దేశవ్యాప్తంగా పాఠశాలల్లో అసౌకర్యాలు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఆనవాళ్లు

Mar 11, 2024 - 14:12
 0  1

 రాజ్యాంగబద్ధ సంస్థలు ఎన్ని హెచ్చరికలు చేసిన   మెరుగు పడని వైనం.

 ప్రతిష్ట చర్యలు తీసుకొని  విద్యా భారతాన్ని నిర్మించాలని  ప్రజల ప్రజాస్వామ్యవాదుల డిమాండ్.

----  వడ్డేపల్లి మల్లేశం

విద్యాభివృద్ధి  బావి భారత పౌరుల సర్వతో ముఖాభివృద్ధికి  దిక్సూచి అని మేధావులు, విద్యావంతులు, నిపుణులు  హెచ్చరిస్తున్నప్పటికీ  75 వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న  వేల  విద్యార్థులు అరకొర సౌకర్యాల మధ్యన  ప్రభుత్వ రంగంలో విద్యను అభ్యసించడం,  ప్రైవేటు  రంగం  డామినేట్ చేయడాన్నీ
జీర్ణించుకోలేకపోతున్నాము.  మౌలిక వసతుల  కల్పన కనీస బాధ్యత  అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడమంటే  బాధ్యతారాహిత్యoతో  రాజ్యాంగ విద్రోహానికి పాల్పడి  బావి భారత పౌరుల  భవిష్యత్తును పాలకులే చేజేతులా  ధ్వంసం చేయడం  కాదా?

