . ఇప్పటికీ  వరి గోధుమ కూరగాయల  పైన పెట్టిన దృష్టి  మిగతా పంటల పైన లేని కారణంగా వ్యాపార  పంటలు పోషకాహారానికి సంబంధించిన ఇతర పంటలపై రైతుల దృష్టి  తగ్గి వరీ గోధుమకే  మో గ్గు చూపడంతో  అనేక రంగాలలో దిగుమతి అనివార్యం కావడంతో  ఆర్థిక రంగం  సంక్షోభంలోకి వెళ్లడమే కాకుండా  దేశంలోని రైతాంగం యొక్క ఆర్థిక పరిస్థితులు  సన్నగిల్లడానికి కారణమవుతున్నది.  వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు  వంటి నూనె ధాన్యాలతో పాటు  పప్పులు  పసుపు  అల్లము  ఇతర ఆహార పంటలు   తగ్గుముఖం పట్టడంపై  ప్రభుత్వం ఆలోచించకపోవడం వలన సమతుల్యత దెబ్బతిని  దిగుమతి కారణంగా మరింత ధరలు పెరగడానికి  పరోక్షంగా పేదవర్గాల కొనుగోలు శక్తి క్షీణించడానికి  కారణమవుతున్న విషయాన్ని గమనించకపోతే ఎలా?  ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు  వరి గోధుమ పంటలను  మాత్రమే ప్రోత్సహించడంతో  ఇక్కడ ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న కొరతను గమనించవచ్చు . ఇక 1960  చివరన  హరిత విప్లవ భావన భారతదేశంలో తొంగిచూసినప్పటికీ  65 - 80 మధ్యకాలంలో  దాని యొక్క పలాలు  కొంతవరకు కనిపించినా  ఇబ్బడి ముబ్బడిగా రసాయనఎరువు లు పురుగుమందుల వాడకాలు  కొనసాగిన కారణంగా  అప్పటినుండి దిగుబడి పెరగవచ్చు కానీ నాణ్యతా ప్రమాణాలు దిగజారి,  ఆహార కల్తీ ఏర్పడి,  పోషక విలువలు నాశనమై,  అనారోగ్య భారతాన్ని మనమే కొనితెచ్చుకున్న విషయాన్ని  ఇప్పుడిప్పుడే దేశం అర్థం చేసుకుంటున్నది . ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లు  ఈ వికృత పరిణామాన్ని  వ్యవసాయ, ఆర్థిక,  ఆహార రంగ నిపుణులతో చర్చించి  సాంద్ర వ్యవసాయానికి బదులుగా సేంద్రియ వ్యవసాయాన్ని  గణనీయంగా పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రణాళికలు ప్రకటించాలి .రైతులను ప్రోత్సహించడం  పండిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడం  వంటి చర్యలు చేపట్టినట్లయితే  ఉత్పత్తి పెరిగి, గిట్టుబాటు ధర లభించి,  ఆర్థిక స్వావలంబన సాధ్యమై, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా  దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ప్రజలకు పోషకాహారాన్ని  తక్కువ ధరలకు అందించడానికి అవకాశం ఉంటుంది కదా !
       దిగుమతులను నిరుత్సాహపరచాలి :-
*******
ముఖ్యంగా ఆహార రంగంలో  నూనెలు  పప్పు ధాన్యాలు  ఇతర ఆహార పదార్థాలను  దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి అదే స్థాయిలో  సమాంతరంగా  దేశంలో ఉత్పత్తి చేయడానికి  రైతాంగానికి మద్దతిచ్చి  ఎగుమతులను  ప్రోత్సహించడం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి . స్థానిక వాతావరణం, నీ టి లభ్యత వంటి కొన్ని కారణాల వలన  అన్ని పంటలకు అవకాశం లేకపోవచ్చు కానీ  ఆరోగ్యం, పోషకాహారం అనే  విలువల పైన దృష్టి సారించినప్పుడు  వర్షా బావ పరిస్థితులలో కూడా    తృణధాన్యాలు  ఉలవలు  పెసర  కందులు  వంటి కొన్ని ప్రత్యేక  ధాన్యాల దిగుబడిని పెంచుకోవడం ద్వారా  స్థానిక మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క ఆహార అవసరాల పైన కేంద్రం రాష్ట్రాలు దృష్టి సారించవలసిన అవసరం ఎంతగానో ఉంది . వ్యవసాయ దేశమైన భారతదేశo  అనాదిగా ఈ దేశంలో  పంటల ఉత్పత్తిలో  అనుభవాలు,  శ్రమ,  పశు సంపద , సేంద్రియ  ఎరువుల లభ్యత వంటి అనేక అంశాలు  అందుబాటులో ఉన్న కారణంగా  ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే రసాయనకేరువులు పురుగుమందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించే  చొరవ ప్రభుత్వాలు తీసుకోవాలి.  