మార్పు కోసం పరితపించే ఆలోచన పరులకు సమాజం మద్దతు ఇవ్వాలి.
ఊహాజనిత విశ్వాసాల పునాదిని కూల్చివేయాలి.
రచయితలు కళాకారులు, మేధావులు, అభ్యుదయ
ఆలోచనపరులపై సమాజం విశ్వాసం ఉంచాలి.
అదే అంతే స్థాయిలో ప్రజల ఆకాంక్షలను,
పాలకుల అకృత్యాలను, పెట్టుబడి దారి దుర్మార్గాలను
ఎత్తిచూపి పరిరక్షించడంలో ప్రజల పక్షాన ఉండాలి.
పాలకులు రాజనీతిజ్ఞులు అయితే ప్రజల ఆకాంక్షలను డిమాండ్లను అవసరాలను ప్రయోజనాలను ఆలోచిస్తారు కానీ నేటి రాజకీయాలలో అధికారం, డబ్బు, గుర్తింపు కోసం ఎంతటి దుస్థితికైనా తెగించి పార్టీలను మార్చి పదవులను పొందుతున్న రాజకీయ వ్యవస్థలో ప్రజలు తప్పనిసరి చైతన్యలు కావలసిన అవసరం ఉంది. అందుకే అరిస్టాటిల్ "ప్రజాస్వామ్యంలో ప్రజలు మరింత చైతన్యం కావాల్సిన అవసరం ఉంటుంది" అని నొక్కి చెప్పినారు. అంటే ప్రజాస్వామ్య ముసుగులో పాలకులు చేసే అవినీతికి అకృత్యాలకు హద్దు ఉండది అని దాని అర్థం .
అదే సందర్భంలో రాజ్యాంగాన్ని దాని యొక్క విశిష్ట లక్షణాలను విప్పి చెప్పిన సందర్భంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజలు జాగరూపులై ఉండాలి అనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన హెచ్చరిక కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చైతన్యాన్ని నొక్కి చెబుతుంటే పాలకుల యొక్క అకృత్యాలకు హద్దు లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని తెలుస్తున్నది. అందుకోసమే రాజ్యాంగాన్ని సమర్పించిన సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ" ప్రజల అవసరాల కోసం దేశ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రాయబడినటువంటి రాజ్యాంగం ప్రజల డిమాండ్లను ప్రయోజనాలను నెరవేర్చనప్పుడు లేదా పాలకులు ఆ వైపుగా కృషి చేయనప్పుడు ప్రభుత్వ వ్యతిరేక భావన ప్రజల్లో వస్తుంది .
అప్పుడు రాజ్యాంగం యొక్క మంచి చెడులను ఆలోచించకుండా తమకు మేలు చేయని రాజ్యాంగ వ్యవస్థను రాజకీయ యంత్రాంగాన్ని కూలదోసి చిదిమి వేసి పాలకులకు కనువిప్పు కలిగే స్థాయిలో నూతన రాజకీయ యంత్రాంగాన్ని వ్యవస్థను నిర్మించుకుంటారు" అని చేసిన హెచ్చరిక కూడా ప్రజాస్వామ్యం యొక్క రెండు దృక్పథాలను పాలకుల పట్ల గల అపనమ్మకాన్ని తెలియజేస్తున్నది .
ఈ సందర్భంలోనే ప్రజల గురించి ఆలోచించే ఒక వర్గం అంటూ బయలుదేరిన సందర్భంలో ముఖ్యంగా కవులు రచయితలు, కళాకారులు వివిధ రంగాలలో నిపుణులైన మేధావులు ఆలోచనపరులు అభ్యుదయ సమాజాన్ని ఆశించే ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశాన్ని పాలకుల యొక్క కబంధ హస్తాల నుండి రక్షించుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది . రాజ్యాంగము హెచ్చరించినా నిజజీవితంలో రాజకీయ నాయకుల విష కౌగిలిలో చిక్కి పోతున్న సామాన్య ప్రజానీకం యొక్క ఆ వస్థను ఆలోచించిస్తే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఈ దేశంలో అవసరం అని తెలుస్తుంది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే అసమానతలు, అంతరాలు, దోపిడీ పీడన వంచన ఉన్నాయో ఆ ప్రతి చోట కూడా ఆలోచించే బుద్ధి జీవులు ప్రగతి కాముకులు కవులు తమ సామాజిక బాధ్యత నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ అవసరం బహుశా మన భారతదేశంలో మరింత ఎక్కువేమో!