విద్యా రంగానికి సంబంధించిన కొన్ని గణాంకాలు:-

   గత సంవత్సరం కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన 21 _22 నివేదిక ప్రకారం  దేశవ్యాప్తంగా 14.89 లక్షల పాఠశాలలో  26.5 2 కోట్ల మంది విద్యార్థులు అభ్యసిస్తుండగా  పాఠశాలల్లో సౌకర్యాల లేమి  తీవ్ర ఇబ్బందులకు విద్యార్థుల గురిచేస్తున్నట్లుగా 
తెలుస్తున్నది  .జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ(N C P C R ) వె ల్లడించిన నివేదిక ప్రకారం  దేశంలోని 14 శాతం ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోగా,  22 శాతం పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నట్టుగా  ఆ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు.  34 శాతం పాఠశాలల్లో తరగతులకు సరిపడా గదులు లేకపోవడంతో పాటు కేవలం 14 శాతం పాఠశాలల  వద్ద మాత్రమే స్పీడ్ బ్రేకర్లు ఉంటే  లక్షలాది పాఠశాలల ముందు  వేగంగా వచ్చే వాహనాల వలన స్పీడు బ్రేకర్లు లేని కారణంగా  వేలాది మంది విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నట్లుగా తెలుస్తున్నది .  దేశ  వ్యాప్తంగా 12 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని గత సంవత్సరం కేంద్ర విద్యా శాఖ రాజ్యసభలో స్వయంగా వెల్లడించడం  పాలకుల యొక్క  బాధ్యతారాహిత్యానికి  నిదర్శనంగా భావించాలి  .5 లక్షలకు పైగా పాఠశాలల్లో  నీటి  వసతి లేకపోగా,  18 వేల స్కూళ్లలో  మంచినీటి కరువుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు  గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  ప్రభుత్వంతోపాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించినట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ  నాణ్యతా లోపం, అనుకూలంగా లేకపోవడంతో వినియోగంలో లేవని  సరైన పారిశుద్ధ్య  సేవలు అందడం లేదని స్వయంగా కంప్ట్రో లర్ అండ్ ఆడిటర్  జనరల్ (కాగ్)  తన నివేదికలో  ప్రభుత్వాన్ని నిలదీయడం  సిగ్గుచేటు కాదా!
      అనేక సందర్భాలలో పాఠశాలల్లో మరుగుదొడ్లు మూత్రశాలలు  ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి  సౌకర్యాలు కల్పించడంతోపాటు  మౌలిక వసతులను కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు తొలగించాలని  సర్వోన్నత న్యాయస్థానంతో పాటు దేశంలోని అనేక హైకోర్టులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా  పాలకులలో చలనం లేకపోవడం  అంటే విద్య హక్కు చట్టానికి  గండి పడినట్లే కదా!  ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 57% విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని  వినియోగించుకున్నట్లు  తెలుస్తుంటే  అనేక అధ్యయనాలు  మధ్యాహ్న భోజన అమలు తీరు  పైన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు  ఫుడ్ పాయిజనింగ్ , నాణ్యత లోపం,  వంట తయారీ సౌకర్యాల లేమి  కారణంగా దేశవ్యాప్తంగా  ప్రతి ఏటా 2000 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని  తెలుస్తుంటే  ప్రభుత్వ విద్యారంగాన్ని పాలకులు రక్షించుకోకపోగా  ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించి అక్రమార్కులకు  అండగా ఉండడం అంటే  రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కాదా?
         పటిష్టమైన చర్యలు అవసరం:-
********
  దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పైన గత సంవత్సరం  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారంగా  తెలంగాణ రాష్ట్రం 31 వ స్థానంలో ఉందంటే  రాష్ట్రాలలోని దుస్థితిని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక  తెలంగాణలో  29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే 31లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో వుంటే   ప్రభుత్వం ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.  కేంద్ర ప్రభుత్వం  10 శాతం  రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం నిధులను బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించాలని గతంలో కొఠారి కమిషన్ హెచ్చరిస్తే  కేంద్ర ప్రభుత్వం 2 శాతం కూడా కేటాయించకపోవడం  విద్యారంగం , పేద వర్గాల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శించడమే అవుతుంది.  ఇక కేరళ ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాలు 24 25% విద్యారంగానికి బడ్జెట్లో కేటాయిస్తూ
ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే  చాలా రాష్ట్రాలు నిధులను కేటాయించక  ప్రభుత్వ రంగాన్ని పట్టించుకోని కారణంగా ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే బడ్జెట్ కేటాయింపుల్లో చివరి స్థానంలో (7%) ఉన్నదంటే  పాలకవర్గాలను కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నట్లే కదా!
     కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొఠారి కమిషన్ సూచన మేరకు  అధిక నిధులను బడ్జెట్లో కేటాయించడంతోపాటు,  సరిపడా అన్ని వసతు లతో  గదులను నిర్మించడంతోపాటు శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించి సర్వాంగ సుందరంగా సౌకర్యవంతంగా  పిల్లల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు మూత్రశాలలు నిర్మించి   పిల్లల ఆత్మగౌరవాన్ని కాపాడాలి.  పాఠశాల చుట్టూ ప్రహరీ గోడలు  మధ్యాహ్న భోజన తయారీకి వంటశాలలతో పాటు  నిధులను భారీగా కేటాయించి వంట కార్మికులకు  వేతనాలను ఇవ్వడం ద్వారా  ఫుడ్ పాయిజన్ కు అవకాశం లేని నాణ్యమైన భోజనం అందిస్తే  ప్రయోజనకరంగా ఉంటుంది.  అంతేకాకుండా  మూస విద్యా ప్రణాళిక కు భిన్నంగా  సృజనాత్మకతకు, చర్చలకు ,ఉపాధ్యాయుల స్వయం అనుభవాలు ఆలోచనలకు  అధిక ప్రాధాన్యత నిచ్చే ప్రణాళికను  ఆమోదించడం ద్వారా  పిల్లల్లో ఉండే శక్తులను బయటికి తీయడానికి   సవాళ్లను అధిగమించేలా తీర్చిదిద్ధి  భావి జీవితంలో స్వావలంబన  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో సముచిత నిర్ణయాలు తీసుకోగలిగే  సత్తాను అందించిన వాళ్ళం అవుతాము.  ఈ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  సామాజిక బాధ్యతగా తీసుకోవాలి అదే సందర్భంలో న్యాయవ్యవస్థ ప్రభుత్వాలపై కొరడా ఝలి పించి  బోనులో నిలబెట్టినప్పుడు మాత్రమే  విద్యారంగంలో మరింత పరిణతి సాధ్యమవుతుంది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత  హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333