రసానిక పదార్థాల ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు  పాలకుల కనుసన్నల్లో  నడుస్తున్న కారణంగా కూడా  ప్రభుత్వాలు  కఠిన చర్యలు తీసుకోవడానికి  వెనుకాడడం కూడా  ప్రజల ఆరోగ్యాన్ని  గాలికి వదిలివేయడమే అవుతున్నది . గత కొన్నేళ్లుగా ఉచితంగానే  పేదలకు బియ్యాన్ని సరఫరా చేస్తున్న కేంద్రం  మరికొన్ని ఏళ్ల పాటు ఇవ్వడానికి ప్రకటించినప్పటికీ  అందులో ఉండే పోషక విలువల  పాత్ర ఏ పాటిదొ  అర్థం చేసుకోవాలి.  ప్రచారం కోసం  ప్రకటించుకుంటే,  పోషక విలువలు లేకుండా  నామాత్రంగా మిగిలిపోతే  ప్రజల  రోగనిరోధక శక్తిని ఏరకంగా సాధించగలం అనేది పాలకుల ముందున్న పెద్ద ప్రశ్నగా  అంగీకరించి తీరాలి.  కరోనా సమయంలో  ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం  ప్రజలతోపాటు ప్రభుత్వాల బాధ్యత అని గుర్తింపచేసినప్పటికీ  ఆ వైపు కన్నెత్తి కూడా చూడకుండా మొక్కుబడి  దొడ్డు బియ్యం పంపిణీ తో  కేంద్రం సరిపెట్టుకోవడం  రాష్ట్రాలు తమ పథకాలు గానే భావించి ప్రచారం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.
         ముఖ్యంగా ఆహార పదార్థాలలో  కల్తీ పల్లెటూరు నుండి దేశ రాజధాని వరకు  నిరంతరం కొనసాగుతూనే ఉన్నది.  నూనెలు ఆహార పదార్థాలు తినుబండారాలు, కల్లు  అన్నింటిలో కల్తీ రాజ్యమేలుతుంటే  ఆ పరిణామంతో ఎందరో  అనారోగ్యం బారిన పడి చనిపోతుంటే  కల్తీని అరికట్ట లేకపోవడం,  కల్తీ ఆహార పదార్థాల  ప్రమాదాన్ని పాలకులు గుర్తించకపోవడం ప్రజలను కంటికి రెప్పలా కాపాడడం ఎలా అవుతుందో పాలకులే ప్రశ్నించుకోవాలి.   అసంబద్ధ విధానాలను విడనాడి,  శాస్త్రీయమైన వైఖరితో,  స్వావలంబన దిశగా నిపుణుల సలహాలతో  నిరంతరం రైతులు ఆ రంగాలకు చెందిన వారితో సమాలోచన జరపడం ద్వారా  స్థానిక అవసరాలతో పాటు దేశ అవసరాలను కూడా  గుర్తించి ఉత్పత్తి చేసే స్థాయిలో  వ్యవసాయ విధానం రూపకల్పన జరగాలి.  అధిక ఉత్పత్తికి అవకాశం ఇస్తూనే ఆరోగ్య భారతావని నిర్మించే క్రమంలో పోషకాహారాన్ని  తక్కువ ధరలకు  సరిపోయే స్థాయిలో ఈ దేశానికి అందివ్వడంతో పాటు ఇతర దేశాలకు  ఎగుమతి చేసుకోవడం ద్వారా  విదేశీ మారకద్రవ్యాన్ని గణనీయంగా పొందగలిగే ఆర్థిక విధానం పైన కేంద్ర ప్రభుత్వ ముఖ్యంగా దృష్టి సారించాలి . ప్రజా సంక్షేమం ,అభివృద్ధి ,ఆరోగ్యం, అనారోగ్యం,  పోషకాహారం,  కల్తీల వంటి విషయాలలో ప్రభుత్వాలు రాజీ పడకుండా  కఠినంగా వ్యవహరించి ఉక్కు పాదం మోపడం ద్వారా  ప్రజల పక్షాన నిలబడాలి. పెట్టుబడిదారుల  కుట్రలను ఛేదించగలగాలి..... అదే నిజమైన పాలన.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రo)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333