ఎంత ఒత్తిడి వచ్చిన లక్ష సిద్ది కోసం ఆచరణ లో ఏమరుపాటు లేకుండా ప్రజల పక్షాన పని చేయవలసిన బాధ్యత ఈ మేధావి కార్యకర్తలు సామాజికవేత్తలు సాహిత్య రంగం పైన ఉన్నది. "కేవలం రచనలు చేసే వాళ్ళు మాత్రమే రచయితలు కాదు ఆలోచన అందించి, సూచనలు చేసి , ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకొని, మార్పు కోసం పరితపించే విభిన్న రూపాలలో ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళందరూ కూడా కవులు రచయితలు కళాకారులే" కొందరు ప్రసంగాలు చేస్తారు, మరికొందరు రచనలు చేస్తారు, ఇంకొందరు ఆ కళారూపాలను ప్రదర్శించి ప్రజల వద్దకు తీసుకువెళ్తారు, ప్రజా జీవితాన్ని పాటలు ఆటలు మాటలు వీధి నాటకాలు యక్షగానం బుర్రకథ హరికథ రూపంలో ప్రజల మధ్యన ప్రదర్శించి పాలకుల దుర్నీతిని పెట్టుబడిదారీ విధానం యొక్క మోసపూరిత సామ్రాజ్యవాద కుట్రను చే దించే ప్రయత్నం చేస్తారు.
అయితే ఇలాంటి ప్రగతి కామకులకు వ్యతిరేకమైన దిశలో మరికొందరు ఊహ జనీ తమైన విశ్వాసాలు దైవభక్తి మతము ఏక వ్యక్తి పాలన అది నాయకుని పేరు మీదుగా ప్రచారం చేయడంలో ముందుండే కొన్ని రాజకీయ పార్టీలు సంస్థలు, మతాలను పెంచి పోషించే స్వచ్ఛంద సంస్థలు ఇవాళ దేశవ్యాప్తంగా లౌకిక వాదాన్ని హేతు బద్ధతను శాస్త్ర సాంకేతిక విషయాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ గుడ్డిగా విశ్వాసాల పునాదిగా పనిచేయడానికి ప్రజలను ఆ వైపుగా తీసుకువెళ్లడానికి పనిచేస్తున్న సందర్భాలను మనం గమనించవచ్చు. ఇదే సందర్భంలో 1949సెప్టెంబర్ 25వ తేదీన రాజ్యాంగాన్ని కి సంబంధించి చివరిసారిగా చేసిన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్" పరిపాలనలో వ్యక్తి ఆరాధన నిషేధమని, వ్యక్తి పేరు మీద పాలన కొనసాగకూడదని, సిద్ధాంతాలు ఆచరణ విధానాలు ప్రజల ప్రయోజనాల ప్రాతిపదికన పరిపాలన కొనసాగాలని" చేసిన సూచన కూడా మనదేశంలోని పాలకులు గుర్తించకపోవడం ఏనాడూ గౌరవించకపోవడం విచారకరం. అందు వల్లనే బరితెగించిన రాజకీయాల గుట్టు రట్టు చేయడానికి పెట్టుబడిదారులకు వంత పాడుతూ సామాన్య ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నటువంటి చోట తమ పరిశోధనలు కొనసాగించి వాస్తవాలను వెలికి తీస్తే, గాయకులు పాటల రూపంలో వక్తలు ప్రసంగాల రూపంలో ప్రజలను జాగృతం చేస్తూనే ఉన్నారు. ఈ బుద్ధి జీవుల సమూహాన్ని సమాజాన్ని నిరంతరం మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే పాలకులు గుణపాఠం తెచ్చుకుంటారు, ప్రజల కోసం ఏమైనా ఆలోచన చేస్తారు, తమ అస్తిత్వం కూలిపోతుందని సోయి తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
అభ్యుదయ కారులను సమాజం ఆదరించాలి:-
మరింత ఉన్నత స్థాయిలో ఈ సమాజం ఉండాలని కోరుకునే సందర్భంలో రాజకీయాలను శాసించడమే కాదు రాజనీతిజ్ఞుల చేతిలో పరిపాలన ఉండాలని కోరుకుంటున్న బుద్ధి జీవుల ఆకాంక్షలు నిజం కావాలంటే ఒకవైపు రాజకీయాలను ప్రక్షాళన చేస్తూనే మరొకవైపు ప్రజలను చైతన్యం చేయడం సమాంతరంగా జరగాలి. ఆ ప్రధాన బాధ్యతను భుజాన్ని ఎత్తుకొని మో స్తున్నది కవులు, కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ ఆలోచన పరులు, తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు . ఇప్పటికీ భారతదేశంలో ప్రజల పక్షాన ఆదివాసీలు పేదలు అట్టడుగు వర్గాలు హక్కులను కోల్పోతూ దీనంగా బతుకుతున్న అనేకమంది కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధపడి పోరాటాలలో ఉన్న వాల్లె0 దర్నో పాలకులు బలిగొన్నారు. ఎంతోమంది విచారణ ఖైదీల పేరుతో ప్రస్తుతం జైలు పాలైన విషయం తెలుసు ఇటీవల ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సుమారు 10 ఏళ్లపాటు జైలు శిక్షణ అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టు నిర్దోషి అని ప్రకటించబడితే ఆ పదేళ్ల జీవితం నరకయాతన పడిన శిక్షకు ఏ పాలకవర్గాలు బాధ్యత వహిస్తాయో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎంతోమంది రచయితలు కళాకారులు జర్నలిస్టులు, మేధావులను రాజ్యం పొట్టన పెట్టుకున్నది. పాలకులకు వ్యతిరేకంగా రాసినందుకు, పాలకులను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మీడియా పైన కూడా ఉక్కు పాదం మోపిన విషయం తెలుసు. అందుకే ప్రపంచంలోనే పత్రికా స్వేచ్ఛలో మన దేశం అధమ స్థాయిలో ఉండడాన్ని గమనిస్తే పేరుకు ప్రజాస్వామ్యమైన ఎంత దయనీయస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అందుకే అభ్యుదయ పురోగమి ఆలోచన పరుల పైన భారం ఎక్కువ పడుతున్నది అదే సందర్భంలో వీరందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పౌర సమాజం పైన ఉన్నది . ప్రశ్నించడం, ప్రతిఘ టించడం, ఉద్యమించడం ,పోరాటం చేయడంలో ప్రజలు కూడా ఉద్యమకారులకు అండగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పోరాటంలో విజయవంతం కాగలుగుతాము. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోతే చెడిపోయేది ప్రజలే కానీ ఆ పేరుతో ప్రాణాలు కోల్పోతున్నది ఉద్యమకారులు అని ప్రజలు గుర్తించకపోతే వ్యవస్థకు ద్రోహం చేసినట్లే.
నిజమైన ప్రజాస్వామిక వాదులకు పెట్టుబడిదారులు పాలకవర్గాల నుంచి ఒకవైపు ఇబ్బందులు ఆటంకాలు ఉంటే మరొకవైపు ఈ వ్యవస్థ మారకూడదని ఇలాగే కొనసాగాలని చైతన్యాన్ని ధిక్కరించి మూఢవిశ్వాసాలలోకి గుడ్డి నమ్మకాలలోకి వ్యక్తి ఆరాధనలోకి తీసుకువెళ్లే కొంతమంది వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. బుద్ధి జీవులు ఈ రెండు పార్శ్వాలను సమతుల్యం చేసుకుంటూ వెళ్లవలసిన అవసరం ఉంటుంది. ఇంత సామాజిక బాధ్యత మోస్తున్న ఉద్యమకారులు, విప్లవకారులు, బుద్ధి జీవులు, ఆలోచన పరులు, ప్రజాస్వామ్యవాదులు అందరికీ వందనాలు! మీ పోరాటానికి త్యాగాలకు ఉద్యమ స్ఫూర్తి కి ప్రజలు రుణపడి ఉంటారు. ఉండాలి కూడా .
---వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)